సంపాదకీయం

వి‘చిత్ర’ మాదకం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చలనచిత్ర రంగానికి చెందిన పూరీ జగన్నాథ్ అనే ప్రముఖ దర్శకుడిని ప్రభుత్వ ‘మాదక ని రోధక’ కార్యాచరణ దళం అధికారులు బుధవారం హైదరాబాద్‌లో సుదీర్ఘంగా ప్రశ్నించడం ‘ప్రతీక’ మాత్రమే! గురువారం చిత్ర గ్రాహకుడు- కెమెరామన్- శ్యామ్ కె.నాయుడు అనే మరో ప్రముఖుడు కూడ ఈ మాదక నిరోధక ప్రశ్నల పరంపరకు గురి అయ్యాడట! సుబ్బరాజు అనే నటుడిని శుక్రవారం ఈ ప్రత్యేక ‘కార్యాచరణ దళం’ వారు విచారించారట. శనివారం తరుణ్ అన్న నటుడు విచారణకు గురికానున్నాడట. ‘మాదక’ వ్యవహారం నిందితులందరూ నేరస్థులు కాదన్నది వౌలిక న్యాయ సూత్రం. అందువల్ల పూరీ జగన్నాథ్, నాయుడాదులను అధికారులు నిందితులుగా న్యాయస్థానంలో నిలబెట్టినప్పటికీ వెంటనే వారిని నేరస్థులుగా భావించడానికి వీలులేదు. ఏ నిందితుడైనా న్యాయస్థానంలో నేరస్థుడుగా ధ్రువపడితే తప్ప అతనిని బుద్ధిమంతుడు కాదని చెప్పకూడదు. చెబితే ‘అభిమానులు’ ఊరుకోరు. పూరీ జగన్నాథాదులు ‘నిందితులు’ కూడ కాదు. అధికారులు ‘మాదకం ముఠాల’ను పసికట్టి పట్టుకొని శిక్షించడంలో భాగంగా ఈ చలనచిత్ర ప్రముఖులను విచారిస్తున్నారంతే! నిజానికి మా దకం మత్తు మందుల- ఇంటాక్సికేటింగ్ డ్రగ్స్- రవాణాలో, పంపిణీలో, విక్రయంలో, సేవించడంలో ‘చలనచిత్ర’ నిర్మాణ రంగానికి ఎలాంటి సంబంధం ఉండకూడదు. కానీ ‘మాదకం’ ద్రవ్యాలను విదేశాల నుంచి దేశంలోకి, దే శంలో నుంచి ఇతర దే శాలకు చేరవేస్తున్న ము ఠాలకు ‘ప్రత్యేక రంగం’ అంటూ లేదు. అందువల్ల ఈ మాదక విక్రేతలు, ఉత్పత్తిదారులు దాదాపు అన్ని రంగాలలోను చేరిపోయి ఉన్నా రు. అమాయకత్వాన్ని అభినయిస్తూ వీధులలో తినుబండారాలను, అల్లాన్ని బెల్లాన్ని ‘అల్లమరుబ్బా’లను అమ్ముకుంటున్న వారిలో ‘మాదకం’ మనుషులున్నారు. నైజీరియా నుంచి ఇతర దేశాల నుంచి పనిచేయడం కోసం లేదా ‘దేశం చూడడం’ కోసం ‘ప్రవేశ అనుమతి’- వీసా- పత్రాలను పొంది చొరబడుతున్న వారిలో మాదక విక్రేతలు మెండు. అది ఇది అనకుండా అన్ని జీవన రంగాలలోకి ‘మాదకం’ ముఠాలు చొరబడినట్టు స్పష్టంగా ధ్రువపడింది. పాఠశాలల, కళాశాలల విద్యార్థులు ‘మాదకం మత్తు’ ముఠాలుగా ఏర్పడిపోవడం సరికొత్త వైపరీత్యం. కానీ ఏళ్ల తరబడి ‘మాదకం మత్తు’ విస్తరిస్తున్న వాస్తవం మన సమాజానికి దిగ్భ్రాంతిని కలిగించలేదు. తమ పక్క ఇంటిలోనే చివరికి తమ ఇంటిలోనే ‘మాదకం’ మనుషులు ఉన్నారని తెలిసినప్పటికీ దిగ్భ్రాంతికి ఎక్కువ కాలం గురి కావడం లేదు. కానీ చలనచిత్ర రంగం ప్రముఖులకు మాదకం వ్యవహారంతో సంబంధం ఉందని జరుగుతున్న ప్రచారం మాత్రం ప్రకంపనలను సృష్టిస్తోంది..
ఇందుకు ప్రధాన కారణం చలనచిత్ర రంగానికి ఉన్న ప్రాధాన్యం. చలనచిత్రం అతి ప్రభావ వంతమైన దృశ్య మాధ్యమం, ప్రచార మాధ్యమం. దశాబ్దుల తరబడి సమాజాన్ని ప్రభావితం చేస్తున్న ఈ విచిత్ర దృశ్య మాధ్యమం తమ రంగంలోని వారిని కూడ ప్రభావితం చేస్తోందన్నది నిరాకరింపజాలని నిజం. తొలిరోజుల్లో చిత్ర మాధ్యమం భారతీయ జీవన సంస్కారాలను ప్రచారం చేయడం చరిత్ర. ఇప్పుడు ఏ ‘సంస్కారాల’ను ప్రచారం చేస్తోందన్నది సూర్యుని వెలుతురు వలె స్పష్టంగా కనిపిస్తున్న దృశ్యం. ఆ మధ్య ఒక పదహారేళ్ల భారతీయ సంతతి బాలిక అమెరికాలో తల్లిదండ్రులను నోటికి వచ్చినట్టు తిట్టి ఇంట్లో నుంచి వెళ్లిపోవడం ఒక సినిమాలో చూపించారు. అదే- అలా వెళ్లిపోవడం- ఆ తెలుగు చిత్రంలో ప్రధాన ఇతివృత్తం. పైగా భారతదేశంలో ఇప్పుడు ఇలాగే జరిగిపోతోందని కూడ ఆ పసిపాప చేత చెప్పించారు. ఇప్పుడు ఇలాగే జరిగిపోతోంది కదా!! చివరికి సినిమాలోని అమెరికా బాలిక వలె భారతీయ బాలికలు కూడ తిరిగి ఇంటికి వెడుతున్నారు. కాని తిరిగి వెళ్లని వాళ్లు ఎందరు ఉన్నారో?! ఇది ఒక ఉదాహరణ మాత్రమే. నగలూ పట్టుచీరలూ తెచ్చి ఇస్తానన్న ప్రియుడితో ‘తాళిబొట్టు కూడ తీసుకొని రమ్మని’ ప్రియురాలు కోరడం పాత సినిమా కథ! ‘కొంచెం హద్దు మీరు..’ అని పెళ్లికాని యువతి పెళ్లికాని ప్రియుడిని రెచ్చగొట్టడం నేటి కథ!! సమాజాన్ని మత్తెక్కించి తైతక్కలాడిస్తున్న ‘చలనచిత్ర మాదకం’ ఇదీ.. అన్ని రంగాలలోను నైతిక నిష్ఠ నశించిపోవడం అతి భయంకరమైన మాదకం మత్తు..
అది పట్టుబడుతున్న రకరకాల మాదకం బిళ్లల కంటె అతి భయంకరమైనది. ఈ ‘సినిమా మాదక’ ప్రభావం నుంచి విముక్తి కలిగే మార్గం కనిపించక పోవడం అసలు సమస్య. రాజకీయ ప్రముఖులను, ప్రభుత్వ ఉన్నత ఉద్యోగులను వివిధ అభియోగాలపై పోలీసులు విచారణకు పిలుస్తున్నారు, నిర్బంధించి న్యాయస్థానాల ముందు నిలబెడుతున్నారు. ఆయా సందర్భాల్లో ‘అభిమానులు’ హడావుడి చేయడం లేదు. కాని చలనచిత్ర రంగం వారి పేర్లు బయటకు రాగానే ‘అభిమానుల’ నిరసన ఆర్భాటాలు మొదలైపోతున్నాయి. ఈ చలనచిత్ర ప్రముఖులు నిందితులా? ని రపరాధులా? నేరస్థు లా? అన్న ప్రశ్నలు ‘అభిమానుల’కు ఉదయించ డం లేదు. తమ ‘గౌరవ పాత్రులు’ నేరస్థులని ధ్రువపడినప్పటికీ వారిని విచారించరాదన్నది, వారిని శిక్షించరాదన్నది ఈ ‘అభిమానుల’ అభిమతం. సంజయ్ దత్, సల్మాన్ ఖాన్ వంటివారి విషయంలో ఈ విషయం అనేకసార్లు ధ్రువపడింది. ఏ రంగానికి చెందినవారైనా నిందితులు నిర్దోషులా? నేరస్థులా? అన్న ప్రాతిపదికగా మాత్రమే ఆలోచించాలి. నిర్థారించవలసినది న్యాయస్థానాలు.. ‘అభిమానులు’ కాదు, నిందితులూ కాదు. కానీ ఈ విచక్షణ వికసించకుండా ‘చలనచిత్ర ప్రభావ వైపరీత్య మాదకం’ నిరోధిస్తోంది.
సినిమా రంగంలోని ప్రముఖులు మాదకం ముఠాలను నడపడం, నడపకపోవడం ప్రధానం కాదు. బయటపడనివారు ఎందరో ఉండవచ్చు. విచారణకు గురైన వారిలో నేరస్థులూ ఉండవచ్చు, నిరపరాధులూ ఉండవచ్చు. కానీ వివిధ రంగాలలోకి చొరబడి మాదకం మత్తెక్కిస్తున్నవారిలో దేశద్రోహులు, విదేశాల నుంచి చొరబడుతున్న ప్రత్యక్ష, ప్రచ్ఛన్న బీభత్సకారులు ఎందరు ఉన్నారన్నది ప్రభుత్వాలకు, ప్రజలకు ఆందోళన కలిగించ వలసిన వ్యవహారం. గతంలో దేశంలో మద్యపానం నేరం. ఆ సమయంలో నేర ప్రవృత్తి గలవారు మద్యం ముఠాలుగా పనిచేశారు. మద్యపానం చట్టబద్ధమైన తరువాత ఈ నేర ప్రవృత్తి గలవారు ‘మాదకం ముఠాలు’గా విస్తరించారు. ‘తొండ ముదిరి ఊసరవెల్లులు’ మాదక విషం కక్కుతుండడానికి ఎవరు కారణం? ప్రభుత్వ రాజకీయ నిర్వాహకులు, విధానకర్తలు ఆలోచించాలి!