సంపాదకీయం

‘ప్రణవ’ ప్రస్థానం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పదవీ విరమణ చేస్తున్న రాష్టప్రతి ప్రణవ్‌కుమార్ ముఖర్జీ ప్రామాణిక జాతీయ నాయకుడు. ఈ ‘ప్రామాణిక’ కార్య పద్ధతి ఆయన సుదీర్ఘ కాలం పాటు నిర్వహించిన రాజకీయ, రాజ్యాంగ పదవుల ద్వారా ప్రస్ఫుటించింది. 1970వ దశకం నుంచి జాతీయ రాజకీయాలలో, కేంద్ర మంత్రివర్గంలో ప్రముఖ భూమిక నిర్వహించిన ప్రణవ్ ‘అసమర్ధత’, ‘అవినీతి’ అన్న ఆరోపణలకు మాత్రం గురికాలేదు. నిరంతర క్రియాశీలత, అవినీతి అంటని రాజకీయ స్వభావం ఆయన ‘ప్రమాణత’లోని రెండు ప్రధాన అంశాలు. కేంద్రమంత్రిగా ‘ప్రమాణాల’ను నిలబెట్టగలిగిన ప్రణవ్ ముఖర్జీ గత ఐదేళ్లుగా రాష్టప్రతిగా కూడ పదవీ ‘ప్రమాణత’ను పెంపొందించడానికి కృషి చేయడం నిరాకరింపజాలని నిజం. ఆయన ప్రధానమంత్రితోను, కేంద్ర మంత్రివర్గంతోను సమన్వయంతో పనిచేశారు. వివాదగ్రస్తుడు కాలేదు. కేంద్ర మంత్రివర్గానికి కేవలం ఆమోద ముద్రలన్న ‘చెడ్డపేరు’ రాష్టప్రతి పదవిని నిర్వహించిన కొందరికి లభించడం చరిత్ర. ప్రణవ్‌కు అలాంటి అపనింద కూడ లేదు. ‘రాష్టప్రతి దేశాధినేత, పరిపాలకుడు కాదు’ అన్న ప్రజాస్వామ్య పార్లమెంటరీ సంప్రదాయానికి అనుగుణంగా రాజ్యాంగ ప్రమాణాలను నిలబెట్టడం ఆయన నుంచి నూతన రాష్టప్రతి రామ్‌నాథ్ కోవిద్‌కు లభిస్తున్న సార్వభౌమ వారసత్వం! తనకు పూర్వం పనిచేసిన ప్రామాణిక రాష్టప్రతులను ప్రస్తావించిన నవ నిర్వాచిత రాష్టప్రతి కోవిద్ ఈ ప్రామాణిక ఆదర్శమూర్తుల పరంపరలో ప్రణవ్‌కుమార్‌ను పేర్కొనడం ఇందుకు నిదర్శనం. ప్రథమ రాష్టప్రతి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ రాజ్యాంగ వ్యవహారాల్లో పరమ ప్రామాణికుడు. ప్రణవ్ ఆ వారసత్వాన్ని నిలబెట్టారు. రాష్టప్రతి ముఖర్జీ గత మూడేళ్లకు పైగా తండ్రి వలే మార్గదర్శ నం చేశారని ప్రధాని నరేంద్ర మోదీ ప్రస్తుతించడం ప్రణవ్ నిలబెట్టిన ప్రమాణాలకు చెరగని సాక్ష్యం. రాష్టప్రతికి సలహాలను ఇవ్వడానికై ప్రధాని నాయకత్వంలోని మంత్రివర్గం ఏర్పడి ఉండడం, ఆ సలహాలకు అనుగుణంగా రాష్టప్రతి తన పదవీ బాధ్యతలను నిర్వహించడం రాజ్యాంగంలో డెబ్బయి నాలుగవ అధికరణం నిర్దేశిస్తున్న ‘పాలన సూత్రం’.. మోదీకి ప్రణవ్ ద్వారా లభించిన మార్గదర్శనం ప్రామాణిక పద్ధతులకు అద్దం. కాంగ్రెస్ అభ్యర్థిగా 2012 జూలైలో రాష్టప్రతి పదవికి ఎన్నికైన ప్రణవ్ 2014 మే 26 నుంచి భారతీయ జనతాపార్టీ నాయకత్వంలోని కేంద్ర మంత్రివర్గాన్ని ఇలా నడిపించారు. ఇదీ సమన్వయానికి చిహ్నం..
ప్రణవ్ ముఖర్జీ ప్రధాని పదవికి అర్హుడన్నది గతంలో వ్యాపించిన అభిప్రాయం. ఈ అభిప్రాయం 1980వ దశకంలో అంకురించింది. 2009- 2012 సంవత్సరాల మధ్య విస్తరించింది. ఆయన ప్రధాని కాకపోవడం కాంగ్రెస్‌లో నడచిన అంతర్గత రాజకీయం. ఆయన కాంగ్రెస్ అధినాయకురాలు, మాజీ ప్రధాని ఇందిరా గాంధీకి అత్యంత విధేయుడు. తాను పదవీ విరమణ చేస్తున్న సందర్భంగా ఆదివారం పార్లమెంటు భవనంలో జరిగిన వీడ్కోలు సమావేశంలో ప్రసంగించిన ముఖర్జీ ఈ సంగతిని మరోసారి ధ్రువీకరించడం ఈ విధేయతకు సాక్ష్యం. ఇందిరా గాంధీ అధికారచ్యుతికి గురైన సమయంలో ఆమెను వదలివెళ్లిన అవకాశ వాదుల వలె కాక ఆమెకు అండగా నిలబడిన విధేయతా నిష్ఠ కల కాంగ్రెస్ నాయకులలో ప్రణవ్ ప్రముఖుడు. కానీ ఇందిరా గాంధీ తరువాత ఆమె వారసులు ప్రణవ్‌ను వ్యతిరేకించడం, బహిష్కరించడం, అంటీముట్టనట్టు వ్యవహరించడం 1985 నుంచి 2012 వరకూ నడచిన చరిత్ర! అప్పటి ప్రధాని రాజీవ్ గాంధీ తన మంత్రివర్గంలో ఈ మాజీ ఆర్థికమంత్రికి చోటు కల్పించకపోవడం ఇందిర స్ఫూర్తికి భంగకరమైన పరిణామం. పదవీచ్యుతుడైన ప్రణవ్ ఆ తర్వాత పార్టీ నుంచి కూడ బయటకు వెళ్లవలసి వచ్చింది. ముఖర్జీ తనకు పార్టీలో ప్రధాన ప్రత్యర్థి అని ఇందిరమ్మ కుమారుడు రాజీవ్ భావించడం ఇందుకు కారణం. కానీ ప్రతిభావంతుడు అనుభవజ్ఞుడు సమర్థుడు నిజాయితీపరుడు అయిన ప్రణవ్‌ను కాంగ్రెస్ ఎక్కువ కాలం వదులుకోలేక పోయింది. 1991లో పివి నరసింహారావు ప్రధాని అయ్యాక కాంగ్రెస్‌లో ముఖర్జీ ప్రాధాన్యం మళ్లీ పెరిగింది. పివి తరువాత కాంగ్రెస్‌లో అతి పెద్ద నాయకుడు ముఖర్జీ. అందువల్లనే మన్‌మోహన్ సింగ్ ప్రధాని అయినప్పటికీ సర్వ ప్రభుత్వ వ్యవహారాల్లోను ముఖర్జీ ప్రాధాన్యం ప్రస్ఫుటించడం 2004-2012 సంవత్సరాల మధ్య నడచిన చరిత్ర. 2012లో రాష్టప్రతి పదవిని మన్‌మోహన్‌కు అప్పగించి, ప్రణవ్ ముఖర్జీని ప్రధాని పదవికి ఎంపిక చేయాలన్న భావం కాంగ్రెస్‌లోను, మిత్రపక్షాలలోను వ్యాపించడం బహిరంగ రహస్యం. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వంటివారు రాష్టప్రతి పదవికి ‘కాంగ్రెస్ ఐక్య ప్రగతి కూటమి’ అభ్యర్థిగా మన్‌మోహన్ సింగ్‌ను ప్రతిపాదించారు కూడ. మన్‌మోహన్ అప్పుడు రాష్టప్రతి అయి ఉంటే బహుశా ప్రణవ్ 2012లో ప్రధాని అయి ఉండేవాడు. ఈ పరిణామం సంభవించక పోవడానికి కారణం కాంగ్రెస్ అధిష్ఠానానికి ముఖర్జీపై ఏర్పడి ఉండిన వైముఖ్యం!
‘మీరు లేకుండా ఉండినట్టయితే మన్‌మోహన్ ప్రభుత్వం ఎన్ని ఇబ్బందుల పాలై ఉండేదో..?’ అని 2009లో నాటి లోక్‌సభ చివరి సమావేశంలో భాజపా నాయకుడు ఎల్‌కె అద్వానీ నాటి లోక్‌సభ నాయకుడు ప్రణవ్‌ను ప్రస్తుతించడం ముఖర్జీ ప్రాధాన్యానికి చారిత్రక సాక్ష్యం. ప్రత్యర్థుల మన్ననలను అందుకున్న రాజకీయ వేత్త ముఖర్జీ. ప్రమాణాలను నిలబెట్టిన రాజ్యాంగ వేత్త రాష్టప్రతి ప్రణవ్. ‘అధ్యాదేశ’- ఆర్డినెన్స్- పాలనా పద్ధతిని ప్రణవ్ తప్పుపట్టడం మోదీ ప్రభుత్వానికి ఆయన చెప్పిన పాఠం. ప్రథమ రాష్టప్రతి రాజేంద్ర ప్రసాద్ 1950వ దశకంలో అప్పటి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూకు ‘జనాదేశ సూత్రం’- డాక్టరిన్ ఆఫ్ మాండేట్- గురించి వివరించడం చరిత్ర! రాష్టప్రతి ముఖర్జీ ‘అధ్యాదేశ’ పాలనా పద్ధతులను వ్యతిరేకించడం మరో రాజ్యాంగ పాఠం. ‘్భమి సేకరణ’ చట్టానికి ‘అధ్యాదేశం’ ద్వారా కేంద్ర మంత్రివర్గం సవరణలను ప్రతిపాదించడం చరిత్ర. పదవీ విరమణ ప్రసంగంలోనే కాదు, పదవిలో ఉన్నపుడు కూడ ముఖర్జీ ఈ ‘ఆర్డినెన్స్’ల పాలనను విమర్శించి ఉన్నాడు. 2015 నాటి గణతంత్ర దినోత్సవ సందేశంలో మొదటిసారి ఆయన ఈ ‘అధ్యాదేశా’ల పాలనను విమర్శించాడు. కానీ 1952 నుంచి కూడ వివిధ రాజకీయ పక్షాల ఆధ్వర్యవంలోని ప్రభుత్వాలు విరివిగా ఆర్డినెన్స్‌లను జారీ చేయడం చరిత్ర.
పార్లమెంటు సమావేశాలు జరగని సమయంలో ప్రభుత్వం కొత్త నిర్ణయాలను అమలు జరుపతలపెట్టడానికి మార్గం- రాజ్యాంగంలోని 123వ అధికరణం కింద ‘అధ్యాదేశం’ జారీ చేయడం. పార్లమెంటు ‘బిల్లు’ను ఆమోదించిన తర్వాత అమలు జరగవలసిన నిర్ణయాలు, కార్యక్రమాలు తాత్కాలికంగా ఆర్డినెన్స్‌ల ద్వారా అమలు జరుపవచ్చు. ఆర్డినెన్స్‌ను ఆ తరువాత పార్లమెంట ఆమోదించినపుడు మాత్రమే అది రాజ్యాంగబద్ధం అవుతుంది. ఇది కేవలం అత్యవసర, అతి ప్రధాన అంశాల విషయంలో అనుసరించే పద్ధతి. కానీ ‘అధ్యాదేశాల’ను విరివిగా జారీ చేయడం 1952 నుంచి కొనసాగుతోంది. అందువల్ల ప్రణవ్ బహుశా పాఠం చెప్పవలసి వచ్చింది. ఈ ‘పాఠం’ ప్రభుత్వాల పనితీరుకు మార్గదర్శకం కావాలి..