తొవ్వ ముచ్చట్లు - జయ ధీర్

సభా నిర్వాహకుల సరికొత్త విలవిల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సభలు సమావేశాలు రకరకాలు.
విద్యాసంస్థలు నిర్వహించే సభలు సైతం భిన్నగా ఉం టాయి. సదస్సులు, చర్చాగోష్ఠులు, రౌండ్ టేబుళ్ళు, ముఖాముఖులు వగైరాలు ఎనె్నన్నో.
ఏవి ఏమైనా ఏ పేరుతో పిలిచినా వాటిని నిర్వహించే సంస్థలు ఓవైపు ఉంటాయి. ఆ సంస్థల వారు పిలిచే అతిథులు మరోవైపు ఉంటారు. పిలవడం అంటే మామూలుగానే అనిపిస్తుంది. కాని కొందరిని బొట్టుపెట్టి పిలవాలి. కొందరికి వాయనాలు ఇవ్వాలి. మరికొందరికి ఇంటికి వెళ్లి పేరు వేసుకోవడానికి కూడా బుదగరించాలి.
ఈ మధ్య ఆహ్వాన పత్రికలు, కూడా సెల్‌ఫోనులో చేరుతున్నాయి. వాట్సప్‌లో కులుకులు పలుకుతున్నది. పోస్టులో ఆహ్వానపత్రం పంపడం గతకాలమైంది.
సభ మొత్తం ఫోనుద్వారా రూపొందుతున్నది. ఫోనులోనే తమరు రండని అడిగి పేరు పెట్టుకోవడం జరుగుతోంది.
ఈ నేపథ్యంలో-
సరే! అన్న వాళ్లు రావడం గణనీయంగా తగ్గిపోతుంది. లోగడ అలా ఎవరికైనా రాకపోతే రానివారూ, పిలిచినవారూ కొంత ఇబ్బంది పడేవారు. శ్రోతలు సైతం పలురకాలుగా భావించేవారు. ఎందుకు రాలేదో ఊహాగానాలు చెలరేగేవి. చాలా సందర్భాలలో అనారోగ్యం మిషతో కొట్టివేయబడేవి. కాని ఇప్పుడు ప్రేక్షకులు కూడా సీరియస్‌గా తీసుకోవడం లేదు. ఎందుకంటే అందుకు అనేక కారణాలు ఉన్నాయి. ఆమధ్యకాలంలో విషయ పరిజ్ఞానం ఉన్న వక్తల సంతతి భాగా ఉండేది. రానురాను అది తరిగిపోయింది. సభలో పాల్గొనే అతిథులలో కొందరు రాకపోయినా పెద్దగా ఎవరూ పట్టించుకోవడంలేదు. తెలివి పెరిగిన సంస్థల నిర్వాహకులు ఈ ట్రెండ్ గమనించి, ఎందుకైనా మంచిదని ఒకరికి బదులు ఇద్దరిని, ఇద్దరికి బదులు నలుగురిని పిలుస్తున్నారు. అందులో సగం శాతం రాకపోయినా సభ నడిచిపోతున్నది. ఒకవేళ కొంపదీసి అందరు రాకపోయినా అప్పటికప్పుడు ఆపద్బంధు వక్తలు వేదికనెక్కి సభని పూర్తికానిస్తున్నారు. సభ విజయవంతం కావడానికి వక్తలు ప్రమాణం కాదు. పత్రికల్లో వార్తలు ముఖ్యం. అవి వస్తే చాలు సభ సక్సెస్. పెద్దపెద్ద అతిథులను పిలవడం కూడా సభ సక్సెస్ కోసమే. అప్పుడప్పుడు పెద్దపెద్ద వక్తలు వచ్చి, గొప్పగా ఉపన్యసించినా వార్తలు రాకపోతే సభ విజయవంతం అయినట్టు కాదు. సభ అన్నాక సంస్థ నిర్వాహకులు, శ్రోతలు, ఇరువర్గాల వారు ముఖ్యం. కాని ఇప్పుడు శ్రోతలు లేకపోయినా ఎవరో కొందరు అతిథులు ముఖ్యం అయ్యారు. పత్రికా వార్తలు మాత్రమే సభ సక్సెస్‌కు గీటురాళ్లయ్యాయి. అప్పుడప్పుడు వేదిక నిండుగా ఉంటుంది. సభలో శ్రోతలు ప్రేక్షకులు నిండు సున్నాలా ఉంటారు. వేదికపై ఉండేవారికన్నా తక్కువగా ప్రేక్షకులు ఉంటారు. నిర్వాహకులు దానిని ఏమాత్రం పట్టించుకోరు. ఓ అతిథి రాకపోతే ఫలానా కారణం వల్ల ఫలానా వారు రాలేకపోయారని లేని ప్రేక్షకులకు సంజాయిషీ ఇస్తారు. కాని ప్రేక్షకులు లేకపోవడానికి అతిథులకు ఏనాడూ సంజాయిషీ చెప్పబడలేదు.
లోగడ వేదికపై అతిథుల పేర్లను చూసి శ్రోతలు వచ్చేవారు. వారు మాట్లాడే విషయం వినాలని భావించేవారు. ఇవ్వాళ అలా లేదు. ఒకనాడు అలా గొప్పగా మాట్లాడగలిగిన సత్తా ఉన్నవారు కూడా ఇవ్వాళ ‘స్థాయి’ తగ్గిపోయారు. అదే రొడ్డకొట్టుడు పాత ఉపన్యాసం.
మేం బిఎస్సీ చదివే రోజుల్లో మా జువాలజీ అధ్యాపకుడు రామ్ నారాయణ్ సింగ్ గారు పదేళ్లుగా ఒకటే సిలబస్ చెప్పేవాడు. పదేళ్ల కింద రాసుకున్న నోట్స్ కాగితాలే చూసి చెప్పేవాడు. అలాగే ఇప్పుడు అలనాటి పాత ఉపన్యాసాలకి వందో జిరాక్స్ ప్రతిలా పేలవంగా ప్రతిధ్వనిస్తున్నారు.
వారు నమ్మిన భావాలలో మార్పు వచ్చినా వారి ఉపన్యాసాలు ఎంతమాత్రం మారలేదు. వారు విడిపోయిన పార్టీలు వేరైనా అలనాటి ఉమ్మడి కాలంలో చెల్లిన భావాలే చర్విత చరణంగా చెబుతుంటారు. అందువల్ల విషయ విశే్లషణ తగ్గి నీతిపురాణమో అభియోగ స్వరమో వినిపిస్తారు. ఐనా వారిని సభలకు పిలుస్తూనే ఉంటారు. ఎందుకంటే వారివల్ల ఎలాంటి ప్రమాదం ఉండదు. ప్రళయం రాదు. నిర్వాహకులు అలాంటి వారిని పిలిచి అభ్యుదయ రంగానికి ప్రాతినిధ్యం ఇచ్చినట్టుగా భావిస్తారు. అది ఒకలాంటి తృప్తి. తెలిసిన వారినే పిలవడం అవసరం. అది ఇప్పుడు రివాజే. ఎందుకంటే వారు నిర్వాహకుల లోపాలను ఎత్తి చూపరు. పైగా వారిని పేరుపెట్టి ప్రశంసిస్తారు. ఈ ప్రశంస వారికి ఆనందం కలిగిస్తుంది. మరోసారి వారినే పిలవడానికి అది దోహద పడుతుంది.
ఇకపోతే మరోపక్క-
ఎవరు పిలిచినా మొదట రాను, రాలేను, ఆలోచించి చెబుతాను అని అనడం లేదు. వస్తాను అని చెప్పాక, తన పాత్ర ఏమిటని అడుగుతారు. తనకు సరిపోయేటట్లున్నట్లయితే సరే. లేదా సభకి డుమ్మానే. ఓ రోజు ముందుగానే గుర్తు చేస్తే అయ్యో! నాకు గుర్తు లేదండి. రాలేనని చెప్పేస్తారు. అదేమంటే మొన్ననే కదా ఓసారి గుర్తు చేశాను అని అంటే, ఏమోనండీ మరచిపోయాను అంటాడు.
మరోతరహా గెస్టు ఉంటాడు. చివరి దాకా వస్తానంటాడు. తీరా సభ ప్రారంభం అవుతోందనగా ఆరోగ్యం బాగాలేదంటాడు. లేదా ఊరికి వెళ్లవలసి వచ్చిందని చల్లగా చెబుతాడు. అలా ఊరికే ఊరు వెళ్లరు కదా. దానికి ఒక కారణం ఉండాలి. ముందస్తు ప్లాన్ ఉండాలి. అదేమీ చెప్పడు. సెల్‌ఫోన్ పుణ్యమాని ఎవరైనా ఎక్కడైనా ఎంతదూరంలోనైనా, ఏ ఊళ్లోనైనా ఉండగలరు. ఊరికి పోయేవాడు, పోతూ నిర్వాహకులకి చెప్పవచ్చు కదా. చెప్పడు. కనీస మర్యాద, గౌరవం పాటించడు. అలాంటివాడు వేదికనెక్కి నీతులు బోధిస్తాడు. నిప్పులు చెరుగుతాడు.
వేరే ఊళ్లో సమావేశం జరుగుతున్నా రాలేకపోతున్నానని చెప్పడు. ముందుగా ఎలాంటి సమాచారం ఇవ్వడు. కావాలనే ఇలా ప్రవర్తిస్తాడు. రైలు టిక్కెట్లు పంపినా అంతే. అతని కోసం ఖర్చు చేసి ఎన్నో వసతులు ఏర్పాటు చేసిన తరువాత, నిర్వాహకులు ఫోను చేసినప్పుడు మాత్రమే అసలు విషయం చల్లగా చెబుతాడు. అలా చెప్పడంలో అసలు విషయం తెలిసిపోతుందని తెలిసినా కించిత్ బాధపడడు. తనలాంటి ‘వక్త’ మరొకడు లేడని ధీమా. తన ‘అహం’ ముఖ్యం. ఒక సభని తిరస్కరించానని మరో నిర్వాహకునితో గొప్పగా చెప్పుకోవడం ఒక వ్యసనం.
భార్యా బాధితుల్ని చూశాం. భర్తల వల్ల బాధపడిన వాళ్ల సంఘాల్ని చూశాం. ఇప్పుడు అతిథులు, వక్తల బాధితుల నిర్వాహకుల్ని చూస్తున్నాం.
ఎన్నో వ్యయప్రయాసలకోర్చి కాసింత మంచి కార్యక్రమాలు నిర్వహించాలని చూసే సంస్థల వారి బాధలు మరీ వేరు. ఈ సభలకి పేర్లు వేసి ఆహ్వానాలు పంపి, పత్రికలలో వార్తలు అచ్చయిన తరువాత రావడం లేదని అనేవారున్నారు. ఎందుకంటే కేవలం తనకు గిట్టని వారిని తెలియక పిలిచినా తనను అవమాన పరిచారని భావించి గైర్హాజరవుతారు.
ఇప్పుడు సమాజంలో అనేక మార్పులు వచ్చాయి. ఐనా సభా నిర్వహణలో కొత్త ముఖాలు రావడం లేదు. మొన్నటి వరకు ప్రభుత్వ మనుషులను సభలకు పిలవడం కుదిరేది కాదు. ఇప్పుడు వారినే ఎక్కువగా ఆహ్వానిస్తున్నారు. ఎందుకంటే ప్రభుత్వ బాకా పత్రికలు తప్పక వార్తలు రాస్తాయి. ఆ రెండు పత్రికలలో నైనా రావడం సంతృప్తి కలిగిస్తుంది.
నిజానికి సుప్రసిద్ధ అతిథుల జాతి తగ్గిపోయింది. పెద్ద ముఖాలు లేవు. అందుకే తమకు ఎవరితో సరిపడులు లేవు. అందుకే తనకు ఎవరితో పనిపడుతుందో, ఎవరు తమ సామాజికవర్గం వారో, లేదా నాలుగు డబ్బులు ఇవ్వగలరో వారే అతిథులుగా కనుపిస్తున్నారు. వీరు ఎలా మాట్లాడుతారో, ఏం మాట్లాడుతారో అందరికీ తెలుసు. అందుకే శ్రోతలు తమని తాము రక్షించుకోవడం కోసం ఆవేపు రావడానికి జంకుతున్నారు.
ఐనా సభలు జరుగుతూనే ఉన్నాయి. సమావేశాలు ఏర్పాటవుతూనే ఉన్నాయి. ఇప్పుడు గొప్ప అతిథులు ముఖ్యం కాదు. తమ గురించి పొగడ్తలు గుప్పించే వారే వక్తలు. వారే ముఖ్య అతిథులు, ఆత్మీయ అతిథులు. అతిథులు, విశిష్ట అతిథులు, నిజానికి విషయ ప్రాధాన్యత గీత దాటి చాలా రోజులైంది.
గొప్ప కవి గాయకులు కొందరు ఉన్నారు. వారిని పిలిస్తే సకల మర్యాదలు, చేతికింత తడి తాకుతుందంటేనే వస్తారు. ఆ విషయం స్పష్టంగా అడుగుతున్నారు. లేదా తమ పేరు వేసుకోమని చెప్పి తీరా సభా సమయానికి ఫోను ఎత్తరు. ఎత్తినా మాట్లాడరు. మాట్లాడితే అబద్ధాలు. ఆ అబద్ధాలకీ పొంతన ఉండదు. వస్తున్నాను. మీరు కానీయండి అంటారు. మధ్యమధ్యలో ఫోను చేయించుకుంటూ మళ్లీ అబద్ధాలు. అలా అబద్ధాలు ఆడేస్తూ నిర్వాహకులకు శాంతి లేకుండా చేస్తారు.
ఇది కొంగొత్త ధోరణి!
పాపం సభా నిర్వాహకులు, సంస్థల నాయకులు నానా తంటాలు పడుతున్నారు. ఇది ఒక కొత్త అవస్తల వలయం. ఓసారి ఇందులోకి వచ్చారా తిరిగి వెనక్కి పోవడం కష్టం. అన్ని వ్యసనాల కన్నా పెద్ద వ్యసనం ఇది.
ఇలాంటి వాళ్ల సమస్యలు చర్చించడం కోసం ఓ సభ ఏర్పాటు చేయాలి. అతిథులుగా ఎవరిని పిలుద్దాం?
తిరిగి కథ పాతదే!

-జయధీర్ తిరుమలరావు సెల్ : 9951942242 jayadhirtr@gmail.com