సంపాదకీయం

పరివర్తన పథంలో..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సుదర్శన చక్రాన్ని ధరించిన ‘మోహనుని’ నుండి నూలు వడికే చక్రం ధరించిన ‘మోహనుని’ వరకు గల మహనీయులు ప్రస్ఫుటింప చేసిన స్ఫూర్తి స్వతంత్ర భారతదేశానికి భవిష్యత్ మార్గదర్శకమన్నది ప్రధాని నరేంద్ర మోదీ డెబ్బయి ఒకటవ స్వాతంత్య్ర దినోత్సవ సభా వేదికపై పునరుద్ఘాటించిన చారిత్రక వాస్తవం. ఈ పునరుద్ఘాటన మరో నూతన చరిత్రకు శ్రీకారం అన్నది ఆయన ప్రసంగంలోని ఇతివృత్తం. కొత్త భారతాన్ని నిర్మించాలన్నది మనకు స్వాతంత్య్రం వచ్చిన తరువాత డెబ్బయి ఏళ్లు గడిచిన సందర్భంగా కేంద్ర ప్రభుత్వం వారి సంకల్పం. ఈ సంకల్ప సిద్ధికి ప్రజలంతా తమ కర్తవ్య నిష్ఠకు పునరంకితం కావాలన్నది మంగళవారం దేశ రాజధానిలోని ఎఱ్ఱకోట బురుజులపై నుంచి మోదీ చేసిన హితబోధ! స్వాతంత్య్ర దినోత్సవం నాడు ప్రధాని జాతినుద్దేశించి ఇలా ఉద్బోధించడం, పిలుపునివ్వడం, కర్తవ్యాన్ని గుర్తు చేయడం, పునరంకిత ప్రవృత్తిని జాగృతం చేయడం డెబ్బయి ఏళ్లుగా కొనసాగుతున్న జాతీయ సంప్రదాయం. పరిణత ప్రజాస్వామ్య రాజ్యాంగ వికాస క్రమంలో పునరావృత్తం అవుతున్న లాంఛనం! కానీ మోదీ మంగళవారం చేసిన ప్రసంగం కేవలం లాంఛనప్రాయంలా లేదు. ‘నవభారత’ నిర్మాణ దీక్షకు ఈ ప్రసంగం పునరారంభం. ఈ ‘నవ’ భారతం నిజానికి సనాతన భారతం, శాశ్వత సంస్కార సమాహార సమష్టి స్వభావం! ఐదువేల వంద ఏళ్లకు పూర్వం సుదర్శన చక్రధరుడైన మోహనుడు- యదుకృష్ణుడు- సంకల్పించింది నవభారత నిర్మాణమే. వంద ఏళ్లకు పూర్వం దారం వడికే చక్రం ధరించిన మోహనుడు- మహాత్మాగాంధీ- ఆకాంక్షించింది కూడ ‘కొత్త భారతదేశమే’. లోకమాన్య బాలగంగాధర తిలక్ నూట ఇరవై ఏళ్ల క్రితం ఆరంభించిన సామూహిక ‘గణేశ ఉత్సవాల’ లక్ష్యం నూతన భారత నిర్మాణం. యదుకుల కృష్ణుని నవభారతానికి ప్రాతిపదిక మానవీయ ధర్మస్థాపన. ఈ ధర్మం అనాదిగా ఉన్నది, అనంతంగా ఉం డేది. అందువల్లనే ఇది సనాతన- శాశ్వత- ధర్మం అయింది. అనాదిగా ఉన్న ధర్మాన్ని కృష్ణుడు మళ్లీ స్థాపించడం ఏమిటి? అనాదిగా ఉదయిస్తున్న సూర్యుడు ప్రతిరోజూ కొత్తగా ఉదయిస్తున్నాడు. అందువల్ల సూర్యుడు సనాతనుడు. కానీ ప్రతిరోజు కొత్తవాడు. ఈ భరత జాతి సనాతన దేశమై ఉండగా మళ్లీ కొత్త భారతాన్ని నిర్మించడం కూడ సూర్యుడు మళ్లీ కొత్తగా ఉదయించినట్టు మాత్రమే. ధర్మానికి, ధర్మ భాస్కరునికి గ్రహణం పట్టింది, కృష్ణుడు తొలగించాడు! సనాతన భారత జాతికి గ్రహణం పట్టింది, ఈ గ్రహణం బ్రిటన్ దురాక్రమణ! ఈ గ్రహణ విముక్త భారతం మళ్లీ కొత్త భారతం. ఈ నవ భారతాన్ని లోకమాన్యుడు ‘స్వరాజ్యం’గా దర్శించాడు. ఈ నవ భారతాన్ని మహాత్ముడు ‘గ్రామరాజ్యం’గా సంభావించాడు. బ్రిటన్ దురాక్రమణ విముక్త భారతం అందువల్ల మరోసారి పునరావృత్తమైన ‘నవ భారతం’, మరోసారి జరిగిన సూర్యోదయం, మరోసారి ఆరంభమైన వెలుగుల ప్రస్థానం!
‘గ్రహణం’ శాశ్వతంగా తొలగిపోవడం లేదు. మళ్లీ మళ్లీ దాపురిస్తోంది. ఈ ‘గ్రహణం’ అవినీతి, ఈ గ్రహణం సరిహద్దుల భద్రతను ఛిద్రం చేస్తున్న దురాక్రమణ, ఈ గ్రహణం అంతర్గత భద్రతను భగ్నం చేస్తున్న ఉగ్రవాదం. ఉగ్రవాదం వివిధ వికృత రూపాలతో విధ్వంస కేళీ విన్యాసాలను ప్రదర్శిస్తోంది. పాకిస్తాన్ ప్రేరిత జిహాదీ బీభత్సకాండ, చైనా ప్రేరిత మావోయిస్టు విధ్వంసకాండ అంతర్గత భద్రతకు దాపురించిన ఉగ్రవాద రూపానికి రెండు ముఖాలు. జమ్మూ కశ్మీర్‌లో, ఈశాన్య ప్రాంతంలో, చత్తీస్‌గఢ్‌లో, ఝార్‌ఖండ్‌లో.. దాదాపు అన్ని ప్రాంతాల్లో అంతర్గత భద్రతను నిలదీస్తున్న ‘గ్రహణం’ ఉగ్రవాదం. దేశంలోకి చొరబడిపోతున్న మాదకం మత్తు ముఠాలు, దేశంలో చెదలు పుట్టలుగా విస్తరిస్తున్న లైంగిక బీభత్సకారులు నిరంతరం విరుచుకుపడుతున్న గ్రహణాలు.. ప్రభుత్వేతర స్వచ్ఛంద సంస్థల- ఎన్‌జిఓ-ల ముసుగులో దేశ విద్రోహకాండను కొనసాగిస్తున్న విదేశాల తొత్తులు, నల్లధనాన్ని విస్తరింపచేస్తున్న డొల్ల వాణిజ్య సంస్థలు స్వతంత్ర భారత దినకరుడిని దిగమింగుతున్న గ్రహణాలు! ఈ గ్రహణాల నుంచి దేశం విముక్తం కావడం నరేంద్ర మోదీ ఎఱ్ఱకోట బురుజులపై ప్రస్తావించిన ‘నవ భారతం’! 2022 నాటికి, మరో అయిదేళ్లకు ఈ నవ భారతం సర్వ సమగ్రంగా ఆకృతి ధరించగలదన్నది మోదీ వ్యక్తం చేసిన విశ్వాసం. దారిద్య్ర విముక్త, స్వయం సమృద్ధ, స్వావలంబ స్వరాజ్య భారతం అది..
ఈ వికృత గ్రహణాల గురించి, వాటి నుంచి విముక్తిని సాధించడానికి గత మూడేళ్లుగా తమ ప్రభుత్వం చేసిన ప్రయత్నాల గురించి, చేయనున్న కృషి గురించి ప్రధాని స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో ప్రస్తావించడం సహజమైన పరిణామం. ప్రధానమంత్రి పదవిని స్వీకరించాక మోదీ చేసిన నాలుగవ స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగం ఇది. త్యాగం, సంఘటిత శక్తి సంకల్పసిద్థికి దోహదం చేయగలవన్నది మోదీ మరోసారి చెప్పిన మాట. భద్రతకు తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోందన్నది కూడ ఆయన చేసిన మరో పునరుద్ఘాటన. భద్రతను పెంపొందించేందుకు తమ జీవితాలను సమర్పిస్తున్న వీరుల- సైనికులు, అనుబంధ సాయుధ బలగాలు, పోలీసులు, ఇతర భద్రతా దళాల - త్యాగానికి మో దీ నివాళులర్పించడం జాతీయ కృతజ్ఞతకు మరో ఆవిష్కరణ. ‘గా లీ’ల- తిట్ల-తో కాని, గోలీ- తూటాలతో కాని కశ్మీర్‌లో శాంతి నెలకొల్పడం తమ అభిమతం కాదని ‘కశ్మీరీల’ను- గలేలగనా- ఆలింగనం చే సుకొనడం- ద్వారా కశ్మీర్‌లో ప్రశాంతిని వ్యవస్థీకరిస్తామన్నది మోదీ చెప్పిన మరోమాట. ప్రత్యక్ష బీభత్సకాండకు, ప్రచ్ఛన్న బీభత్సకాండకు పాల్పడుతున్న రెండు పొరుగు దేశాల గురించి మోదీ ప్రస్తావించక పోవడం వినూతన వ్యూహం. వౌనంలో ‘మహాధ్వని’ నిబిడీకృతం కావడం ఇదే! అంతర్గతంగా ప్రతిపక్షాలపై ఎ లాంటి విమర్శలు చేయకపోవడం ద్వారా మోదీ సముచితమైన ఔచిత్యాన్ని పాటించాడు. గరీబుల- నిరుపేదల- ను ‘లూటీ’ చేస్తున్న అవినీతి నుంచి దేశాన్ని విముక్తం చేయడానికి జరిగిన కృషి గురించి, పారదర్శక పాలన గురించి మోదీ చెప్పిన వాస్తవాలు సందర్భోచిత పునరావిష్కరణలు. నల్లధనం వ్యాప్తి చేసిన ‘డొల్ల’ కంపెనీలు మూతపడిపోతుండడం ‘సురాజ్య’ వ్యవస్థకు శ్రీకారం..
అవినీతి రహిత భారత నిర్మాణానికి జరుగుతున్న కృషికి ప్రధాన అవరోధం ‘ప్రపంచీకరణ’ పేరుతో పెరిగిపోతున్న విదేశీయుల ఆర్థిక దురాక్రమణ. ఈ దురాక్రమణ కారణంగా దేశంలో అవినీతి విస్తరిస్తోంది, ‘్భరత్‌లో నిర్మాణం’- మేన్ ఇన్ ఇండియా- స్ఫూర్తి నీరుకారిపోతోంది. గాలిపటాలను ఎగరేసుకొనేందుకు పిల్లలు వాడే దారం నుంచి వంటింట్లో పొయ్యి వెలిగించడానికి గృహిణులు వాడే ‘లైటర్’ వరకూ చైనా నుంచి దిగుమతి అవుతున్నాయి. విదేశీయ ఆర్థిక దురాక్రమణకు ఇది ఒక ఉదాహరణ మాత్రమే. గతంలో ఒక్క ‘ఈస్టిండియా’ కంపెనీ దేశాన్ని ‘బందీ’గా మార్చింది. ఇప్పుడు వందల వేల ఈస్టిండియా కంపెనీలు..! ఈ ఆర్థిక దురాక్రమణను అడ్డుకోనిదే మోదీ చెప్పిన ‘పరివర్తన’ ఎలా సాధ్యం?