మెయన్ ఫీచర్

పరీక్షా కేంద్రాలా? నిర్బంధ క్యాంపులా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రస్తుత పరీక్షలు నూతన విధానంలో జరగాలి. అంటే పరీక్షా కేంద్రాల్లో పరీక్షలు స్వేచ్ఛాపూరిత, స్నేహపూరిత వాతావరణంలో కొనసాగాలి. కాని ఇందుకు భిన్నంగా గతంలో లాగే పరీక్షల్ని నిర్వహించి విద్యార్థుల్ని భయాందోళనకు గురిచేయడం జరుగుతున్నది. దీన్ని గుర్తించడానకి, నియంత్రించడానికి ఉపాధ్యాయులకు, ఉపాధ్యాయ సంఘాలకు, ఎలాగో పట్టింపు లేదు. యధాపాలన, తథా బోధనలా సాగుతున్న ఈ వ్యవహారం మేధావి వర్గానికి కూడా పట్టకుండా పోవడం బాధాకరం. విద్యార్థులు తప్ప, అందరు నిజాయతీ పరులే అనే ఈ దొంగాటలో ప్రతిసారి పావులుగా మారుతున్నది విద్యార్థులే.
--
ఒకటి కాదు-రెండు కాదు-సరిగ్గా పది సంవత్సరాల పాటు వారు పాఠశాల విద్యను అభ్యసించారు. జ్ఞానం, విజ్ఞానంతో పాటు,విలువల్ని కూడా పెంపొందించుకున్నారు. ఎన్నో నీతి కథల్ని విన్నారు. ఇతిహాసాలు ధర్మ బోధనల్ని కొంతలో కొంతగా అవగాహన చేసుకున్నారు. జాతీయ నాయకుల గూర్చి, స్వాతంత్య్ర పోరాట కాలంలోని వారి త్యాగాల గూర్చి తెలుసుకున్నారు. గణతంత్ర, స్వాతంత్య్ర దినోత్సవాల ప్రాశస్త్యం గురించి గుర్తెరిగారు. అక్టోబర్ 2, నవంబర్ 14ల ప్రాముఖ్యను ఆకళింపు చేసుకున్నారు. దాదాపు 20-30 మంది ఉపాధ్యాయుల, విషయ బోధకుల బోధనల్ని విన్నారు. ఓ రెండువేలసార్లు ప్రతిజ్ఞ చేశారు. దేశాన్ని ప్రేమించుమన్నా.. మంచి అన్నది పెంచుమన్నా.. అంటూ గురజాడ జాతి బోధనను నిద్రలో కూడా వల్లెవేయడం తెలుసు.
ఇంత నిబద్ధతతో, బోధనలతో, క్రమశిక్షణలతో విద్యనభ్యసించిన విద్యార్థులు పరీక్షల సమయంలో ఎందుకు గాడి తప్పుతున్నారో తెలియదు. మనసా, వాచా, నైతిక విలువల్ని ఒంట బట్టించుకొని, దైవ పారాయణం చేసే కొంతమంది తల్లిదండ్రులు, వక్రమార్గాలలోనైనా తమ పిల్లలు అత్యుత్తములుగా ఎదగాలని ఎందుకు అనుకుంటున్నారో అర్థం కాదు. బిహార్ రాష్ట్రంలోని వైశాలిలో గత ఏడాది పదో తరగతి పరీక్షలు జరిగిన తీరే దీనికి నిదర్శనం. విలువలతో కూడిన విద్య అంటూ, వ్యక్తిగత శ్రద్ధంటూ, వ్యక్తిత్వ వికాసమంటూ నినదించే ప్రైవేటు పాఠశాలలు పరీక్షల సమయంలో అడ్డదారులకై ఎందుకు ప్రయత్నిస్తాయో తెలియదు. విద్యాశాఖ మంచిదే. దీని మంత్రివర్యులు మంచివారే. దీన్ని నియంత్రిస్తున్న పాలకపక్షం మరీ మంచిది. సంబంధిత అధికారగణం, జిల్లా విద్యాశాఖాధికారి, మండల విద్యాశాఖాధికారి, ప్రధానోపాధ్యాయులు, మిగతా ఉపాధ్యాయవర్గం- అంతా నీతిమంతులే. సిటింగ్ పేరున, జంపింగ్ పేరున విద్యార్థుల పరీక్ష కేంద్రాల్ని కాపలా కాస్తున్న స్క్వాడ్లు నిజాయితీతో ఏర్పాటు చేసినవే! ఇందులో పనిచేసే రెవెన్యూ, పోలీసు యంత్రాంగం అవినీతికి ఆమడదూరం. వీరందర్ని నియంత్రించే జిల్లా కలెక్టరు, జిల్లాల పరీక్షల పర్యవేక్షకులు కొలతబద్దకు అందనంతగా విలువలు కలిగినవారే. అయినా, పరీక్షల గతిని ఓ యంత్రం (కెమెరా) కాపలా కాయా ల్సి వస్తున్నది.
మన విద్యావిధానం విలువలతో కూడుకున్నదే! ఉపాధ్యాయుల ఎంపిక నిజాయతీతోనే జరిగింది. వారి శిక్షణ నైతికతతోనే పదునైంది. గాంధీగారి మూడు కోతుల కథ వీరికి ఆదర్శం. ప్రైవేటు ఉపాధ్యాయులైతే మరింతగా సుశిక్షితులే. నిజాయతీపరులే. ఇలా ఓ దశాబ్దం పాటు వీరి చేతుల్లో తీర్చిదిద్దబడ్డ రేపటి పౌరులు పరీక్షల సమయంలో వ్యవస్థ నమ్మకాల్ని ఎందుకు వమ్ము చేస్తున్నారో మనకు అర్థం కాదు. ఇన్విజిలేటరును ఛీఫ్ నమ్మడు. ఛీఫ్‌ను డిపార్ట్‌మెంట్ అధికారి, ఈయన్ని సిట్టింగ్ స్క్వాడ్, ఈ స్క్వాడ్‌ను ఫ్లైయింగ్ స్క్వాడ్ నమ్మదు. వీరందరిని డిఈఓ, ఈయన్ని కలెక్టర్, కలెక్టర్‌ను పరీక్షల పరిశీలకుడు, ఈయన్ని రాష్ట్ర విద్యాశాఖ, విద్యాశాఖను హోల్‌మొత్తంగా ప్రభుత్వం నమ్మదు. వీరి నమ్మకమంతా ప్రస్తుతం ఓ బుల్లి యంత్రంపైనే!
పరీక్షలు లోపభూయిష్టంగా వుంటున్నాయంటూ, మాస్ కాపీయింగ్ జరుగుతున్నదంటూ నివారణకై ఎన్నో ప్రయోగాలు చేశారు. పరీక్షలకై క్లస్టర్లను, మండల కేంద్రాల్ని ఎంపిక చేస్తారు. విద్యార్థుల్ని జంబ్లింగ్ విధానంలో కూర్చోబెడతారు. సంబంధిత ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు, లేకుండా చూస్తారు. ఉన్నా మరో పర్యవేక్షకుణ్ణి నియామకం చేస్తారు. యూనిఫాంను బట్టి ఫలానా పాఠశాల విద్యార్థులని గుర్తించి పక్షపాతం చూపిస్తారని, సివిల్ డ్రెస్‌లో విద్యార్థులను హాజరుకమ్మంటారు. చివరకు పేపరును కోడ్ నెంబరు చెప్పి పంపిణీ చేస్తారు. విద్యార్థులు ఒక నిముషానికి మించి ఆలస్యంగా రావడానికి ఒప్పుకోరు. ఇలా ఉరుకుల,పరుగులతో, భయాందోళనకు గురిచేసే వాతావరణంలో చేస్తున్న పరీక్షల నిర్వహణ అధికారులకు చెలగాటంగా, విద్యార్థులకు సంకటంగా ప్రతీ సంవత్సరం ఓ పరీక్షల దొంగాట సాగుతున్నది. విద్యాసంవత్సరమంతా సక్రమంగా సాగిందా, నిజంగా ఉపాధ్యాయులున్నారా, వుంటే వారు సక్రమంగా బోధన సాగించారా? ప్రైవేటు పాఠశాలల బోధనా విధానం శాస్ర్తియంగా కొనసాగిందా? రాచి రంపాన పెడుతూ అత్యుత్తమ బోధనంటూ ప్రచారం సాగిస్తుంటే పట్టించుకోని యంత్రాంగం, ప్రభుత్వ విద్యాశాఖ ఓ ఐదు నిముషాల ఆలస్యాన్ని బోనస్‌గా ఇవ్వడం గొప్ప విషయంగా తోస్తున్నది. పాఠశాల నిర్వహణ, విద్యాశాఖ అస్తవ్యస్తంగా వున్నా, జవాబుదారీతనం లేకున్నా ఎవరికీ పట్టదు. ఇటువంటి వ్యవస్థలో పరీక్షలకు మాత్రం విద్యార్థులు టంచన్‌గా, నిర్ణీత సమయానికి ముందే చేరుకోవాలి. ఇదే మన విద్యావిధానానికి గీటురాయి.
విద్యా సంవత్సరానికి 220 రోజుల చొప్పున పది సంవత్సరాల పాటు ఓ విద్యార్థి రమారమి రెండు వేల రోజులు హాజరవుతాడు. ఇన్ని రోజులు హాజరైన విద్యార్థికి కనీస అభ్యసన స్థాయికి ఎందుకు చేరుకోలేక పోతున్నాడో రాష్ట్ర స్థాయి ఎపెక్స్ సంస్థ ఎస్‌సిఈఆర్‌టికి కూడా పట్టదు. సమాంతరంగా నడుస్తున్న సర్వశిక్షా అభియాన్‌కు చెవికెక్కదు. వీరికి తెలిసిందల్లా ఉపాధాయుల్ని సంవత్సరమంతా శిక్షణల పేరుతో తిప్పడం, టెలీకాన్ఫరెన్స్‌ల పేరున, వీడియో కాన్ఫరెన్స్‌ల పేరున, కంప్యూటర్ విద్య పేరున, మన టీవీ, రేడియో ప్రోగ్రాంల పేరున తరగతి గదికి దూరం చేయడమే. ఎన్ని ప్రయోగాలు చేసినా ఏ ప్రయోగం ఏ ఒక్క లక్ష్యాన్ని నెరవేర్చడం లేదు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సర్వే ప్రకారమే ఆయిదో తరగతిలో 46 శాతం, ఎనిమిదో తరగతిలో 33శాతం కనీసంగా తెలుగు చదవని స్థితి. రాయడంలో 59 శాతంగా, 45 శాతం వెనుకబడి ఉన్నారని తేల్చింది. ఇక మనం అతిగా అభిమానిస్తున్న ఆంగ్లభాష స్థితి అంతంతమాత్రమే. పదో తరగతి పిల్లలు స్వయాన ఆంగ్లంలో తమ పేర్లనే సక్రమంగా రాయలేని వైనం. ప్రైవేటు పాఠశాల విద్యార్థుల పరిస్థితి ఇందుకు భిన్నంగా ఏమీ లేదు. ఎగిసిపడేవారి భావాల్ని వ్యక్త పరచడానికి రాని భాషను మాధ్యమంగా వాడాలన్న నిబంధనే విద్యార్థుల్ని కనీన అభ్యసనకు దూరం చేస్తున్నది. పరభాష (ఆంగ్ల) వ్యామోహంతో స్వతహాగా పిల్లల్ని ఎదగనీయని ఓ ఊహాజనిత విద్యావిధానం ఈ దేశంలో వేళ్లూనుకున్నది.
గత దశాబ్ద కాలంగా పరీక్షల విధానంపై జరగాల్సిన చర్చలు జరిగాయి. జరుగుతూనే ఉన్నాయి. ఎన్‌సిఈఆర్‌టి నుంచి, ఎస్‌సిఈఆర్‌టి దాకా అనేక కసరత్తులు జరిగాయి. వర్క్‌షాపులు, శిక్షణలు నిర్వహించారు. చిట్టచివరికి నిరంతర సమగ్ర మూల్యాంకనం అమలు చేయాలని 2012లో నిర్ణయించారు. కొంత విద్యార్థికి వెసులుబాటు కలిగిస్తుందని, కేవలం వార్షిక పరీక్షల ఆధారంగా జరిగే ఏకపక్ష మూల్యాంకనం విద్యార్థికి న్యాయం చేయడం లేదని, ఈ నూతన విధానం విద్యాసంవత్సరమంతా, విద్యార్థికి తెలియకుండా, ఇబ్బంది కలుగకుండా జరుగుతుంది కాబట్టి, బాగుంటుందని తల్లిదండ్రులు సంతోషించారు. పోతే ఉపాధ్యాయులకు ఈ విధానం ఇబ్బందికరంగా తయారైంది. దీంతో ఈ విధానంలోనే విద్యార్థిని మూల్యాంకనం చేస్తున్నట్టు పేపరుపై చూపెట్టడం జరుగుతున్నది. నిజానికి ఈ విధానం అమలుకు మన తరగతి గది, ఉపాధ్యాయుడు, ఎదగాల్సినంతగా ఎదగకపోగా, ఎదిగించాల్సిన బాధ్యతను విద్యాశాఖ తూతూమంత్రంగా పూర్తి చేసింది. మొత్తంగా విద్యార్థులు బలిపశువులుగా మారుతున్నారు.
2013-14 విద్యా సంవత్సరంలో ప్రారంభమైన ఈ విధానం ప్రస్తుతం పదో తరగతి వారికి ఎనిమితో తరగతిలోనే మొదలైంది. ఈ లెక్కన ప్రస్తుత పరీక్షలు నూతన విధానంలో అంటే పరీక్షా కేంద్రాల్లో స్వేచ్ఛాపూరిత, స్నేహపూరిత వాతావరణంలో కొనసాగాలి. కాని ఇందుకు భిన్నంగా గతంలో లాగే పరీక్షల్ని నిర్వహించి విద్యార్థుల్ని భయాందోళనకు గురిచేయడం జరుగుతున్నది. దీన్ని గుర్తించడానకి, నియంత్రించడానికి ఉపాధ్యాయులకు, ఉపాధ్యాయ సంఘాలకు, ఎలాగో పట్టింపు లేదు. యధాపాలన, తథా బోధనలా సాగుతున్న ఈ వ్యవహారం మేధావి వర్గానికి కూడా పట్టకుండా పోవడం బాధాకరం. విద్యార్థులు తప్ప, అందరు నిజాయతీ పరులే అనే ఈ దొంగాటలో ప్రతిసారి పావులుగా మారుతున్నది విద్యార్థులే. విద్యాశాఖ నిజాయతీతో పనిచేస్తున్నదనే ఓ తప్పుడు సంకేతాన్ని ఇవ్వడమే ఈ పరీక్షల నిర్వహణ విధానం.
ఈ తప్పుడు విధానాన్ని ముందుగా కరీంనగర్ జిల్లా తల్లిదండ్రులు గుర్తించడం ముదావహం! పిల్లల్ని హైరానా చేస్తూ నిర్వహించే విధానాన్ని, తరగతి గదుల్లో ఏర్పాటు చేసిన నిఘా కెమెరాలను తొలగించాలని రోడ్డుపై బైఠాయించారు. చివరికి అధికారులు వచ్చి, మాస్ కాపీయింగ్‌ను అరికట్టడానికే ఈ విధానమంటూ వివరణ ఇవ్వాల్సి వచ్చింది. అంటే, ప్రభుత్వం భావిస్తున్నట్టుగా పరీక్షలు నిజాయతీగా జరగడం లేదన్నట్టే. కనీసం ఇప్పుడన్నా ఈ విధానానికి స్వస్తి పలికేలా ఒత్తిడి పెరగాలి. పరీక్షల్లో సమూలమైన మార్పులు జరగాలి.

- డా. జి.లచ్చయ్య సెల్: 9440116162