సంపాదకీయం

వైద్య నిర్లక్ష్యం తగదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దేశానికి స్వాతంత్య్రం వచ్చి ఏడు దశాబ్దాలు దా టినా వైద్య సేవలన్నవి అందని మావి చందంగానే ఇప్పటికీ కొనసాగడం విచారకరం. గోరఖ్‌పూర్‌లోని బాబా రాఘవదాస్ వైద్య కళాశాల ఆసుపత్రిలో ఇటీవల జరిగిన చిన్నారుల మృతి సంఘటన గ్రామీణ ఆరోగ్య వ్యవస్థ ఎంత అధ్వాన్నంగా ఉందో కళ్లకు కట్టింది. దేశ జనాభాలో మెజారిటీ భాగం గ్రామీణ ప్రాంతాల్లోనే ఉంటున్నారన్నది వాస్తవం. పట్టణాలు ఎంతగా విస్తరిస్తున్నా గ్రామీణ భారతాన్ని ఆదుకోకపోతే, వైద్య ఇతర అత్యవసర సేవలకు సంబంధించి తగిన ఏర్పాట్లు చేయకపోతే పరిస్థితి ఎంతగానైనా విషమిస్తుందని చెప్పడానికి గోరఖ్‌పూర్ ఘటనకు మించిన ఉదాహరణ మరొకటి లేదు. గ్రామీణ ఆ రోగ్య వ్యవస్థలు అత్యంత బలహీనంగా ఉన్నాయి. అసాధారణ రీతిలో పెరిగిపోతున్న రోగుల ఒత్తిడి ఇటు వైద్యులపైనా, అందుబాటులో ఉన్న అరకొర సేవలపైనా తీవ్ర ప్రభావానే్న కనబరుస్తోంది. ఈ లోపాలను సరిదిద్దే ప్రయత్నం చేయకపోవడం వల్లే గోరఖ్‌పూర్ ఘోరం చోటు చేసుకుంది. అతిస్వల్ప వ్యవధిలో పెద్దసంఖ్యలో చిన్నారులు మృతిచెందడం అన్నది వైద్యపరమైన నిర్లక్ష్యానికే కాకుండా, అరకొరగా ఉన్న సౌకర్యాల తీరుతెన్నులను వెలుగులోకి తెచ్చింది. అనేక వ్యాధులు గ్రామీణ ప్రాంతాల్లో స్వైర విహారం చేస్తున్న నేపథ్యంలో ఇటు కేంద్ర స్థాయిలోనూ, అటు రాష్ట్రాల స్థాయిల్లోనూ ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ పరిస్థితిని ఏమాత్రం విస్మరించినా అవసరానికి దగ్గ పరిమాణంలో ఇటు ఆసుపత్రుల సంఖ్యను, అటు వైద్యుల లభ్యతను పెంచకపోయి నా ఎలాంటి ఘోరాలైనా చోటుచేసుకునే అవకాశం ఉంటుంది.
గోరఖ్‌పూర్ ఉదంతా నే్న తీసుకున్నా దాని చు ట్టుపక్కల ఉన్న గ్రామా ల్లో గానీ, ఉత్తరప్రదేశ్ ఇరుగు పొరుగు రా ష్ట్రాల్లో కాని వైద్యపరమైన వౌలిక సదుపాయాలు అత్యంత బలహీనంగా ఉన్నాయని చెప్పడానికి సందేహించాల్సిన అవసరం లేదు. రోగుల ఒత్తిడిని తట్టుకోలేని ఆసుపత్రులు వారిని తదుపరి వైద్య నిమిత్తం ఇతర ఆసుపత్రులకు తరలిస్తున్న ఉదంతాలు ఎన్నో ఉన్నాయి. గ్రామీణ వైద్య విధానం ఎంత అధ్వానంగా ఉందో గత ఏడాది మార్చిలో జాతీయ గ్రామీణ హెల్త్ మిషన్‌పై కంప్ట్రోలర్, ఆడిటర్ జనరల్ ఇచ్చిన నివేదికే కళ్లకు కట్టింది. ఎన్నో విధాలుగా గ్రామీణ ఆరోగ్య వ్యవస్థ లోపభూయిష్టంగానే ఉందన్న వాస్తవం ఆ నివేదికలో మరింతగా నిగ్గుదేలింది. కేటాయించిన నిధులను పూర్తిస్థాయిలో వినియోగించుకోకపోవడం, పెరిగిపోతున్న రోగాలకు తగినట్టుగా వైద్య పరికరాలను సమకూర్చుకోకపోవడం ఈ పరిస్థితికి ఒక కారణమైతే చాలా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో తగిన సిబ్బందే లేకపోవడం, అలాగే కమ్యూనిటీ ఆరోగ్య కేంద్రాల్లోనూ పరిస్థితి ఇదేరకంగా ఉండటం దిగ్భ్రాంతి కలిగించే విషయమే. అంతోకొంతో మెరుగైన పరిస్థితి ఉంటుందని భావించే జిల్లా ఆసుపత్రులు కూడా ఇందుకు భిన్నంగా ఏమీ లేవు. ఉన్న పరికరాలు కూడా తాతలనాటివి కావడంవల్ల వైద్య పరీక్షలను పూర్తిస్థాయి విశ్వసనీయతతో చేసే పరిస్థితే లేకుండా పోతోంది. అన్నింటికీ మించి రోగులకు అత్యవసరంగా ఇవ్వాల్సిన మందులు కూడా తగిన పరిమాణంలో అందుబాటులో లేకపోవడం అన్నది ఈ ఆసుపత్రుల పనితీరును మరింతగా దిగజారుస్తోంది. చాలా ఆసుపత్రుల్లో రోగుల సంఖ్య పెరుగుతున్నా వైద్యపరమైన ఖాళీలను భర్తీచేసే ప్రయత్నాలు మాటలకే పరిమతం అవుతున్నాయి. గ్రామీణ భారతంలో ఎక్కడ చూసినా ఈ రకమైన పరిస్థితి అన్ని ఆసుపత్రుల్లోనూ కళ్లకు కడుతుంది. రాష్ట్రాల స్థాయిలో వైద్య సేవల లభ్యతకు సంబంధించి, వాటిని మెరుగుపరిచే విషయంలోనూ చర్యలు తీసుకుంటున్నామని చెబుతున్నా అవి గ్రామీణ ప్రాంతాలకు అందిరావడం అన్నది అనుకున్న పరిమాణంలో జరగడం లేదన్నది వాస్తవం.
ఉత్తరప్రదేశ్ విషయానికే వస్తే దాదాపు 50 శాతం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వైద్యుడే లేడన్నది గుండెను పిండేసే విషయమే. అసలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ఏర్పాటు లక్ష్యానే్న ఈ దిగ్భ్రాంతికర వాస్తవం నీరుగారుస్తోంది. అతి సాధారణ స్థాయి వ్యాధుల చికిత్స కోసం గ్రామీణ ప్రాంత ప్రజలకు అందుబాటులో ఉండేందుకు ఈ పిహెచ్‌సిలను ఏర్పాటు చేశారు. వీటిలో 50 శాతం ఆస్పత్రుల్లో వైద్యుడే లేడంటూ కాగ్ ఇచ్చిన నివేదిక ప్రభుత్వాల మాటలకు, చేతలకు ఏ కోశానా పొంతనే లేదన్న చేదునిజాన్ని నిగ్గుతేలుస్తోంది. మరో 13 రాష్ట్రాల్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వైద్య ఖాళీల భర్తీ పూర్తిస్థాయిలో జరగలేదన్న విషయమూ ఆందోళన కలిగించేదే. వైద్యపరంగా భారతదేశాన్ని కొత్త పుంతలు తొక్కిస్తామని కేంద్ర రాష్ట్ర స్థాయిలో ప్రభుత్వాలు ఊకదంపుడు ఉపన్యాసాలతో ప్రకటనలు చేస్తున్న నేపథ్యంలో గ్రామీణ భారత వైద్య చిత్రం అందుకు పూర్తి విరుద్ధంగా ఉండడం విడ్డూరమే. బిహార్, జార్ఖండ్, సిక్కిం, ఉత్తరాఖండ్, పశ్చిమ బెంగాల్ తదితర రాష్ట్రాల్లోని గ్రామీణ ప్రాంతాల్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, వైద్య ఉపకేంద్రాలు, కమ్యూనిటీ ఆ రోగ్య కేంద్రాల్లో వౌలికమైన వైద్య సౌకర్యాలు అరకొర చందంగానే ఉం డడం కూడా గ్రామీణ వైద్య లక్ష్యాన్ని నీరుగారుస్తోంది. ఈ రాష్ట్రాల్లోని ప్రాథమిక వైద్య కేంద్రాలన్నీ కూడా ఇక అంతిమ ప్రయత్నంగా రోగులను పెద్దాసుపత్రులకు పంపక తప్పని పరిస్థితిని ఎదుర్కొంటున్నాయి.
గ్రామీణ ఆరోగ్య వ్యవస్థను ఆధునీకరించేందుకు అత్యంత ప్రామాణిక రీతిలో వైద్య సేవలను అందుబాటులోకి తెచ్చేందుకు ఎప్పుడో మార్గదర్శకాలు జారీ ఆయ్యాయి. అత్యంత ప్రాథమిక స్థాయిలోని ఆరోగ్య ఉపకేంద్రాలు మొదలుకొని పైస్థాయిలో ఉన్న అన్నింటిలోనూ వైద్య సేవల ప్రామాణికతను పెంచే ఉద్దేశంతో ఆ మార్గదర్శకాలను రూపొందించి ఏళ్లు గడుస్తున్నా ఎక్కడి గొంగళి అక్కడే అన్న చందంగా పరిస్థితులు ఉండటం సిగ్గుచేటు. 2020 నాటికల్లా ఆధునిక వైద్య భారతాన్ని ఆవిష్కరించాలన్న లక్ష్యాన్ని కేంద్రం ప్రకటించింది. జాతీయ ఆరోగ్య మిషన్ కింద వివిధ లక్ష్యాలను నిర్దారించుకుంది. ముఖ్యంగా శిశు మరణాల రేటును గణనీయంగా తగ్గించడంతోపాటు ఇతరత్రా వైద్యపరమైన లోపాలను పూర్థిస్థాయిలో తొలగించి ఆధునిక ప్రమాణాలను పాదుకొల్పాలనీ సంకల్పించింది. కానీ ప్రస్తుత గ్రామీణ వైద్య పరిస్థితిని అవలోకిస్తే ఈ ఆధునిక వైద్య భారత ఆవిష్కరణ మరో మూడేళ్ల కాలంలో సాధ్యమేనా? అనే సందేహాలకు ఆస్కారం ఏర్పడుతోంది. గ్రామీణ జనాభా సంఖ్యను దృష్టిలో పెట్టుకుని దానికి తగ్గ పరిమాణంలో ఆసుపత్రులను, వైద్యుల లభ్యతను పెంపొందిస్తే తప్ప పరిస్థితిలో గుణాత్మక మార్పు రాదు. ఇందుకు కావలసింది లక్ష్యాన్ని సాధించే నిబద్ధత కలిగిన చేతలే తప్ప జనం కోసం మాట్లాడే మాటలు కాదు. అలా జరిగినప్పుడే మరో గోరఖ్‌పూర్ ఘోరం నివారితమవుతుంది.