సంపాదకీయం

పాకిస్తాన్‌కు ‘దాసోహం!’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మన గూఢచారిని తమ దేశంలో పసికట్టి పట్టుకుని నిర్బంధించినట్టు శుక్రవారం పాకిస్తాన్ ప్రభుత్వం వెల్లడించడం అసలు సమస్యనుండి దృష్టిని మళ్లించడంలో భాగం. పాకిస్తాన్ ప్రభుత్వం నిరంతరం మన దేశంలోకి జిహాదీ ఉగ్రవాద హంతకులను ఉసికొల్పుతుండడం అసలు సమస్య! ఈ సమస్య ప్రాధాన్యాన్ని తగ్గించడానికి వీలుగా తన బీభత్స వికృత వ్యూహాన్ని కప్పిపుచ్చుకొనడానికి వీలుగా పాకిస్తాన్ ప్రభుత్వం ఈ ఎత్తుగడలను ఆరంభించిన తరువాత అనేక ఏళ్లు గడిచిపోయాయి! బలూచిస్తాన్‌లో విద్రోహ కలాపాలు జరిపిస్తున్న పాకిస్తాన్ వ్యతిరేకులను మన ప్రభుత్వం సమర్ధిస్తోందన్నది ఈ ఎత్తుగడ! ఈ ఎత్తుగడను పదే పదే అమలు జరుపుతున్న పాకిస్తాన్ ప్రభుత్వం తమ దేశంలో మన ప్రభుత్వం విచ్ఛిన్న కలాపాలను ప్రోత్సహిస్తోందన్న భ్రాంతిని కల్పించడానికి యత్నిస్తోంది! ఈ షడ్యంత్రంలో భాగంగానే పాకిస్తాన్ ప్రభుత్వం కులభూషణ్ యాదవ్ అనే భారతీయుడ్ని ఈనెల 21న అరెస్టు చేసినట్టు 25వ తేదీన వెల్లడించింది. పాకిస్తాన్, ఆఫ్ఘానిస్తాన్ దేశాల సరిహద్దుల్లో ఉన్న చమన్ అన్న ప్రాంతంలో కులభూషణ్ యాదవ్‌ను పట్టుకొన్నట్టు బలూచిస్థాన్ ఆంతరంగిక భద్రతా వ్యవహారాల మంత్రి సర్ఫరాజ్ బుగ్తీ ప్రకటించాడట! కులభూషణ్ యాదవ్ మన ప్రభుత్వ పరిశోధన, విశే్లషణ విభాగానికి-రా-చెందిన గూఢచారి అన్నది పాకిస్తాన్ ప్రభుత్వం చేస్తున్న ఆరోపణ! ఈ అరెస్టు చేసిన తరువాత మన రాయబారి గౌతమ్ బంబావాలేను ఇస్లామాబాద్‌లోని పాకిస్తాన్ విదేశాంగ మంత్రిత్వశాఖ వారి కార్యాలయానికి పిలిపించి నిరసన కూడా తెలిపారట! మన ప్రభుత్వం వారు పాకిస్తాన్ ప్రభుత్వం చేసిన ఆరోపణలను ఖండించారు. కానీ ఢిల్లీలోని పాకిస్తాన్ రాయబారిని పిలిపించి ఇ లాంటి తప్పుడు ఆరోపణల ను చేయడం తగదని మందలించలేదు. ఇలా మందలించకపోవడం మన మెతకతనానికి సరికొత్త ఉదాహరణ. ఈ మెతక విధానం కారణంగానే దశాబ్దుల తరబడి వేలాదిమంది భారతీయులను హత్య చేయించి పాకిస్తాన్ బీభత్స ప్రభుత్వం నాగరిక ప్రభుత్వంగా చెలామణి అవుతోంది! కులభూషణ్ యాదవ్ గతంలో మన నౌకాదళంలో పని చేసాడట! ఆయన సక్రమమైన ప్రయాణ అనుమతి పత్రం-పాస్‌పోర్ట్, ప్రవేశ అనుమతి పత్రం-వీసా-కలిగి ఉన్నాడు! కానీ ఆయనను మన ప్రభుత్వం గూఢచర్యకు వినియోగించిందన్న పాకిస్తాన్ ప్రభుత్వం చేస్తున్న ఆరోపణ! ఇలాంటి అబద్ధాలను పాకిస్తాన్ ప్రభుత్వం నిజాలుగా ప్రచారం చేయడం కొత్త కాదు. మన దేశానికి చెందిన మానవ రహిత విమానం ఒకటి తమ దేశంలోకి చొరబడిందని దాన్ని కూల్చివేసామని పాకిస్తాన్ ఇటీవల ఆరోపించింది. ఆ తరువాత ఈ ఆరోపణ తప్పని ధ్రువపడింది. మన విమానం పాకిస్తాన్‌లోకి చొచ్చుకుని పోలేదని స్పష్టమైంది. ఆరోపణ చేసి ఆర్భాటించిన పాకిస్తాన్ ప్రభుత్వం ఆ తరువాత నోరు మెదపడం లేదు!
ఇప్పుడిలా కులభూషణ్ యాదవ్‌ను పాకిస్తాన్ ప్రభుత్వం నిర్బంధించిన వెంటనే మన ప్రభుత్వం పఠాన్‌కోటకు రండి అని పాకిస్తాన్ పరిశోధక బృందానికి చెప్పి ఉండాలి! కానీ చెప్పలేదు! పాకిస్తాన్ ప్రభుత్వం ఎన్ని కవ్వింపు చర్యలకు పాల్పడినప్పటికీ మన ప్రభుత్వం ఇలా మితిమీరిన సమన్వయాన్ని పాటించడం మన దేశపుదీర్ఘకాల ప్రయోజనాలను దెబ్బ తీస్తోంది. గతంలో సర్వజిత్‌సింగ్ అనే భారతీయుడిని పాకిస్తాన్ సైనికులు మన దేశంలోకి చొరబడి అపహరించుకుని వెళ్లారు. ఆయనపై అనేక నేరాలను ఆరోపించారు. సర్వజిత్‌సింగ్ తమ దేశంలోకి చొరబడి గూఢచర్యం సాగిస్తుండగా తమసైనికులు పట్టుకున్నారన్నది పాకిస్తాన్ ప్రభుత్వం చేసిన ఆరోపణ! నిరపరాధి అయిన సర్వజిత్‌సింగ్ జీవితమంతా పాకిస్తాన్ జైళ్లలో గడిచిపోయింది. దశాబ్దులు గడిచిన తరువాత పాకిస్తాన్ ప్రభుత్వం జైల్లోనే సర్వజిత్‌ను చంపించింది. ఇరవై ఎనిమిదేళ్ల సర్వజిత్‌సింగ్‌ను 1990 ఆగస్టులో పాకిస్తాన్ దళాలు అపహరించాయి. లాహోర్‌లోను ఫైసలాబాద్‌లోను జరిగిన పేలుళ్లకు ఆయన కారకుడని ఆ తరువాత ఆరోపించాయి. అప్పటికే ఇద్దరు కుమార్తెలకు తండ్రి అయిన సర్వజిత్ ఆ తరువాత ఇరవై మూడేళ్లు పాటు పాకిస్తాన్‌లో నిర్బంధ గ్రస్తుడయ్యాడు. ఆయన కుటుంబంవారు ఇక్కడ అనాధలయ్యారు. 2013 ఏప్రిల్‌లో పాకిస్తాన్ ప్రభుత్వం ఉసిగొల్పిన హంతకులు లాహోర్ జైల్లో ఆయనపై దాడిచేసి భయంకరంగా గాయపరిచారు. మే రెండున సర్వజిత్‌సింగ్ మరణించాడు! అప్పుడు సైతం మన ప్రభుత్వం పాకిస్తాన్ ప్రభుత్వాన్ని బీభత్సవ్యవస్థ- టెర్రర్ రిజీమ్‌గా ప్రకటించలేదు. మన ప్రభుత్వాలు ఇలా పాకిస్తాన్‌ను నాగరిక దేశంగా ఇంకా గుర్తించడం మన దేశ వ్యతిరేక చర్య..ప్రజా వ్యతిరేక చర్య! దశాబ్దుల తరబడి మన ప్రజలను హత్య చేయించిన, చేయిస్తున్న పాకిస్తాన్ ప్రభుత్వ ప్రతినిధులతో సిగ్గుమాలిన మన రాజకీయ నేతలు కరచాలనాలు చేసి చిరునవ్వులు చిందిస్తుండడం దశాబ్దుల వైపరీత్యం! ఇప్పుడు కులభూషణ్ యాదవ్ నిర్బంధం సర్వజిత్ వ్యధకు పునరావృత్తి అయ్యే ప్రమాదం ఉంది. మన ప్రభుత్వం నిరోధించగలదా?
బలూచిస్తాన్ పాకిస్తాన్‌లోని ఒక ప్రాంతం-ప్రావిన్స్! అఖండ భారత్ 1947లో విభజనకు గురైన తరువాత పాకిస్తాన్ ఏర్పడినప్పటినుంచీ కూడా బలూచిస్తాన్ ప్రజలు అన్యాయానికి గురి అవుతునే ఉన్నారు. పశ్చిమ పంజాబ్ ప్రాంతం వారు తమపై ఆధిపత్యం వహిస్తున్నారని తమ ను అణచివేస్తున్నారని పాకిస్తాన్‌లోని మిగిలిన ప్రాంతాల ప్రజలు ఆదినుంచీ భావిస్తున్నారు. అందువల్లనే బలూచిస్తాన్ ప్రజలు నిరంతరం తిరుగుబాటు చేస్తున్నారు. ఈ తిరుగుబాటు దారులు క్రమంగా బలూచిస్తాన్ స్వతంత్ర ఉద్య మ కారులుగా పరివర్తన చెందడం చరిత్ర! పాకిస్తాన్ పౌర ప్రభుత్వాలు, సైనిక ప్రభుత్వాలు అనేక మంది ఉద్యమనేతలను ఉద్యమకారులను చంపించింది! ఇలా చంపిన అభియోగంపై మాజీ నియంత పరవేజ్ ముషారఫ్‌పై కేసులు కూడ నమోదయ్యాయి! ముషారఫ్‌పై కక్ష తీర్చుకొనడంలో భాగంగా ఆయన తరువాత పాకిస్తాన్‌ను పాలిస్తున్న వారు ఈ కేసులు పెట్టించారన్న ఆరోపణలు కూడ కొనసాగుతున్నాయి. ఏమయినప్పటికీ ఈ పాకిస్తాన్ అంతర్గత కల్లోలంతో మన ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదు. సంబంధం లేదని కులభూషణ్ యాదవ్ అరెస్టు తరువాత శుక్రవారం కూడ మన ప్రభుత్వం ఈ స్పష్టీకరణను ఇచ్చింది! అయినప్పటికీ బలూచిస్తాన్ స్వాతంత్య్ర ఉద్యమంతో మనప్రభుత్వానికి లేని సంబంధాన్ని ఉన్నట్టుగా చిత్రీకరించడానికి పాక్ ఏళ్ల తరబడి యత్నిస్తోంది!
పాక్‌ను 1990వ దశకంలోనే మన ప్రభుత్వం బీభత్స వ్యవస్థగా ప్రకటించి ఉండాలి! జిహాదీ ఉగ్రవాదులను ఉసిగొల్పడం మాననంత వరకూ మీతో మాకు ఎలాంటి చర్చలు సంబంధాలు వద్దు...అని మన ప్రభుత్వం చెప్పి ఉండాలి. ఈ విధానాన్ని కనీసం ఐదేళ్లపాటు మన ప్రభుత్వం అమలు చేసి ఉండినట్టయితే పాక్ ప్రభుత్వం దారికి వచ్చి ఉండేది. ప్రపంచ దేశాలు సైతం మన మాటలను విశ్వసించి ఉండేవి. కానీ పాక్ ప్రభుత్వం ఎంత భయంకరమైన బీభత్సకాండ జరిపించినప్పటికీ ఆరు నెలల తరువాత మన ప్రభుత్వ ప్రతినిధులు పాకిస్తాన్ ప్రతినిధులతో కలిసి విందులారగించడం దశాబ్దుల తరబడి కొనసాగుతున్న వైపరీత్యం! పఠాన్‌కోటపై దాడి తరువాత మన ప్రభుత్వం మరింత దిగజారింది. దాడి చేసిన పాక్ ప్రభుత్వం దర్యాప్తు జరుపుతుందట... పఠాన్‌కోటకు వచ్చి! అంతర్జాతీయ సమాజం విస్తుపోతోంది..మన దేశ ప్రజలు దిగ్భ్రాంతి చెంది ఉన్నారు!!