సంపాదకీయం

ఇదేం ‘పారదర్శకత’?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రజాప్రతినిధుల, రాజకీయ వేత్తల ఆస్తుల విలువ శరవేగంతో పెరుగుతుండడం పట్ల సర్వోన్నత న్యాయస్థానం విస్మయాన్ని వ్యక్తం చేయడం రాజకీయాలను ఆవహించి ఉన్న అవినీతికి మరో నిదర్శనం. ఈ విషయమై సకాలంలో దర్యాప్తు జరుపనందుకు ప్రభుత్వాన్ని సర్వోన్నత న్యాయస్థానం బుధవారం తప్పుపట్టడం సంచలనాత్మక పరిణామం. పారదర్శకతను పాటిస్తున్నట్టు ప్రచారం చేసుకుంటున్న ప్రస్తుత కేంద్ర ప్రభుత్వ రాజకీయ నిర్వాహకులు ఈ విషయమై తీవ్రమైన మేధా మథనం జరుపుకోవలసి ఉంది. 2004 నుండి 2014 వరకు కాంగ్రెస్ నాయకత్వంలోని ‘ఐక్య ప్రగతి కూటమి’ కేంద్ర ప్రభుత్వాన్ని నిర్వహించిన సమయంలో అనేకానేక అవినీతి కలాపాల పుట్టలు పెరిగాయి. దూరవాణి రంగంలో, బొగ్గు గనుల కేటాయింపుల రంగంలో అవినీతి పెద్ద ఎత్తున బయటపడడం చరిత్ర. రక్షణ రంగంలో, వివిధ రంగాలలో పగిలిన అవినీతి పుట్టలు సృష్టించిన చిటపటలు ఇంకా సద్దుమణగలేదు. 2014 మే 26 నుంచి కేంద్ర ప్రభుత్వాన్ని నిర్వహిస్తున్న భారతీయ జనతాపార్టీవారు తమ పాలనకు అవినీతి అంటలేదని అత్యంత విశ్వాసంతో ప్రచారం చేస్తున్నారు! విదేశాలలోను, స్వదేశంలోను నక్కి ఉన్న నల్లధనాన్ని వెలికి తీయడంలో ప్రస్తుత ప్రభుత్వం పాక్షికంగా విజయాలను సాధించడం కూడ వాస్తవం! పెద్దనోట్ల రద్దు కార్యక్రమం ఈ పాక్షిక విజయంలో భాగం. విదేశాలలో దాగి ఉన్న నల్లడబ్బును వెలికి తీయడానికి సైతం నరేంద్ర మోదీ ప్రధాన మంత్రిత్వంలోని ప్రభుత్వం గత మూడేళ్లుగా గణనీయమైన కృషి చేసింది! అంతర్జాతీయ వేదికలపై సైతం ప్రధాన మంత్రి ‘నల్లడబ్బు’ ప్రమాదాన్ని ప్రస్తావించి ఉన్నాడు. నల్లడబ్బును వెలికి తీయడంలో సహకరించాలని వివిధ దేశాలకు పదే పదే విజ్ఞప్తులు చేస్తున్నాడు! ‘స్వచ్ఛంద సంస్థల’ ము సుగులో వివిధ దేశ వ్యతిరేక కలాపాలను సాగిస్తున్న నకిలీ ముఠాలకు విదేశాల నుండి తరలి వస్తున్న అక్రమ నిధులకు కూడ ప్రస్తుత ప్రభుత్వం అడ్డుకట్ట వేసింది. రాజకీయ వాదులు, వాణిజ్యవేత్తలు, దళారీలు, అసాంఘిక శక్తులు, దేశవిద్రోహులు పరస్పరం కలసికట్టుగా నల్లడబ్బును పెంచడం చరిత్ర! వేలాది వాణిజ్య సంస్థలు కేవలం నల్లడబ్బును తెల్లడబ్బుగా మార్చి ప్రజలకు లభించవలసిన ‘ఆదాయపు పన్ను’ ఎగవేయడం చరిత్ర! పెద్ద నోట్ల రద్దు ద్వారాను, వస్తుసేవల పన్నుల-జిఎస్‌టి-ను వ్యవస్థీకరించడం ద్వారాను ఇలాంటి దాదాపు రెండు లక్షల డొల్ల వాణిజ్య సంస్థలను రద్దు చేయగలిగినట్టు ప్రభుత్వం ఇటీవల ప్రకటించింది. ఆదాయం పన్నును చెల్లించని రెండు లక్షల పదివేల కంపెనీలను ప్రభుత్వం వాణిజ్య సంస్థల జాబితాలోంచి తొలగించిందట! ఆదాయం పన్ను చెల్లించని దాదాపురెండు లక్షలమంది నిర్వాహకులు-డైరక్టర్‌లు-కొత్త సంస్థలలో ఎలాంటి పదవులను పొందరాదని కూడ ప్రభుత్వం నిర్దేశించింది. వేలాది నకిలీ స్వచ్ఛంద సంస్థలకు లభిస్తున్న అక్రమ విదేశీయ నిధుల ప్రవాహం కూడ ఆగిందన్న ప్రచారం జరుగుతోంది.
ఇదంతా అవినీతికి వ్యతిరేకంగాను, నల్లడబ్బుకు వ్యతిరేకంగాను వర్తమాన ప్రభుత్వం ప్రదర్శిస్తున్న పారదర్శకమైన పనితీరుకు నిదర్శనం! కానీ ఎన్నికల సందర్భంగా దాఖలు చేసిన నామాంకన-నామినేషన్ పత్రాలలో అభ్యర్థులు ప్రకటించిన ఆస్తులకంటె ఇబ్బడి ముబ్బడిగా వారి ఆస్తులు పెరిగి పోవడం సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జె.చలమేశ్వర్, ఎస్.అబ్దుల్ నజీర్ జారీ చేసిన ఆదేశానికి ప్రాతిపదిక! కొందరు అభ్యర్థుల ఆస్తుల పరిమాణం, విలువ ఐదు రెట్లు-ఐదు వందల శాతం-కూడ పెరిగిపోయిందని, ఈ విషయమై ఇది వరకు ఎందుకు దర్యాప్తు జరపలేదని న్యాయమూర్తులు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఎన్నికలలో అక్రమ ధన ప్రభావం తగ్గించడానికి వీలుగా సంస్కరణలను చేయాలని భావిస్తున్న ప్రభుత్వం అభ్యర్థుల ఆస్తులు ఇలా పెరిగిపోతుండడం గురించి ఎందుకు పట్టించుకోదన్న సర్వోన్నత న్యాయస్థానం ప్రశ్నకు సెప్టెంబరు పనె్నండవ తేదీలోగా ప్రభుత్వం సమాధానం చెప్పవలసి ఉంది! అభ్యర్థులు తమ నామాంకన పత్రాలలో తమ ఆస్తులను, భార్య ఆస్తులను, కుటుంబ సభ్యుల ఆస్తులను వెల్లడించే వివరాలను నమోదు చేస్తున్నారు. అయితే ఈ వివరాలు నిర్దిష్టమైనవా? నిర్దుష్టమైనవా? అన్న విషయాలను నిగ్గు తేల్చగల ‘కాలపరిమితి’కి లోబడిన వ్యవస్థ యంత్రాంగం ఎక్కడుంది? అభ్యర్థుల ఆస్తులు వెల్లడి అవుతున్నాయి. కాని ఆస్తులను అభ్యర్థులు ఎలా సంపాదించారు? వారి ఆదాయం ఎంత? ఆదాయ మార్గాలు ఏవి? అన్న వివరాలను నామాంకన పత్రాలలో పొందుపరచడం లేదన్నది న్యాయసూచికను దాఖలు చేసిన ‘లోక్ ప్రహారీ’ అన్న స్వచ్ఛంద సంస్థ సర్వోన్నత న్యాయస్థానానికి నివేదించిన వాస్తవం.
అందువల్ల అభ్యర్థులు కేవలం తమ ఆస్తులను వెల్లడించడం వల్ల ‘నల్లడబ్బు’, ‘అక్రమ ఆర్జన’ వెల్లడి కావు! ఆ ఆస్తులను అభ్యర్థులు ఎలా సంపాదించారన్న వాస్తవాన్ని కూడ వారు వెల్లడించాలన్న నిబంధనను విధించాలి! ఏమయినప్పటికీ రాజకీయ అవినీతిని సమూలంగా తుదముట్టించడానికి వీలైన ఎన్నికల సంస్కరణలు ఇప్పటి వరకు జరగలేదన్నది సర్వోన్నత న్యాయాగ్రహానికి కారణం! ప్రభుత్వం ఇప్పుడైనా ఎం దుకు ఈ సంస్కరణలను మొదలుపెట్టరాదు? రాజకీయ పార్టీలకు సమాచా రం పొందే హక్కు-రైట్ టు ఇన్‌ఫర్‌మేషన్- చ ట్టాన్ని వర్తింపచేస్తూ నిర్దిష్టమైన సవరణ జరుగవలసి ఉంది! ఇరవై వేల రూపాయలను, అంతకంటే ఎక్కువ మొత్తాలను తమకు చెల్లించే వారి పేర్లను, సంస్థల పేర్లను రాజకీయ పక్షాలు వెల్లడించవలసి ఉంది. కానీ జాతీయ రాజకీయ పక్షాలకు లభిస్తున్న విరాళాలలో సగటున పనె్నండు శాతం మాత్రమే ఇలా వెల్లడి అవుతున్న ‘ప్రదాత’ల నుంచి లభిస్తోందట! అంటే మిగిలిన ఎనబయి ఎనిమిది శాతం ఆదాయం ఆయా జాతీయ రాజకీయ పార్టీలకు ఎలా లభిస్తోందన్నది వెల్లడి కావడం అంటే ఈ ఎనబయి శాతం ఆదాయం-సగటున-ఇరవై వేల రూపాయలకంటే తక్కువ విరాళం ఇస్తున్న ‘ప్రదాత’లకు లభిస్తోందన్నమాట... జనం నమ్మాలి! ఈ పరిమితి ఎందుకు? రాజకీయ పార్టీలకు ప్రతి పైసా ఎలా లభిస్తోందన్న సర్వ సమగ్ర సమాచారం వెల్లడయ్యే విధంగా నిబంధనలు ఎప్పుడు సవరిస్తారు? అలా వెల్లడయినప్పుడే పారదర్శకతకు అర్థం సమగ్రవౌతుంది. ప్రభుత్వం పూనుకుంటుందా?
అధికార పక్షానికి విపక్షాల కంటే అభిమానులు అధికంగా ఉండడం సహజం. అందువల్ల 2015-2016 ఆర్థిక సంవత్సరంలో ఏడు జాతీయ రాజకీయ పక్షాలకు లభించిన వెల్లడైన విరాళాలలో యాబయి ఐదు శాతం భారతీయ జనతాపార్టీకి దక్కడం ఆశ్చర్యకరం కాదు. కాంగ్రెస్‌కు ఇరవై ఏడు శాతం వాటా దక్కిందట! కానీ ఈ జాతీయ పక్షాలకు లభిస్తున్న మొత్తం విరాళాల ప్రదాతల వివరాలను తెలుసుకునే హక్కు ప్రజలకుంది..‘పారదర్శకత’కు ఇదీ ప్రాతిపదిక!