సంపాదకీయం

ఊపిరాడని పుడమి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మన దేశపు తూర్పు సముద్ర తీర ప్రాంతంలో ప్రతి సంవత్సరం దాదాపు పనె్నండు వేల తాబేళ్లు చేపల వలలలో చిక్కి విలవిలలాడి చనిపోతున్నాయట! ఇవి కాలుష్యం కాటుకు గురై ఊపిరి ఆడని తాబేళ్లు కాదు, కేవలం మత్స్యకారుల అజాగ్రత్తవల్ల నిర్లక్ష్యం వల్ల ప్రాణాలను పోగొట్టుకుంటున్న సముద్ర కూర్మాలు! మన దేశపు పశ్చిమ సముద్ర తీరంలో ఇలా ఎన్ని వేల తాబేళ్లు మృత్యువునకు బలి అవుతున్నాయన్నది తెలీదు. కాలుష్యం కారణంగా సముద్ర జలచరాలు లక్షల సంఖ్యలో అకాల మరణం పాలవుతుండడం నడుస్తున్న వైపరీత్యం! మత్స్యకారుల నిర్లక్ష్యం వల్ల చట్టాలలోని నియమాలను వారు పాటించకపోవడంవల్ల జరుగుతున్న జల చర వధకంటే అనేక రెట్ల నష్టం మానవ నిర్లక్ష్యం వల్ల ఏర్పడిన కాలుష్యంవల్ల సముద్ర జీవులకు సంభవిస్తోంది. అంతరిక్షం సైతం కాలుష్యంతో కలుషితం కావడానికి కారణవౌతున్న మానవ నిర్లక్ష్యం జీవ జాలం నష్ట భ్రష్టం కావడానికి దోహదం చేస్తోంది. మానవుడు జీవ జాలంలో భాగం కనుక తన నష్టాన్ని తానే కొని తెచ్చుకుంటున్న భస్మాసుర ప్రవృత్తిని ఇప్పుడైనా విడనాడాలన్నది ప్రకృతి చెబుతున్న పాఠం. వృక్ష జాలం మనుగడ జంతుజాలం మనుగడపై ఆధారపడి ఉంది. జంతు జాలం అస్తిత్వానికి ప్రాథమిక ప్రాతిపదిక వృక్ష జాలం! ఇలా మొత్తం జీవ జాలం మనుగడ భూమి స్వచ్ఛతను నీటి స్వచ్ఛతను గాలి స్వచ్ఛతను కాపాడుతోందన్న ‘స్పృహ’ నశించిపోతుండడం నడుస్తున్న కాలుష్యపు కథ! కానీ పచ్చదనాన్ని ‘పరిరక్షించడానికి’ ప్రశంసనీయమైన కృషి చేస్తున్న కేంద్ర రాష్ట్రాల ప్రభుత్వాలు పచ్చదనాన్ని ‘పరిమార్చుతున్న’ విధానాలను సమాంతరంగా కొనసాగిస్తుండడం ‘ప్రపంచీకరణ’ మాయాజాలం! తూర్పు తీరంలోని జాలరులు ప్రధానంగా మర పడవలలో పెద్ద ఎత్తున చేపలను పడుతున్న ‘వాణిజ్య మత్స్యకారులు’ తమ వలలలో తాబేళ్లు వంటి ఇతర ప్రాణులు చిక్కుకొనకుండా ‘నిరోధక కవాటాల’ను వలలకు అనుసంధానం చేయాలట! ఈ నియమాన్ని 1996 నాటి వన్యప్రాణి పరిరక్షణ చట్టం, 1994 నాటి ఆంధ్రప్రదేశ్ సముద్ర మత్స్య గ్రహణ చట్టం నిర్దేశిస్తున్నాయి! ఇలా వలలకు ‘తాబేళ్ల రక్షక పరికరాల-టర్టిల్ ఎక్స్‌క్లూడర్ డివైసెస్ - టిఇడి-ను అమర్చక పోవడంవల్ల జాలరుల వలలలో తగుల్కున్న తాబేళ్లు బలి అయిపోతున్నాయి. కానీ ‘ప్రపంచీకరణ’ మాయల వలలో చిక్కుకున్న మన ప్రభుత్వాలు కాలుష్యాన్ని నిరోధించలేకపోవడం తాబేళ్లను మాత్రమే కాదు తిమింగలాలను పెద్ద పులులను ఏనుగులను బలిగొంటున్న విస్తృత ప్రమాదం! ‘ప్రపంచీకరణ’ వల బిగిస్తున్న కొద్దీ పచ్చదనం హరించుకునిపోతోంది..
పచ్చదనం హననం కావడం వల్ల భూగర్భ జలాలు ఇంకిపోతున్నాయి, ఉపరితలం ఎండిపోయి నీటి చుక్కకు నోచుకోని అటవీ జంతువులు జనావాసాలలోకి చొరబడి బీభత్సం సృష్టిస్తున్నాయి, చివరికి ప్రాణాలు కోల్పోతున్నాయి! మరయంత్రాల కోరలకు గురైన లక్షలాది ఆవులు, దూడలు కోడెలు పెయ్యలు ఇతర పాడి జంతువులు దశాబ్దులుగా అంతరించిపోయాయి. ఫలితంగా ఆవుల పేడ పశువుల పేడ దొరకని భూములను కృత్రిమ రసాయనపు ఎఱువులు కాటేస్తున్నాయి. ఇది పాశ్చాత్యీకరణ! వానపాములు-‘ఎఱ’లు- కోట్ల సంఖ్యలో నిరంతరం వ్యవసాయ సీమలను ‘దున్ని’ భూసారాన్ని పరిరక్షిస్తున్నాయి, పరిపోషిస్తున్నాయి. ‘పేడ’, అటవీవృక్షాల ఆకుల వాసనలు ఈ వానపాములకు ఊపిరి. కానీ కృత్రిమ రసాయనాల విష వాసనలకు ఊపిరి ఆడని వానపాములు భూగర్భంలోని ముప్పయి అడుగుల లోతునకు పారిపోతున్నాయి...అందువల్ల భూమి నిస్సారమైపోయింది, మరిన్ని కృత్రిమ రసాయనాలు.. మరింతగా భూమిపాడైపోవడం! ‘ప్రపంచీకరణ’ మొదలైన తరువాత జన్యువుల మార్పిడి- జనటిక్ మోడిఫికేషన్- జి.ఎమ్- ప్రక్రియ ద్వారా తయారయిన పత్తి విత్తనాలు కాలుష్యాన్ని పెంచే పంటను పండిస్తున్నాయి. ‘జిఎమ్’ పంటలలోని ‘బాసిలస్ తురింజెనిసిస్‌‘- బిటి -అన్న జీవ రసాయనం విష కాలుష్యాన్ని విస్తరింప చేయడానికి దోహదం చేస్తోంది. ‘బిటి’ పత్తికి తోడు ‘బిటి’ ఆవాలను కూడ భూమి సారాన్ని హత్య చేయడానికై ‘ప్రపంచీకరణ’ ఉసి గొల్పుతోంది.. ఇది మత్స్యకారుల తప్పుకాదు, ప్రభుత్వాల తప్పు.. ‘స్వేచ్ఛా వాణిజ్యం’ విస్తరింపచేసిన ముప్పు..
భూగర్భం, ఉపరితలం ఇలా కాలుష్యంతో నిండిపోవడం కాలుష్య జలాలు నదులలో సముద్రాలలో కలసిపోవడం ధరాతలం మొత్తం కాలుష్య మండలమైపోయింది! ఫలితంగా అడవులలోని, సముద్రంలోని జంతువులు ఊపిరాడక ఉసురును కోల్పోతున్నాయి. తిమింగలాలను బలిగొంటున్న కాలుష్యం తాబేళ్లను కబళించకుండా ఉంటుందా? గత మే నెలలో హైదరాబాద్ శివారులోని ‘మేడ్జెల్’ సమీపంలోని ఒక చెఱువులో ఇరవై వేల చేపలు మృతి చెందాయి. ఇవన్నీ ఒకే రోజున ఒడ్డునకు కొట్టుకుని వచ్చాయట! అదే సమయంలో హైదరాబాద్ సమీపంలోని శామీర్‌పేట చెఱువులో నలబయి వేల చేపలు, రామ్‌పల్లి కొలనులో ముప్పయి వేల చేపలు చనిపోయాయట! కాలుష్యపు వేడి కోరల ‘వాడి’కి ఇది ఉదాహరణ మాత్రమే. దేశమంతటా నీటి కాలుష్యం నిర్దయగా కోట్ల ప్రాణుల గొంతులను ఇలా నులిమేసింది! కాలుష్యం వేడిమి ఇలాగే విస్తరించినట్టయితే 2020 నాటికి -1970లో బతికి ఉండిన- వన్యమృగాలలో మూడింట రెండు వంతులు అంతరించిపోగలవని కొన్ని స్వచ్ఛంద అధ్యయన సంస్థల వారు హెచ్చరించారు. ఇది అతిశయోక్తి కాకపోవచ్చు. ఎందుకంటే క్రమంగా వన్య జంతువుల సంఖ్య తగ్గిపోతుండడం ప్రత్యక్ష ప్రమాణం.. 1970లో ప్రపంచంలో నివసించిన వన్యప్రాణులలో యాబయి ఎనిమిది శాతం 2012 నాటికి అంతరించిపోవడం ధ్రువపడిన వాస్తవం. కాలుష్య జలాల్లో ఉండలేక తమిళనాడు తీరంలోకి కొట్టుకుని వచ్చిన దాదాపు వంద తిమింగలాలలో గత ఏడాది డిసెంబర్‌లో నలబయి అయిదు ఊపిరి ఆడక మరణించాయి. వందల వేల సముద్ర తాబేళ్ల మృత దేహాలు ఒడ్డునకు కొట్టుకుని వస్తుండడం గురించి దాదాపు ప్రతి నెలలోను ఎక్కడో అక్కడ ప్రచారం అవుతూనే ఉంది!! తాబేళ్ల పరిరక్షణ పరికరాలను వలలకు అమర్చి తీరాలని ప్రభుత్వాలు సముద్ర తీరంలోని మత్స్యకారులను ఆదేశించవచ్చు! దానివల్ల జాలరుల వలలో చిక్కుకుని తాబేళ్లు మరణించకుండా నిరోధించవచ్చు! కానీ కాలుష్యపు వలయంలో చిక్కుకున్న తాబేళ్లకు దిక్కు ఎవ్వరు?
తెలంగాణ ప్రభుత్వం హరితహారం పేరుతో పచ్చదనాన్ని పెంచుతోంది. గొర్రెలను, బర్రెలను వ్యవసాయ దారులకు పెద్దసంఖ్యలో పంపిణీ చేయడానికి పూనుకుంది. 2029 నాటికి రాష్ట్ర విస్తీర్ణంలో యాబయి శాతం అటవీ ప్రాంతంగా మార్చడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నడుం బిగించిందట! కానీ మరోవైపు ఉభయ రాష్ట్రాలలోను ‘ప్రపంచీకరణ’ శక్తులు పారిశ్రామిక కాలుష్యాన్ని పెంచుతున్నాయి...సమన్వయం ఏదీ..??