సంపాదకీయం

‘కాభ్’ ఎక్కాలంటే...!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘కాబ్’ అన్నది కేవలం ఆంగ్లభాషకు చెందిన మాట కాదు, అమెరికా నాగరికతను మననెత్తిన రుద్దుతున్న ‘ప్రపంచీకరణ’ పరిభాషలో ‘క్యాబ్’ భాగం! ‘కార్’, ‘టాక్సీ’ అన్న ఆంగ్ల పదజాలాన్ని ‘క్యాబ్’ మింగివేయడం మన దేశపు ‘సమాచార సాంకేతిక రంగం’ - ఇన్‌ఫర్‌మేషన్ టెక్నాలజీ- ఐటి- అమెరికాతో జట్టుకట్టిన ఫలితం! చదవడం కోసం, ఉద్యోగించడం కోసం మన దేశపు యువజనులు అమెరికాకు వెల్లువెత్తిన గత దశాబ్దులలో అమెరికా పరిభాషను ఇక్కడే ‘రిహార్సల్’ చేయడం- వల్లెవేయడం జీవన రీతి- ఫ్యాషన్-గా మారింది. అలా ‘క్యాబ్’ ఎక్కడం మనకు అలవాటయింది. ‘క్యాబ్’ అని కాకుండా, ‘టాక్సీ’ అని ‘అద్దెకారు’ అని పలికితే అమెరికాకు వెళ్లే విమానాలను ఎక్కనివ్వరు-అన్న భయం ఆవహించింది. ఇప్పుడు వ్యతిరేక దిశలో ఈ ‘జన ప్రవాహం’ వెల్లువెత్తుతోంది. ‘క్యాబ్’ మాత్రం మిగిలింది. సర్వజన భాగస్వామ్య ప్రగతి గురించి ప్రభుత్వాలు నిరంతరం ప్రచారం చేస్తున్నాయి. ప్రగతి ‘నిలువున’ అట్టడుగు స్థాయిలో ఉన్న నిరుపేదల వరకు విస్తరించడం ఆంత్యోదయం. ప్రగతి ‘అడ్డం’గా అన్ని ప్రాంతాలకు విస్తరించడం ‘వికేంద్రీకరణ’! ప్రగతి ‘నిలువున’ కాని, అడ్డంగ కాని విస్తరించకుండా ‘ప్రపంచీకరణ’ అడ్డుకుంటోంది. ‘స్వేచ్ఛా వాణిజ్య వ్యవస్థ’ అడ్డుకుంటోంది, ‘బహుళ జాతీయ వాణిజ్య సంస్థలు’- మల్టీ నేషనల్ కంపెనీలు అడ్డుకుంటున్నాయి, మనదేశాన్ని ఎదగనీయకుండా నిరోధిస్తున్న విదేశీయ శక్తులు అడ్డుకుంటున్నాయి. ఫలితంగా ‘ప్రగతి’ కేంద్రీకృతమవుతోంది. వనరులపై, ఉత్పత్తులపై, పంపిణీపై, సేవలపై ‘బహుళ జాతీయ సంస్థల’ గుత్త్ధాపత్యం పెరుగుతోంది. విదేశీయసంస్థల ‘బహుళ జాతీయ వాణిజ్య’ స్వభా వం, స్వదేశీ సంస్థలను కూడ ఆవహించిం ది. ఈ ‘స్వభావం’ గుత్త్ధాప త్యం సాధించడం ద్వారా వినియోగదారులను దోచుకోవడం. ఈ దోచుకునే స్వభావానికి ‘రాకపోకల రంగం’లో ఈ ‘క్యాబ్’ ఒక ప్రతీక మాత్రమే! ‘‘ఇంత దూరం ప్రయాణం చేసినట్టయితే ఇంత డబ్బు చెల్లించాలి..’’ అన్నది ఆటో రిక్షాలకు టాక్సీలకు ఇన్నాళ్లుగా వర్తించిన నిబంధన. రాత్రిపూట పది గంటల తరువాత తెల్లవారు జామున ఐదు గంటల వరకు అదనంగా యాబయి శాతం చెల్లించడం నిబంధన! కానీ ‘స్వేచ్ఛా వాణిజ్యం వ్యవస్థ’కు సంచార ప్రతీకలుగా, సంచలన పతాకలుగా మారిన ‘క్యాబ్’లు ఈ నిబంధనను మార్చివేశాయి. ఇప్పుడు ఎంతదూరం ప్రయాణం చేసామన్నది ప్రధానం కాదు, ఎంత ‘గిరాకీ’ ఉందన్నది మాత్రమే డబ్బును గుంజడానికి ప్రాతిపదిక! ‘గిరాకీ’ ‘లభ్యత’ ప్రాతిపదికగా ఐదు కిలోమీటర్లు ‘క్యాబ్’లో వెళ్లడానికి వంద రూపాయలనుంచి నాలుగు వందల రూపాయల వరకు వసూలు చేస్తున్నారు! ‘ఓలా’, ‘ఉబర్’ సంస్థల ‘కాబ్’లు మాత్రమే దేశమంతటా ప్రయాణ ‘సేవ’లను అదుపు చేస్తుండడం ఈ ‘కృత్రిమ’మైన గిరాకీ ఏర్పడడానికి కారణం!!
‘కార్లు’ లేదా ‘కాబ్’లు కొన్న యజమానులు మొత్తం ‘ఓలా’ వద్ద ‘ఉబర్’ వద్ద నమోదు చేసుకుంటున్నారు. అందువల్ల ఈ రెండు సంస్థలకే ‘కాబ్’లపై గుత్త్ధాపత్యం! ఇతర సంస్థలు కొన్ని నామమాత్రంగా మిగిలి ఉన్నప్పటికీ ఈ రెండు సంస్థలదే తొంబయి శాతానికి పైగా వ్యాపారం. ‘ఉబర్’ అమెరికా ‘యజమానుల’ సంస్థ! ‘ఓలా’ భారతీయ యాజమాన్యం కింద నడుస్తోందన్నది జరిగిన ప్రచారం. కానీ క్రమంగా ‘ఓలా’ యాజమాన్యంపై విదేశీయులు పట్టు సాధిస్తున్నారు!! ‘ఉబర్’ తో జరుగుతున్న పోటీలో పై చేయి సాధించడానికి వీలుగా ‘ఓలా’ సంస్థ వారు చైనాకు చెందిన ‘టెన్‌సెంట్’ అన్న బహుళ జాతీయ వాణిజ్య సంస్థతో జట్టుకట్టిందట! ఈ చైనా సంస్థ వారు ‘ఓలా’ సంస్థలో దాదాపు ఏడువేల నాలుగు వందల కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టి భాగస్వామ్యం వహిస్తోంది. చైనాకు చెందిన మరికొన్ని సంస్థలు, ఇతర దేశాలకు చెందిన వాణిజ్య సంస్థలు కూడ ‘ఓలా’లోకి చొరబడిపోవడానికి సిద్ధంగా ఉన్నట్టు ప్రచారవౌతోంది!! ‘సేవల’ రంగాలలోను, అనవసరమైన పానీయాలను, ‘తిండి దిబ్బ’లను ఉత్పత్తి చేసే రంగాలలోను మాత్రమే విదేశీయులు పెట్టుబడులుపెట్టి లాభాలను తరలించుకొనిపోతున్నారు. ఈ వైపరీత్యానికి ఇది మరో ఉదాహరణ మాత్రమే!! నిజమైన ప్రగతికి ప్రాతిపదికలైన వౌలిక పారిశ్రామిక ఉత్పత్తులను పెంచడానికి వీలుగా విదేశీయ సంస్థలు ఈ వౌలిక రంగాలలో పెట్టుబడులను పెట్టడంలేదు, బొగ్గు, ఇంధనం, విద్యుత్తు, ఉక్కు, సిమెంటు వంటి వౌలిక ఉత్పత్తులను పెంచడంలేదు. మన దేశ ప్రయోజనాలను దోచుకొనడానికి మిక్కిలి అవకాశం ఉన్న ‘రాకపోకల’ సేవలను కొల్లగొట్టడానికి మాత్రమే ఈ విదేశీయ సంస్థలు ‘పెట్టుబడుల’ ఆయుధాన్ని ప్రయోగిస్తున్నాయి...
ఇది సగం మాత్రమే. శత్రు దేశమైన చైనా సంస్థలు మన దేశంలో వాణిజ్య దురాక్రమణను కొనసాగిస్తుండడం మరో సగం. ఇజ్రాయిల్ అరబ్ దేశాలలో పెట్టుబడులను పెట్టడం లేదు. అరబ్ దేశాలు ఇజ్రాయిల్‌లో పెట్టుబడులను పెట్టడంలేదు. చైనా సంస్థల పెట్టుబడులు జపాన్‌ను ముంచెత్తడంలేదు, జపాన్ సంస్థలు చైనాలోకి చొరబడడం లేదు. కానీ చైనా సంస్థలు మాత్రం మన దేశంలో వాణిజ్య సామ్రాజ్యాలను నిర్మించుకుంటున్నాయి. చైనా భౌతిక దురాక్రమణను సరిహద్దులలో మన సైనికులు ప్రతిఘటిస్తున్నారు. కానీ చైనా వారి వాణిజ్య దురాక్రమణను మన ప్రభుత్వాలు ప్రతిఘటించడం లేదు, ప్రోత్సహిస్తున్నాయి! అందువల్ల ‘ఓలా’ సంస్థ లో చైనా సంస్థలు పెట్టుబడులను పెట్టవచ్చు! ‘ఓలా’ తో వాణిజ్య అనుసంధా నం కుదుర్చుకున్న లక్షల వాహనాల యజమానుల ‘జుట్లు’ చైనా కబంధ బంధంలో ఇరుక్కుని పోవడానికి ఈ పెట్టుబడులు మాధ్యమాలు కాగలవు! ఇదంతా ప్రగతి పేరుతో వ్యవస్థీకృతవౌతున్న ‘కేంద్రీకరణ’. లక్షల రూపాయల సొంత డబ్బు పెట్టి, మరికొన్ని లక్షల రూపాయలను బ్యాంకుల నుంచి, ఇతర ఆర్థిక సంస్థలనుంచి ఋణాలు పొంది ‘కార్ల’ను కొంటున్న లక్షల మంది తమ ‘కేబ్’లను సొంతంగా నడుపుకొనడానికి వీలులేని దౌర్భాగ్య స్థితి వ్యవస్థీకృతమై ఉంది! ఈ కార్ల యజమానులు విడివిడిగా స్వతంత్రంగా తమ వ్యాపారం చేసుకోలేని స్థితి. వీరందరూ ‘ఓలా’కు ‘ఉబర్’కు ఇంకా కొన్ని చిల్లర సంస్థలకు కట్టు బానిసలు. ప్రతిరోజు ఈ యజమానులు లేదా వాహన చోదకులు ఈ సంస్థలు నిర్దేశించినంత ‘దూరం’ తిరగాలి! అప్పుడు మాత్రమే ఈ సంస్థలు వీరికి ‘దినం దినం’ కూలీ చెల్లిస్తాయి. ఇదీ జరిగిపోయిన కేంద్రీకరణ, ‘యజమానులు’ కూలీలుగా మారడం ప్రపంచీకరణ.
రైల్వే స్టేషన్‌కు వెళ్లాలన్నా బస్‌స్టాండ్‌కు పోవాలన్నా విమానాశ్రయానికి చేరాలన్నా రోడ్డుమీద నిలబడి ‘టాక్సీ’ పిలిచి కుదుర్చుకునే రోజులు గతించాయి, ఇకపై ఆటోలు కూడ ఇలా దొరకక పోవచ్చు! ఎందుకంటే ‘ఆటోవాలాలు’ కూడ ‘ఓలా’తో ‘ఉబర్’తో అనుసంధానం అవుతున్నారు, ఉద్యోగులైపోతున్నారు! అందువల్ల ప్రయాణీకులకు ‘కాబ్’ కావాలంటే స్మార్ట్ ఫోన్ ద్వారా కాని, కంప్యూటర్ సిస్టమ్ ద్వారా కాని ఈ ‘కంపెనీ’లకు ఫోన్ చేసి ముందుగా కుదుర్చుకోవాలి. వేచి ఉండాలి! ‘స్మార్ట్’ ఫోన్ లేని వారు ఏం చేయాలి? రోడ్డుపై నిలుచుండిపోవాలి.