సంపాదకీయం

‘కిరాణా’ గరిమ...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒక పాఠశాల ప్రధానోపాధ్యాయుడుగా పనిచేసిన ఒక విద్యావంతుడు రాజీనామా చేశాడు. ఆ తరువాత ఆయన ఒక కిరాణా కొట్టును పెట్టుకున్నాడు! భాగ్యనగరంలో సంభవించిన పరిణామం ఇది. ఇలాంటి విద్యావంతులు దేశమంతటా ఉన్నారు. పాఠశాల ప్రధాన ఉపాధ్యాయ బాధ్యతను నిర్వహించడం గౌరవప్రదం. కిరాణా దుకాణాన్ని నియమ నిబంధనలతో నిజాయితీగా నిర్వహించడం కూడ అంతే గౌరవ ప్రదం... సమాజంలో నిర్వహించే వృత్తినిబట్టి కాక నిర్వహించే వారి వ్యక్తిత్వం గుణగణాలు ప్రాతిపదికగా ఆయా వ్యక్తులకు గౌరవం లభిస్తుందన్నది వాస్తవంలో సగం మాత్రమే, సమాజ సమష్టిహిత సాధనకోసం వ్యవస్థీకృతమై ఉన్న అన్ని వృత్తులు కూడ సమానస్థాయివన్నది మిగిలిన సగం... ఈ వాస్తవం భారతీయ జీవనంలో అనాదిగా ప్రస్ఫుటించడం చరిత్ర! ధర్మాచార్యుడైన రవిదాస్ శతాబ్దులకు పూర్వం వారణాసిలో గంగానది ఒడ్డున చెప్పులు కుట్టి బతుకు తెరువును సాధించడం ఈ జాతీయ జీవన వాస్తవం! మాంసం దుకాణం పెట్టుకున్న ధర్మవ్యాధుడు మహా ఋషులకు సైతం ప్రవర్తన పాఠాలను బోధించడం పూర్వ యుగాల ముచ్చట! గదాధర పండితుడన్న సుప్రసిద్ధ సాహిత్య, వ్యాకరణవేత్త వంటలు చేసి జీవించే వాడన్నది తరతరాలకు స్ఫూర్తినిస్తున్న జాతీయ జీవన స్మృతి... ‘చాయ్’ -తేనీరు- దుకాణం నడిపిన వాడు ప్రస్తుతం దేశాన్ని నడుపుతున్న ప్రధానమంత్రి. అందువల్ల పాఠశాలను నిర్వహించే వృత్తికి, కిరాణా దుకాణం నిర్వహించే వృత్తికి మధ్య ప్రవృత్తిలో తేడా లేదు, సహజమైన గౌరవ ప్రతిపత్తిలో తేడా లేదు. ఈ సహజ సమన్వయ వ్యవస్థను విదేశీయ రాజకీయ, మత, ఆర్థిక, భౌతిక బౌద్ధిక బీభత్సకారులు ధ్వంసం చేసారు, పాలకుల పేరుతో చెలామణి అయిన ఈ బీభత్సకారులు వృత్తుల మధ్య, వృత్తులను నిర్వహించే జనసముదాయాల మధ్య విద్వేషాన్ని రగిలించి పోయారు, వైరుధ్యాలను వ్యవస్థీకరించి వెళ్లారు. ఈ బీభత్స విద్వేష వారసత్వాన్ని కొనసాగిస్తున్న విబుధదైత్యులు వర్తమాన సమాజంలో కూడ ప్రబలి ఉండడం, బలిసి ఉండటం సామాజిక సమరసతకు విఘాతం కలిగిస్తోంది... ఇలాంటి వారు తమ వృత్తికంటే భిన్నమైన అన్ని వృత్తుల వారిని నీచ పదజాలంతో నిందిస్తున్నారు. సమన్వయం, సమాజంలో సామరస్యం నెలకొనడం ఇలాంటి విదేశీయ బీభత్స వారసత్వ గ్రస్తులకు ఇష్టం లేదు... అనాదిగా ఈ దేశంలో విద్యా వ్యవస్థ బౌద్ధిక సంస్కారాలను ప్రదానం చేసింది, వాణిజ్య వ్యవస్థ ఆర్థిక సమన్వయాన్ని సాధించింది. విద్యా వ్యవస్థను వద్దనుకుంటే సాంస్కృతిక జీవన విస్తృతి లేదు, వాణిజ్య వ్యవస్థను ధ్వంసం చేస్తే ఆహారం నిత్య అవసరాల పంపిణీ లేదు! పండించే ‘పొలాని’కి వండి వడ్డించే ‘పొయ్యి’కీ మధ్య సహజమైన, అనివార్యమైన అనుసంధాన మాధ్యమం యుగయుగాలుగా వాణిజ్య వ్యవస్థ...
శరీరంలో వ్యాధి నిరోధక శక్తి నశిస్తే వివిధ అవయవాల మధ్య సమన్వయం నశిస్తే శరీరం రోగగ్రస్తం అవుతుంది. రోగం వచ్చిందని శరీరాన్ని ద్వేషించడంలేదు, రోగాన్ని నిర్మూలించడానికి యత్నించడం సహజం! అవినీతి రోగం పట్టిన దేశాన్ని ద్వేషించడం లేదు, అవినీతి నిర్మూలనకు కృషి జరగాలన్నది అందరూ ఆమోదిస్తున్న మాట! అన్ని రంగాలను అవినీతి ఆవహించి ఉంది, అందువల్ల విద్యా రంగాన్ని, వాణిజ్య రంగాన్ని కూడ సమానంగా అవినీతి ఆవహించి ఉంది. అవినీతి నిలువున ఉన్నతోన్నత రాజకీయవేత్తల నుంచి, అధికార గణం నుంచి అట్టడుగు స్థాయి వరకు వ్యవస్థీకృతం కావడం నడుస్తున్న చరిత్ర, అవినీతి అడ్డంగా బలిసి అన్ని ప్రాంతాలకు అన్ని జీవన రంగాలకు విస్తరించింది. ఈ మాతృభూమి పట్ల కల మమకారం అనాదిగా అన్ని వృత్తుల వారి ప్రవృత్తి నిహితం కావడం జాతీయ జీవన విధానం... ఈ మాతృభూమిపట్ల మమకారం లేని విదేశీయ బర్బర జాతులు ఈ దేశంలోకి చొరబడి దోపిడీ చేశారు, అన్ని జీవన రంగాలను కొల్లగొట్టారు, ప్రవృత్తులను వికృతపరిచారు, ‘పాలకులు’గా చెలామణి అయ్యారు, ఈ ‘జాతీయత’ను కలుషితం చేశారు, ఈ ‘సంప్రదాయాన్ని’ అవినీతిమయం చేశారు, ధ్వంసం చేశారు... క్రీస్తుశకం ఏడు వందల పనె్నండవ సంవత్సరంలో మొదలైన ఈ విదేశీయ బర్బర బీభత్స దురాక్రమణ కొనసాగిన కాలంలో ఈ దేశం మొత్తం దళిత, ఈ జాతి మొత్తం పీడిత! క్రీస్తుశకం పంతొమ్మిది వందల నలబయి ఏడవ సంవత్సరం తరువాత దశాబ్దులు గడిచినప్పటికీ ఈ విదేశీయ భావదాస్య వారసత్వం తొలగకపోవడం అన్ని రంగాలలోని అవినీతికి కారణం.. వాణిజ్యరంగం కూడ, విద్యారంగం కూడ అవినీతి గ్రస్తం కావడం సహజం...
పదార్థాలను ఉత్పత్తి స్థానం నుంచి వినియోగ స్థానం వరకు నిరంతరం పంపిణీ చేసే జీవన నాడీ మండలం వ్యాపారం... సిరలు ధమనులు లేకపోయినట్టయితే రక్త ప్రసరణ లేదు, దేహం లేదు! వాణిజ్య వ్యవస్థ లేనట్టయితే పదార్థ పరంపర ప్రసరణం లేదు, పంపిణీలేదు, దేశంలేదు! వాణిజ్య వ్యవస్థ మాత్రమే కాదు జాతీయ జీవన స్వరూప అవయవాలైన ఏ వృత్తి నశించినప్పటికీ దేశం లేదు. ఒక అవయవం దెబ్బతింటే ఆ మేరకు శరీరం పక్షవాతం పాలవుతుంది, ఒక వృత్తి దెబ్బ తిన్నట్టయితే దేశం ఆ మేరకు ప్రగతికి దూరం అవుతుంది. వైవిధ్య వృత్తుల మధ్య నిరంతర సమన్వయం, వైవిధ్య స్వరూపాల మధ్య ఏకోన్ముఖ చైతన్య స్వభావం భారత జాతీయ జీవనం... అవినీతిని అరికట్టాలి, నిజాయితీని జాగృతం చేయాలి! జీవనాడులలో జీవన నాడులలో చేరిన అవినీతి రుగ్మతను తొలగించి స్వచ్ఛతను పునరుద్ధరించడం అనివార్యం.. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న ‘వస్తు సేవల పన్ను’ -గూడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్ -జిఎస్‌టి- వాణిజ్యరంగాన్ని అవినీతి రోగ విముక్తం చేయగలదన్నది చిగురిస్తున్న ఆశ...
వాణిజ్య నిర్వహణ శాస్త్రం -బిజినెస్ అడ్మినిస్ట్రేషన్- లో స్నాతకోత్తర స్థాయి పట్టా -మాస్టర్స్ డిగ్రీ- పుచ్చుకున్న ఒక యువకుడు విజయవాడలో చిన్న కిరాణా దుకాణం ప్రారంభించాడు! సక్రమంగా నిర్వహిస్తున్నాడు, సమంజసమైన లాభాలను గడిస్తున్నాడు, భార్యతో ఇద్దరు పిల్లలతో సంతృప్తికరమైన జీవన యాత్ర సాగిస్తున్నాడు. అవినీతి అంటని ఇలాంటి జీవన సంతృప్తి అధికాధిక ప్రజలలో విస్తరించడం నిజమైన ప్రగతి! వందమంది సంపన్నులు ఇరవై శాతానికి పైగా జాతీయ ఆదాయాన్ని గడించడం కృత్రిమ ప్రగతి... అందువల్లనే ‘స్థూల జాతీయ ఆదాయం’ -జిడిపి- మాత్రమే ప్రగతికి సంకేతం కాదని సర్వోన్నత న్యాయస్థానం గతంలో వ్యాఖ్యానించింది! ‘జిడిపి’ పెరిగిందా? తగ్గిందా? అన్నది ప్రధానం కాదు - నిజాయితీపరులైన వ్యాపారులు, ఉద్యోగులు, కర్షకులు, శ్రామికులు సంతృప్తికరమైన జీవనానికి తగినంత ఆర్జించ గలుగుతున్నారా? అన్నది ప్రధానం! ‘జిఎస్‌టి’ అమలులోనికి రాగానే ఈ ‘విజయవాడ యువ వాణిజ్యవేత్త’ తన కిరాణా కొట్టును ఈ ‘వ్యవస్థ’లో నమోదు చేయించాడు! దేశంలోని లక్షలాది చిల్లర వ్యాపారులకు ఈ ‘యువకుడు’ స్ఫూర్తిదాయకుడు! మాతృదేశ మమకార భూమికపై అన్ని వృత్తులు వికసించాలి!!