సంపాదకీయం

విష రసాయన ‘శుద్ధి’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆహారం శుద్ధి పరిశ్రమల - ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ-లో విదేశీయుల పెట్టుబడుల ఆర్భాటం అప్రతిహతంగా కొనసాగుతోంది! నవంబర్ నెలలో ఢిల్లీలో ‘ప్రపంచ ఆహారం’ ప్రదర్శనోత్సవాలు జరుగనున్నాయి. ఈ ఉత్సవాలకు పూర్వరంగంగా ‘‘మన దేశంలోని ఆహారశుద్ధి పరిశ్రమలలో దాదాపు అరవై ఐదు వేల కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టడానికి విదేశీయ సంస్థలు అంగీకరించినట్లు’’ కేంద్రమంత్రి హరిస్మరత్ కౌర్ బాదల్ ఢిల్లీలో సోమవారం వెల్లడించడం ఆర్భాటపు ప్రహసనంలోని వర్తమాన ఘట్టం! ఈ ఆహారశుద్ధిశాఖ మంత్రిని పదవినుంచి తొలగించాలని ‘స్వదేశీ జాగరణ్ మంచ్’ వారు గత మార్చి ఏడవ తేదీన ప్రధానమంత్రి నరేంద్రమోదీకి విజ్ఞప్తి చేశారు. ఆహారం శుద్ధిరంగంలోను, ఆహారరంగపు చిల్లర వ్యాపారంలోను విదేశీయుల పెట్టుబడులను అనుమతించాలని ఈ మంత్రిత్వశాఖ నిర్ణయించడం ఆ విజ్ఞప్తికి కారణం! తమ ప్రతిపాదనలను ఆమోదించాలని మంత్రివర్గ సమావేశంలో కోరనున్నట్లు హరిస్మరత్ బాదల్ చేసిన ప్రకటనను ‘స్వదేశీయ జాగరణ్ మంచ్’ అప్పుడు నిరసించింది! ‘ఆహారశుద్ధి’ మంత్రి ప్రతిపాదన కేంద్ర ప్రభుత్వ విధానానికి, 2014 వ సంవత్సరం నాటి లోక్‌సభ ఎన్నికల సందర్భంగా ‘్భరతీయ జనతా పార్టీ’ చేసిన వాగ్దానానికి విరుద్ధమన్నది ‘స్వదేశీ జాగరణ్ మంచ్’ చేసిన నిర్ధారణ! చిల్లర వ్యాపార రంగంలోకి విదేశీయ సంస్థలు చొరబడడాన్ని 2014 మే 25 వరకు ప్రధాన ప్రతిపక్షంగా ఉండిన భారతీయ జనతా పార్టీ తీవ్రంగా వ్యతిరేకించింది! అయినప్పటికీ అప్పటి ప్రధానమంత్రి మన్‌మోహన్ సింగ్ నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం బహుళ వస్తువుల చిల్లర వ్యాపారంలోకి విదేశీయ సంస్థల చొరబాటును ఆమోదించింది. ఈ వ్యవహారంలో మన్‌మోహన్ సింగ్ ప్రభుత్వం అమెరికా ప్రభుత్వం ఒత్తిడికి లొంగిపోయిందన్నది 2012వ సంవత్సరంలో జరిగిన ప్రచారం! బహుళ వస్తువుల ప్రధానంగా ‘కిరాణా’ దుకాణాల చిల్లర రంగంలోకి చొరబడడానికి అమెరికా ‘వాల్‌మార్ట్’ సంస్థ ఉవ్విళ్లూరడం ఈ ప్రచారానికి కారణం. మన్‌మోహన్‌సింగ్ ప్రభుత్వం అనుమతించిన తరువాత ‘చిల్లర దుకాణాల’ను దేశమంతటా తెరవడానికి పూనుకున్నది కూడ ‘వాల్‌మార్ట్’ సంస్థ వారే! ‘వాల్‌మార్ట్’ వారి దుకాణాలను తెరవనివ్వబోమని తెరచిన దుకాణాలను తమ ప్రభుత్వం మూయించివేస్తుందని 2014వ సంవత్సరానికి పూర్వం ‘్భజపా’ ప్రకటించడం చరిత్రలో నమోదై ఉంది. విదేశీయులు దొడ్డిదారిన చిల్లర వ్యాపారంలోకి చొరబడడానికి ‘ఆహారశుద్ధి’ రంగం మాధ్యమమన్నది బహిరంగ రహస్యం. ‘స్వదేశీ జాగరణ్ మంచ్’ వారు గత మార్చిలో చేసిన నిర్ధారణకు ఇదంతా నేపథ్యం... ‘్భజపా’ విధానానికి వ్యతిరేకంగా ప్రతిపాదనలను చేస్తున్న హరిస్మరత్ కౌర్ బాదల్‌ను అందువల్ల పదవి నుంచి తొలగించాలన్నది ‘మంచ్’ మార్చిలో చేసిన అభ్యర్థన...
కానీ హరిస్మరత్ కౌర్ బాదల్ ప్రకటనలు కేంద్ర మంత్రివర్గం నిర్ణయాలన్నది ‘స్వదేశీ జాగరణ్ మంచ్’ వారికి, ఇతరేతర స్వదేశీయ ఆర్థిక ఉద్యమకారులకు తెలియని ‘మహారహస్యం’. మన్‌మోహన్ సింగ్ ప్రభుత్వం నాటి ‘విదేశీయ ప్రత్యక్ష నిధుల’ - ఫారిన్ డైరక్ట్ ఇన్‌వెస్ట్‌మెంట్- ఎఫ్‌డిఐ - విధానం ఇప్పటికీ కొనసాగుతుండడం ఈ బహిరంగ రహస్యం! అందువల్లనే ‘ఆహార శుద్ధి’ శాఖ మంత్రి మార్చిలో చేసిన ప్రతిపాదనలు ప్రస్తుత నిర్ణయాలయిపోయాయి. ‘నవంబర్ పండుగ’ జరుగక ముందే ‘ఆహార శుద్ధి’ రంగానికి ఇన్నివేల కోట్ల రూపాయల పెట్టుబడులు వాగ్దత్తమయ్యాయి. అందువల్ల ‘ప్రపంచ ఆహార పండుగ’ నాటికి మరిన్ని కోట్ల రూపాయల విదేశీయ నిధులు ఈ శుద్ధి పరిశ్రమకు లభించనున్నాయట! ‘ఆహారం శుద్ధి’ పరిశ్రమను కుటీరాల నుంచి, ఇళ్లనుంచి, సామాన్య మహిళల శ్రామికుల యాజమాన్యం నుంచి తప్పించి పెద్దపెద్ద పారిశ్రామికవేత్తలకు అప్పగించడానికి తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలుసహా వివిధ రాష్ట్రాల ప్రభుత్వాలు ఉత్సాహంతో ఉరకలు వేస్తుండడం హరిస్మరత్‌కౌర్ ఆనందానికి అఖిల భారత నేపథ్యం..
ఆహారం శుద్ధి పేరుతో విషరసాయనాలతో ఆహారాన్ని కలుషితం చేసి తిన్నవారిని రోగగ్రస్తులను చేస్త్ను విదేశీయ సంస్థలు ఇప్పటికే దశాబ్దులుగా దేశంలోకి చొరబడి ఉన్నాయి. నెజిల్-నెస్లె- సంస్థ వారు దశాబ్దులపాటు అమ్మి సొమ్ము చేసుకున్న ‘మ్యాగీ’ సేమ్యాలు ‘శుద్ధి’ పేరుతో వ్యాపించిన కాలుష్యానికి ఒక ఉదాహరణ మాత్రమే! ఇంకా చాలా విదేశీయ సంస్థలు, చాలా పదార్థాలు ఉన్నాయి! మ్యాగీ ‘సేమ్యా’లలోని ‘రసాయన విషం’ రుచి మరిగిన జనాలు ఎగబడి ఈ సేమ్యాలను కొన్నారు. ఫలితంగా గ్రామాలలో నగరాలలో ఇళ్లలో సేమ్యాలను, అప్పడాలను, వడియాలను, మసాలా దినుసులను, ఆవకాయలను, మిఠాయిలను పిండి వంటలను చేసి ఏరోజుకారోజు అమ్ముకునే మహిళలకు సంచార వర్తకులకు ఉపాథి కరవైంది! సంప్రదాయ శుద్ధిలో రసాయనాలు లేవు. ఉక్కు, సిమెంటు, విద్యుత్తు, ఇంధన తైలం, ఇంధన వాయువు, బొగ్గు వంటి వౌలిక పారిశ్రామిక రంగాలలో విదేశీయుల పెట్టుబడులు -ఎఫ్‌డిఐ - పెరగడం వల్ల నిజమైన పారిశ్రామిక ప్రగతి విస్తరిస్తుంది. కానీ ఈ రంగాలలో తప్ప మిగిలిన రంగాలలో విదేశీయుల పెట్టుబడులు వెల్లువెత్తుతున్నాయి! ఇది మొదటి వైపరీత్యం! సాంకేతిక అధునాత పరిజ్ఞాన పరికరాలు అవసరం లేకుండా సంప్రదాయ పద్ధతులలో సామాన్య జనం ఉత్పత్తి చేయగల రంగాలలోకి పెద్దపెద్ద పారిశ్రామిక సంస్థలు చొరబడడం వల్ల, చిన్న ఉత్పత్తిదారులు పోటీకి తట్టుకోలేక తమ గృహ పరిశ్రమలను, కుటీర పరిశ్రమలను మూసుకొనవలసి వస్తోంది. ఇలా ఉపాధిని కోల్పోతున్న ‘యజమానులు’ ఘరానా సంస్థల కర్మాగారాలలో కూలీలుగా మారుతున్నారు. వికేంద్రీకృత ఆర్థిక వ్యవస్థ నష్టభ్రష్టమైపోయి, కేంద్రీకృత వాణిజ్యం మననెత్తినెక్కుతున్న తీరు ఇది! నూలుమిల్లు వస్త్ర కర్మాగారాలు కేంద్రీకరణకు దారితీయడం గత చరిత్ర.. బ్రిటిష్ సామ్రాజ్యవాదులు వ్యవస్థీకరించిన ఈ కేంద్రీకరణ వల్ల గ్రామాలలో నూలు వడికేవారి ‘రాట్నం’ విరిగిపోయింది, బట్టలు నేసేవారి మగ్గాలు బుగ్గి అయ్యాయి. అందువల్లనే వికేంద్రీకృత ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించి స్వయం సమృద్ధ గ్రామాలను తిరిగి నెలకొల్పడం కోసం మహాత్మాగాంధీ ‘చరఖా’ - రాట్నం -ను ‘ప్రతీక’గా చేశాడు! ‘ఆహారశుద్ధి’ ‘మెగా’ ప్రాంగణాలను ఏర్పాటు చేస్తున్న తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు ఈ చారిత్రక వాస్తవాన్ని విస్మరించరాదు!
వేల వందల కోట్ల రూపాయలను పెట్టుబడి పెడుతున్న వాణిజ్య సంస్థలు ‘ఆహారశుద్ధి’ రంగం నుండి చిన్న ఉత్పత్తిదారులను నిర్మూలించనున్నాయి! అందువల్ల ప్రభుత్వాలు ఈ పెద్ద సంస్థలను ప్రోత్సహించడం మానుకోవాలి. ‘స్వయం సహాయక బృందాలు’ మహిళా సంఘాలు తదితర మాధ్యమాల ద్వారా ప్రతి పల్లెలోను ‘ఆహారశుద్ధి’ కేంద్రాలను నిర్వహించే వికేంద్రీకృత పద్ధతులను పునరుద్ధరించాలి. పండిత దీనదయాళ్ ఉపాధ్యాయ ప్రవచించిన ‘అంత్యోదయం’ స్ఫూర్తి ఇది!