సంపాదకీయం

సేంద్రియం.. శిరోధార్యం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రజల ఆరోగ్యానికి హాని కలిగిస్తున్న క్రిమినాశక ఔషధాలను ‘బహుళ జాతీయ వాణిజ్య సంస్థలు’ విరివిగా సరఫరా చేస్తుండడం బహిరంగ రహస్యం. ‘కేంద్రీయ క్రిమి నాశక ఔషధ నియంత్రణ నిర్వాహక మండలి’ - సెంట్రల్ ఇన్‌సెక్టిసైడ్స్ అండ్ రిజస్ట్రేషన్ కమిటి - సిఐబిఆర్‌సి - వారి నియమావళిని ఈ విదేశీయ సంస్థలు బాహాటంగా ఉల్లంఘిస్తుండడం వాణిజ్య ప్రపంచీకరణ - గ్లోబలైజేషన్ - మాయాజాలం! నియమావళికి వ్యతిరేకంగా రూపొందుతున్న క్రిమినాశక ఔషధాలు -పెస్టిసైడ్స్ - వ్యవసాయ భూమిని కాలుష్యగ్రస్తం చేస్తున్నాయి. వ్యవసాయదారుల, వినియోగాదారుల ప్రాణాలను బలికొంటున్నాయి. స్విట్జర్లాండ్ వారి ‘సింఝెంఠా’ అమెరికాకు చెందిన ‘మొన్‌సాంటో’ వంటి బహుళ జాతీయ సంస్థల ‘పురుగు మందులు’ ప్రజల ప్రాణాలను తీయడంలో పేరుమోశాయి. మరోవైపు చైనా నుంచి అక్రమంగాను, సక్రమంగాను దిగుమతి అవుతున్న అనేక విష రసాయనాలు కూడ ప్రజల ప్రాణాలకు ముప్పును కలిగిస్తున్నాయి. పండ్లకు, కూరగాయలకు ‘ఆకర్షకమైన’ రంగులను అద్దుతున్న ‘చైనా పౌడర్లు’ ఈ ఆహార పదార్థాలను విషపూరితం చేస్తున్నాయన్నది ప్రభుత్వాలు అంగీకరించిన వాస్తవం! గాలిపటాలను ఎగురవేయడానికి వీలుగా చైనావారు తయారు చేసిన ‘దారం’ కూడ రసాయన విషపూరితం కావడం ప్రజల ప్రాణాలతోను, ప్రకృతి స్వచ్ఛతతోను చెలగాటమాడుతున్న వాణిజ్య బీభత్సానికి నిదర్శనం! ఈ చైనా ‘దారాన్ని’ ప్రభుత్వాలు నిషేధించిన తరువాత కూడ ‘దొంగచాటు’ దుకాణాలలో ఈ దారాన్ని అమ్ముతుండడం గురించి ప్రచారమైంది! బహుళ జాతీయ వాణిజ్య సంస్థలను అదుపుచేయడానికి కేంద్రప్రభుత్వం ఇటీవల చర్యలను ప్రారంభించినప్పటికీ ఈ సంస్థ లు తమ అక్రమ వాణిజ్య కలాపాలను మానడం లేదు. ఇందుకు ప్రధాన కారణం ప్రవర్ధమాన దేశాల ‘ఆర్థిక స్వాతంత్య్ర సార్వభౌమ అధికారాన్ని’ ప్రపంచీకరణ’ - ప్రపంచ వాణిజ్య సంస్థ- నియమావళి అదుపు చేస్తుండడం!! అందువల్లనే అక్రమాలకు పాల్పడుతూ అక్రమార్జనను తమ దేశాలకు తరలించుకొనిపోతున్న ‘సింఝెంఠా’, ‘మొన్‌సాంటో’ వంటి సంస్థలను మన ప్రభుత్వం దేశం నుంచి వెళ్లగొట్టలేకపోతోంది! ఈ బహుళ జాతీయ వాణిజ్య సంస్థలు ‘ఐక్యరాజ్య సమితి’ ‘ఆహా ర వ్యవసాయ వ్యవహారాల సంస్థ’ -ఎఫ్‌ఏఓ- వారి మార్గదర్శకాలను సైతం లెక్కచేయడం లేదు. సంపన్న దేశాలలో ప్రభుత్వాలు నిషేధించిన, వ్యవసాయదారులు బహిష్కరించిన ‘పురుగుల మందుల’ను ఎఱువులను, విత్తనాలను ఆ దేశాలకు చెందిన వాణిజ్య సంస్థలు మనదేశం వంటి ప్రవర్ధమాన దేశాలకు తరలించుకొనివచ్చి అమ్ముకుంటున్నాయి. మన దేశంలోని కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు ఈ విషయం గురించి ధ్యాస లేదు, మరికొన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు ధ్యాస ఉన్నప్పటికీ ఈ విదేశీయ సంస్థలను వెళ్లగొట్టలేకపోతున్నాయి...
మహారాష్ట్ర ప్రభుత్వం ఈ బహుళ జాతీయ వాణిజ్య సంస్థల -ఎమ్‌ఎన్‌సిలు-ను వెళ్లగొట్టలేకపోవడం సరికొత్త ఉదాహరణ! తమ రాష్ట్రంలో ‘మొన్‌సాంటో’, సింఝెంఠా’ సంస్థల వారి పురుగుల మందు లు వాడిన కారణంగా విష ప్రభావానికి లోనై ముప్పయి తొమ్మిది మంది మరణించారని వేలాదిమంది రకరకాల అస్వస్థతలకు గురి అయ్యారని మహారాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధి ఒకరు వెల్లడించాడు. ఈ రెండు సంస్థలు, మరో సంస్థ ‘‘యునైటెడ్ ఫాస్ఫరస్’’ కలపి అత్యధికంగా పురుగుల మందులను అమ్మేస్తున్నాయట! ఇలా ఆరోగ్య భద్రతా నియమావళిని భంగపరుస్తున్న సంస్థలను ఆ ప్రభుత్వం కాని ఇతర రాష్ట్రాల ప్రభుత్వాలు కాని కేంద్ర ప్రభుత్వం కాని నిషేధించలేకపోవడం బిగిసిపోతున్న ‘ప్రపంచీకరణ’ ఉచ్చులకు నిదర్శనం. ఇతర దేశాలు ప్రధానంగా సంపన్న దేశాలవారు మన ఆహారం దిగుమతులపై తరచు ఆంక్షలను విధిస్తున్నారు, నిషేధిస్తున్నారు. మళ్లీ తమకు ఇష్టం వచ్చినప్పుడు ఈ ఆంక్షలను తొలగిస్తున్నారు. అమెరికా, ఐరోపా దేశాలు పాల్పడుతున్న ఈ ఆంక్షలకు, నిషేధాలకు ప్రధానమైన ‘సాకు’ మన దేశాల ఆహార ఉత్పత్తులు ‘క్రిమిసంహారాల’ దుష్ప్రభావానికి గురి అయి ఉన్నాయన్నది! ఒకవైపున ఈ దేశాలకు చెందిన సంస్థలు ‘క్రిమి సంహారకాల’ను మన వ్యవసాయంపైకి ఉసిగొల్పుతున్నాయి, మరోవైపున ఈ దేశాల ప్రభుత్వాలు ఈ ‘‘క్రిమి సంహారకాలు నిండిన మన పండ్లను, కూరగాయలను, ఇతర ఆహార పదార్థాల’’ను నిషేధిస్తున్నాయి! ప్రపంచీకరణ మారీచమృగ మాయాజాలం ఇది...
బహుళ జాతీయ వాణిజ్య సంస్థల ‘కబంధ బంధం’ నుంచి వ్యవసాయ రంగాన్ని పరిరక్షించడానికై మహారాష్ట్ర ప్రభుత్వం సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించాలని భావిస్తుండడం ప్రశంసించదగిన పరిణామం! ఈ ప్రతిపాదన ఆచరణకు వచ్చినట్టయితే వ్యవసాయ భూమికి ‘బహుళ జాతుల’ దోపిడీ నుంచి మాత్రమే కాక, కృత్రిమ రసాయన విషాల నుంచి కూడ విముక్తి లభిస్తుంది! ఎలాంటి ‘రసాయనాలు’ ఉపయోగించకుండా సేద్యం చేసే రైతులకు సాలీనా ఎకరానికి పదివేల రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందించాలన్నది ఈ ప్రతిపాదన. ఇలా రసాయనపు ఎఱువులు కాని, రసాయన క్రిమిసంహారాలు కాని ఉపయోగించకుండా ప్రాకృతిక పద్ధతిలో పంటలు పండించడం వల్ల ఆరంభంలో రైతులు నష్టపోవచ్చు! ఆ నష్టాన్ని పూడ్చడం కోసం ఇలా ఎకరానికి పది వేల రూపాయలను ప్రభుత్వం అందజేయాలన్నది ప్రతిపాదన. మహారాష్ట్ర ప్రభుత్వానికి చెందిన ఒక విభాగం వారు చేస్తున్న ఈ ప్రతిపాదనను మహారాష్ట్ర ప్రభుత్వం మాత్రమే కాదు, దేశమంతటా అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు ఆమలు జరపడం మేలు... అలా అమలు జరగడం వల్ల రసాయన విషాల నుంచి, విషపు వాసనల నుంచి భూమికి విముక్తి లభిస్తుంది, పరిసరాలకు విముక్తి లభిస్తుంది! ప్రజల ఆరోగ్యం పెంపొందడానికి ప్రాకృతిక పరిశుభ్రత విస్తరించడానికి ఈ ‘విముక్తి’ దోహదం చేయగలదు! ప్రభుత్వాలు అందించే సహాయంతో రైతులు ఆవుపేడ పశువుల పేడ, సారవంతమైన మట్టి, అటవీ ఉత్పత్తులతో సహజమైన ఎఱువులను తయారు చేసుకోగలరు. గోమూత్రం వంటి ప్రాకృతిక పదార్థాలతో తయారయ్యే ఔషధాలను వాడడం వల్ల పంటలలో క్రిమికీటకాలు జనించవు. తెగుళ్లు సోకవు. కాబట్టి నివారించడం అనవసరం...
ఇదంతా సహజమైన సేంద్రియ ప్రక్రియ! సేంద్రియ వ్యవసాయం దేశమంతటా విస్తరించినట్టయితే ‘సింఝెంఠా’, ‘మొన్‌సాంటో’ వంటి విదేశీయ సంస్థలు ‘తట్టలు బుట్టలు తపేలాల’ సహితంగా మన దేశం నుంచి నిష్క్రమించడం తప్పదు! కేరళ రాష్ట్రంలోని అనేక ‘తాలూకా’లలో ఇప్పటికే సంప్రదాయ సేంద్రియ వ్యవసాయం జరుగుతోందట! గత ఏడాది జనవరి నాటికి మొత్తం సిక్కిం రాష్ట్రం సేంద్రియ వ్యవసాయ క్షేత్రంగా ఏర్పడింది. ప్రధాన మంత్రి నరేంద్రమోదీ సిక్కిం రాజధాని గాంగ్‌టక్‌లో ఈ వాస్తవాన్ని ఆవిష్కరించాడు. సిక్కిం స్ఫూర్తితో దేశమంతటా సేంద్రియ వ్యవసాయం జరగడం ఒక్కటే విదేశీయ ఆర్థిక సామ్రాజ్యవాదం నుంచి విముక్తికి మార్గం...