సంపాదకీయం

అవును..సాధించాం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇదీ మన సినిమా..ఇదీ మన సత్తా అని ప్రతి తెలుగువాడు తనివితీరా ఆస్వాదించాల్సిన తరుణమిది. ఆరున్నర దశాబ్దాలుగా తెలుగు సినిమాకు ఎండమావిగా మారిన జాతీయ ఉత్తమ చిత్రం అవార్డు ఆలస్యంగానైనా సరైన సినిమాకే దక్కింది. అదీ తెలుగు దర్శకత్వ ప్రతిభకు, తెలుగు ఆలోచనా పదునుకు అంతర్జాతీయ గుర్తింపును తెచ్చిన బాహుబలికే స్వర్ణకమలం లభించడం మరింత ఆనందదాయకం. ఇప్పటి వరకూ తీసిన సినిమాలు ఒక ఎత్తు..ఇక నుంచి తీయబోయే సినిమాలు మరో ఎత్తు అన్న బాధ్యతను, స్పృహను ఈ అవార్డు తెలుగు దర్శక నిర్మాతలకు కలిగించిందనడంలో ఎలాంటి సందేహం లేదు. జాతీయ ఉత్తమ చిత్రంగా ఎన్నిక కావడానికి ఉండాల్సిన అన్ని రకాల అర్హతలు, హంగులు, సాంకేతిక నైపుణ్యం బాహుబలికి ఉన్నాయి. సినిమా ఎలా ఉంటే ఏమిటిలే అని కాకుండా తన సినిమా ఇలాగే ఉండాలన్న తపనతోనే దర్శకుడు రాజవౌళి ఈ ప్రాజెక్టును చేపట్టడం, దాదాపు నటీనటులందరినీ నెలల తరబడి బయటికి రాకుండా చేసి తన సినిమా పట్ల అంచనాలు మరింతగా పెంచుకోవడంలో దర్శకుడు తనదైన శైలిని కనబరిచారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నిష్ణాతులైన, ఎన్నో హాలీవుడ్ సినిమాలకు సాంకేతిక దన్నునందించిన ఎందరి సేవల్నో బాహుబలి కోసం వినియోగించుకున్నారు. అన్నింటికీ మించి తెలుగు సినిమా చరిత్రనే తిరగరాసే రీతిలో ఇటు వాణిజ్య పరంగానూ అటు వినూత్న కథాంశ పరంగానూ బాహుబలి రికార్డులు సృష్టించడం..ఇంత వరకూ ఏ తెలుగు సినిమా ఊహించని మైలురాళ్లెన్నింటినో అధిగమించడం ఈ జాతీయ ఉత్తమ పురస్కారానికి దాని అర్హతల్ని మరింత పెంచిందనే చెప్పాలి. పైగా గత ఏడాది విడుదలైన చిత్రాల్లో ఎన్నో అద్భుతాల్ని సృష్టించాయి. కథల్లోనూ, కథనంలోనూ కొత్త పుంతలు తొక్కా యి. బాజీరావు మస్తానీ, బజరంగి భాయిజాన్ వంటి సినిమాల పోటీని తట్టుకుని ఉత్తమ జాతీయ చిత్రంగా బాహుబలి ఎంపిక కావడం తెలుగువాడి నిదర్శనం. తెలుగుదనానికి నిఖార్సయిన గుర్తింపు. తెలుగు సినిమాకు అవార్డులు కొత్త కాదు. అంతర్జాతీయ పురస్కారాలూ అందనివేమీ కాదు. కానీ, దశాబ్దాల తరబడి జాతీయ స్థాయిలో ఉత్తమ చిత్రం అవార్డుకు ఇప్పటి వరకూ నోచుకోక పోవడానికి కారణమేమిటి?
మనకు సృజన లేదా? జాతీయ ప్రేక్షకుల్ని ఆకట్టుకోగలిగే రీతిలో కథాంశాలను వినూత్న రీతిలో తెరకెక్కించగలిగే సామర్థ్యం లేదా? మనకున్న దర్శకులు ఇప్పటి వరకూ ఎన్నో జాతీయ అవార్డులు పొందిన వారికి ఎంత మాత్రం తీసిపోరు. మన నిర్మాతల అభిరుచి ఇటు కళాత్మతకు, అటు సమాంతర సినిమాకు ఎన్నో సందర్భాల్లో అద్దం పట్టింది. ఇక నటీనటుల విషయానికొస్తే మనం ఎవరికి దిగదుడుపు? ఓ ఎన్టీఆర్, ఓ ఏఎన్‌ఆర్, ఓ ఎస్వీయార్ ఇలా చెప్పుకుంటూ పోతే విలక్షణమైన నటనకు, వినూత్నమైన ఆలోచనలకు తెలుగుదనం పెట్టింది పేరు. ఎందరో హాలీవుడ్, బాలీవుడ్ నటీనటులు సైతం అబ్బుర పడే నటనావైదుష్యం ఇలాంటివారెందరికో సొంతం? పౌరాణిక, జానపద సినిమాలు తీయడంలో మన ల్ని మించిన వారెవరు? రామాయణం తీయాలన్నా..ఆబాల గోపాలాన్ని ఆకట్టుకునే రీతిలో భారతాన్ని తెరకెక్కించాలన్నా అది మనకే సాధ్యం. ఎవరు ఈ ప్రయత్నం చేసినా అది అరకొర చందమే తప్ప..పరిపూర్ణం కాదన్న విషయాన్ని మన పౌరాణికాలెన్నో రుజువు చేశాయి. యాభయ్యవ దశకంలోనే తెలుగు సినిమా కొత్త ఒరవడిని సంతరించుకుంది. ఎన్నో సమకాలీన అంశాల్ని ఇతివృత్తంగా చేసుకుని అభ్యుదయ భావాలను పాదుగొల్పే రీతిలో నాటి దర్శక నిర్మాతలు ఎన్నో సినిమాలు తీశారు. లాభాపేక్షతో కాకుండా సమాజానికి ఎంతోకొంత ఉపయోగ పడాలన్న ఉద్దేశమే వారి ప్రయత్నాల్లో ఉండేది. అంతే కానీ అవార్డుల కోసం వారా సినిమాలు తీయలేదు..అలాంటిదేదో వస్తుందనీ ఆశించలేదు. ఆ రీతిలోనే ఎన్నో సినిమాలు వచ్చాయి. వాటిలో కొన్నింటికి జాతీయ స్థాయిలో ప్రాంతీయ ఉత్తమ చిత్రం అవార్డు లభించిందే తప్ప..మొత్తం భారతంలో ఇదే ఏకైక ఉత్తమ చిత్రం అన్న గుర్తింపుమాత్రం బాహుబలి వచ్చే వరకూ దక్కలేదు. ఇంత వరకూ మనం ఎదురుచూడాల్సిన పరిస్థితి ఎందుకొచ్చిందంటే కారణాలెన్నో..మనకు అవార్డు రాలేదంటే అందుకు అవసరమైన రీతిలో లాబీయింగ్ చేసుకోలేక పోయామన్న విమర్శ చటుక్కున వచ్చేస్తుంది. ముఖ్యంగా జాతీయ అవార్డుల విషయంలో ఈరకమైన నిరాశా, నిట్టూర్పులు సహజంగానే వ్యక్తం అవుతాయి. దేశంలో మరే భాషలో నిర్మించనన్ని సినిమాలను మనం ఏటేటా నిర్మిస్తున్నాం. ఈ విషయంలో బాలీవుడ్ తర్వాతి స్థానం టాలీవుడ్‌గా పేర్కొనే తెలుగు సినిమాదే.
జాతీయ అవార్డు అనేది పట్టుబట్టి తెచ్చుకునేదే తప్ప ఆయా సినిమాల గొప్పదనాన్ని బట్టి, నటీనటుల విలక్షణ నటనా వైదుష్యాన్ని బట్టి వచ్చేది కాదన్న వాదన ఎంత మాత్రం సరైనది కాదు. దాదాఫాల్కే అవార్డు కూడా జాతీయ స్థాయిలో సినిమాకు ఇచ్చేదే. ఇలాంటి ఉన్నత పురస్కారం ఇప్పటి వరకూ ఆరుగురు తెలుగువారికి దక్కింది. దక్షిణ భారత దేశంలో ఇన్ని సార్లు ఫాల్కే పురస్కారం పొందిన ఘనత తెలుగుసినిమాదే. లాబీయింగ్ వల్లే అవార్డు వస్తుందని భావించినప్పుడు ఫాల్కే కూడా మనకు ఇన్ని సార్లు దక్కి ఉండకూడదు కదా? మనతోపాటే దాదా పు సినీ ప్రయాణాన్ని మొదలెట్టిన తమిళ సినిమాకు కూడా ఇప్పటి వరకూ రెండు సార్లు మాత్రమే జాతీయ ఉత్తమ చిత్రం అవార్డు లభించింది. బెంగాల్‌కు లభించిన 22 అవార్డులు, హిందీకి లభించిన 13 అవార్డులతో పోల్చుకుని మనకు అన్యాయం జరిగిపోయిందని గుండెలు బాదుకోవాల్సిన అవసరం లేదు. ఉత్తమ చిత్రాన్ని ఎంపిక చేయడానికి కొన్ని ప్రమాణాలు, నియమాలూ, నిబంధనలూ ఉంటాయి. వీటన్నింటినీ ఓ సినిమా జాతీయ స్థాయిలో సంతృప్తి పరిస్తే..పోటీగా నిలిచిన ఇతర సినిమాల కంటే అజేయంగా నిలిస్తేనే ఉత్తమ జాతీయ పురస్కాలం లభిస్తుంది. అమితమైన ప్రజాదరణ పొందిన హాలీవుడ్ చిత్రం ఆస్కార్ అవార్డులను ఊడ్చేసినట్టుగా జాతీయ ఉత్తమ పురస్కారాలను గంపగుత్తగా చేజిక్కించుకోవడం సాధ్యం కాదు. కళాత్మక విలువలతో కూడిన సమకాలీన దృశ్య కావ్యాలకే ఇప్పటి వరకూ ఎక్కువగా జాతీయ ఉత్తమ చిత్రం అవార్డులు లభించాయి. ఇవేవీ సగటు ప్రేక్షకులను మెప్పించే సినిమాలు కాకపోయినా అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లో సముచిత గుర్తింపును సంతరించుకున్నాయి. తెలుగు నేలపై సమాంతర సినిమా ఒక దశలో ఊపందుకున్నా..తర్వాత చతికిల పడింది. కేవలం కళాత్మక సినిమాలకే అవార్డు అన్న నానుడి క్రమంగా తొలగి పోయి వ్యాపార, వాణిజ్యపరమైన జనరంజక సినిమాలకూ అవార్డుల పరంపర మొదలైంది. ఆ కోవలో తెలుగు సినిమా హేమాహేమీలను జయించి మరీ అవార్డును కైవసం చేసుకోవడం స్ఫూర్తిదాయక విజయం. ఇన్నాళ్లూ ఎందుకు రాలేదన్న నిట్టూర్పు కంటే..ఇక నుంచి ‘జాతీయ’ లక్ష్యాలు ఎలా సాధించాలన్న పట్టుదల పెరగాలి. అదే తెలుగు సినిమాకు కొత్త ఊపిరి నిస్తుంది. సరికొత్త ఉత్సాహాన్నీ అందిస్తుంది.