సంపాదకీయం

ఐరోపా ద్వంద్వనీతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భారత, ఐరోపా సమాఖ్యల పదమూడవ వాణిజ్య శిఖర సమావేశం విఫలం కావడం ఆశ్చర్యకరం కాదు. ఇరవైతొమ్మిది దేశాల ఈ సమాఖ్య-ఐరోపా యూనియన్-తో మన వాణిజ్య సంబంధాలు, దౌత్య సంబంధాలు అంటీ ముట్టని రీతిలో సాగుతుండడం, ఏళ్ల తరబడి ఆవిష్కృతమవుతున్న అంతర్జాతీయ దృశ్యం. అందువల్ల సమాఖ్యతో మన ప్రభుత్వం కుదుర్చుకోదలచిన, విస్తృత వాణిజ్య పారిశ్రామిక భాగస్వామ్య వ్యవహారాల ఒప్పందం బెల్జియం రాజధాని బ్రస్సెల్స్ నగరంలో గురువారం జరిగిన సమావేశంలో కొలిక్కి రాకపోవడంలో వింత లేదు. ఈ విస్తృత వాణిజ్య, పారిశ్రామిక భాగస్వామ్య వ్యవహారాల ఒప్పందం-బ్రాడ్ బేస్డ్ ట్రేడ్ అండ్ ఇనె్వస్ట్‌మెంట్ అగ్రిమెంట్-బిటిఇఏ- గత ఐదేళ్లుగా కూలబడి ఉంది. మనదేశంలోని స్వచ్ఛంద సంస్థల-ఎన్‌జిఓ- ముసుగులో చొరబడి పోతున్న దళారీ ముఠాలు మన అంతర్గత వ్యవహారాల్లో జోక్యం కలుగ చేసుకుంటుండడం దశాబ్దుల వైపరీత్యం. ఈ ఎన్‌జిఒలలో అధికశాతం ఐరోపా వాణిజ్య ప్రయోజనాలకోసం, ఐరోపా సంస్కృతిని మన దేశ ప్రజలపై రుద్దడం కోసం కృషి చేస్తున్నాయి. ఇలాంటి సంస్థలకు వాటి భారతీయ అనుబంధ విభాగాలకు లభిస్తున్న విదేశీయ నిధులు ప్రధానంగా ఈ సాంస్కృతిక దురాక్రమణను కొనసాగించడానికి దోహద పడుతున్నాయి. ఐరోపా ప్రభుత్వాలు విడివిడిగా మనదేశంలో సన్నిహిత మైత్రిని పెంపొందించుకుంటున్నాయి. గత ఏడాది మన ప్రధాని నరేంద్ర మోదీ ఐరోపా దేశాలలో పర్యటించిన సందర్భంగా వెల్లివిరిసిన సుహృద్భావం ఇందుకు నిదర్శనం. ఈ ద్వైపాక్షిక సాన్నిహిత్యం ఐరోపా దేశాల సమా ఖ్య విధానాలలో ప్రస్ఫుటించకపోవడానికి ప్రధాన కారణం వాణిజ్యం. రెండవది మన జాతీయ సాంస్కృతిక తత్వానికి వ్యతిరేకంగా ఐరోపా స్వచ్ఛంద సంస్థలు సాగిస్తున్న షడ్యంత్రం. ఈ రెండు వ్యవహారాలలోను, ఐరోపా దేశాల ప్రభుత్వాల పాత్ర పరిమితం, ప్రధానంగా ఐరోపా సమాఖ్య పాలకమండలి, వాణిజ్య వ్యవహారాల సమితి-ఐరోపా కమిషన్- ఈ వ్యవహారాలను నియంత్రిస్తున్నాయి. అందువల్లనే మనదేశంలో మానవ అధికారాలకు భంగం జరిగిపోతోందని ఐరోపా సమాఖ్య ప్రభుత్వం ఆర్భాటిస్తోంది. అనేక ఏళ్లుగా ఈ మానవాధికారాల ఉల్లంఘనను నిరసిస్తూ సమాఖ్య పార్లమెంటు తీర్మానాలను కూడ చేస్తోంది. కానీ ఐరోపా దేశాల చట్టసభలు ఇలాంటి తీర్మానాలు చేయవు. మనదేశానికి వ్యతిరేకంగా ఐరోపా సమాఖ్య వాణిజ్య పరమైన ఆంక్షలను విధిస్తోంది. మన దిగుమతులను అప్పుడప్పుడు నిషేధిస్తోంది కూడ. కానీ సమాఖ్య దేశాల ప్రభుత్వాలు విడివిడిగా ఇలాటి ఆంక్షలు విధించడం లేదు.
విడివిడిగా మనదేశం పట్ల అత్యంత సుహృద్భావాన్ని ప్రకటిస్తున్న ఐరోపా దేశాలు ఉమ్మడిగా మనదేశాన్ని ఎందుకని దూరంగా ఉంచుతున్నాయి? విడివిడిగా మైత్రిని పెంపొందించుకొనడం ద్వారా బ్రిటన్, ఫ్రాన్స్ తదితర ఐరోపా దేశాలు మనకు తమ ఆయుధాలను అమ్ముకుంటున్నాయి. ఉమ్మడిగా సంకుచిత ప్రొటెక్షనిస్ట్ విధానాలను అమలు జరపడం ద్వారా ఐరోపాలోకి మన దిగుమతులు పెరగకుండా నియంత్రించ గలుగుతున్నాయి. గత ఏడాది నరేంద్ర మోదీ పర్యటన సందర్భంగా అంతర్జాతీయ జిహాదీ ఉగ్రవాదంపై మన దేశంతో కలిసి పోరాడాలన్న నిశ్చయాన్ని బ్రిటన్, జర్మనీ, ఫ్రాన్స్ వంటి దేశాలు ప్రకటించాయి. మనదేశానికి ఐక్యరాజ్య సమితిలో శాశ్వత సభ్యత్వం కల్పించాలన్న ప్రతిపాదనకు బ్రిటన్ ఫ్రాన్స్‌లు నిర్ద్వంద్వంగా మద్దతును కూడ ప్రకటించాయి. బెల్జియం ప్రధాని ఛార్లెస్ మిహాయిల్‌తో మార్చి 30వ తేదీన నరేంద్ర మోదీ జరిపిన చర్చలలో కూడ టెర్రరిజానికి వ్యతిరేకంగా ఉభయ ప్రభుత్వాల విధానం ఒకటేనన్న వాస్తవం మరోసారి ధ్రువపడింది. ఈ ద్వైపాక్షిక స్ఫూర్తికి భిన్నమైన రీతిలో భారత-ఐరోపా వాణిజ్య సభ విఫలం కావడం విచిత్రం కాదు. ఈ అంతరం ఏళ్ల తరబడి కొనసాగుతోంది. ఐరోపా మండలి అధ్యక్షుడు డోనాల్డ్ టస్క్‌తోను, ఐరోపా నిధి అధ్యక్షుడు వెర్నెర్ హోమర్‌తోను మోదీ జరిపిన చర్చలు విజయవంతమైనాయన్నది ప్రచారం. ఈ చర్చల వల్ల సహకారం మరింత బలపడిందని సంయుక్త ప్రకటనలో వివరించారు. విస్తృత వాణిజ్య పారిశ్రామిక భాగస్వామ్యం మాత్రం ఆకృతి దాల్చలేదు.
విస్తృత అంగీకారం కుదిరినట్టయితే భారతీయ సంస్థలు ఐరోపా సేవా రంగంలోకి చొరబడిపోతాయన్నది సమాఖ్య నిర్వాహకుల భయం కావచ్చు. బిటిఐఏ కుదరక పోవడానికి ఇది కూడ ఒక కారణం. కానీ ‘‘్భరత దేశంలో మానవ అధికారాలకు భంగం కలిగిపోతుండడం’’ వల్లనే ఒప్పందం కుదరలేదని మనదేశంలోని ఐరోపా సమాఖ్య రాయబారి టోమస్జ్ కోజ్లోవ్‌స్కీ ప్రకటించాడట. ఐరోపా సమాఖ్య వారు మాన అధికారాలకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నారట. ఎన్‌జిఒల హక్కులకు కూడ మనదేశంలో భంగం కలుగుతోందట. ఈ ఎన్‌జిఓలకు విదేశాల నుంచి వచ్చిపడుతున్న నిధులగురించి వాటిని ఈ స్వచ్ఛంద బృందాలు ఖర్చు పెడుతున్న తీరును గురించి ప్రభుత్వం వివరాలు అడగడం ఆరంభించింది. ఫలితంగా ఈ ఎన్‌జిఓలు అక్రమ కలాపాలకు అడ్డుకట్టపడినట్టయింది. ఎన్‌జిఓల హక్కులకు భంగం కలుగడం అంటే ఇదే. దీన్ని ఐరోపా సమాఖ్య నిరసిస్తోందట. ఈ ఎన్‌జిఓలు సేవ పేరుతో మనదేశంలో భారీ ఎత్తున మతమార్పిడులను సాగిస్తుండడం బహిరంగ రహస్యం. మతం మార్పిడులు నిర్నిరోధంగా సాగిపోయినట్టయితే ఐరోపా సమాఖ్య వారికి అభ్యంతరం లేదు. మన ప్రభుత్వం ఈ మత మార్పిడులను నివారించే చర్యలు కూడ తీసుకోలేదు. కేవలం ఎన్‌జిఓలు తమ నిధుల విషయంలో పారదర్శకతను ప్రదర్శించాలని మాత్రమే కోరింది...
జమ్మూకశ్మీర్‌లో మానవ అధికారాలకు భంగం వాటిల్లుతోందని ఐరోపా పార్లమెంటు తీర్మానించి ఉంది. ఇప్పుడు మొత్తం దేశంలో ప్రాధాన్యం లేని -మార్జినల్- వర్గాల హక్కులకు భంగం కలుగుతోందని మోదీ బ్రస్సెల్స్‌లో ఉన్న సమయంలోనే, కోజ్లోవ్‌స్కీ ఆరోపించాడు. ఈ ప్రాధాన్యత లేని వర్గాలవారు ఎవరన్నది మాత్రం సమాఖ్య వారు వివరించలేదు. మన ఈశాన్య ప్రాంతం మొత్తం విదేశీయుల పాలనలో ఉందని ఐరోపాకు చెందిన స్వచ్ఛంద సంస్థలు పదిహేను ఏళ్ల క్రితమే ఒక పరిశోధన పత్రాన్ని రూపొందించించాయి. ఈ సంస్థలు ఈశాన్యంలో అనేక దశాబ్దుల పాటు మతం మార్పిడులను ప్రోత్సహించాయి, నిధులిచ్చాయి. ఈశాన్య ప్రాంతాన్ని మనదేశం నుండి విడగొట్టడం ఈ ఐరోపా సంస్థల దీర్ఘకాల వ్యూహం. ఐరోపా సమాఖ్య వారు మనదేశంపై తరచు చేయిస్తున్న హక్కుల ఉల్లంఘన ఆరోపణలకు ఇదీ నేపథ్యం. మన కేరళ తీరంలో ఇద్దరు జాలర్లను దారుణంగా హత్య చేసిన ఇటలీ నావిక బీభత్సకారులను విచారించకుండా వదలిపెట్టాలని ఐరోపా సమాఖ్య కోరుతోంది. ఇవన్నీ సమాఖ్య మనదేశం పట్ల అనుసరిస్తున్న విధానానికి కొన్ని ఉదాహరణలు మాత్రమే. శిఖర సభ వైఫల్యం అందువల్ల ఆశ్చర్యకరం కాదు.