మిర్చిమసాలా

శవం మీద పార్టీ జెండా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈ మధ్య పార్టీ నాయకులు ఎవరు ఎప్పుడు పార్టీ మారతారో, ఎవరు ఏ పార్టీలో ఉంటారో తెలియని పరిస్థితి. టిడిపి ఆవిర్భావ దినోత్సవం వేడుకలను ఎన్టీఆర్ భవన్‌లో నిర్వహించారు. మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు ఉద్వేగంగా మాట్లాడుతూ తాను మరణించిన తరువాత తన శవంపై టిడిపి జెండా కప్పాలంటూ అభ్యర్థించారు. అంత ఉద్వేగం ఎందుకూ అని పార్టీలో కొందరు అనుమానం వ్యక్తం చేస్తే, తెలంగాణలో టిడిపి నాయకులు ప్రతి రోజు ప్రాతివ్రత్యాన్ని నిరూపించుకోవలసి వస్తున్నది, దాంతో మేం పార్టీ మారడం లేదు అని ఇలాంటి సెంటిమెంట్ ప్రకటనలు చేయాల్సి వస్తోందని నాయకుడు సమాధానం చెప్పారు. మాజీ మంత్రి తమ్మినేని సీతారాం కూడా ఇదే విధంగా తన శవంపై టిడిపి జెండా కప్పాలని ప్రకటించి, ఆ వెంటనే ప్రజారాజ్యంలో చేరారు. ఏంటో నాయకులు ఏం మాట్లాడినా జనం నమ్మడం లేదు.
- మురళి

వెంకయ్య-మాంసాహారం-జనసంఘ్!
కేంద్ర మంత్రి ముప్పవరపు వెంకయ్య నాయుడు ఆంధ్రప్రదేశ్ రాజధాని విజయవాడ నగరానికి వచ్చినప్పుడల్లా మీడియాతో గాని, లేదా కార్యకర్తల సమావేశాల్లో గాని ఏదోఒక ఆసక్తికర కొత్త విషయాన్ని చెబుతున్నారు. తాజాగా విజయవాడలో జరిగిన జెఎన్‌యు విద్యార్థి సంఘం అధ్యక్షుడు కన్హయ్ కుమార్ సభకు ప్రతిగా నిర్వహించిన సభలో పాల్గొన్న వెంకయ్య తనను ఎందరు నిరాశపరచినా బిజెపిలో ఎలా చేరాననేది వివరించారు. ‘నెల్లూరు జిల్లా కుగ్రామానికి చెందిన నేను ఆరోజుల్లో జనసంఘ్‌లో చేరాలనుకున్నా. ఆ గ్రామానికి చెందిన ఓ పెద్దయ్య నా మంచి కోరి.. ఏం వెంకయ్యా! ఏదో పేరుకూడా తెలియని సంఘ్ పార్టీలో చేరుతున్నావంట. అసలు ఆ పార్టీ ఉత్తరాదికి, అందునా వ్యాపారులు, బ్రాహ్మణులకే పరిమితమట. ఇంకో విషయం తెలుసా! నీకేమో మాంసాహారం బహు ఇష్టం. ఆ పార్టీ సమావేశాల్లో ఒట్టి శాఖాహారమేనట. బాగా ఆలోచించు’ అన్నారు. వెంటనే నేను దీని గురించి ఆరాదీశా. పార్టీ మీటింగ్‌లు ఈటింగ్ కోసం కాదు, సభ్యత్వం తీసుకున్నవారు శుభ్రంగా మాంసాహారం భుజించవచ్చం’టూ ధైర్యాన్నిచ్చారు. అప్పటికే ఎంతోకొంత ఆర్‌ఎస్‌ఎస్‌తో పరిచయం ఉండటంతో జనసంఘ్‌లో చేరా. నాటి నుంచి నిన్నటి వరకు తృప్తిగా మాంసం తింటూనే ఉన్నా. వయస్సు పెరిగి ఆరోగ్యం సరిగా లేకపోవటంతో డాక్టర్లు జీవితాంతం సరిపడే మాంసం ఇప్పటికే ఎంతో ఎక్కువగానే తిన్నావు, ఇక తగ్గించమన్నారు’ అంటూ వివరించారు. అయితే వెంకయ్య ఓ విషయం చెప్పటం మరిచారు. నాడు కమ్యూనిస్టులు గోడలపై ‘జనసంఘ్’ బోర్డులపై ముందు అక్షరంగా ‘్భ’ అని చేర్చి ఎగతాళి చేసేవారని!
- నిమ్మరాజు చలపతిరావు

పొగడ్తాండా..తిడుతాండా..?
అసెంబ్లీ సమావేశాల సందర్భంగా అధికార,ప్రతిపక్ష నాయకులు సభలో పరస్పర ఆరోపణ, ప్రత్యారోపణలు చేసుకోవడం సాధారణం. అదే స్థాయిలో విమర్శనాస్త్రాలు సంధించుకోవడం కూడా సహజమే. కానీ ముఖ్యమంత్రి కెసిఆర్‌ను విమర్శిస్తూనే పొగడడం అన్నది చాలా అరుదు. తెలంగాణవ్యాప్తంగా షాదీముబారక్ పథకంలో అక్రమాలు చోటుచేసుకున్నాయంటూ శాసన సభలో ప్రతిపక్ష ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఒవైసీ ఆరోపించారు. కల్యాణ లక్ష్మి, షాదీముబారక్ పథకాల నిధులు పక్కదారి పడుతున్నాయని, పథకాల అవినీతిపై ఏసిబి విచారణ జరిపించాలని ముఖ్యమంత్రిని నిలదీశారు. అదే సందర్భంలో ముఖ్యమంత్రి కెసిఆర్ పేదల కోసం కల్యాణ లక్ష్మి, షాదీముబారక్, రెండు పడకల గదుల నిర్మా ణం వంటి పథకాలు చేపట్టడం ముదావహమని అక్బరుద్దీన్ ఒవైసీ ప్రభుత్వంపై ప్రశంసల జల్లు కురిపించారు. దీంతో సభికులంతా నవ్వుకుంటూ ప్రతిపక్ష నేత అక్బరుద్దీన్ ప్రభుత్వాన్ని ‘పొగడ్తాండా..తిడుతాండా..’ అంటూ ఆశ్చర్యపోయారు.
-సయ్యద్ గౌస్‌పాషా

వౌనమేలనోయి...
శాసనసభలో విపక్ష సభ్యులు తమ డిమాండ్లను సాధించుకోవడం కోసం నిరసన వ్యక్తం చేయడం సహజం. కొంత మంది సైకిళ్లమీద శాసనసభకు వచ్చి నిరసన తెలిపిన ఘటనలు ఉన్నాయి, మరికొంత మంది ఎడ్లబళ్లపైనా వచ్చి నిరసన తెలిపారు. మరికొంత మంది సభకు నల్ల రిబ్బన్లతో, రంగు చొక్కాలతో రావడం ఇంకొన్ని సందర్భాల్లో స్పీకర్ పోడియంను చుట్టుముట్టడం, స్పీకర్ పోడియంలోనే బైఠాయించడం, పెద్దపెట్టున నినాదాలు చేయడం, సభ ముగిసినా సభలోనే కొనసాగడం ఇలా రకరకాలుగా నిరసన తెలిపిన అనుభవాలు శానసభ చరిత్రలో ఎన్నో...కాని వౌనంగా ఉన్నా శాసనసభ నుండి బహిష్కరించేలా ఉన్నారు..అంటూ వైకాపా సభ్యులు చమత్కరిస్తున్నారు. ఈ చమత్కారానికి కారణం లేకపోలేదు, శాసనసభ బడ్జెట్ సమావేశాల చివరి రోజున కొంత మంది వైకాపా సభ్యులు కూర్చుని నినాదాలు చేస్తుండగా, ఆర్ధిక మంత్రి యనమల రామకృష్ణుడు జోక్యం చేసుకుని కూర్చున్నా మిమ్మల్ని సస్పెండ్ చేయవచ్చు...గుర్తుంచుకోండి అనడంతో ఈ జోకులు శాసనసభలో రివ్వు మంటున్నాయి.. బాబోయ్ వౌనంగా ఉన్నా సస్పెండ్ చేస్తారేమో అంటూ...
- బి వి ప్రసాద్

వ్యూహమా? తప్పిదమా?
శాసనసభలో ప్రతిపక్ష నాయకుడు జానారెడ్డి వ్యూహం ప్రజలకు ఏమోగానీ ఆ పార్టీ సభ్యులకు కూడా అర్థం కాని పరిస్థితి ఏర్పడింది. ద్రవ్యవినిమయ బిల్లుకు కాంగ్రెస్ తరఫున మద్దతు ఇస్తున్నామని చెప్పి ప్రతిపక్ష నాయకుడు జానారెడ్డి కూర్చున్నారు. ఆ తర్వాత మిగతా విపక్షాలు అదే తరహాలోనే మద్దతు పలికాయి. దీంతో స్పీకర్ ద్రవ్యవినిమయ బిల్లు ఆమోదం పొందినట్టు ప్రకటించారు. అయితే అంతకుముందు మద్దతు ప్రకటించిన జానారెడ్డి ఆ తర్వాత మనసు మార్చుకొని బిల్లుకు కాంగ్రెస్ నిరసన వ్యక్తం చేస్తుందని చెప్పారు. ముందు మద్దతు ప్రకటించి, బిల్లు ఆమోదం పొందాక నిరసన తెలియజేయడం ఏమిటనీ విస్తుపోయిన స్పీకర్ అదేమి పట్టించుకోకుండా సభను మరుసటి రోజుకు వాయిదా వేసినట్టు ప్రకటించారు. ద్రవ్యవినిమయ బిల్లుపై మాట్లాడిన కాంగ్రెస్ సభ్యులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, జీవన్‌రెడ్డి ప్రభుత్వం ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేదని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తమ నాయకుడు జానారెడ్డి కూడా తమ మాదిరిగా ప్రభుత్వాన్ని ఎండగడుతారనుకుంటే ఆయనేమో మద్దతు ప్రకటించడాన్ని కాంగ్రెస్ సభ్యులు జీర్ణించుకోలేకపోయారు. ద్రవ్యవినిమయ బిల్లును వ్యతిరేకించి తీరాల్సిందేనని మిగతా సభ్యులు పట్టుబట్టడంతో మొక్కుబడిగా నిరసన వ్యక్తం చేయడానికి జానారెడ్డి ప్రయత్నించారు. ప్రతిపక్ష నాయకుడు ప్రభుత్వానికి సహకరిస్తుంటే మిగతా సభ్యులే వ్యతిరేకిస్తున్నారన్న అభిప్రాయాన్ని సభలో బలపడేలా చేయడంలో జానారెడ్డి సఫలికృతం కాగా? ఆయన వ్యూహం ఏమిటో అర్థంకాక కాంగ్రెస్ సభ్యులు జుట్టు పీక్కుకుంటున్నారు.
- వెల్జాల చంద్రశేఖర్