సంపాదకీయం

తెలుగువాఢు.. విశ్వనరుడు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుగులేదు, విశ్వనరుడు నేను - అన్న మహాకవి గుఱ్ఱం జాషువా మాటకు మరో నిర్ధారణ ఇది. ప్రపంచంలోని తెలుగువారి ప్రతినిధులు భాగ్యనగరంలో సభలు తీరుతుండడం ఈ నిర్ధారణకు సరికొత్త చారిత్రక సాక్ష్యం. ఈ చరిత్ర రెండువేల ఏళ్లకు పైగా కొనసాగుతోంది. తెలుగువాడు విశ్వనరుడు, భరతమాత వజ్రాల బిడ్డడు. తెలుగు వెలుగులు ప్రసరించిన నేలపై ప్రభవించిన శాతవాహనులు యావత్ భారతదేశాన్ని ఐదువందల ఆరేళ్లు పాలించడం ఈ చరిత్రకు రెండువేల ఎనిమిది వందల ఏళ్లకు పూర్వం మరో శ్రీకారం! తెలుగువారు సముద్రాలు దాటి వెళ్లారు. భారతీజాతీయ సాంస్కృతిక పరిమళానికి పవనవీచికయ్యారు. సముద్రాలు దాటివచ్చిన వారికి తెలుగువారు ఆతిథ్యం ఇచ్చారు. తెలుగునేలపై వేల ఏండ్లుగా వికసించిన మానవీయ సంస్కారాలు భారతీయతను మరింత సమగ్రం చేశాయి, తెలుగునేలపై పరుగులు తీసిన భౌతిక ప్రగతి రథాలు భారత జాతీయ జీవన ప్రస్థానాన్ని పరిపుష్టం చేశాయి. ఆంధ్రదేశం అన్నపూర్ణ అయింది, త్రిలింగసీమ భౌతిక ధార్మిక ఆధ్యాత్మిక అభ్యుదయ స్రవంతుల సంగమ క్షేత్రమైంది. కావేరీ నదీతీరం వరకు మహానదీ తీరం వరకు అరుణాచలం నుంచి రామగిరి వరకు విస్తరించిన భూమిపై తెలుగు అక్షరాలు అక్షయభావామృత ఫలాలను పండించాయి.. పినాకిని తుంగభద్ర కృష్ణ గోదావరి మంజీరా ప్రాణహిత వంశధార నాగవళీ నదులు తెలుగు సీమను నిరంతరం మంగళాభిషిక్తను చేస్తుండడం శతాబ్దుల సహస్రాబ్దుల చరిత్ర! తెలుగునేల నలుచెరగులా వికేంద్రీకృతమై ఉండిన బట్టీలలో అతి మన్నికైన ఉక్కు ఉత్పత్తికావడం చరిత్ర.. ఈ ‘ఉక్కు’ ‘‘డమాస్కస్ స్టీల్’’గా ప్రపంచ దేశాలకు వితరణ కావడం చరిత్ర... సముద్రాలు దాటి వెళ్లిన తెలుగువాడు, భారతీయుడు, సంస్కార సామ్రాజ్యాలు స్థాపించడం ప్రపంచ చరిత్ర.. జాషువా చాటిన విశ్వనరత్వానికి ఇదీ భూమిక! తెలుగువారి ప్రపంచ కుటుంబానికి, తెలుగువారి ప్రపంచ విస్తృతికి ఈ చరిత్ర ప్రాతిపదిక... ‘‘ఉదార చరితానాంతు వసుధైవ కుటుంబకమ్..’’ - ఉదారమైన ప్రవృత్తి కలవారికి ప్రపంచమే కుటుంబం - అన్నది తరతరాల భారతీయ స్వభావం! ఈ ప్రపంచ హితతత్త్వం, ‘ప్రపంచ కుటుంబం’ మరోసారి ధ్రువపడడం తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న తెలుగు మహాసభలకు ఇతివృత్తం! తెలుగువారిది వసుంధరాహిత చిత్తం... తెలుగు భాషాసాహిత్య కళాజీవనకాంతినిహిత స్వభావం విశ్వహితం... నలబయికి పైగా దేశాల నుంచి విచ్చేసిన తెలుగువారు కాకతీయ మహాద్వార ప్రవేశం చేస్తున్న చారిత్రక దృశ్యం ఇది! శాతవాహన ప్రాంగణంలో కొలువుతీరుతున్న విశ్వకల్యాణ సమ్మేళనం ఇది!!
ఈ జగత్ హితభావం ‘‘నన్నయభట్టు తెలుంగునన్ మహాభారత సంహితా రచన బంధురుడయ్యె జగద్ధితంబుగన్..’’ అని చరిత్ర శుభంకరమైన చాటింపువేసిన నాటిది. అంతకు పూర్వం యుగాలనాటిది. మహాకవి పోతన సంస్కృత భాగవతాన్ని తెలుగులో వ్రాయడంలోని లక్ష్యం విశ్వకల్యాణం... ‘‘దీనిన్ తెనింగించి మజ్జననంబున్ సఫలంబు చేసెద!’’ అని చెప్పిన ఆ మహాకవి ‘‘సమ్మతితో హరికిచ్చి చెప్పె ఈ బొమ్మెర పోతరాజొకడు భాగవతంబు జగద్ధితంబుగన్..’’ అని తెలుగువాని విశ్వహిత చిత్తవృత్తిని విశదీకరించాడు! ఈ విశ్వహిత ప్రవృత్తి ‘‘వండ నలువదు వేవురు వచ్చిరేని, అతిథులేతేరనడికి రేయైనబెట్టు..’’ అని అల్లసాని పెద్దన తెలుగువారి అతిథ సత్కార జీవన సంప్రదాయాన్ని గురించి వివరించిన నాటిది! తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడు మళ్లీ తెలుగు వంటకాలతో తెలుగు ‘పలుకుల’ తేనెల మాధుర్యంలో విశ్వనరులకు విందు చేస్తోంది! తెలుగు భాషామతల్లి వీక్షిస్తోంది, వాత్సల్య సుధాధారలను వర్షిస్తోంది! ఈ తెలుగు మాతృదేవి మోచర్ల రామకృష్ణ కవి చెప్పినట్లు ‘‘శ్రుతి మధురాక్షంబయి’న సౌందర్యమూర్తి, సౌజన్యస్ఫూర్తి, సౌశీల్య దీప్తి! ‘ముగురమ్మల’కూ ప్రతీక.. వెలుగుల పతాక! అందుకే ‘‘వాణియె తీరవాటిక, భవానియె రాయలసీమ, శ్రీ తెలంగాణమె పూర్ణరాజ్య రమగా ముగురమ్మల రూపుగొంచు గీర్వాణ పథంబునన్’’ కదలుతున్న తెలుగుభాషా యోషను మహాకవి బోయి భీమన్న దర్శించాడు. ఈ కదలిక ఆద్యంతాలు లేని తెలుగు జనావళి జీవన ప్రస్థాన గీతిక..
ఇంతగొప్ప చరిత్ర కలిగిన తెలుగు విదేశీయ భాషా దాస్యపు పంజరంలో బందీ అయి ఉండడం ప్రస్థాన గతిలో వర్తమాన ఘట్టం, ప్రస్థాన ప్రగతిని ప్రతిఘటిస్తున్న అవరోధం! తెలుగులోను ఇతర భారతీయ భాషలలోను మహా సారస్వతం వికసించిననాటికి ఆంగ్లభాష పుట్టలేదు. కానీ గత రెండు శతాబ్దులుగా ఆంగ్లభాష భారతీయ భాషలను జీవన వ్యవహారం నుంచి తొలగించి వేస్తోంది! భారతీయ భాషలు ఆంగ్ల పదాలతో సంకరం కావడం రెండవ వైపరీత్యం! ఈ సాంకర్యం నుండి మాతృభాషలను విముక్తం చేయడానికి దేశంలోని వివిధ ప్రాంతాలలో ఉద్యమాలు జరుగుతున్నాయి. ఇలాంటి ‘స్వచ్ఛ్భాషా’ ఉద్యమాలు తెలుగు ప్రాంతాలలో ఆరంభం కాకపోవడం ‘తెలుగు మహాసభల’కు పూర్వరంగం. మహాసభల స్ఫూర్తితోనైనా ‘తెలుగుభాష’ స్వచ్ఛతను, తెలుగు పదజాలాన్ని, తెలుగు నుడికారాన్ని, తెలుగు అక్షరాలను, పరిరక్షించడానికి అందరూ ‘కలాల’ను బిగించాలి, ‘గళా’లను సంధించాలి! ‘తేట తేట తెనుగు’ ‘తేనెలొలుకు తెలుగు’ అన్నవి వేదికలకు పరిమితమయ్యే నినాదాలుగా మిగిలిపోరాదు, జీవన వ్యవహారంగా వ్యవస్థీకృతం కావాలి! ‘మమీ’ అని పలుకుతున్న నోళ్లనుంచి ‘అమ్మా’ అన్న పదం మళ్లీ వెలువడినప్పుడు మాత్రమే ‘తెలుగు అమ్మ’ హృదయం తేనెలొలుకగలదు.. పనె్నండవ తరగతి వరకూ అన్ని పాఠశాలలోను తెలుగు భాషను బోధించాలన్న తెలంగాణ ప్రభుత్వ నిర్ణయం ఇదుకు కొంత దోహదం చేయగలదు! కానీ పదునాలుగేళ్లు వచ్చేవరకు పిల్లలకు మాతృభాష మాధ్యమంగా బోధించాలన్న సహజమైన జీవననియమం నీరుగారిపోయింది. మూడేళ్ల వయసునుంచే తెలుగు పిల్లలు మాతృభాషకు దూరమయ్యేందుకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. ‘‘ఐ డోంట్ స్పీక్ తెలుగు..’’ - నేను తెలుగు మాట్లాడను - అని బడి పిల్లల చేత పదిహేను నుంచి యాబయిసార్ల వరకూ బలవంతపు వ్రాత - ఇంపోజిషన్ - లను వ్రాయించిన వ్రాయిస్తున్న ఘరానా వాణిజ్య పాఠశాలలు - కార్పొరేట్ స్కూల్స్ - తెలుగు నేల నలు చెరగులా వెలసి ఉన్నాయి. ఈ దుస్థితిని మార్చడానికి వీలైన స్ఫూర్తి ప్రపంచ తెలుగు మహాసభల ద్వారా ప్రస్ఫుటించాలి! ఒకటవ తరగతి నుంచి అంతకంటె కింది స్థాయినుంచి కనీసం ఎనిమిదవ తరగతి వరకూ ఉభయ తెలుగు రాష్ట్రాలలోని అన్ని పాఠశాలలోను విధిగా తెలుగు మాధ్యమంగా బోధన జరిగే వ్యవస్థను పునరుద్ధరించాలి! భావిభారత పౌరులు తెలుగునకు దూరం కారాదన్న ఆకాంక్ష కలవారు ఇందుకు పూనుకోవాలి! తెలంగాణ ప్రభుత్వం పూనుకోవాలి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పూనుకోవాలి!
ఈ తార్కికమైన జీవన వాస్తవం గురించి ఈ మహాసభలు విస్తృ చర్చావేదికలు కావాలి! ‘‘చందమామ రావె.. జాబిల్లి రావె..’’ అని శిశువులు వల్లించగలగాలి. ‘‘ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్’’ గురించి పదవ తరగతి ఉత్తీర్ణులయిన తరువాత తెలుసుకోవచ్చు, చదువుకొనవచ్చు! శిశువుల నాలుకలపై నిరంతరం నర్తించినప్పుడే ‘అమ్మభాష’ సజీవంగా ఉండగలదు, అజరామర శోభలతో తెలుగు తేజోరిల్లగలదు...