సంపాదకీయం

వాణిజ్య వైరుధ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అర్జెంటీనా రాజధాని బుయెనోస్ ఏరెస్‌లో జరిగిన ‘ప్రపంచ వాణిజ్య సంస్థ’ సభ్య దేశాల సమావేశం విఫలం కావడం విచిత్రం కాదు. ‘ప్రపంచీకరణ’ పేరుతో నడుస్తున్న వాణిజ్య ప్రహసనంలో నిహితమైన ఉన్న వైరుధ్యాలు ఇందుకు కారణం. అందువల్ల 2001 నాటి దోహా బృహత్ సమ్మేళనం తరువాత జరుగుతున్న ప్రపంచ వాణిజ్య సంస్థ సమావేశాలలో ‘ఏకాభిప్రాయం’ ఊరిస్తూనే ఉంది. ‘జనరల్ అగ్రిమెంట్ ఫర్ ట్రేడ్ అండ్ టారిఫ్స్’ - వాణిజ్యం, సుంకాల సాధారణ అంగీకారం - గ్యాట్ - అన్న ‘తొండ’ ముదిరి ‘ప్రపంచీకరణ’ అన్న ‘ఊసరవెల్లి’గా మారడం ‘ప్రపంచ వాణిజ్య సంస్థ’ - వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ - డబ్ల్యుటిఓ - అవతరణకు నేపథ్యం. ‘గ్యాట్’ వ్యవస్థ 1993లో ‘ప్రపంచీకరణ’ను స్థిరపరచిన తరువాత రద్దయిపోయి ‘డబ్ల్యుటిఓ’గా రూపాంతరం చెందింది. ‘ప్రపంచీకరణ’ను అందువల్ల ఇరవై ఆరు ఏళ్లుగా ‘ప్రపంచ వాణిజ్య సంస్థ’ పర్యవేక్షిస్తోంది. ‘ప్రపంచీకరణ’ వల్ల ప్రపంచ దేశాల సరిహద్దులన్నీ చెరగిపోయి అన్ని దేశాలు కలసి ‘పుడమి పల్లె’గా ఏర్పడుతాయన్నది 1990వ దశకంలో జరిగిన ప్రచారం! కానీ ప్రపంచాన్ని ‘వాణిజ్య సత్రం’గా మార్చిన సంపన్న దేశాలు ప్రవర్ధమాన దేశాలపై పెత్తనం చెలాయించడానికి ‘ప్రపంచీకరణ’ దోహదం చేస్తోందన్నది ఆవిష్కృతవౌతున్న దృశ్యం. ఆర్భాటాల అట్టహాసాల పోరు మధ్య దాదాపు పదేళ్లపాటు ప్రవర్ధమాన దేశాలు గందరగోళానికి గురి అయ్యాయి. కానీ క్రమంగా ఈ అమాయకత్వం తొలగిపోతోంది. సంపన్న దేశాల పెత్తనాన్ని ప్రతిఘటించడానికి ప్రవర్ధమాన దేశాలు పూనుకుంటున్నాయి. ఈ ‘ప్రతిఘటన’ ఉద్యమంలో మనదేశం ఇప్పుడు అగ్రగామిగా ఉంది. గత కొన్ని ఏళ్లుగా ‘ప్రపంచ వాణిజ్య సంస్థ’ నిర్వహిస్తున్న ఈ ‘దోహా రౌండ్’ సమావేశాలు ఏకాభిప్రాయానికి నోచుకోకపోవడానికి కారణం సంపన్న దేశాల వాణిజ్య సామ్రాజ్యవాద అక్రమ విస్తరణను మనదేశం వంటి ప్రవర్ధమాన దేశాలు ప్రతిఘటించడం! వర్ధమాన దేశాల్లో వ్యవసాయ రంగానికి కల్పిస్తున్న ‘రాయితీ’లు రద్దు కావాలని, లేదా తగ్గిపోవాలని సంపన్న దేశాలు కోరుతున్నాయి. మన ప్రభుత్వం అమలు చేస్తున్న ‘ఆహార భద్రత’ పథకం ‘ప్రపంచ వాణిజ్య సంస్థ’ నియమావళికి ‘ప్రపంచీకరణ’ స్ఫూర్తికి, ‘స్వేచ్చా విపణి’ - మార్కెట్ ఎకానమీ - స్వభావానికి విరుద్ధమన్నది సంపన్న దేశాల వాదం. వ్యవసాయ ఉత్పత్తులకు ప్రభుత్వం కనీసపు మద్దతు ధరను ప్రకటించడం, ఆహార ఉత్పత్తులను రైతులనుంచి నేరుగా కొనుగోలు చేయడం వంటి చర్యలను కూడా సంపన్న దేశాలు వ్యతిరేకిస్తున్నాయి. ‘సబ్సిడీ’లను ‘ఆహార భద్రత’ను ‘వ్యవసాయ ఉత్పత్తుల సేకరణ’ను ‘కనీసపు మద్దతు’ ధరలను రద్దు చేయడానికి మన ప్రభుత్వం ససేమిరా అంగీకరించకపోవడం సంపన్న దేశాలకు దురాగ్రహం కలిగిస్తున్న వ్యవహారం. ‘బుయెనోస్ ఏరెస్’లో జరిగిన చర్చలు భగ్నం కావడానికి ఇదీ ప్రధాన కారణం.
సబ్సిడీలను ఎత్తివేయడానికి కాని వ్యవసాయ సంక్షేమ పథకాలను రద్దు చేయడానికి కానీ ఆహార భద్రతను నీరుకార్చడానికి కానీ అంగీకరించే ప్రసక్తి లేదని ‘అర్జెంటీనా’ సమావేశాలు ఆరంభంకాక పూర్వమే మన వాణిజ్య మంత్రి సురేశ్ ప్రభు స్పష్టం చేశాడు, ఈయన ప్రభుత్వ మానవీయ విధానం సంపన్న దేశాల ‘బహుళ జాతీయ సంస్థల’ అక్రమ ప్రయోజనాలకు హానికరమన్నది జగమెరిగిన వాస్తవం. వాణిజ్య అనుసంధానం పేరుతో ప్రవర్ధమాన దేశాల ఆర్థిక సార్వభౌమత్వ పరిధిలోనికి సంపన్న దేశాలు చొరబడిపోతున్నాయి. ఆహారభద్రత వంటి పథకాలు మన రాజ్యాంగం వ్యవస్థ ఆకాంక్షిస్తున్న సర్వజన సంక్షేమ సాధనలో భాగం! అందుకోసం రాయితీలు, ప్రోత్సాహకాలు కొనసాగడం తప్పనిసరి! కానీ సంపన్న దేశాలు వీటిని ఎందుకని వ్యతిరేకిస్తున్నట్టు?? వర్ధమాన దేశాలలోని సామాన్య రైతులకు రాయితీలను ఇవ్వరాదని కోరుతున్న సంపన్న దేశాల ప్రభుత్వాలు తమ దేశాలలో మాత్రం ‘ఉత్పత్తి రంగాల’కు భారీగా ‘సబ్సిడీ’లను కల్పిస్తున్నాయి! ప్రపంచ వాణిజ్య సంస్థ నియమావళిలోని ‘పరిభాషకు వివిధ దేశాల వారు విభిన్న విరుద్ధ వ్యాఖ్యానాలను చేయడానికి వీలుండడం ఈ వైపరీత్యానికి కారణం.
సంకుచిత జాతీయ - ప్రొటక్టివ్ - వాణిజ్య ఆర్థిక విధానాలను ఏ దేశం కూడా అనుసరించరాదన్నది ‘ప్రపంచీకరణ’ నియమావళి నిర్దేశిస్తున్న మార్గదర్శక సూత్రం. కానీ ఆచరణలో ఈ సూత్రం వివిధ దేశాలలో వివిధ రంగాలుగా అమలు జరుగుతున్నది. సంపన్న దేశాలు తమ రాజకీయ ఆధిపత్య బలంతో తమ అక్రమ అధిక ప్రయోజనాలను నెరవేర్చుకుంటున్నాయి! మనదేశం నుంచి మామిడి పండ్ల దిగుమతిని 2008 వరకూ అమెరికా ప్రభుత్వం అనేక ఏళ్లపాటు నిషేధించింది! ఆ తరువాత మనకు అవసరం లేని ‘మోటార్ సైకిళ్ల’ను మామిడి పండ్లకు ప్రతిఫలంగా దిగుమతి చేసుకునే నిబంధనపై ఈ నిషేధం ఎత్తివేసింది! మన మామిడి పండ్లు క్రిమిసంహారక రసాయన విష ప్రభావానికి గురి అవుతున్నాయన్నది అమెరికా ప్రభుత్వం చేసిన ఆరోపణ! ఐరోపా సమాఖ్య కూడా మన కూరగాయల దిగుమతులను అనేక ఏళ్లపాటు నిషేధించింది. ఇవన్నీ సంకుచిత జాతీయ ప్రయోజన పరిరక్షక విధానాలు, ప్రపంచ వాణిజ్య సంస్థ నిబంధనలకు విరుద్ధాలు... కానీ సంపన్న దేశాలు యథేచ్ఛగా ‘ప్రపంచ వాణిజ్య సంస్థ’ నియమావళిని ధిక్కరిస్తున్నాయి - కానీ మన ప్రభుత్వం మాత్రం మన దేశంలోనే వెల్లువెత్తుతున్న చైనీయ వస్తువులను నిషేధించలేకపోతోంది, కనీసం నియంత్రించలేకపోతోంది! ప్రపంచ వాణిజ్య సంస్థ నియమావళి అడ్డువస్తోంది.
ప్రవర్ధమాన దేశాల వ్యవసాయ ఉత్పత్తుల ధరలు ‘అంతర్జాతీయ విపణి’ వీధులలో సంపన్న దేశాల వ్యవసాయ ఉత్పత్తుల ధరల కంటె అధికంగా ఉండాలన్నది అసలు రహస్యం. ప్రభుత్వాలు రాయితీలు కన్పించినట్టయితే ప్రవర్ధమాన దేశాలలోను, పేద దేశాలలోను, వ్యవసాయంపై రైతులు భరించవలసిన వ్యయం బాగా తగ్గిపోతుంది. ఫలితంగా ఉత్పత్తుల ధరలు తక్కువగా ఉంటాయి. దీనివల్ల ‘అంతర్జాతీయ విపణి వీధుల’లో మన దేశం వంటి ప్రవర్ధమాన దేశాల వ్యవసాయ ఉత్పత్తుల ధరలు ‘సంపన్న’ దేశాల ఉత్పత్తుల ధరలకంటె తక్కువగా ఉంటాయి. ఫలితంగా మన వ్యవసాయ ఉత్పత్తులు, వ్యవసాయ ఆధార పారిశ్రామిక ఉత్పత్తులు ఎక్కువగా అమ్ముడుపోతాయి! ఇలా ప్రవర్ధమాన, నిరుపేద దేశాల వ్యవసాయదారులు, ప్రజలు ప్రయోజనం పొందకుండా నిరోధించడం సంపన్న దేశాలలోని ‘బహుళ జాతీయ వాణిజ్య సంస్థల’ లక్ష్యం!! ప్రపంచీకరణ మారీచమృగం మాయాజాలంలో ఇది ఒక ‘్భంగిమ’ మాత్రమే! మన దేశానికీ, అమెరికాకు మధ్య తీవ్రమైన విధాన వైరుధ్యాలు ‘బుయెనోస్ ఏరెస్’ సమావేశంలో ఏర్పడడానికి ఒక వౌలిక కారణం ఇది. ఇలాంటి విధాన వైరుధ్యాలు క్రమంగా పెరుగుతుండడానికి కారణం ‘ప్రపంచీకరణ’ పేరుతో సంపన్న దేశాలు నడిపిస్తున్న ‘వాణిజ్య సామ్రాజ్యవాద షడ్యంత్రం’ గురించి ప్రవర్ధమాన దేశాలలో అవగాహన పెరుగుతుండడం. ఐక్యరాజ్య సమితిలో నూట తొంబయి ఒక్క దేశాలకు సభ్యత్వం ఉంది. కానీ నూట అరవై నాలుగు దేశాలు మాత్రమే ‘ప్రపంచ వాణిజ్య సంస్థ’లోను, ‘ప్రపంచీకరణ’ వ్యవస్థలోనూ భాగస్వామ్యం పొందాయి. ఏమయినప్పటికీ ‘బుయెనోస్ చర్చలు’ భగ్నం కావడం ‘మానవీయత’కు లభించిన విజయం, మన ప్రభుత్వానికి లభించిన వ్యూహాత్మక విజయం.