మెయన్ ఫీచర్

తల్లిదండ్రులూ! ప్రభుత్వ విద్యకై పోరాడండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రైవేటు పలల ఫీజుల నియంత్రణకై ఒత్తిడి తేవడం కన్నా, ప్రభుత్వ పాఠశాలల్ని సక్రమంగా నడపాలని కోరవచ్చు. ఉద్యమాన్ని లేవదీయవచ్చు. ఇదే జరిగితే, ఇరు రాష్ట్రాల్లో అమోఘమైన పౌర స్పందన లభిస్తుంది. మనకోసమే అలోచిస్తే, మనం మాత్రమే బాగుపడవచ్చు. సమాజం కోసం ఆలోచిస్తే సామాజిక న్యాయం జరిగి ఓ ఆరోగ్యకరమైన సమాజం ఆవిష్కరింపబడి, అందరికి రాజ్యాంగ నిర్దేశిత ప్రకారం ఒకే తీరుగల నాణ్యతతో కూడిన విద్య అందుతుంది. ఈ విషయంగా కొఠారీ సూచనలు అమలులోకి తెచ్చినవారు అవుతారు.
మాచారహక్కు చట్టం కింద రెండో తరగతి చదివే తన కుమారుడికి చెల్లించిన రూ.45వేలను ఏయే పద్దుకింద ఖర్చు చేశారో తెలపాలంటూ గత ఏడాది నగరంలోని ఓ పేరుమోసిన పాఠశాల విషయంలో ఓ తండ్రి రాష్ట్ర సమాచార కమిషన్‌ను కోరినందుకు, ఆ పిల్లవానికి రస్టికేట్ (చదవడానికి అనర్హుడు) సర్టిఫికెట్ ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టిన నిరంతర సమగ్ర మూల్యాంకనానికి అనుగుణంగా ప్రభుత్వాలు ముద్రించిన పుస్తకాలనే వాడాలని కోరినందుకు, హైదరాబాద్‌లో వివిధ ప్రైవేటు పాఠశాలలకు చెందిన 500 మంది తల్లిదండ్రులు, అప్పటికే ఆయా పాఠశాలలు అమ్మిన ప్రైవేటు పుస్తకాల్ని కొన్నామని, తమకు తిరిగి కొనడం భారం కాబట్టి, వాటినుంచి మినహాయింపు ఇవ్వాలని రాష్ట్ర హైకోర్టును గత సంవత్సరం ఆశ్రయించాల్సి వచ్చింది. దేశంలోని ముఖ్యమైన మెట్రో నగరాలలో, దేశ రాజధాని పేరుతో వున్న ఓ ‘పబ్లిక్’ పాఠశాలకు హైదరాబాద్‌లో నాలుగు బ్రాంచీలున్నాయి. చిల్లర పద్దుల కింద వసూలు చేసే ఖర్చులు కాక, సంవత్సరానికి గాను ట్యూషన్ ఫీజు కింద కోల్‌కత్తాలో రూ.26 వేలను, చెన్నైలో రూ.43 వేలను, బెంగళూరులో రూ.63 వేలను, నేరుగా ఢిల్లీలో రూ.92 వేలను వసూలు చేస్తుంటే హైదరాబాద్‌లో రూ.1.50 లక్షలు వసూలు చేస్తున్నది. ఇదే రాజధానిలో కొండాపూర్ ప్రాంతంలోని ఓ పబ్లిక్ పాఠశాల 2008లో ప్రాథమిక స్థాయి లో తీసుకున్న ఫీజు రూ.47,100 కాగా, 2015 నాటికి సెకండరీ స్థాయికి చేరిన విద్యార్థి చెల్లించిన ఫీజు రూ.2,03,510లు మాత్రమే. అంటే సంవత్సరానికి 54 శాతం పెరుగుదల చొప్పు న గత ఏడేళ్లలో పెరిగిన ఫీజు శాతం కేవలం 432 శాతమే! ఈ లెక్కన పాఠశాలకు విద్యకై చెల్లించిన మొత్తం ఫీజు రూ.8.44 లక్షలు. కానె్సప్టు, టెక్నో, ఈ-టెక్నో, ఒలింపియాడ్ లాంటి తోకల్ని చూసి బంపిన (మురిసిన) తల్లిదండ్రులు సంపాదించిన సొమ్మును ధారపోస్తూనే ఉన్నారు.
గత 25 ఏళ్ల కాలంలో ఈ ప్రైవేటు విద్యారంగం బాగా ముదిరి ఊసరవెల్లిగా మారింది. మరీ ముఖ్యంగా హైదరాబాద్‌లో మూడు అడ్మిషన్లు ఆరు లక్షల ఆదాయంతో విరాజిల్లుతున్నాయి. దీంతోపాటు, విశాఖ, విజయవాడ, నెల్లూరు, గంటూరు, కడప, కర్నూలు, వరంగల్, కరీంనగర్‌లలో దేశంలో ఏ పట్టణాల్లో లేనంతగా వసూళ్లు జరుగుతున్నాయి. అంటే మిగతా మెట్రో నగరాలకన్నా, రాష్ట్రాలకన్నా రెండు తెలుగు రాష్ట్రాలు ఆర్థికంగా బాగా బలిసిపోయాయన్నమాట. ఈ విధంగా ఇరు తెలుగు రాష్ట్రాల్లోని ముఖ్యపట్టణాల్లో దాదాపు లక్ష దాకా వసూలు చేస్తుంటే, హైదరాబాద్‌లోని కొన్ని పాఠశాలలు సంవత్సరానికి వసూలు చేస్తున్నది గరిష్టంగా రూ.3.50 లక్షలు. దేశవ్యాపితంగా పెరిగిన ఖర్చులకు, పెంచిన జీతాలను దృష్టిలో వుంచుకొని రమారమి 10 శాతాన్ని పెంచితే, హైదరాబాద్‌లో ఈ పెరుగుదల 50 శాతానికి పైగానే వుంటున్నది. పోనీ ఈ పెరుగుదలకు అనుకూలంగా వౌలిక సదుపాయాలు, బోధనా సదుపాయాలు వుంటాయా అంటే, పిల్లలు ఎవరి నీటిని వారే తీసుకు బోవడం తెలిసిందే. ఉపాధ్యాయులకు ఇచ్చే జీతాలు అత్యధికంగా రూ.5వేలనుంచి రూ.15వేలు దాటవు. ఒకరిద్దరికి ఇస్తే కొంత ఎక్కువగా ఇవ్వవచ్చు. ఈ దోపిడిపై స్పందించాలని ప్రభుత్వం పట్టించుకోవాలని గత దశాబ్దకాలంగా హైదారాబాద్‌లోని కొన్ని ప్రైవేటు పాఠశాలల తల్లిదండ్రులు ఒక సంఘం (హెచ్‌ఎస్‌పిఎ)గా ఏర్పడి మొరపెట్టుకోగా కన్నీటి తుడుపుగా, ఫీజుల నియంత్రణకై రెండు జీవోలను విడుదల చేసింది. అతికష్టంగా ఓ పెనె్నండు స్కూళ్లకు నోటీసులు జారీ చేసింది.
ఈ జీవోలకు ముందు 1-1-1994 జీవో నెం.(1)ని విడుదల చేసింది. నాటి తెలుగుదేశం హయాంలో విడుదలైన ఈ జీవో ప్రైవేటు విద్యారంగ నియంత్రణకి ఓ మాగ్నాకార్టా లాంటిదే. దీని ప్రకారం వసూలు చేసిన ట్యూషన్ పీజు నుంచి 50 శాతాన్ని విధిగా ఉపాధ్యాయుల జీతాలకై చెల్లించి, మరో 15 శాతాన్ని వారి భవిష్యత్ నిధికై, గ్రాటిట్యూ, బీమా లాంటి సౌకర్యాలకై వినియోగించాలి. అంటే, వసూలు చేసిన మొత్తంలో 65 శాతాన్ని ఉపాధ్యాయులకోసం ఖర్చు చేయాలి. మిగతా దాంట్లో 15 శాతాన్ని నిర్వహణ ఖర్చులకై, మరో 15 శాతాన్ని వౌలిక వసతుల కల్పనకై పోగా మిగిలిన 5 శాతానే్న యాజమాన్యం ఆదాయంగా తీసుకోవాలి. ఈ జీవో విడుదలై రెండు దశాబ్దాలు దాటినా ఇరు రాష్ట్రాల్లో 30 వేలకు పైగా ఉన్న ఏ ఒక్క ప్రైవేటు పాఠశాలు దీన్ని ఆచరించిన పాపాన పోలేదు.
తర్వాత కాంగ్రెస్ హయాంలో వెలువడిన జీవో నెం. 91, 42లు ఫీజుల నియంత్రణకై నిర్దేశించినా, ఒక్క అడుగు ముందుకు పోలేకపోగా, ఒకటి సుప్రీంకోర్టులో, మరొకటి హైకోర్టులో పెండింగ్‌లో ఉండటం గమనార్హం. 2008, ఆగస్టు 6న వెలువరించిన 91వ జీవో ప్రకారం జిల్లా స్థాయిలో కలెక్టర్ ఛైర్మన్‌గా జిల్లా ఫీజుల నియంత్రణ కమిటీలను (డిఎఫ్‌ఆర్‌సి) ఏర్పాటు చేసి పెరుగుతున్న ఖర్చులకు అనుగుణంగా మూడు సంవత్సరాలకు ఒకసారి 10 శాతానికి మించకుండా పెంచాలి. ఇది వెలువడి దశాబ్దకాలం కావస్తున్నా దీన్ని పట్టించుకున్న జిల్లా కాని, మండలం కాని లేదు. అలాగే విద్యాహక్కు చట్టం 2009కి లోబడి 2010, జులై 30న వెలువడ్డ జీవో 42 ప్రకారం గ్రామీణ ప్రాంత ప్రాథమిక పాఠశాలల్లో రూ.7,800లను, ఉచ్ఛతర ప్రాథమిక పాఠశాలల్లో రూ.9,000లను, సెకండరీ పాఠశాలల్లో రూ.10,800 మాత్రమే వసూలు చేస్తూ, పట్టణ ప్రాంతాల్లో రూ.12,000కు మించకుండా చూడాలి. ఎలాంటి డొనేషన్లు, ఇతర ఖర్చులను వసూలు చేయకూడదు. ఇలా చేస్తే, జరిమానాతో పాటు, జైలుశిక్ష అనే నిబంధన కూడా ఉంది. కాని కంటితుడుపు చర్యగా ఓ నాలుగు పాఠశాలలకు జరిమానా విధించి, చేతులు ముడుచుకున్నారు.
91 జీవోపై 37 పాఠశాలల ప్రైవేటు యాజమాన్యాలు హైకోర్టుకు పోగా, 2010, ఆగస్టు 27ననే వీరికి వ్యతిరేకంగా తీర్పు రాగా, తిరిగి యాజమాన్యాలు సుప్రీంకోర్టును ఆశ్రయించగా, ప్రభుత్వం తగువిధంగా స్పందించకపోవడంతో అక్కడ పెండింగ్‌లో ఉంది. అలాగే 42జీవోపై హైకోర్టు స్టే విధించినా, ప్రభుత్వంలో చలనం లేదు. ఈ పరిస్థితిలోనే తల్లిదండ్రుల సంఘం 91వ జీవోపై సుప్రీంకోర్టును ఆశ్రయించినా ఫలితం లేకుండా పోయింది. ప్రభుత్వంపై ఒత్తిడి పెంచడానికై మార్చి 29న శిల్ప కళావేదిక దగ్గర మానవహారాన్ని ప్రదర్శించింది. జీవో 91ని ఆదర్శంగా తీసుకున్న తమిళనాడు ప్రభుత్వం ఏకంగా అసెంబ్లీలో ఓ చట్టాన్ని చేసి, కొంతమేరకు ఫీజుల్ని నియంత్రించడం గమనార్హం.
ఈ లెక్కన ప్రైవేటు పాఠశాలల ఫీజుల నియంత్రణకై ఒత్తిడి తేవడం కన్నా, ప్రభుత్వ పాఠశాలల్ని సక్రమంగా నడపాలని కోరవచ్చు. ఉద్యమాన్ని లేవదీయవచ్చు. ఇదే జరిగితే, ఇరు రాష్ట్రాల్లో అమోఘమైన పౌర స్పందన లభిస్తుంది. మనకోసమే అలోచిస్తే, మనం మాత్రమే బాగుపడవచ్చు. సమాజం కోసం ఆలోచిస్తే సామాజిక న్యాయం జరిగి ఓ ఆరోగ్యకరమైన సమాజం ఆవిష్కరింపబడి, అందరికి రాజ్యాంగ నిర్దేశిత ప్రకారం ఒకే తీరుగల నాణ్యతతో కూడిన విద్య అందుతుంది. ఈ విషయంగా కొఠారీ సూచనలు అమలులోకి తెచ్చినవారు అవుతారు.
కాని తల్లిదండ్రుల్లోని బలహీనతను గుర్తించిన ప్రభుత్వాలు, పరోక్షంగా ప్రైవేటు విద్యారంగానికి ప్రోత్సాహాన్నిస్తూ, ప్రభుత్వ రంగ విద్యను ఓట్లకోసం మాత్రమే నడిపించడంతో ఈ పాఠశాలల్లో పిల్లల్ని చదివించడమంటే, దరిద్రులతో చదివించడమనే భావన ఉన్నత వర్గాల్లోనే కాదు, మధ్య, కింది తరగతి వర్గాల్లో బాగా నాటేటట్లు చేయడంలో ప్రభుత్వం విజయం సాధించింది. అందుకే ఇదో ఎదురులేని, ఆడిట్‌కు దొరకని వ్యాపారరంగంగా మారిపోయంది. ఇలా విద్యావ్యాపారం చేసుకునేవారే విద్యావేత్తలుగా మారడం బహుశా ఏ రాష్ట్రంలో లేకపోవచ్చు. వీరికి రాజ్యాంగం, ఆదేశిక సూత్రాలు, ప్రాథమిక హక్కులు, వీటి అనుబంధంగా ఉన్న విద్యాహక్కు చట్టం, విద్యాపాఠ్య ప్రణాళికా చట్రాలు, పెడగాజీ సూత్రాలు పట్టవు. వీరికి పట్టేదల్లా పట్టిందల్లా బంగారం కావడం, పాలకులతో జట్టు కట్టడం, లేదా నేరుగా పాలకులుగా అవతారమెత్తడం.
ఇలాంటి లోపాయికారి, లోపభూయిష్ట విధానం కొఠారి ప్రయోజనాల్ని నెరవేరుస్తున్నది కాని, అశేష సామాజిక అవసరాల్ని, వారి ప్రయోజనాల్ని తీర్చలేకపోతున్నది. దీంతో సమాజం రెండుగా చీలిపోవడ, స్వార్థ చింతన పెరగడం, అభివృద్ధి కుంటుపడడం, అభివృద్ధి ఫలాలు కొందరికే దక్కడం జరుగుతున్నది. దీన్ని ఎదుర్కోవడం అంత సులభం కాకపోవచ్చు కాని, హైదరాబాద్ పాఠశాలల తల్లిదండ్రులు ఈ దిశగా ఆలోచిస్తే, మొత్తం విద్యారంగమే బాగుపడుతుంది. నిజానికి ప్రైవేటులో చెల్లిస్తున్న ఫీజులకంటే ప్రభుత్వ రంగంలోనే తలసరి ఖర్చు ఎక్కువని గుర్తిస్తే, మంచి విద్యను, సౌకర్యాల్ని ప్రభుత్వ రంగలోనే పొందవచ్చు.

- డా. జి.లచ్చయ్య సెల్: 9440116162