సంపాదకీయం

‘ఎడారి’ రోదనం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సౌదీ అరేబియాలోను, ఆ దేశానికి పొరుగున ఉన్న అరబ్బీ దేశాలలోను ప్రవాస భారతీయులు అమానుష వివక్షకు పాశవిక చిత్రహింసలకు గురి అవుతుండడం గురించి మనదేశంలో పెద్దగా ప్రచారం కావడం లేదు. ఉపాధి కోసం సౌదీ అరేబియా, కువాయిత్, ఖతార్, సమైక్య అరబ్ సంస్థానాలు - యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ - యూఏఈ-వంటి దేశాలకు వెళ్లిన భారతీయులకు ప్రభుత్వేతర వాణిజ్య సంస్థలు వేతనాలు చెల్లించకపోవడం సర్వసాధారణమైపోయింది. వేతనాలు దొరకని భారతీయ శ్రామికులు స్వదేశానికి తిరిగిరాలేక అక్కడ ఉండలేక ఆకలితో అలమటిస్తున్నారు. తరచూ ఏదో ఒక వాణిజ్య సంస్థ ఇలా నెలల తరబడి జీతాలు చెల్లించకపోవడంతో భారతీయ ప్రవాసీ ప్రజలు నిరంతరం ఆర్థిక మానసిక అభద్రతకు గురి అవుతున్నారు! పనిచేయించుకొని వేతనాలను ఎగవేస్తున్న ‘వాణిజ్య సంస్థల’కు వ్యతిరేకంగా న్యాయస్థానాలలో ఫిర్యాదు చేయడం గురించి, చేయవలసిన పద్ధతి గురించి తెలియని భారతీయ ఉద్యోగులు కార్మికులు వౌనంగా రోదిస్తున్నారు! కొంతమంది మాత్రమే న్యాయస్థానాలలో ఫిర్యాదు చేయగలుగుతున్నారు. ఇలా ఫిర్యాదు చేసిన ప్రవాస భారతీయులకు ఎక్కువ సందర్భాలలో న్యాయం జరగడం లేదు. వేతనాలను చెల్లించవలసిందిగా కొన్ని సంస్థలను న్యాయస్థానాలు ఆదేశించినప్పటికీ ఆయా సంస్థలవారు లెక్కచేయకపోవడం, న్యాయస్థానాలకెక్కిన ఉద్యోగులను, కార్మికులను ఉద్యోగాల నుంచి తొలగించడం వంటి సంఘటనలు సంభవిస్తూనే ఉండడం ఏళ్ల తరబడి కొనసాగుతున్న దారుణం! ఇటీవల సౌదీ అరేబియాకు చెందిన ఒక సంస్థను భారతీయ ఉద్యోగులకు జీతాలు చెల్లించవలసిందిగా ఒక స్థానిక న్యాయస్థానం ఆదేశించిందట. కానీ ఆ సంస్థవారు జీతాలు చెల్లించకపోవడంతో దాదాపు రెండు వందలమంది ఉద్యోగులు వీధులలో పడి బికారులవలె సంచరిస్తున్నారట! కువాయిత్‌లో కూడ అనేక సంస్థలు వందలాది భారతీయులకు వేతనాలను ఎగవేస్తున్నాయి. మన విదేశ వ్యవహారాల సహాయ మంత్రి విజయకుమార్ సింగ్ ఇటీవల కువాయిత్‌ను సందర్శించినప్పుడు ఈ వైపరీత్యం బయటపడింది. మన మంత్రి విజ్ఞప్తి మేరకు కువాయిత్ ప్రభుత్వం ఈ వేతన సమస్యను పరిష్కరించనున్నట్లు ‘హామీ’ ఇచ్చిందట. ఈ హామీ ఎప్పుడు కార్యరూపం ధరించగలదన్నది స్పష్టం కాలేదు. అనేక నెలల తరబడి జీతాలు దొరకని భారతీయులు ‘కార్మిక శిబిరాల’లో తలదాచుకున్నారట! ఈ శిబిరాలలో కొన్ని ‘సంస్థలు’ అన్నపానీయాలను సమకూర్చుతున్నప్పటికీ ఈ కార్మికుల సమస్యకు శాశ్వత పరిష్కారం మాత్రం లభించలేదు. ఈ కార్మిక శిబిరాల - లేబర్‌కాంప్స్-తో వ్యాధిగ్రస్తులవుతున్నవారికి వైద్య చికిత్సలు అందుబాటులో లేవు. కువాయిత్‌లో పనిచేస్తున్న భారతీయ వైద్యులు కొందరు ఈ అభాగ్యులకు ఉచితంగా చికిత్స చేస్తుండడం కొంత ఊరట కలిగిస్తోందట...
కువాయిత్, ‘యూఏఈ’ వంటి ‘పారశీక సింధుశాఖ’ - పర్షియన్ గల్ఫ్ - దేశాలలో భారతీయుల కడగండ్లు ఈ ‘వేతనాల’ సమస్య ఒక ప్రతీక మాత్రమే! ప్రభుత్వాలు, ప్రభుత్వేతరులు రకరకాలుగా భారతీయ కార్మికులను అమానవీయ బీభత్సకాండకు బలి చేస్తున్నారు. సౌదీ అరేబియాలో ‘గృహ సహాయిక’గా పనిచేస్తుండిన ఒక భారతీయ మహిళను ఆ ఇంటి యజమానురాలు రెండవ అంతస్థునుంచి కిందికి తోసేసింది, మరో యజమానురాలు భారతీయ గృహ సహాయిక వీపుపై ‘పెనుము’ కాల్చి పైశాచిక ‘ముద్ర’లను వేసింది. నిస్సహాయులైన ఈ భారతదేశపు పనికత్తెలను, ఇతర గృహ కార్మికులను నిర్దయగా రోజుల తరబడి గదులలో కుక్కి నిర్బంధించిన ఘటనలు తిండిపెట్టకుండా రోజుల తరబడి మాడ్చిన ఘటనలు ఈ ‘ఇస్లాం మతరాజ్యాల’లో కోకొల్లలు! సర్వమత సమభావ ప్రజాస్వామ్య దేశాలలో ప్రతి ‘దారుణం’ తక్షణం ప్రచారవౌతుంది. మత రాజ్యాంగ వ్యవస్థలున్న దేశాలలోను, ఇతర నియంతృత్వ దేశాలలోను జరిగిపోతున్న ఘోరాలు తొందరగా బయటపడవు. ఆయా దేశాలలోని స్థానికులు అన్యాయాలకు గురి అయినప్పుడు కూడ అవాస్తవాలు బయట దేశాలకు చాలా ఆలస్యంగా పొక్కుతున్నాయి. విదేశీయుల విషాద గాథలకు ప్రచారం మరింత తక్కువ. కడప జిల్లాకు చెందిన పి.సుబ్బలక్ష్మి అనే మహిళను సౌదీ అరేబియా రాజధాని రియాద్ నగరంలోనే ‘మూడు నెలల పాటు’ గృహ నిర్బంధంలో ఉంచారట! ఆమెచేత ‘శౌచ గవాక్షం’ - టాయ్‌లెట్ - లోని నీరు బలవంతంగా తాగించారట! మూడు నెలలు అలా ‘చీకటి గది’లో అలమటించిన ఈ భారతీయ మహిళ జూన్ పదకొండవ తేదీన మళ్లీ వెలుగు ముఖం చూడగలిగింది. ఆమె స్వదేశానికి తిరిగి రాగలగడం దైవఘటన.. కానీ తిరిగి రాలేక ‘ఎడారి’ చీకటి గుడారాలలో పడి ఉన్నవారు ఎందరో..?!
ప్రభుత్వేతర సంస్థలు, స్థానిక ప్రజలు మాత్రమే కాదు ఈ ‘గల్ఫ్’ దేశాల ప్రభుత్వాలు సైతం భారతీయ కార్మికులను విచిత్ర హింసలకు గురిచేస్తుండడం నడుస్తున్న పైశాచిక క్రీడ. యజమానులు దాఖలు చేస్తున్న అబద్ధపు ఆరోపణలు ప్రాతిపదికగా ఈ గల్ఫ్ దేశాలలో పోలీసులు భారతీయ ప్రవాసులను నిరవధికంగా నిర్బంధంపాలు చేస్తుండడం ‘ప్రభుత్వ బీభత్స కాండ’కు నిదర్శనం. జగిత్యాలకు చెందిన డి మధుసూదన్ అనే యువకుడు ‘రియాద్’లో కారు డ్రైవరుగా పనిచేశాడు. పట్ట్భద్రుడైన మధుసూదన్‌కు యజమాని వేతనం సరిగా చెల్లించలేదు. వివిధ రకాలుగా హింసించాడు! ఈ హింసాకాండను సహించలేని ‘వాహన చోదకుడు’ రాజీనామా చేశాడు, కానీ యజమాని అంగీకరించలేదు. మధుసూదన్‌కు చెందిన ‘పాస్‌పోర్ట్’ను ఇతర అధికార పత్రాలను తిరిగి ఇవ్వడానికి నిరాకరించాడు. విధిలేక పారిపోయిన మధుసూదన్ రియాద్‌లో మన దౌత్య కార్యాలయానికి చేరుకున్నాడు. దౌత్య కార్యాలయం సహాయంతో విమానమెక్కి స్వదేశానికి రానున్న మధుసూదన్ విమానాశ్రయంలో ‘రియాద్’ పోలీసులు నిర్బంధించి తీసుకువెళ్లారు. మధుసూదన్ తన కారును దొంగిలించినట్టు ఆ యజమాని ఫిర్యాదు చేశాడట. తెలంగాణ ప్రాంతానికి చెందిన దాదాపు ఇరవైమంది ఇలా అసత్య ఆరోపణలకు బలై సౌదీ అరేబియా జైళ్లలో మగ్గుతున్నారట! కేంద్ర ప్రభుత్వం ఎందుకు ఈ ‘గల్ఫ్’ దారుణాలను ఎప్పటికప్పుడు నిరోధించలేకపోతోంది??
గత సెప్టెంబర్ నాటి గణాంకాల ప్రకారం సౌదీ అరేబియాలోని జైళ్లలో రెండువేల మందికి పైగా భారతీయులు మగ్గుతున్నారట! మరణించిన కార్మికుల మృతదేహాలను మనదేశానికి తరలించడానికి వలసిన వ్యయాన్ని ఆయా సంస్థల యజమానులు చెల్లించాలన్న నిబంధనను సౌదీ ప్రభుత్వం అమలు జరిపించకపోవడం అమానుష, చిత్తవృత్తికి పరాకాష్ఠ! అనేకమంది భారతీయ కార్మికుల మృతదేహాలు సౌదీ అరేబియాలోని ‘వైద్యగృహా’లలో నెలల తరబడి పడి ఉండడం ప్రచారం కాని విషాదం! ఖతార్, కువాయిత్, యూఏఈ ‘జైళ్ల’లో సైతం వందలాది నిరపరాధి భారతీయులు ఏళ్ల తరబడి అలమటిస్తున్నారు. రెండేళ్ల క్రితం ఢిల్లీలోని ఒక సౌదీ అరేబియా దౌత్యవేత్త, వాడి మిత్రులు ఇద్దరు మహిళలను తన ఇంటిలో అనేక నెలలు నిర్బంధించి సామూహిక లైంగిక అత్యాచారానికి గురిచేసినట్టు ధ్రువపడింది. కానీ ‘పిశాచి’ని మన ప్రభుత్వం నిర్బంధించలేదు, వాడు దర్జాగా విమానమెక్కి స్వదేశానికి వెళ్లిపోయాడు.. ఇదీ తేడా!