సంపాదకీయం

దురహంకార ‘విద్య’..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గ్రామీణ ప్రాంతాలలోని బాలబాలికలు యువజనులు ‘ఇంగ్లీషు’ నేర్చుకొనడానికి ఎక్కువ మక్కువను చూపిస్తున్నారట! హైదరాబాద్‌లోని వనస్థలిపురంలో నడుస్తున్న ‘ప్రశాంతి విద్యానికేతన్’ అన్న పాఠశాలలో ఒకటవ తరగతి చదువుతుండిన పి.అంజలి అనే ఆరేళ్ల పాప నిర్వాహకుల క్రూరమైన నిర్లక్ష్యం కారణంగా శనివారం బస్సులోనుండి పడిపోయి అకాల మరణంపాలైంది! హర్యానాలోని యమునానగర్‌లో ‘స్వామి వివేకానంద పాఠశాల’కు చెందిన ఒక పద్దెనిమిది ఏళ్ల విద్యార్థి పాఠశాల ప్రధాన అధ్యాపిక ఋతూఛాబ్రాను ఆమె కార్యాలయంలోనే శనివారం కాల్చి చంపేశాడు! వాణిజ్య సంస్థల - కార్పొరేట్ - పాఠశాలలో చదువుకుంటున్న ఎక్కువ మందికి ‘వసంత పంచమి’ అంటే ఏమిటన్నది తెలీదు, సరస్వతీ మాత విజ్ఞానాన్ని విద్యలను ప్రసాదిస్తుందన్న ధ్యాస లేదు! చదువుకుంటున్న యువతులు చేతులకు గాజులు నుదుటన బొట్లు తీసి పారేశారు, పారేస్తున్నారు! ఆంగ్ల మాధ్యమ విద్యార్థులు ఇంటిలో పెద్దలకు కాని, బయట పెద్దలకు కాని, గుడిలో దేవుడికి కాని చేతులు జోడించి నమస్కరించడం లేదు.. ‘హాయ్’ అని పలకరిస్తున్నారు. పాఠ్యాంశాలు తప్ప ఇతర పుస్తకాలు కాని వార్తా పత్రికలు కాని చదవడం లేదు, అశ్లీల లైంగిక - పార్న్ - కలాపాలను ‘వాట్స్‌ఆప్’ లోను ‘ఇంటర్‌నెట్’లోను దర్శిస్తున్నారు! చదువుకుంటున్న ఆడపిల్లలకు ‘పేరంటా’నికి వెళ్లడం నామోషీ, బతకమ్మను గురించి దుర్గమ్మను గురించి పాడడం నామోషీ! ‘పేరంటం’ అనే పదాన్ని గ్రామీణులు మరచిపోయారు! ‘‘పేరంటానికి రండి, మా పాప పుట్టినరోజు పండుగ..’’ అని చెప్పడం లేదు! ‘‘మా పాప ‘బర్త్ డే’, ఈవినింగ్ ఫంక్షన్‌కు రండి..’’ అని పిలవడం గ్రామీణ ప్రాంతాలలోని వారి తెలుగు వ్యవహార భాషకు మచ్చుతునక! ఈ ‘్ఫంక్షన్’లలో ‘మేరీజీ రిసెప్షన్’లలో ముత్తయిదువులు మంగళహారతులు ఇవ్వడం, పురోహితుడు మంత్రాలను శ్లోకాలను చదవడానికి ప్రాధాన్యం లేదు! వీడియో చిత్రీకరణకు, ‘సెల్ఫీ’లకు ‘కేకు’లను తరగడానికి ప్రాధాన్యం పెరిగిపోయింది! సంప్రదాయమైన సంగీత స్వరాలు వినబడడం లేదు, ‘బర్మడా’లను తగిలించుకున్నవారు ‘గాడిద’ గొంతులతో ‘బఱ్ఱె’ గొంతులతో ఫంక్షన్లలోను రిసెప్షన్లలోను పాడేస్తున్నారు.. భారత రాజ్యాంగంలోని మూడవందల నలబయి మూడవ అధికరణం మేరకు ‘దేవనాగరి లిపిలో వ్రాసే హిందీ’ కేంద్ర ప్రభుత్వం వారి అధికార భాష! రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వానికి మధ్య అనుసంధాన భాష మూడు వందల నలబయి ఆరవ అధికరణం మేరకు హిందీ భాష! రాజ్యాంగం అమలులోకి వచ్చిన తరువాత పదిహేను సంవత్సరాలు మాత్రమే ‘ఇంగ్లీషు’ ‘హిందీ’కి అనుబంధంగా ఉపయోగించాలన్నది రాజ్యాంగ నిబంధన! కానీ సకల భారతీయ భాషలను తుదముట్టించడానికై ‘ఇంగ్లీషు’ దేశమంతటా జనం నెత్తిక్కి తాండవం చేస్తోంది!!
గ్రామీణ ప్రాంతాలలోని విద్యార్థులలో డెబ్బయి తొమ్మిది శాతం ఇంగ్లీషును వ్రాయగలుగుతున్నారట, చదువగలరట, వాక్యాలను అర్థం చేసుకుంటున్నారట! పదునాలుగు, పద్దెనిమిది ఏళ్ల మధ్య వయస్కులలో ఇలా ఆంగ్లభాషను అర్థం చేసుకుంటున్నవారి సంఖ్య యాబయి ఎనిమిది శాతమన్నది ‘వార్షిక పాఠశాల విద్యా నివేదిక’ ద్వారా నిర్ధారణ జరిగిందట! దేశవ్యాప్తంగా ఆంగ్లభాష పట్ల ఆదరణ పెరిగిపోతోందనడానికి ఈ ‘నిజనిర్ధారణ’ సరికొత్త ప్రాతిపదిక. ఆంగ్లభాషను అభ్యసించినట్టయితే అమెరికాకు వెళ్లి ఉద్యోగాలు చేసి ‘డాలర్ల’ను సంపాదించవచ్చునన్నది గత మూడు నాలుగు దశాబ్దులుగా ప్రచారమైన మహా విషయం. ‘‘ఇది కేవలం భ్రాంతి’’ అని ఇప్పుడు ధ్రువపడింది! అయినప్పటికీ లక్షలు కోట్లు రూపాయలు సంపాదించడానికి ‘ఇంగ్లీషు’ భాష ఇంగ్లీషు మాధ్యమ విద్య మాత్రమే దోహదం చేయగలదన్నది వాణిజ్య ప్రపంచీకరణ - గ్లోబలైజేషన్ - వల్ల మనకు దాపురించిన సమష్టి మనఃప్రవృత్తి! ‘సంపాదన’ ప్రధానం, మిగిలినవన్నీ పనికిరానివి.. వ్యక్తిగత సౌశీల్యం, జాతీయ భావనిష్ఠ, మాతృదేశం పట్ల, మాతృ సంస్కృతి పట్ల మమకారం, భారతీయమైన విలువల పట్ల కట్టుబాటు ఇవన్నీ నామరూపాలు లేకుండా నశించిపోతుండడం శిశువులను ఆంగ్లమాధ్యమ శిక్షణకు గురిచేస్తున్న దేశవ్యాప్త ప్రక్రియకు సమాంతర పరిణామాలు..
విద్య ఒసగును వినయంబు - విద్యాదదాతు వినయం - అన్నది భారతీయ జీవన లక్షణం! కానీ ఇంగ్లీషు భాషా పాండిత్యం పెరిగిన వారిలో అత్యధికులకు వినయం అలవడడం లేదు, అతిశయం అలవడుతోంది! యుగాలుగా సాగిన భారతీయ జీవన విధానంకంటె విభిన్నమైన పద్ధతిలో తాము ప్రవర్తించాలన్న భావం లేదా భ్రాంతి ఉన్నత పాఠశాలల విద్యార్థి దశలోనే అలముకుంటోంది. ఇంగ్లీషు చదవని కర్షకులకంటె, వృత్తిపనులవారికంటె, గ్రామీణులకంటె తమ కుటుంబంలోని తల్లిదండ్రులకంటె తాతలకంటె నాయనమ్మలకంటె తాము ‘ప్రత్యేకత’ సంతరించుకుంటున్నామన్నది, అతిశయానికి ప్రాతిపదిక! అధికాధికులలో ఈ ‘అతిశయం’ ‘దురహంకారం’గా రూపొందుతోంది! ‘‘నితాంత అపార భూతదయ’’ భారతీయులు యుగయుగాల సమష్టి జీవన ప్రవృత్తి! కానీ ‘ఇంగ్లీషు మీడియమ్’ ద్వారా తయారవుతున్నవారిలో ఎక్కువ మందిని వౌలిక జాతీయ సంస్కారం పట్ల అవగాహన తక్కువైపోయింది! అందువల్ల ‘‘నేను’’ సంపాదిస్తున్నాను, నేను ఖర్చు పెట్టుకుంటున్నాను..’’ అన్న వికృత చిత్తవృత్తి అధికాధికులను ఆవహించి ఉంది. ‘‘నేను సంపాదించిన దానిలో సమాజం కోసం, దేశం కోసం, జాతి కోసం, సమష్టి హితం కోసం కొంతయినా ఖర్చు పెట్టాలి...’’ అన్న భారతీయ సంస్కారం భారతీయ భాషల ద్వారా వికసించింది! ‘‘పరోపకారాయ పుణ్యాయ పాపాయ పరపీడనమ్’’ అన్నది ఈ సంస్కారం!!
ఇలా విద్యాస్థాయి పెరిగినకొద్దీ ‘్భరతీయత’కు విద్యావంతులలో ఎక్కువ శాతం దూరమైపోతుండడం స్వతంత్ర భారతదేశంలో నడుస్తున్న కథ! భారతీయ భాషల మాధ్యమంగా ప్రభుత్వ పాఠశాలలోను, కొన్ని జాతీయ స్వచ్చంద సంస్థలు నిర్వహించే పాఠశాలలలోను నిన్నమొన్నటి వరకు విద్యాబోధన జరిగేది. కానీ ఇప్పుడు అన్ని పాఠశాలలోను శిశుస్థాయినుంచి - మూడేళ్ల వయసు నుంచి - మాతృభాషలను నేర్పని విద్యాబోధన వ్యవస్థ ‘‘వికసిస్తోంది’’! తెలుగును చదవలేని, తెలుగును వ్రాయలేని, ఆంగ్ల పదాలతో అతిగా సంకరమైన తెలుగును మాట్లాడే ఉన్నతోన్నత విద్యావంతుల సంఖ్య నిరంతరం పెరుగుతోంది! దేశంలోని అనేక ప్రాంతాలలో మాతృభాషలకు ఇదే దుర్గతి దశలవారీగా దాపురిస్తోంది! అతిశయం, అహంకారం, ఆర్థిక పరమావధి, సమష్టి హితం పట్టని అమానవీయత, క్రూరమైన నిర్లక్ష్యం కొలువుతీరున్నాయి. జరిగిన జరుగుతున్న వికృతకాండకు ఇదీ కారణం. హృదయం లేని బుద్ధి, సంస్కార స్పర్శ లేని విజ్ఞానం ‘ఆంగ్ల’ మాధ్యమ ప్రాథమిక విద్యాబోధన ఫలితం.. మొక్కయి వంగనిది మానయి వంగునా??