సంపాదకీయం

నరేంద్ర ‘ధుని’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వైవిధ్యాల మధ్య వైరుధ్యం లేని మానవ జీవన ప్రశాంత ప్రగతి ప్రస్థానం భారతీయుల సనాతన - శాశ్వత - సంస్కారం! ఈ సమన్వయ సంస్కారాన్ని ప్రపంచంలోని వివిధ దేశాలవారు అలవరచుకోవాలన్నది మన ప్రధానమంత్రి నరేంద్రమోదీ స్విట్జర్లాండ్‌లోని ‘దావోస్’ ప్రాంగణంలో జరుగుతున్న ‘ప్రపంచ ఆర్థిక సమాఖ్య మహా సమ్మేళన ప్రారంభ సమావేశంలో చేసిన ప్రసంగంలోని ఇతివృత్తం! ఆర్థిక ప్రగతితోపాటు, ఐహిక ఆరోగ్యాన్ని, శారీరక మానసిక ఆరోగ్యంతోపాటు జీవన సమగ్రతను పొందదలిచేవారు భారతీయ జీవనాన్ని అధ్యయనం చేయాలన్నది తన ‘చారిత్రక’ ప్రసంగంలో మానవాళికి నరేంద్రమోదీ ఇచ్చిన పిలుపు. మానవాళి సముత్కర్ష అభ్యుదయం సనాతన ప్రశాంతి భారతదేశపు లక్ష్యమన్నది మోదీ చేసిన చారిత్రక పునరుద్ఘాటన! ఆర్థిక ప్రగతి, సృష్టిగత సమగ్ర వికాస ప్రక్రియ నుండి విభిన్నమైనదికాదని, ప్రత్యేకమైనది కాదని, సమగ్ర వికాస ప్రక్రియలో ఆర్థిక అభ్యుదయం ఒక అవిభాజ్య అంశమని భారతీయ ఋషిమునులు, కవులు, మేధావులు, పాలకులు, సంపన్నులు, సామాన్యులు అనాదిగా ధ్వనింప చేసిన జీవన వాస్తవానికి ‘దావోస్’ సమ్మేళన ప్రారంభ సభలో మోదీ చేసిన ప్రసంగ ప్రతిధ్వని.. ప్రపంచ ప్రజల ఈ సమగ్ర వికాసానికి అడ్డు తగులుతున్న మూడు ప్రధానమైన ప్రమాదాలను నరేంద్రమోదీ ఈ ‘ప్రపంచ ఆర్థిక సమాఖ్య’ - వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ - డబ్ల్యు.ఇ.ఎఫ్ - సభలో మన ప్రధాని వివరించడం సంపన్న దేశాల విధానాలకు పరోక్ష అభిశంసన! పర్యావరణంలో ప్రమాదకరమైన పరివర్తన, అంతర్జాతీయ బీభత్సకాండ, స్వయం కేంద్రీకృత - ఆత్మకేంద్రిత - విధానాలు మోదీ ప్రస్తావించిన మూడు ప్రమాదాలు! మొదటి రెండు ప్రమాదాలను గురించి జరుగుతున్న ప్రచారం మూడవ ప్రమాదం గురించి జరగడం లేదు. కానీ ఇదికూడ ప్రపంచ సమష్టి హితానికి మొదటి రెండు ప్రమాదాలంత తీవ్రస్థాయిలోనే నష్టం కలిగిస్తోందన్నది ప్రతినిధులకు మోదీ గలిగించగలిన ధ్యాస! ఒకవైపున ‘ప్రపంచీకరణ’-పేరుతో ఒకే అంతర్జాతీయ సమాజం అవతరిస్తోందన్న నేపథ్యంలో అనేక దేశాలు ఈ స్ఫూర్తికి భిన్నంగా ‘సంకుచిత - ప్రొటక్షనిస్ట్ - ఆర్థిక విధానాలను అవలంబిస్తున్నాయని, ‘స్వయం కేంద్రిత’ - సెల్ఫ్‌సెంట్రిక్ - ఆర్థిక ప్రయోజన సాధన కోసం కృషి చేస్తున్నాయని పేర్కొన్న మోదీ అమెరికా, ఐరోపా, చైనావంటి సంపన్న దేశాలను పరోక్షంగా అభిశంసించాడు! ఈ సంపన్న దేశాలు ‘ప్రొటక్షనిస్ట్’ ‘సెల్ఫ్‌సెంట్రిక్’ విధానాలను కొనసాగిస్తుండడం ప్రపంచీకరణ స్ఫూర్తిని నీరుకారుస్తోంది! ఈ మూడు ప్రమాదాల నుంచి ప్రపంచాన్ని కాపాడడానికి మోదీ ‘ప్రతీకలు’గా చూపించిన మూడు పరిష్కారాలు భారత్, భారతీయత, భారతీయ సంస్కారం...
ప్రకృతిగతమైన సమన్వయానికి విభిన్నమైన వైరుధ్యం ఏర్పడినందువల్లనే ప్రపంచం ఛిన్నాభిన్నంగా మారి ఉందన్నది మోదీ చెప్పిన మాట.. ‘‘్ఛన్నాభిన్న సమాజానికి సర్వ భాగస్వామ్య భవిష్యత్తును సాధించడం లక్ష్యం’’గా దావోస్‌లో ఈ ‘సమాఖ్య’ సమ్మేళనం జరుగుతోంది. ఈ లక్ష్య సాధనకు పై మూడు ప్రమాదాలు కల్పించిన వైరుధ్యం అవరోధంగా మారింది. కానీ భారతదేశం ఇప్పుడు మాత్రమేకాక అతి ప్రాచీన కాలం నుంచి కూడా ఛిన్నాభిన్నం చేయడానికి - తోడ్‌నేకాకామ్ - కాక, సమన్వయాన్ని పెంచడానికి - జోడ్‌నేకాకామ్ - స్వభావంగా సంతరించుకొని ఉందని మోదీ వివరించాడు. ‘వాణిజ్య ప్రపంచీకరణ’ - గ్లోబలైజేషన్ - కేవలం ఆర్థిక వ్యవహారాలకు పరిమితంగా మారి మిగిలిన జీవన రంగాల నుంచి మానవాళిని విడగొడుతున్న నేపథ్యంలో మోదీ సర్వసమగ్రమైన ‘వసుంధరా పరివార’ భావాన్ని ‘దావోస్’లో పునరావిష్కరించగలిగాడు. ఇది ‘‘వసుధైవ కుటుంబకమ్..’’ పుడమి ఒక పల్లెమాత్రమేకాదు ‘‘ప్రపంచ ప్రజలందరూ ఒకే ఇంటివారు..’’ అన్న భారత జాతీయ సంస్కారం. సనాతన భారతీయ లక్ష్యం ఆర్థిక భౌతిక సమష్టి ప్రగతికి మాత్రమేకాక విశ్వమానవ సాంస్కృతిక ఆధ్యాత్మిక సుగతికి కూడ ప్రతీకలు..
ఈ సాంస్కృతిక ఆధ్యాత్మిక సుగతి ప్రకృతిలో మానవుడు సహజంగా తాదాత్య్మం - తాల్‌మేల్ - చెంది ఉండడం. ‘‘మాతా భూమిః పుత్రోహం పృథివ్యాపి’’ అన్న వేద వాక్యాన్ని ఉటంకించడం ద్వారా నరేంద్రమోదీ ఈ సనాతన సత్యాన్ని పునరావిష్కరించాడు. ‘‘్భమి తల్లి నేను ఆమె పుత్రుడను’’ అన్న సత్యం జీవన ప్రవృత్తిగా మారిన మానవులు భూమిని కాలుష్యంతో గాయపరచరు. నీరు నిప్పు గాలి ఆకాశం భూమి - ఈ పంచభూతాలతో కూడిన ప్రకృతిలో పాంచభౌతికమైన మానవుడు భాగం.. ఇదీ భారతీయులకు ప్రకృతితో కల ‘ఏకాత్మత’, సృష్టితోకల ‘తాదాత్మ్యము’. అందువల్లనే భారతీయ జీవన విధానం ప్రకృతిని పరిరక్షించింది. ప్రకృతిలోని వనరులను ‘అవసరం’ - నీడ్ - మేరకు ఉపయోగం ఈ పరిరక్షణ అని, ‘అత్యాశ - గ్రీడ్ -తో కొల్లగొట్టడం వినాశహేతువని ఋషిమునులు మొదలు మహాత్మాగాంధీ వరకుగల భారతీయులు సంభావించిన తీరును మోదీ వివరించడం ప్రతినిధులను ప్రభావితం చేయగలిగింది. ప్రాకృతిక కాలుష్యం నిరోధించడానికి ప్రకృతిని మళ్లీ ఆరోగ్యవంతంగా జీవింప చేయడానికి ఏకైక పరిష్కారం, ఏకైక చికిత్స తరతరాల భారతీయత.. బీభత్సకాండ వల్ల జరుగుతున్న విధ్వంసాన్ని భారతదేశం శతాబ్దులుగా ప్రతిఘటించింది! వైవిధ్యాల మధ్య వైరుధ్యం లేని విశ్వ వ్యవస్థ భారతీయుల స్వప్నం, భారతీయుల సంకల్పం, భారతీయుల లక్ష్యం, భారతీయుల జీవనం కావడమే విజయవంతమైన ఈ ప్రతిఘటనకు ప్రాతిపదిక! వైవిధ్యాలను - మత వైవిధ్యాలను, భాషా వైవిధ్యాలను, ఇతరేతర అసంఖ్యాక వైవిధ్యాలను అనాది నుంచి ఆధునిక కాలం వరకు భారతీయులు పరిరక్షిస్తున్నట్టుగానే ప్రపంచంలోని ఇతర దేశాలవారు కూడ రక్షించాలన్నది మోదీ ప్రసంగంలోని ‘ధ్వని’.. వైవిధ్య పరిరక్షణ బీభత్స విధ్వంసానికి విరుగుడు..
‘ప్రపంచీకరణ’ నియమాలను పాటించి ఇతరదేశాల హక్కులను సంరక్షించాలన్నది ప్రతి దేశానికి నరేంద్రమోదీ చెప్పిన పాఠం.. ‘‘తేన త్యక్తేన భుంజీథా’’ - అతడు సంతృప్తి చెంది వదలిపెట్టిన సంపదను నేను అనుభవిస్తాను - అన్నది ఉపనిషత్ మార్గం ఈ పాఠం! ‘‘నేను సంతృప్తి చెందిన తరువాత భోం చేయాలి..’’ అని భావిస్తున్న సంపన్న దేశాలకు ఇది దావోస్‌లో భారతీయుని ప్రబోధం.. ‘‘సహనౌభునక్తు..’’ ఇద్దరం కలసి మెలసి భోజనం చేద్దాము - ఒక్కరే అంతా తినేయరాదు - అన్న మరో మంత్రాన్ని కూడ ఉటంకించిన మోదీ ‘‘అందరూ ఆనందంగా ఉండాలి, అందరూ ఆరోగ్యంగా ఉండాలి, అందరూ భద్రంగా జీవించగలగాలి.. ఎవ్వరూ కూడా దుఃఖంలో భాగస్వామి కారాదు..’’ అన్న భారతీయమైన ‘ప్రపంచీకరణ’ను మరోసారి ఆవిష్కరించాడు! ‘‘సర్వేపి సుఖినః సన్తు, సర్వే సన్తు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యన్తు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్’’! రవీంద్ర కవీంద్రుని మాటలలో ‘ముక్కలు చెక్కలు కాని ప్రపంచం’’ మోదీ ఆవిష్కరించిన లక్ష్యం...