సంపాదకీయం

స్వచ్ఛ ‘కామన్ వెల్త్’?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సముద్రాలలో నెలకొని ఉన్న చిన్న దేశాల ఆర్థిక సౌష్టవాన్ని పరిరక్షించడం, పర్యావరణాన్ని సంరక్షించడం ‘కామన్‌వెల్త్’ దేశాల ప్రధాన కార్యక్రమం కావాలన్నది మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేసిన ప్రతిపాదన. బ్రిటన్ రాజధాని లండన్‌లో గురు, శుక్రవారాల్లో జరిగిన ‘కామన్‌వెల్త్ దేశాల ప్రభుత్వాధినేతల సమావేశం’- కామన్‌వెల్త్ హెడ్స్ ఆఫ్ గవర్నమెంట్స్ మీటింగ్- చోగమ్- సందర్భంగా ‘కార్యాచరణ’ సదస్సులో మోదీ ప్రసంగానికి ప్రధాన ఇతివృత్తం పర్యావరణ పరిరక్షణ. పర్యావరణంలో వస్తున్న ‘విపరీత’ పరివర్తన కారణంగా సముద్ర తీర దేశాల జీవజాలం అంతరించిపోతుండడం దశాబ్దుల వైపరీత్యం. సముద్రతీర దేశాలలోని జంతుజాలం జలకాలుష్యంతో ఊపిరి ఆడక ఉక్కిరిబిక్కిరి అవుతోంది! వృక్షజాలం అంతరించి పోవడం జంతుజాలాన్ని కాలుష్య వలయంలోకి నెట్టిన ఘోరం.. ఇలా పెద్ద దేశాల తీర ప్రాంతాలు ప్రమాదాల ప్రాంగణాలుగా మారి ఉన్నాయి. కానీ సముద్రస్థ చిన్న దేశాలు- ద్వీపాలు- పూర్తిగా నీటిలో మునిగిపోవడానికి వాతావరణ కాలుష్యం రంగాన్ని సిద్ధం చేస్తోంది. లక్షలాది సముద్ర జలచరాలు కాలుష్యం కాటుతో అకాల మరణం పాలవుతున్నాయి. కుప్పలుగా తెప్పలుగా కట్టలుగా గుట్టలుగా వాటి కళేబరాలు సముద్ర తీరాలకు కొట్టుకొని వస్తోండడం దాదాపు ప్రతిరోజు ఎక్కడో అక్కడ ఆవిష్కృతం అవుతున్న వికృత విషాదం.. సముద్రాలలో ఇమిడి ఉన్న చిన్న దేశాలు పర్యావరణ వైపరీత్యాలకు బలికాకుండా ‘కామన్ వెల్త్’ నిరోధించాలన్న మోదీ పిలుపునకు నేపథ్యం. ఇలా సముద్ర కాలుష్యం పెరగడానికి కారణం ప్రపంచంలోని అగ్రరాజ్యాలు, సంపన్న దేశాలు విచ్చలవిడిగా పారిశ్రామిక విషాలను, రసాయన వ్యర్థాలను సముద్రాలలో కుమ్మరిస్తూ ఉండడం. ఐరోపా దేశాల, అమెరికా చైనా వంటి సంపన్న దేశాల పాత ఓడలు, పనికిరాని నౌకలు వర్ధమాన దేశాల సముద్ర జలాలలో మునిగిపోతున్నాయన్నది దశాబ్దుల రహస్యం. ఈ ఓడల నిండా పారిశ్రామిక, ప్లాస్టిక్, రసాయన వ్యర్థాలను, చెత్తను నింపి ముంచేస్తున్నారు. సముద్ర గర్భంలో కాలుష్యం విస్తరించి జీవజాలం నశిస్తోంది..
ప్రశాంత మహాసాగరంలో నెలకొని ఉన్న ‘కిరివటి’- కిరివసి- దేశం 1979 వరకు బ్రిటన్‌కు వలస! ‘చోగమ్’లోని భాగస్వామ్య దేశాలు మొత్తం గతంలో బ్రిటన్ దురాక్రమణకు గురయ్యాయి. బ్రిటన్ దాస్య విముక్త దేశాలు బ్రిటన్‌తో కట్టిన ‘జట్టు’ పేరు ‘కామన్ వెల్త్’. ‘కామన్ వెల్త్’ అన్న పదానికి ‘సమష్టి సంపద’ అని అర్థం. ‘సంపద’ దాదాపు అన్ని బ్రిటన్ దురాక్రమిత దేశాల నుంచి బ్రిటన్‌కు తరలిపోవడం దాదాపు నాలుగు దశాబ్దుల ‘సమష్టి’ చరిత్ర. బ్రిటన్ కొల్లగొట్టింది. మిగిలిన ‘కామన్ వెల్త్’ దేశాలు ‘డొల్ల’గా మారాయి. ఇదీ ‘సమష్టి సంపద’ కథ. తమ ‘రవి అస్తమించని ప్రపంచ సామ్రాజ్యం’ అంతరించి పోవడానికి రంగం సిద్ధమైందని గ్రహించిన బ్రిటన్ వారు 1931లో ‘కామన్ వెల్త్’ను ఏర్పాటుచేశారు. ప్రస్తుతం యాబయి మూడు దేశాలు ‘కామన్ వెల్త్’లో భాగస్వామ్యం వహించి ఉన్నాయి. అందువల్ల ‘కామన్ వెల్త్’ బ్రిటన్ దురాక్రమణ స్మృతులకు కేంద్రం! బీభత్స వారసత్వ ప్రాంగణం! బ్రిటన్ నుంచి స్వాతంత్య్రం పొంది సార్వభౌమ దేశాలుగా ఏర్పడిన మాజీ ‘వలస’లు భావదాస్యం నుండి మాత్రం విముక్తం కాలేదు. బ్రిటన్ ప్రదానం వల్ల కాక స్వయంగా స్వాతంత్య్రం పొందిన ‘అమెరికా’ ఈ ‘కామన్ వెల్త్’లో లేదు! మోదీ ప్రస్తావించిన పర్యావరణ కాలుష్యం వెనుకనుంచి ఈ భావకాలుష్యం కూడ తొంగి చూస్తోంది. ‘్భవ కాలుష్యం’ ఐరోపా జాతుల, ప్రధానంగా బ్రిటన్ జాతి స్వభావం! పర్యావరణాన్ని పరిరక్షించడం, ప్రకృతిని పూజించడం అనాదిగా భారతీయుల స్వభావం. ప్రకృతిని ధ్వంసం చేసే ప్రవృత్తి మనకు బ్రిటన్ బీభత్స పాలన కాలంలో సంక్రమించింది. ‘ప్రపంచీకరణ’ వల్ల తొండ ముదిరి ఊసరవెల్లి అయింది. కేంద్ర ప్రభుత్వం అమలుచేస్తున్న సముద్ర తీర ప్రాంత నియంత్రణ విధానం, బుధవారం వెల్లడించిన జాతీయ స్వచ్ఛ వాయు కార్యక్రమం ముసాయిదా ఇలా ‘తొండ ముదిరి ఊసరవెల్లి’ అవుతున్న తీరుకు సరికొత్త నిదర్శనాలు. మోదీ లండన్‌లో పర్యావరణ పరిరక్షణకు, ‘సముద్ర తీర స్వచ్ఛత పరిరక్షణ’కు పిలుపునివ్వడం, ఈ ‘స్వచ్ఛవాయు కార్యక్రమ’ ముసాయిదా పత్రం- డ్రాఫ్ట్ నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్- ఎన్‌సిఏపి- వెలువడడం సమాంతర పరిణామాలు! ఈ ‘స్వచ్ఛవాయు’ విధాన ముసాయిదా పత్రంతోపాటు ‘తీరప్రాంత నియంత్రణ’- కోస్టల్ రెగ్యులేషన్ జోన్- సిఆర్‌జెడ్- ముసాయిదా పత్రాన్ని కూడ కేంద్ర ప్రభుత్వం ఆవిష్కరించింది. 2011లో రూపొందిన నియమావళి ప్రకారం సముద్రతీరం పొడవునా ఐదువందల మీటర్ల వెడల్పు గల భూభాగంపై విహారయాత్రా కేంద్రాల - టూరిజం సెంటర్స్-ను, వాణిజ్య కేంద్రాలను ప్రాంగణాలను నిర్మించరాదు. రక్షణకు సంబంధించిన నిర్మాణాలకు మాత్రమే అనుమతి ఇవ్వవచ్చునన్నది 2011నాటి నిబంధన. కేంద్ర ప్రభుత్వం ఈ నిబంధనను సడలించనున్నట్టు ‘సిఆర్‌జెడ్’ ముసాయిదా విధానపత్రం వల్ల వెల్లడైంది. ఈ నిబంధనను సడలించినట్టయితే ‘అనుమతి పొందిన’ సంస్థలు ప్రధానంగా ‘బహుళ జాతీయవాణిజ్య సంస్థలు’- మల్టీ నేషనల్ కంపెనీస్- మన దేశపు ఏడువేల కిలోమీటర్ల సముద్ర తీరం పొడవునా వివిధ రకాల ‘కాలుష్య కేంద్రాల’ను ఏర్పాటు చేయడం ఖాయం! కాలుష్యం వల్ల ఉష్ణోగ్రత పెరుగుతోంది. సగటున ప్రతి ఐదేళ్లకోసారి ఒక సెల్సియస్ డిగ్రీ చొప్పున ఉష్ణోగ్రత పెరిగి స్థిరపడిపోతుండడానికి ఏకైక కారణం కాలుష్యం! రసాయన విషాలు, ప్లాస్టిక్ విషాలు ‘టూరిజం’ పరిశ్రమలో నిండి నిబిడీకృతం అయి ఉన్నాయి. ఈ విషాలు వెదజల్లుతున్న కాలుష్యం విహార యాత్రా స్థలాలను మాత్రమేకాక రహదారులను, సముద్ర తీరాలను, పర్వత ప్రాంతాలను వేడెక్కిస్తున్నాయి. రెండు దశాబ్దులలో హిమాలయ పర్వతాలలోని పదమూడు శాతం ‘మంచు దిబ్బలు’- గ్లాసిమర్స్- కరిగిపోవడానికి ఇదీ కారణం. సముద్రాల నీటిమట్టం పెరిగి అనేక ద్వీపాలు జల దిగ్బంధనంలో చిక్కుకోనున్న ప్రమాదం ముంచుకొస్తోంది. వేడిమి వల్లనే సముద్రాలలోని ‘హిమ శకలాలు’- ఐస్‌బర్గ్‌లు- కరగిపోయి నీటిమట్టం పెరుగుతోం ది. తిమింగలాలు వందలు, వేల సంఖ్యలో అకాల మరణం పాలవుతున్నాయి. తాబేళ్లు, చేపల వ్యథ సముద్ర తీర ప్రాంతాన్ని విషాదగ్రస్తం చేస్తోంది. అయినప్పటికీ కేంద్ర ప్రభుత్వం సముద్ర తీరంలో మరిన్ని కట్టడాలను ప్రోత్సహించడానికి కారణం ‘ప్రపంచీకరణ’ శక్తుల ప్రభావం.. ‘ముసాయిదా’ పత్రాలను విడుదల చేయడం వల్ల ప్రజలు సలహాలు చెప్పడానికి వీలవుతుందట! సముద్ర తీర పర్యావరణ పరిరక్షణ నిబంధనలను, స్వచ్ఛవాయు నిబంధనలను సడలించరాదని ప్రభుత్వానికి ప్రజలు సలహా చెప్పాలి. ‘స్వచ్ఛ్భారత్’ కార్యక్రమం జరుగుతూనే ఉంది. మరోవైపు స్వచ్ఛతను మరింతగా భంగపరిచే విధానం కూడ రూపొందడం విచిత్రం కాదు, ఇది ‘ప్రపంచీకరణ’ మారీచుని మాయాజాలం!
దాదాపు తొమ్మిదివందల చదరపు కిలోమీటర్ల భూభాగం, లక్ష జనాభాకల ‘కిరివటి’ దేశం మొత్తం సముద్ర జలాలలో మునిగిపోయే ప్రమాదం ఏర్పడింది. నీటిమట్టం మరో మీటరు పెరిగితే ఈ దేశం- ముప్పయి మూడు చిన్న ద్వీపాల సమూహం- పూర్తిగా జలమయమై పోతుందట! కామన్‌వెల్త్ దేశాలలో ఇదికూడ ఒకటి. ఇలాంటి దేశాలను ఉద్ధరించడానికి పర్యావరణ కాలుష్యాన్ని, వేడిని, నీటిమట్టాన్ని తగ్గించవలసిన అనివార్యం ఏర్పడింది. ఈ అనివార్యం మన దేశపు అంతర్గత కాలుష్య నియంత్రణతో కూడ ముడిపడి ఉంది. నరేంద్ర మోదీకి ఇది తెలుసు..