సంపాదకీయం

నకిలీ ‘పారవశ్యం..’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మన ప్రధాని నరేంద్ర మోదీ ఈనెల ఇరవై ఏడవ, ఇరవై ఎనిమిదవ తేదీల్లో చైనా అధ్యక్షుడు ఝీజింగ్ పింగ్‌తో ద్వైపాక్షిక సమావేశం జరుపనుండడం ‘కుహనా పారవశ్యంతో కుతికెలు నిండిన’ వారికి మరో గొప్ప చర్చనీయాంశం! టిబెట్‌కు స్వాతంత్య్రం అక్కరలేదని, దాదాపు ఐదు లక్షల చదరపు మైళ్ల ఒకప్పటి సువిశాల స్వతంత్ర త్రివిష్టప దేశం శాశ్వతంగా చైనావారి దమనకాండకు బలైపోవాలని టిబెట్ మాజీ అధినేత దలైలామా పునరుద్ఘాటించడం ఈ కుహనా పారవశ్యపు దృశ్యాలకు విచిత్ర నేపథ్యం! చైనా నియంతలకు చిక్కి, హత్యకు గురికాకుండా తప్పించుకోగలిగిన దలైలామా తన వేలాది అనుచరులతో టిబెట్ రాజధాని లాసా నుండి 1959లో నిష్క్రమించాడు, మన దేశానికి తరలి వచ్చాడు. హిమాచల్‌ప్రదేశ్‌లోని ధర్మశాలలో ‘ప్రవాస ప్రభుత్వం’ ఏర్పాటు చేసుకున్నాడు. టిబెట్-ప్రాచీన త్రివిష్టపం-ను చైనా దురాక్రమణ నుండి విముక్తం చేసి మళ్లీ స్వతంత్ర సార్వభౌమ దేశంగా రూపొందించడం ఈ ‘ప్రవాస ప్రభుత్వ’ లక్ష్యం. దలైలామా భారతదేశ ఆగమనానికి యాబయి తొమ్మిదేళ్లు నిండాయి. అరవయ్యవ సంవత్సరం ఆరంభమైన సందర్భంగా గత ముప్పయి ఒకటవ తేదీన జరిగిన ఉత్సవంలో దలైలామా పాల్గొన్నాడు. కానీ స్వతంత్ర టిబెట్ లక్ష్యాన్ని ఆయన పదునాలుగు ఏళ్ల క్రితం వదలిపెట్టేశాడు. టిబెట్ ప్రజలు చైనాలో భాగంగానే ప్రగతిని సాధించాలన్నది ఆయన చేసిన చారిత్రక ప్రకటన. ఈ చారిత్రక ప్రకటనను ఇప్పటివరకు ఆయన అనేక సార్లు పునరుద్ధరించి ఉన్నాడు. నరేంద్ర మోదీ ఝీజింగ్ పింగ్‌తో జరుపనున్న సమావేశానికి పూర్వరంగంగా దలైలామా ‘డెబ్బయి పదకొండవ’ పర్యాయం ఈ చారిత్రక ప్రకటనను పునరుద్ఘాటించడం కొత్త విషయం కాదు. అయినప్పటికీ చైనా నియంతలకు తన పట్ల ఇప్పటికీ కొనసాగుతున్న అనుమానాలను నివృత్తి చేయడానికి దలైలామా చేస్తున్న కృషిలో ఈ పునరుద్ఘాటన భాగం! దలైలామా ‘టిబెట్‌కు స్వాతంత్య్రం అక్కరలేదని’ పదే పదే ‘చాటింపు’ వేయడం మన ప్రభుత్వానికి గొప్ప వెసులుబాటు. ‘టిబెట్ స్వాతంత్య్రం చచ్చిపోయింది..’ అని అప్పటి మన ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ- ఉప ప్రధానమంత్రి సర్దార్ వల్లభభాయి పటేల్‌కు 1950లో వ్రాసిన లేఖలో స్పష్టంచేశాడు, టిబెట్‌ను దురాక్రమించుకొనడానికి చైనాకు చక్కటి సహకారాన్ని అందించాడు. అయినప్పటికీ చైనాకు మాత్రం ‘మన దేశం టిబెట్ స్వాతంత్య్ర ఉద్యమాన్ని పురికొల్పుతోందన్న’ అనుమానం నివృత్తి కాలేదు. ఇలా తమను నమ్మని చైనా నియంతలను నమ్మించడానికి 1950 నుంచి మన ప్రభుత్వ నిర్వాహకులు, 2005 నుంచి దలైలామా ప్రయత్నిస్తుండడం ‘కుహనా పారవశ్యానికి’ చారిత్రక ప్రాతిపదిక..
భారత ప్రధాని చైనాకు వెళ్లినప్పుడు కాని, చైనా అధినియంత మన దేశానికి విచ్చేసినప్పుడు కాని ఈ ‘నకిలీ పారవశ్య’ ప్రభావితులు విచిత్ర విశే్లషణలు చేస్తుండడం, ‘వినూతన’ పదజాలాన్ని ప్రచారం చేయడం పరిపాటిగామారి ఉంది. ‘వ్యూహాత్మక సంబంధాలు’ అన్న పదజాలాన్ని చైనాతో మన ‘మైత్రి’కి అన్వయించడం ప్రచార వైశిష్ట్యం! భారత, చైనాలు ‘కలసికట్టు’గా ప్రపంచాన్ని నిర్దేశించగలవన్నది ‘‘మోదీ-ఝీ’ సమావేశానికి పూర్వరంగంగా జరుగుతున్న ‘గొప్ప విశే్లషణ..’ మన విదేశ వ్యవహారాల మంత్రి సుషమా స్వరాజ్ ఆది,సోమ వారాల్లో చైనాలో జరిపిన పర్యటన సందర్భంగా మోదీ, ఝీజింగ్ పింగ్‌తో జరుపనున్న ద్వైపాక్షిక సమావేశం ధ్రువపడింది. పింగ్‌ను మోదీ కలుసుకొనడం ఇది మొదటిసారి కాదు. 2014 నుండి వీరిద్దరు ఏడుసార్లు సమావేశమయ్యారు. డోక్‌లా-డోక్‌లామ్- పచ్చిక మైదానంలోకి చైనా గత ఏడాది చొరబడి డెబ్బయి నాలుగురోజులపాటు తిష్ఠవేసింది. ఆ తర్వాత సైనిక దళాలను ఉపసంహరించుకొంది. ఈ ఉపసంహరణ తర్వాత కూడ మోదీ, జింగ్‌పింగ్‌లు సమావేశం జరపడం ఇది మొదటిసారి కాదు! అయినప్పటికీ ఉభయ దేశాల సంబంధాలలో విప్లవాత్మక పరివర్తన జరిగిపోతుందన్న ప్రచారం మొదలుకావడం విచిత్రమైన వ్యవహారం! ఉభయ దేశాల మధ్య సరిహద్దు సమస్య పరిష్కారం అయ్యేవరకు మనకు చైనా మిత్రదేశం కాజాలదు. శత్రు దేశాల మధ్య ‘వ్యూహాత్మక సంబంధాలు’ పెంపొందడం ఏమిటి?? ఎవరికి వ్యతిరేకంగా, ఎవరికి అనుకూలంగా?? పాకిస్తాన్ దురాక్రమిత కశ్మీర్‌లోకి చైనా సైనికులు చొరబడి తిష్ఠవేసి ఉండడం, ఈ ప్రాంతంలో చైనా ఆర్థిక వాణిజ్య ప్రాంగణాన్ని ఏర్పాటు చేస్తుండడం వ్యూహాత్మక శత్రుత్వానికి నిదర్శనం. చైనా మనకు వ్యతిరేకంగా సాగిస్తున్న వ్యూహాత్మక దురాక్రమణ ఇది. చైనాను మిత్రదేశంగా భావించి ‘వ్యూహాత్మక మైత్రీ’’ విశే్లషణలు చేయడం కుహనా పారవశ్యం. నకిలీ అనుభూతి!
చైనా కాజేసిన మన భూభాగాల గురించి ఆలోచించకుండా, చైనా సరిహద్దులలోను అంతర్జాతీయంగాను జరుపుతున్న వ్యూహాత్మక దురాక్రమణను గురించి పట్టించుకోకుండా కేవలం వాణిజ్యాన్ని పెంపొందించుకోవడం ఈ ‘కుహనా పారవశ్యం’లో నిహితమై ఉన్న నిజం! ఈ వాణిజ్యం చైనాకు మాత్రమే ప్రయోజనకరం! ‘సరిహద్దు’ ధ్యాసలేని, చైనా అక్రమ అధీనంలోని మన భూభాగాల ధ్యాసలేని ‘వ్యూహాత్మక’ ‘కలసికట్టు’ వంటి పదజాలాలవల్ల, అవి ప్రచారం కావడం వల్ల చైనాకు ప్రయోజనం కలుగుతోంది, మనకు నష్టం కొనసాగుతోంది. 2011లో అప్పటి మన మన్‌మోహన్‌సింగ్ ఐక్యరాజ్యసమితి కార్యక్రమంలో పాల్గొనేందుకు అమెరికాలోని న్యూయార్క్‌కు వెళ్లాడు. ఆ సందర్భంగా ఆయన న్యూయార్క్‌లో ఉండిన చైనా నాయకులతో ‘వ్యూహాత్మక ఆర్థిక’ చర్చలు జరిపి వచ్చాడని ప్రచారమైంది. చైనా పట్ల మనం అనుసరించిన పాత విధానం 1988లో పరిసమాప్తమైంది. 1962లోను, అంతకు పూర్వం దురాక్రమించుకున్న మన భూభాగాలను మళ్లీ మనం పొందేవరకు చైనాతో ఇతర రంగాలలో సంబంధాలను పెంపొందించుకోరాదన్నది ఆ పాత విధానం. 1988లో అప్పటి మన ప్రధాని రాజీవ్‌గాంధీ చైనాకు వెళ్లి ఈ ‘పాత బాట’ను పగులగొట్టి వచ్చాడు. ఈ ‘పథ భగ్న’- పాత్ బ్రేకింగ్- విధానం అప్పట్లో గొప్ప ‘విప్లవం’గా ప్రచారమైంది. సరిహద్దు వివాదంతో నిమిత్తం లేకుండా అంటే చైనా దురాక్రమించిన మన భూభాగాన్ని తిరిగి స్వాధీనం చేసుకోవడమన్న లక్ష్యంతో నిమిత్తం లేకుండా చైనాతో దౌత్య వాణిజ్య మైత్రీబంధాన్ని పెంపొందించుకోవాలన్నది ఈ పథభగ్న విధానం! ఈ విచిత్రమైన విధానం వల్ల మూడు దశాబ్దులుగా మన ప్రభుత్వాలు చైనా దురాక్రమణలో ఉన్న మన భూభాగాన్ని గురించి మరచిపోయాయి. చైనా లడక్‌లోకి, సిక్కింలోకి, ఇతర ప్రాంతాలలోకి కొత్తగా చొరబడడం గురించి మాత్రమే మనకు ధ్యాస మిగిలింది. ఈ ‘పథభగ్నం’వల్ల పాత బాట పాడయింది, కొత్తబాట ఏర్పడలేదు!
ద్వైపాక్షిక వాణిజ్యం మాత్రం పదింతలుగా వికసించింది. చైనా మనకు అతి పెద్ద వాణిజ్య భాగస్వామి. మనం చేస్తున్న ఎగుమతులు పెరగడం కాదు, చైనా నుంచి దిగుమతులు భయంకరంగా పెరిగాయి, చైనా వస్తువులు మన ఇళ్లను ముంచెత్తుతున్నాయి. ఫలితంగా మనకు విదేశీయ వాణిజ్యంలో భారీ లోటు ఏర్పడింది. ఏటా రెండు లక్షల రూపాయల మన విదేశీయ వినిమయ ద్రవ్యం- ఫారిన్ ఎక్స్‌ఛేంజ్ కరెన్సీ- చైనాకు తరలిపోతోంది. ఈ సంగతిని మన ప్రభుత్వం పట్టించుకోవాలి! కానీ ‘వ్యూహాత్మక మైత్రి’ని గురించి మన విశే్లషకులు హోరెత్తిస్తున్నారు.