సంపాదకీయం

కామపిశాచికి ఖైదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆశారామ్ బాపు అనే లైంగిక బీభత్సకారుడికి యావజ్జీవ కారాగృహవాస దండన లభించడం ‘్ధర్మాచార్యుల’ వేషంలో జనవంచనకు ఒడిగడుతున్న దుర్మార్గులకు మరో గుణపాఠం. పదహారేళ్ల బాలికను తన లైంగిక బీభత్సకాండకు బలిచేసిన కామపిశాచి ఈ ఆశారామ్- నరరూప రాక్షసుడు! దుర్మార్గులుగా చెలామణి అవుతున్న దుర్మార్గులను సమాజం నిరసిస్తోంది, అసహ్యించుకొంటోంది, అభిశంసిస్తోంది, శిక్షిస్తోంది! కానీ సన్మార్గులుగా చెలామణి అవుతున్న దుర్మార్గులను సమాజం దశాబ్దుల తరబడి అభినందిస్తోంది.. ఆరాధిస్తోంది. ఆ ప్రత్యక్ష దుర్మార్గుల కంటె ఈ ప్రచ్ఛన్న దుర్మార్గులు సమాజానికి, ప్రజలకు ప్రత్యేకించి అమాయకులకు మరింత హాని చేయగలుగుతున్నారు. నిన్న మొన్న ‘డేరాబాబా’ అనేవాడు, బుధవారం శిక్షను పొందిన ఆశారామ్ బాపు అనే వీడు ఇలాంటి ప్రచ్ఛన్న దుర్మార్గులు, ‘్ధర్మాచార్య’ వేషంలోని లైంగిక బీభత్సకారులు, మేకవనె్నల మెకాలు.. ‘నరుల రూపపు ముసుగులో రాక్షసుల క్రీడలు’ సాగించిన ఆకతాయిలు! మనది ధర్మప్రాణ దేశమన్నది చరిత్ర. ఈ చరిత్రను చెఱపడానికి- ‘్ధర్మాచార్యులుగా అభినయ విన్యాసాలను ప్రదర్శించిన ముష్కరులు’ యత్నించడం, యత్నిస్తుండడం సనాతన జాతీయ సాంస్కృతిక ప్రస్థానంలో ఘోరమైన వికృతులు, కర్ణకఠోరమైన అపశ్రుతులు! సూర్యుని వంటి జాతీయ ధర్మానికి ఇలాంటి ఆశారామ్ బాపూలు, డేరాబాబాలు.. ఇంకా ఇంకా కృతకమైన అద్భుతాలను సృష్టించి అమాయక జనాలను ఆకట్టుకుంటున్న, తప్పుదారి పట్టిస్తున్న వంచకులు ‘గ్రహణాల’ వలె దాపురించడం ఈ దేశపు దౌర్భాగ్యం! ఈ దౌర్భాగ్యుల, ఈ దుర్మార్గుల కారణంగా అంతర్జాతీయ సమాజంలో మన ధార్మిక ప్రతిష్ఠ దిగజారుతోంది. యోగం త్యాగం సౌశీల్యం సౌజన్యం వంటి వౌలిక మానవీయ సంస్కారాలకు అనాదిగా నిలయమైన భారత జాతీయ సౌధంలో ఇలాంటి ‘ఆశారామ్’లు, ‘డేరా’లు బూజులాగా పేరుకొనడం నడుస్తున్న చరిత్ర. హైందవ జాతీయ గంగాస్రవంతిని కలుషితం చేస్తున్న దుర్గంధ ధారలు ఈ దుర్మార్గులు.. మహిళను మాతృమూర్తిగా భావించే మన దేశంలో కీచకులు, సైంధవులు, ఆశారామ్ బాపూలు, డేరాబాబాల వంటి పాపులు పుట్టుకొని రావడం కాల వైపరీత్యం. ఇలాంటి సంస్కృతి విద్రోహులు ఎంతోకాలం సమాజ వంచన సాగించలేరు. బుధవారం ఆశారామ్‌కు తగిన శాస్తి జరగడం ఇందుకు మరో నిదర్శనం.. ‘అంతరంగమందు అపరాధములు చేసి మంచి వాని వలెనె మనుజుడుండు... ఇతరులెరుగకున్న ఈశ్వరుడెరుగడా? విశ్వదాభిరామ వినుర వేమ’-అని మహాకవి చెప్పాడు! ఈశ్వరుడు పూనుకున్నాడు, న్యాయదేవత లైంగిక బీభత్సంపై మరోసారి అంకుశం సంధించింది..
వార్ధక్యం పైబడిన ఆశారామ్ బాపు 2013లో ఉత్తరప్రదేశ్‌లోని షహరాన్‌పూర్ జిల్లాకు చెందిన పదహారేళ్ల బాలికపై అత్యాచారం జరపడం బుధవారం అతగాడికి రాజస్థాన్‌లోని జోధ్‌పూర్ న్యాయస్థానం యావజ్జీవ కారాగార వాస శిక్షను విధంచడానికి కారణం! ఇలాంటి లైంగిక ఘోరాలను ఇతగాడు ఎన్నిసార్లు పాల్పడినాడన్నది బహుశా ఎప్పటికీ ధ్రువపడదు. జోధ్‌పూర్ సమీపంలోని తన ఆశ్రమంలో ఇతగాడు ఈ అత్యాచారం జరిపాడట! ఇలా అత్యాచారం జరిపి ఒక ‘మొగ్గ’ బతుకును బుగ్గిపాలు చేసిన ఈ ‘నకిలీ బాబా’ ప్రవృత్తి ఎంత వికృతమైనదో, ఇతని హృదయం ఎంత నికృష్టమైనదో ఊహించుకోవచ్చు! ఇలా ఇతగాని అసలు నైజం అవిష్కృతమైన తరువాత ఐదేళ్లు గడిచిపోయినప్పటికీ ఈ ‘దొంగ సన్యాసి’ అంటే పడి చచ్చిపోతున్న ‘్భక్తాదులు’ వందల వేల సంఖ్యలో ఉన్నారని ప్రచారం జరుగుతోంది. ఆశారామ్‌ను న్యాయస్థానం వారు శిక్షించినట్టయితే ఈ ‘్భక్తాదులు’ తెగ రెచ్చిపోయి విధ్వంసకాండను, బీభత్సకాండను సృష్టిస్తారని కేంద్ర ప్రభుత్వం, నాలుగైదు రాష్ట్రాల ప్రభుత్వాలు భయపడ్డాయట! అందువల్ల జోధ్‌పూర్‌లోను రాజస్థాన్‌లోను గుజరాత్‌లోను హరియాణాలోను కట్టుదిట్టమైన భద్రతను వ్యవస్థీకరించారట! జోధ్‌పూర్ జైలుప్రాంగణంలోనే కోర్టును ఏర్పాటుచేయడం కూడ ‘్భక్తాదుల’ దాడినుంచి చట్టాన్ని రక్షించుకోవడం.. ఈ ‘్భక్తాదులు’ బీభత్సకారులవలె ప్రవర్తించడం ‘డేరాబాబా’ కథకు ప్రధాన ప్రాతిపదిక! మూఢ భక్తి దోషం కాదు, కానీ తాము ఆరాధించిన ఈ ‘నకిలీ బాబా’ల రంగు బయటపడిన తరువాత కూడ వారిని ధర్మాచార్యులుగా భావించడం ఏమిటి? వారి పట్ల ఈ ‘్భక్తాదుల’కు పడిచచ్చిపోయేంత ప్రేమ ఎందుకు??
ఉత్సవ భక్తి ఉన్మాదబుద్ధిగా మారిపోతుండడం ఈ ‘్భక్తాదుల’ విచిత్ర ప్రవర్తనకు ప్రధాన కారణం. ‘్భక్తులు, ఇతరులు కలసి భక్తాదులు అవుతున్నారన్నది’ బహిరంగ రహస్యం. ఈ ‘్భక్తాదుల’లో నిజమైన భక్తుల సంఖ్య తగ్గిపోతోంది, ఇతరుల ప్రాబల్యం మితిమీరుతోంది. తమ నాయకుడిని, దుర్మార్గుడిని, లంచగొండిని, అవినీతిపరుడిని అరెస్టు చేసిన సందర్భాలలో ఈ రాజకీయ ‘్భక్తాదులు’ రెచ్చిపోతున్నారు. తమ ‘రంగుల కథానాయకుడి’కి జైలుశిక్ష పడినట్టయితే చిత్ర విచిత్ర చలనచిత్ర ప్రేమికులు ఉన్మాదంతో ఊగిపోతున్నారు. ఈ ‘రోగం’ ధార్మిక రంగానికి కూడ వ్యాపించి సాంస్కృతిక క్షేత్రాన్ని కలుషితం చేస్తుండడం నిజమైన భక్తులను ఆందోళనకు గురిచేస్తున్న విపరిణామం! ‘డేరా బాబా’గాను, సిర్సాలోని ‘డేరా స్వచ్ఛసౌధ’ అధిపతిగాను చెలామణి అయిన మరో ‘నకిలీ ధర్మాచార్యుడు’ 2012లో తన ఆశ్రమంలోనే ఇద్దరు ‘సాధ్వుల’ను అత్యాచారానికి గురిచేసినట్టు 2017 ఆగస్టులో ధ్రువపడింది. అప్పుడు కూడ హరియాణలోని రోహ్‌తక్ నగరంలోని ‘జైలు’ ప్రాంగణంలోనే ‘కోర్టు’ను ఏర్పాటు చేయవలసి వచ్చింది. అయినప్పటికీ డేరాబాబాగా చెలామణి అయిన గుర్‌మిత్ రామ్హ్రీమ్ సింగ్‌కు రోహ్‌తక్ న్యాయస్థానం ఇరవై ఏళ్ల జైలుశిక్షను విధించగానే ఈ భక్తాదులు జరిపిన బీభత్సం అంతా ఇంతా కాదు. ఈ ‘కాండ’ పునరావృత్తం అవుతుందన్న భయంతోనే ప్రభుత్వాలు నాలుగు రాష్ట్రాలలో బుధవారం భద్రతను పటిష్ఠం చేశాయి. ప్రజల ‘తీరు’ మారిపోతుండడం ఇందుకు కారణం! ‘తత్త్వం’కాక ‘ఉత్సవం’ సామాన్య జనాన్ని ఆకర్షించడం ఆశ్చర్యకరం కాదు. అయితే ఈ ‘ఉత్సవం’లో ‘తత్త్వం’ నిహితమై ఉంది. అందువల్ల ఉత్సవాలను జరుపుతున్న భక్తులు, నిజమైన భక్తులు ‘తాత్త్విక భూమిక’పై నిలబడి సనాతన ధార్మిక సాంస్కృతిక సంప్రదాయాలను పాటిస్తున్నారు. ‘ఉత్సవం’ కేవలం మాధ్యమం, ‘తత్త్వం’ పరమలక్ష్యం. ఇదీ భారతీయమైన మార్గంలో ప్రస్థానం సాగిస్తున్న సామాన్య ప్రజల ప్రవృత్తి...
కానీ రకరకాల మానసిక రుగ్మతలకు లోనయినవారు, డబ్బు బలిసినవారు నిజమైన మహనీయులను, ధర్మాచార్యులను వదలిపెట్టి ఆడంబరాలలో ఆకర్షిస్తున్న ‘నకిలీ బాబా’ల జాలంలో చిక్కుకొనిపోతున్నారు. ఇలాంటి భక్తాదులకు ఈ ‘నకిలీబాబా’లు, ‘కుహనా స్వాము’లు అద్భుతాలను చూపి ఆకర్షిస్తున్నారు. అద్భుతం ‘మహిమ’ కావచ్చు, లేదా ‘మాయ’ కావచ్చు. దేవతలు మహిమలను చూపిస్తారని, రాక్షసులు మాయలను ప్రదర్శిస్తారని తరతరాలుగా ప్రజల విశ్వాసం. కాని ఈ విచక్షణ జ్ఞానం నశించిపోతుండడం వల్లనే ఈ ‘్భక్తాదులు’- ఆశారామ్, ‘డేరా’ల వంటి మారీచుల మాయాజాలంలో ఇరుక్కున్నారు. ఈ నకిలీ బాబాలు గంతులు వేశారు. ‘్భక్తాదులు’ కూడ ఊగిపోతూ తూగిపోతూ గంతులు వేశారు. ఇలా గంతులు వేసిన భక్తుల కళ్లకు ‘నకిలీ బాబా’లు గంతలు కడుతున్నారు. జనం ఈ ‘గంతల’ను తొలగించుకోవాలి! ‘ఆశారామ్’ వంటి రాక్షసులు పునరావృత్తం కారు..