సంపాదకీయం

‘కర’ నాటకం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రత్యర్థికి ‘అపశకునం’ కలిగించడం కోసం ఒక మహాశయుడు తన ముక్కును తానే కోసుకున్నాడన్నది విచిత్ర ఘటన. ఈ విచిత్ర ఘటన పునరావృత్తం అవుతుండడం కర్నాటకలో కొనసాగుతున్న రాజకీయ నటన.. విధానసభ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్న సమయంలోనే ‘లౌకిక జనతాదళ్’కు, ‘ప్రభుత్వం ఏర్పాటు చేయడానికై’ కాంగ్రెస్ తన మద్దతును ప్రకటించడం ఈ రాజకీయ నటన.. భారతీయ జనతాపార్టీ నాయకత్వంలో కర్నాటకలో కొత్త ప్రభుత్వం ఏర్పడకుండా నిరోధించడం కోసం ఇంతటి త్యాగానికి కాంగ్రెస్ సిద్ధపడుతోంది మరి.. ‘ముక్కు’ను మాత్రమే కాదు, ‘తల’ను సైతం ‘తరిగి ఇవ్వడానికి’ కాంగ్రెస్ సిద్ధపడింది! రెండువందల ఇరవై నాలుగు స్థానాలున్న కర్నాటక విధానసభలో ఎన్నికలు జరిగిన రెండువందల ఇరవై రెండు స్థానాలలో ముప్పయి ఎనిమిదిచోట్ల మాత్రమే గెలిచి ప్రజల తిరస్కారానికి గురి అయిన లౌకిక జనతాదళ్ కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలన్నది కాంగ్రెస్ పార్టీ వెళ్లగక్కుతున్న మహత్వ ఆకాంక్ష.. ఇందుకోసం తాము ముఖ్యమంత్రి పదవినీ, అధికారాన్ని- ముక్కును, తలను వలె- తరిగి ‘తాంబాణం’ తట్టలో పెట్టి మాజీ ప్రధాని దేవగౌడ తనయుడైన కుమారస్వామి గౌడకు భక్తిశ్రద్ధలతో సమర్పించడానికి కాంగ్రెస్ సిద్ధమైంది. ఉదార హృదయంతో ఈ ‘తాంబూలాన్ని’ స్వీకరించడానికి హెచ్‌డి దేవగౌడ, ఆయన తనయుడు కుమారస్వామి అంగీకరించడం ‘ భాజపా’కు అధికారం దక్కకుండా నిరోధించడానికి వీలైన ‘అపశకునం’. నూట నాలుగు స్థానాలను గెలిచి కర్నాటక విధానసభలో అతి పెద్ద పక్షంగా అవతరించిన ‘ భాజపా’ను ప్రభుత్వం ఏర్పాటు చేయవలసిందిగా కర్నాటక రాజ్యపాల్ ఆహ్వానించాలి. ఏ పార్టీకి కాని ఎన్నికల తరువాత ‘చట్టసభ’లో సంఖ్యా బాహుళ్యం సిద్ధింపని సందర్భంలో, రాష్టప్రతి కాని రాజ్యపాల్ కాని పాటించదగిన ప్రజాస్వామ్యం ఇది. 1996లో జరిగిన లోక్‌సభ ఎన్నికల తరువాత ఏ పక్షానికి కాని సంఖ్యా బాహుళ్యం - మెజారిటీ- లభించలేదు. అతి పెద్దపక్షంగా అవతరించిన ‘ భాజపా’ పార్లమెంటరీ పక్షం నాయకుడు అటల్ బిహారీ వాజపేయిని అప్పటి రాష్టప్రతి డాక్టర్ శంకర్‌దయాళ్ శర్మ మొదట ప్రధానిగా నియమించాడు! లోక్‌సభ విశ్వాసం పొందలేకపోయిన వాజపేయి రాజీనామా చేసిన తరువాత మాత్రమే ప్రధానమంత్రి పదవిని చేపట్టడానికి ‘కలగూర గంప’ కూటమి నాయకుడైన హెచ్‌డి దేవగౌడకు రాష్టప్రతి అవకాశం ఇచ్చాడు.
ఈ ‘పూర్వవృత్త’- ప్రిసీడెంట్- సంప్రదాయాన్ని ప్రస్తుతం కర్నాటకకు వర్తింపచేయడం న్యాయం. ‘ భాజపా’ విధానపక్షం నేత ఎన్నిక జరిగిన తరువాత ఆ నాయకుడిని లేదా నాయకురాలిని ముఖ్యమంత్రిగా మొదట నియమించాలి! ఆ ముఖ్యమంత్రిని ‘శాసనసభ’ విశ్వాసం పొందవలసిందిగా ‘రాజ్యపాల్’- గవర్నర్ - ఆదేశించాలి.. ఆ ముఖ్యమంత్రి ‘సభా’ విశ్వాసం పొందలేకపోయినట్టయితే ‘కొత్త కూటమి’వల్ల పుట్టుకొచ్చే కొత్త నాయకుడిని ముఖ్యమంత్రిగా అప్పుడు నియమించవచ్చు! కానీ ఈ ప్రజాస్వామ్య రాజ్యాంగ సంప్రదాయాన్ని వమ్ముచేయడానికై కాంగ్రెస్ తన ‘ముక్కు’ను కోసుకొంది. డెబ్బయి ఎనిమిది స్థానాలను గెలిచిన కాంగ్రెస్ ముప్పయి ఎనిమిది స్థానాల ‘మూడవ స్థాయి’ పక్షం నాయకుడిని ముఖ్యమంత్రిని చేయడానికి తహతహలాడుతోంది. ఈ ‘తహతహ’ ప్రజల తీర్పునకు విరుద్ధం, ప్రజలకు అవమానం! ఎన్నికల ప్రచారం జరిగినంత కాలం కాంగ్రెస్ ఈ ‘కుహనా లౌకిక’ జనతాదళ్ పార్టీని తిట్టిపోసింది. ఈ పార్టీ అధ్యక్షుడు, మాజీ ప్రధానమంత్రి దేవగౌడను కాంగ్రెస్‌వారు దుయ్యబట్టారు. ఆయనపై అవమానకరమైన వ్యాఖ్యలను చేశారు. ఈ జనతాదళ్‌వారు ‘ భాజపా’తో లోపాయికారీ ఒప్పందాలను కుదుర్చుకున్నారని, ‘ భాజపా’కు తోకలుగా మారిపోయారని కాంగ్రెస్ నేత, గద్దె దిగనున్న ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఆరోపించాడు. ఈ ఆరోపణల స్మృతులు ఏమాత్రం చెఱగకముందే కాంగ్రెస్ ఇలా కుమారస్వామిని కౌగిలించుకోవడం అనైతికతకు, అవకాశవాదానికి పరాకాష్ఠ..
గతంలో ‘ భాజపా’ మద్దతుతో ముఖ్యమంత్రి పదవిని వెలగబెట్టిన ఈ కుమారస్వామి గౌడ అవకాశ వాదానికి సజీవ రూపం, సైద్ధాంతికమైన ‘దివాలాకోరు తనానికి’ అద్దం.. గతంలో కాంగ్రెస్‌తో జట్టుకట్టిన ‘లౌకిక జనతాదళ్’ 2006లో ‘కూటమి’ని భగ్నం చేసింది. అంతవరకు మతతత్త్వ పార్టీ అని తాము చిత్రీకరించిన ‘ భాజపా’తో జట్టుకట్టింది. కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి ధరమ్‌సింగ్‌ను గద్దెదించింది. అప్పుడు ఈ లౌకిక జనతాదళ్ నాయకుడిగా ఉప ముఖ్యమంత్రి పదవిని నిర్వహిస్తుండిన సిద్ధరామయ్య ఆ తరువాత కాంగ్రెస్‌లోకి ఫిరాయించడం, 2013 ఎన్నికల తరువాత ముఖ్యమంత్రి కావడం అవకాశవాద రాజకీయ చరిత్రలో మరపురాని ఘట్టాలు. 2006లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కుమారస్వామి కూలగొట్టడానికి కారణం తాను ముఖ్యమంత్రి కావాలన్న ఆకాంక్ష! ‘ భాజపా’తో కుదిరిన ఒప్పందం మేరకు ఇరవై నెలలపాటు తాను ముఖ్యమంత్రిగా ఉండాలి, ఆ తరువాత ఇరవై నెలలపాటు ‘ భాజపా’కు చెందిన యడియూరప్పకు ముఖ్యమంత్రి పదవిని అప్పగించాలి. కానీ ఇరవై నెలల తరువాత 2007 అక్టోబర్‌లో కుమారస్వామి గద్దె దిగలేదు, ఒప్పందాన్ని భగ్నం చేశాడు. ఇలా కాంగ్రెస్‌ను, తరువాత ‘ భాజపా’ను వంచించిన ఘనమైన చరిత్ర కుమారస్వామిది. రాజకీయ తృతీయశక్తిగా కర్నాటకలో ‘శిఖండి’పాత్రను పోషిస్తున్న కుమారస్వామి- ప్రజల ఘోర తిరస్కృతికి గురి అయినప్పటికీ- మరోసారి ముఖ్యమంత్రి పదవిని స్వీకరించడానికి ముస్తాబవుతుండడం జుగుప్సాకరమైన విపరిణామం. ‘కరం’-అంటే చేయి- కాంగ్రెస్ పార్టీ ఎన్నికల చిహ్నం.. ఇదీ ‘కర’ నాటకం..
భారతీయ జనతాపార్టీకి ఇది మరో ప్రజాస్వామ్య గుణపాఠం.. విలక్షణ సిద్ధాంత ప్రధాన పక్షం తమదని చాటింపు వేసుకుంటున్న ‘ భాజపా’ వారు బి.ఎస్.యడియూరప్ప వంటి అవకాశవాదిని ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రచారం చేయడం ఘోరమైన తప్పిదం. ఈ తప్పిదం వల్లనే ‘ భాజపా’కు విధానసభలో ‘మెజారిటీ’ లభించడం తప్పిపోయింది. గతంలో ముఖ్యమంత్రి పదవిని నిర్వహించిన వివాద రహితుడైన సదానంద గౌడను కాని, కేంద్రమంత్రి అనంతకుమార్‌ను కాని ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించి ఉండాలి, అప్పుడు ‘ భాజపా’కు స్పష్టమైన ‘మెజారిటీ’ లభించి ఉండేది! కాంగ్రెస్ పాలనను అభిశంసించిన కర్నాటక వోటర్లు ‘ భాజపా’కు స్పష్టమైన ‘మెజారిటీ’ని కట్టబెట్టలేదు.. ఇందుకు కారణం ‘ భాజపా’ మెడకు గుదిబండలా దాపురించిన యడియూరప్ప. ఈ ‘గుదిబండప్ప’ గతంలో ముఖ్యమంత్రి పదవి నుంచి దిగిపోయిన తరువాత ‘ భాజపా’ను వదలిపోయాడు, 2013లో ‘ భాజపా’ పరాజయానికి కారణమయ్యాడు. మళ్లీ ‘ భాజపా’లో చేరి ప్రస్తుత కర్నాటక శాసనసభ ఎన్నికలలో ‘భాజపా’ సంపూర్ణ విజయం సాధించకుండా అడ్డుపడ్డాడు..

‘కర’ నాటకం..