సంపాదకీయం

గిల్గిత్ ‘కీల’..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జమ్మూ కశ్మీర్ ఉత్తర ప్రాంతంలో విస్తరించి ఉన్న ‘గిల్గిత్ బాల్టీస్థాన్’ను ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేయడం పట్ల మన ప్రభుత్వం తీవ్ర నిరసనను తెలుపడం సహజం! జమ్మూ కశ్మీర్‌లోని కొంత భాగాన్నైనా శాశ్వతంగా తమ అక్రమ అధీనంలో ఉంచుకోవాలన్న పాకిస్తాన్ పన్నాగంలో తథాకథిత ‘గిల్గిత్ బాల్టీస్థాన్’ రాష్ట్రం భాగం.. 1947లో అఖండ భారత విభజన తరువాత ఏర్పడిన పాకిస్తాన్‌లో నాలుగు రాష్ట్రాలు-ప్రావెనె్సస్- ఉన్నాయి. సింధు, బలూచిస్థాన్, ఖైబర్-వాయువ్య సరిహద్దు పశ్చిమ పంజాబ్. 1947 అక్టోబర్‌లో మన దేశంలోకి పాకిస్తాన్ నుంచి జీహాదీ బీభత్సకారులు, ఆ తరువాత సైనిక మూకలు చొరబడ్డారు. అప్పటినుంచి ఇప్పటివరకు మూడవ వంతు జమ్మూ కశ్మీర్ పాకిస్తాన్ అక్రమ అధీనంలో ఉంది. పాకిస్తానీ మూకలను జమ్మూ కశ్మీర్ నుంచి పూర్తిగా తిప్పికొట్టకపోవడం 1948లో మన ప్రభుత్వం చేసిన తప్పిదం. పాకిస్తాన్ దురాక్రమించిన జమ్మూ కశ్మీర్‌ను మన సైనికులు పూర్తిగా విముక్తం చేయగలిగి ఉండేవారు. అలా పాకిస్తాన్ దురాక్రమణ నుండి మొత్తం జమ్మూ కశ్మీర్ విముక్తం అయి ఉండినట్టయితే ప్రస్తుతం మనం ఎదుర్కొంటున్న అనేక సమస్యలు ఉత్పన్నమై ఉండేవి కావు. అప్పటి మన ప్రధానమంత్రి జవహర్‌లాల్ నెహ్రూ యుద్ధాన్ని మధ్యలోనే ఆపుచేయించాడు. ఫలితంగా ఎనబయి మూడు వేల చదరపుకిలోమీటర్ల మన భూభాగం పాకిస్తాన్ అక్రమ అధీనంలో మిగిలిపోయింది. ఈ పాకిస్తాన్ దురాక్రమిత కశ్మీర్- పాకిస్తాన్ ఆక్యుపైడ్ కశ్మీర్- పిఓకె-లోని ఉత్తర భాగం ‘గిల్గిత్ బాల్టిస్థాన్’. అందువల్ల గిల్గిత్ బాల్టిస్థాన్ కూడా మిగిలిన ‘పిఓకె’తో పాటు ఎప్పటికైనా పాకిస్తాన్ నుంచి విముక్తం అవుతుంది, మన అధీనంలో ఉన్న జమ్మూకశ్మీర్‌లో విలీనం కానుంది..
ఈ సంగతి పాకిస్తాన్‌కు కూడ తెలుసు. అందువల్ల తన అక్రమ అధీనంలోని కశ్మీర్‌ను విభజించింది. దక్షిణ ప్రాంతాన్ని మాత్రమే పాకిస్తాన్ ‘ఆక్రమిత కశ్మీర్’గా ప్రచారం చేస్తోంది. దీనికి ‘ఆజాద్ కశ్మీర్’ అని పేరుపెట్టింది. ఉత్తర ప్రాంతం ‘గిల్గిత్ బాల్టిస్థాన్’ను కేంద్ర పాలిత ప్రాంతంగా 2009లో ఏర్పాటు చేసింది, ప్రత్యేక పాలక మండలిని ఏర్పాటు చేసింది. ప్రస్తుతం ఈ కేంద్ర పాలిత ప్రాంతం స్థాయిని పెంచి తమ దేశంలోని ఐదవ రాష్ట్రంగా ఏర్పాటు చేసినట్టు పాకిస్తాన్ ప్రభుత్వం ప్రకటించింది. ఈ ఏర్పాటును మన ప్రభుత్వం నిరసించడం సహజం. ‘గిల్గిత్ బాల్టిస్థాన్’ జమ్మూ కశ్మీర్‌లో భాగం కాదన్నది పాకిస్తాన్ చేస్తున్న విచిత్ర వాదం.. చర్చల ద్వారా సయోధ్య కుదిరినట్టయితే మనకు ‘పిఓకె’ను పాకిస్తాన్ అప్పగించాలి. అలాంటి స్థితిలో ‘గిల్గిత్ బాల్టిస్థాన్’ ప్రాంతాన్నైనా శాశ్వతంగా తమ అధీనంలో ఉంచుకోవచ్చునన్న ఆశతో పాకిస్తాన్ పాలకులు ఈ వితండవాదం వినిపిస్తున్నారు. పాకిస్తాన్ ప్రభుత్వ దుశ్చర్య పట్ల ‘గిల్గిత్ బాల్టిస్థాన్’ ప్రజలు పెద్దఎత్తున నిరసనలు ప్రకటించారు. ఆదివారం నిరసన ప్రదర్శనలను పోలీసులు రక్తసిక్తం చేశారు. పోలీసులు జరిపిన కాల్పులలో అనేక మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ నేపథ్యంలో కొత్త ఢిల్లీలోని పాకిస్తాన్ రాయబారి సయ్యద్ హైదర్‌షాను మన ప్రభుత్వం విదేశ మంత్రిత్వశాఖ కార్యాలయానికి పిలిపించి నిరసన తెలిపింది.
గిల్గిత్ బాల్టిస్థాన్ ప్రాంతంలో ప్రాకృతిక సంపద పుష్కలంగా ఉంది. ఈ ప్రాకృతిక సంపదను కొల్లగొట్టడంలో భాగంగా వేలాది పాకిస్తానీలు ఈ ప్రాంతంలోకి చొరబడి దశాబ్దులుగా స్థిరపడిపోయారు. 1993 వరకు ఈ ప్రాంతాన్ని పాకిస్తాన్ ప్రభుత్వం ప్రత్యక్షంగా నియంత్రించింది. స్థానిక ప్రజలకు కానీ, ప్రజాప్రతినిధులకు కాని ఎలాంటి ప్రాధాన్యం లేని విధంగా పాకిస్తాన్ ప్రభుత్వంలోని సహాయ కార్యదర్శి ఒకరు ఈ ప్రాంతంపై పెత్తనం వహించాడు. పాకిస్తాన్ రాజ్యాంగం 1956లో రూపొందినప్పటికీ అందులో ‘గిల్గిత్ బాల్టిస్థాన్’ ప్రస్తావన లేదు- ‘గిల్గిత్ బాల్టిస్థాన్’ తమ దేశంలో భాగం కాదన్నది ఈ విధంగా పాకిస్తాన్ పాలకులే అంగీకరించిన చారిత్రక భౌగోళిక వాస్తవం. ‘గిల్గిత్ బాల్టిస్థాన్’ ప్రాంతం 1947 ఆగస్టు 15వ తేదీ నాటికి జమ్మూ కశ్మీర్ రాష్ట్రంలో భాగమని 1993లో ఇచ్చిన రెండు తీర్పుల ద్వారా ‘పాకిస్తాన్ దురాక్రమిత కశ్మీర్’ ప్రాంత సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. అయినప్పటికీ పాకిస్తాన్ ప్రభుత్వం మాత్రం ‘గిల్గిత్ బాల్టిస్థాన్’ను దురాక్రమిత కశ్మీర్ నుంచి దూరం చేస్తోంది. సువిశాల అటవీ పర్వతమయమైన గిల్గిత్ బాల్టిస్థాన్‌లో జన సాంద్రత తక్కువ. కానీ పాకిస్తాన్ నుంచి చొరబడిన వారివల్ల జన సాంద్రత పెరిగింది, మొత్తం జనాభాలో స్థానిక కశ్మీరీల సంఖ్య యాబయి తొమ్మిది శాతానికి దిగజారింది. ‘టిబెట్‌లోకి చైనావారు చొరబడడం’ నుంచి పాకిస్తాన్ ప్రభుత్వానికి ఈ చొరబాటు స్ఫూర్తి లభించింది. 1999లో అధికారాలు నామమాత్రమైన ‘శాసన మండలి’ ఏర్పడింది. 2009లో ‘గిల్గిత్ బాల్టిస్థాన్’ను తమ దేశంలోని కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించిన పాకిస్తాన్ ప్రభుత్వ చర్యను ‘దురాక్రమిత కశ్మీర్’ సుప్రీం కోర్టు తప్పుపట్టింది, రద్దు చేసింది. ఈ తీర్పును పాకిస్తాన్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఇప్పుడు ‘గిల్గిత్ బాల్టిస్థాన్’ను ప్రత్యేక రాష్ట్రంగా ప్రకటించడం వెనుక చైనా హస్తం ఉంది!
కశ్మీర్ ఈశాన్య తూర్పు ప్రాంతాలలో దాదాపు నలబయి మూడు వేల చదరపు కిలోమీటర్ల మన భూమిని చైనా దురాక్రమించి ఉంది. ఈ ప్రాంతం గుండా టిబెట్ నుంచి ఝింజియాంగ్ వరకు చైనా రహదారిని నిర్మించింది. ఈ రహదారి గిల్గిత్ బాల్టిస్థాన్‌లోని ‘కారాకోరమ్’ పర్వతశ్రేణి గుండా సాగుతోంది. కారాకోరం పర్వతశ్రేణి శిఖర భాగం మన దేశానికి ‘ఝింజియాంగ్’కు మధ్య అనాదిగా సరిహద్దు ప్రాంతం. ఝింజియాంగ్ - సింకియాంగ్- తూర్పు తురికీస్థాన్- ఒకప్పుడు ‘హూణ’ దేశం. బౌద్ధం, బౌద్ధం కంటె ముందు వేద మతాలు ఆ ప్రాంతంలో పరిఢవిల్లాయి. ఇస్లాం జిహాదీలు కలియుగం ముప్పయి తొమ్మిదవ శతాబ్ది- క్రీస్తుశకం ఎనిమిదవ శతాబ్ది-లో ‘హూణ’ దేశంలో చొరబడి బౌద్ధ నిర్మూలన చేశారు. ఇస్లాం బాహుళ్యమైన ఈ ప్రాంతాన్ని 1883లో చైనా పూర్తిగా ఆక్రమించింది. 1959లో చైనా టిబెట్‌ను ఆక్రమించింది. అందు టిబెట్‌ను ‘సింక్‌యాంగ్’ను కలుపుతూ చైనా ఆరువందల కిలోమీటర్ల రహదారి నిర్మించింది. ఈ రహదారి నిర్మాణం ‘గిల్గిత్ బాల్టిస్థాన్’ గుండా జరిగింది. ‘కారాకోరమ్’ ప్రాంతంలో దాదాపు ఆరువేల చదరపు కిలోమీటర్ల భూమిని చైనాకు పాకిస్తాన్ ధారాదత్తం చేసింది. ఫలితంగా కారాకోరం పర్వతశ్రేణి మొత్తం సింకియాంగ్‌లో కలిసింది. ప్రస్తుతం చైనా గిల్గిత్‌లో ఆర్థిక వాణిజ్య ప్రాంగణం నిర్మిస్తోంది. ఫలితంగా పాకిస్తానీయులతోపాటు, చైనావారు కూడ ‘గిల్గిత్ బాల్టిస్థాన్’లో స్థిరపడుతున్నారు. ఈ ‘చొరబాటు’ను స్థానికులు వ్యతిరేకిస్తున్నారు. ఇదీ గిల్గిత్‌లో నెలకొన్న వైపరీత్యం!