సంపాదకీయం

‘పైస’కు ‘పట్టం’..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రభుత్వం వారు మళ్లీ ‘ఒక్క కొత్త పైస’ నాణెమును ముద్రించగలరన్నది జనానికి కలుగుతున్న భావం. ఇది ‘భ్రాంతి’ కావచ్చు. కానీ ప్రభుత్వరంగంలోని చమురు సంస్థలు బుధవారం ఇంధన తైలం ధరలను ఒక పైసా తగ్గించడం మాత్రం భ్రాంతి కాదు. వంద రూపాయల పెట్రోలు పోయించుకున్న ‘పాతకాలం మనుషులు’ కొందరు ఒకటిన్నర పైసలను వెనక్కి ఇమ్మని వ్యాపారులను అడుగుతున్నారట! ‘అరపైస’ పోతే పోనీ ‘పైస’ను అయినా వాపస్ ఇమ్మని అమాయకంగా పేచీలు పెట్టారట! ‘పాతకాలం’ మనుషులంటే 1980వ దశకంలో యువకులుగా ఉండినవారు. వారికి ‘కొత్తపైసల’ గురించి తెలుసు. అందువల్ల ‘నయాపైస’ మేర పెట్రోలు లీటర్ ధర తగ్గినందుకు ఈ పాతకాలం మనుషులు మురిసిపోయారు. బ్రిటన్ దుండగులు మనదేశాన్ని పాలించిన కాలంలో అణాలు, పైసలు ఉండేవట! పదహారు అణాలు ఒక రూపాయి. పనె్నండు పైసలు ఒక అణా. అంటే రూపాయికి నూట తొంబయి రెండు పైసలుండేవి. 1918లో పుట్టెడు వడ్లు ఎనిమిది రూపాయలట! కవిసమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ, చిలకమర్తి లక్ష్మీనరసింహం వంటి మహనీయుల రచనల్లో ఇలాంటి సంగతులు లభిస్తాయి. విడిగా బస్తా వడ్ల ధర రూపాయి. అంటే ఇప్పటి వంద కిలోల బియ్యం బస్తా ధర రెండు రూపాయలు, కందిపప్పు బస్త్ధార నాలుగు రూపాయలు! కందిపప్పు కిలోధర- అప్పుడు ‘వీసె’లుండేవి- ఎనిమిది పైసలు, బియ్యం కిలోధర నాలుగు పైసలు. కానీ ఈ పాత పైసలు రెండయితే ఒక కొత్త పైస- న్యూ పైస్- నయాపైసా- అని 1950వ దశకంలో స్వతంత్ర భారత ప్రభుత్వం నిర్ధారించిందట! అందువల్ల నూట తొంబయి రెండు పాత పైసలను ‘మెట్రిక్’ పద్ధతిలో వంద కొత్తపైసలుగా నిర్ధారించారు. రూపాయికి వంద- కొత్త-పైసలయ్యాయి. అణాలు రద్దయిపోయి కాలగర్భంలో కలిశాయి. 1918లో కొత్త పైసల లెక్క ప్రకారం కిలో కందిపప్పు ధర నాలుగు పైసలు, కిలోబియ్యం ధర రెండు పైసలు.. ‘పైస’ సామాన్యమైనదేమీ కాదు 1918లో. అందువల్ల పెట్రోలు, డీజిల్ ధరలను ఒక ‘పైస’ తగ్గించినవారు తాము 1918లో జీవిస్తున్నామని భ్రమపడి ఉండవచ్చు. ఈ ‘భ్రాంతి’కి కారణం ‘మాయాబజార్’ చలనచిత్రంలో మహాకవి పింగళి నాగేంద్రరావు దర్శించినట్టు పైత్య ప్రకోపం అయి ఉండవచ్చు. లేదా ‘పైస’ తగ్గించిన చమురు సంస్థల నిర్వాహకులు ‘పగటికల’లో గతంలోకి వెళ్లి ఉండవచ్చు. ఖరీదైన విదేశీయ మద్యం కుతికెల వరకూ తాగి కార్యాలయాల్లోనే కక్కుతూ ఉండి ఉండవచ్చు. లేదా ఈ నిర్వాకాన్ని నిర్వహించిన నిపుణులను 1918 నాటి గత జన్మ స్మృతులు దయ్యాల వలె ఆవహించి ఉండవచ్చు.. మంచి దయ్యాలు కూడ ఉంటాయట!
అందువల్ల మరచిపోయిన ‘పాతతరం’ మనుషులకు 1980 వ దశకంలో మరుగునపడ్డ ‘పైస’ నాణెం మళ్లీ గుర్తుకొచ్చింది. ‘అంతా మనమంచికే’ అన్నట్టు చమురు సంస్థల నిర్వాహకులు జనంపై సంధించిన ఈ ‘మొరటైన, క్రూరమైన చతురోక్తి’- క్రూడ్ అండ్ క్రూయల్ జోక్- వల్ల జనానికి తాత్కాలికంగానైనా ‘పైస’ గుర్తుకొచ్చింది, ‘పైస’ ప్రాధాన్యం ప్రస్ఫుటించింది, మన ‘నాణెముల’ చరిత్ర స్ఫురించింది. ‘పైస’ మేర కూడ ధరలు తగ్గుతాయి కాబట్టి ప్రభుత్వం వారు ‘టంకశాలల’లో పైసల నాణెములు ముద్రిస్తారన్నది, జనంలోకి విడుదల చేస్తారన్నది తాత్కాలికంగా కలిగిన ఆకాంక్ష, చిగురించిన ఆశ! కనుమరుగైపోతున్న వాటిని పరిరక్షించడానికి, పెంపొందించడానికి ప్రభుత్వం రకరకాల ‘వారసత్వ పథకాల’- హెరిటేజ్ ప్రాజెక్టుల- ను అమలు జరుపుతోంది. అందువల్ల ‘పైస’ను, రెండు-మూడు-ఐదు పైసలను మళ్లీ భారీ ఎత్తున ముద్రించి ప్రభుత్వం వాటిని పరిరక్షించాలి. ‘పైస’ మాత్రం డబ్బు కాదా? దానికి మాత్రం విలువ లేదా? అన్నది ప్రభుత్వ నిర్ణయంలోని ‘్ధ్వని’, చమురు సంస్థలు సృష్టించిన వికృత ధ్వని..
ఒక నటుడు చిత్రీకరణ- షూటింగ్- ముగిశాక ‘చిత్ర’ వస్త్రాలను విప్పేసి తన సొంత బట్టలు ధరించి ఇంటికెళ్లాడట! తాను విప్పేసిన ‘చిత్ర’ వస్త్రాల జేబులలో తన డబ్బును వదలివేసినట్టు ఆయనకు ఇంటికి చేరిన తరువాత గుర్తుకొచ్చింది. వెంటనే చిత్ర నిర్మాతకు ఫోన్ చేసి ఆ సంగతి చెప్పాడు. జేబులను శోధించి తన డబ్బును తెచ్చి ఇవ్వమని పురమాయించాడు. నిర్మాత తన ఉద్యోగికి ఫోన్ చేశాడు. ఆ ఉద్యోగి ఆ బట్టలు విప్పిన స్థలానికి హుటాహుటిన వెళ్లాడు. కానీ అక్కడ బట్టలు లేవు. ‘దోబీ’కి ఇచ్చేశారట ఉతకడానికి. ఆ ఉద్యోగి మరుసటి రోజు ‘దోబీ’ ఇంటికెళ్లాడు. బట్టలు ఆ సరికి దోబీఘాట్‌కు వెళ్లాయి. అలా వెతుక్కుంటూ వెళ్లి, చిత్రనాయకుడు ధరించిన బట్టలను శోధించిన ఆ ఉద్యోగికి ఒక జేబులో రెండు రూపాయల నోటు మాత్రం కనిపించిందట. కొండను తవ్వి ఎలుకను పట్టిన ఆ ఉద్యోగికి- ‘రెండు రూపాయలు డబ్బులు కాదా ఏమిటి?’ అని నటుడు ముక్తాయింపు ఇచ్చాడట! ‘పైస’ మాత్రం డబ్బు కాదా ఏమిటి? అన్నది చమురు సంస్థల వారు, కేంద్ర ప్రభుత్వం వారు ‘చక్కగా సిగ్గులేకుండా’ సంధించిన ప్రశ్న.. రూపాయికి, రెండు రూపాయలకి సైతం కాలం చెల్లడానికి రంగం సిద్ధమైంది. తెలంగాణ రహదారి రవాణా సంస్థ- ఆర్‌టిసి- వారి బస్సులలో ఇప్పటికే ఈ ‘నాణెముల’ చెలామణిని రద్దు చేశారు. ‘ఐదు రూపాయలు’ అతి చిన్న నాణెం కాబోతోంది. అలాంటిది ‘పైస’ మేర ధరను తగ్గించామని చెప్పే సాహసానికి చమురు కంపెనీలు ఒడిగట్టాయి. ఇదీ ‘ప్రపంచీకరణ’ మాయల మారీచ మృగం సృష్టించిన బంగారపు భ్రాంతి! గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం వారు పెట్రోలియం పంపిణీ సరిహద్దులను చెరిపివేశారు. పెట్రోలియం వ్యవస్థను అంతర్జాతీయ విపణితో అనుసంధానం చేశారు. అంతర్జాతీయ ఆర్థికవేత్త మన్మోహన్ సింగ్ సాధించిన ఘన విజయాలలో ఈ అంతర్జాతీయ అనుసంధానం ప్రధానమైనది. అమెరికా ప్రభుత్వ అధినేతలు ప్రశంసించారు, బహుళ జాతీయ చమురు సంస్థలు సంతోషించాయి. అప్పటి నుంచి చమురు ధరలు నెలకోసారి, వారానికోసారి పెరిగాయి. ప్రతిరోజూ పెరుగుతుండడం ప్రస్తుత ప్రభుత్వం ఘనత.. ఘనకీర్తి! మన్మోహన్ సింగ్ ప్రభుత్వం నిర్మించిన ‘ప్రపంచీకరణ’ బాటలో మోదీ ప్రధానమంత్రిత్వంలోని భారతీయ జనతాపార్టీ ప్రభుత్వం ‘అడుగులో అడుగువేసి’ ముందుకు సాగుతోంది. ప్రతిరోజూ ధరలు పెరగకపోతే అంతర్జాతీయ ‘మాయల వేదిక’పై మన అభినయానికి ‘రేటింగ్స్’ పడిపోతాయట! ‘సావరిన్ రేటింగ్స్’- దేశాల ఆర్థికస్థాయి- ప్రధానం! అందుకే ఇండోనేసియాలో సైతం మన ప్రధాని మోదీ ‘మూడీస్’ను పొగిడి వచ్చాడు. ‘మూడీస్’, ‘ఎస్‌పి’- స్టాండర్డ్స్ అండ్ పూర్స్- వంటివి ప్రవర్థ దేశాలను ‘బహుళ జాతీయ వాణిజ్య సంస్థల’ తరఫున బెదిరిస్తున్న దళారీ ముఠాలు. ప్రభుత్వానికి మతిపోయింది, పెట్రోలు ధర ‘పైస’ తగ్గింది...
ప్రపంచీకరణకు పూర్వం పాలకులకు ఆందోళన కలిగేది.. 1970వ దశకంలో పెట్రోలు కొరత ఏర్పడి ధరలు పెరిగినపుడు అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ గుఱ్ఱం బండిలో ఇంటి నుంచి పార్లమెంటుకు పయనించి ఆందోళన వ్యక్తం చేసింది. భారతీయ జనసంఘ్ అధినాయకుడు అటల్ బిహారీ వాజపేయి ఎద్దుల బండిలోను, ఆయన వరిష్ఠ సహచరుడు లాల్‌కృష్ణ అద్వానీ సైకిల్ ఎక్కి పార్లమెంటుకు వచ్చినట్టు చరిత్ర సాక్ష్యం చెబుతోంది. ఈ చరిత్రను బహుళ జాతీయ వాణిజ్య సంస్థలు చింపేశాయి. అందువల్లనే ధరలు ఎంత భయంకరంగా పెరిగినప్పటికీ పాలకులకు, రాజకీయవాదులకు ‘చీమ కుట్టదు..’