సంపాదకీయం

మార్పులేని ‘సీట్ల జాతర’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలుగు రాష్ట్రాల్లో ఎంసెట్ కౌనె్సలింగ్ సందడి ప్రారంభం కాగా, మరోవైపు ప్రైవేటు ఇంజినీరింగ్ కళాశాలల్లో ‘సీట్ల జాతర’కు యథావిధిగా తెరలేచింది. ఎంసెట్ కన్వీనర్ కోటాలో ప్రవేశాల ప్రక్రియ ప్రారంభం కాకముందే ‘మేనేజ్‌మెంట్ కోటా’ పేరిట సీట్లను ప్రైవేటు కాలేజీలు అమ్మకానికి పెట్టాయన్న వార్తలు వ్యాపించాయి. ఇంటర్ మార్కులతో గానీ, ప్రవేశ పరీక్షలో ర్యాంకుతో గానీ సంబంధం లేకుండానే కొన్ని ‘టాప్’ కాలేజీల్లో ఇంజినీరింగ్ సీట్లను కేటాయిస్తున్నారట! వేలం మాదిరి డిమాండ్ పెంచి మరీ డొనేషన్లు వసూలు చేస్తున్నందున అడ్డగోలు దందా యథేచ్ఛగా సాగుతోందన్న ఆరోపణలు లేకపోలేదు. బ్రాంచిని బట్టి ‘రేటు’ను నిర్ణయించినా, ఒకేసారి నాలుగేళ్ల ఫీజులను చెల్లించాలని షరతులు పెట్టినా కళాశాల యాజమాన్యాలను అడిగే పరిస్థితి లేదు. కన్వీనర్ కోటాలో తమకు నచ్చిన కాలేజీలో సీటు వస్తుందో రాదోనన్న అనుమానంతో చాలామంది విద్యార్థుల తల్లిదండ్రులు భారీగా డొనేషన్లు చెల్లిస్తూ తమ పిల్లలకు సీట్లను ‘రిజర్వ్’ చేసుకుంటున్నారట! ఎన్ని కష్టాలు పడైనా తమ పిల్లలను ఇంజినీరింగ్ చదివించాలన్న తల్లిదండ్రుల అవసరాన్ని కార్పొరేటు కాలేజీలు యథాశక్తిన సొమ్ము చేసుకుంటున్నాయి. నచ్చిన కాలేజీలో సీటు గ్యారంటీ అన్న సంతృప్తితో ఉన్న విద్యార్థుల తల్లిదండ్రులు కాలేజీ యాజమాన్యాలను నిలదీసే పరిస్థితి కనిపించడం లేదు. మేనేజ్‌మెంట్ కోటాలో సీట్లను కొనుగోలు చేసేవారు తమ ఇబ్బందులను బయటకు చెప్పుకోలేక వౌనంగానే అడిగినంత ఫీజులను సమర్పించుకుంటున్నారు. ఇంజినీరింగ్‌లో కంప్యూటర్ సైన్స్ (సీఎస్), ఈసీఈ వంటి బ్రాంచిలకు మంచి డిమాండ్ ఉండడంతో బీ కేటగిరీలో వాటికి వేలం వెర్రి ఏర్పడింది. ఇప్పటికే ఈ కోటా సీట్ల భర్తీ దాదాపు పూర్తయ్యిందన్న ప్రచారం కూడా జరుగుతోంది. బీ కేటగిరీ కింద సీట్ల కేటాయించేందుకు కొన్ని ‘ప్రథమ శ్రేణి’ కళాశాలలు భారీగా డొనేషన్లు, ప్రవేశ రుసుములను వసూలు చేయడం పరిపాటిగా మారింది. సాఫ్ట్‌వేర్ రంగంలో భారీ వేతనాలు, బోలెడు సౌకర్యాలు ఉంటాయన్న భావనతో విద్యార్థులు కంప్యూటర్ సైన్స్‌కే తొలి ప్రాధాన్యం ఇస్తున్నారు. మెకానికల్, ఈఈఈ, సివిల్ ఇంజినీరింగ్ బ్రాంచిల పరిస్థితి కూడా గత ఏడాదికంటే భిన్నంగా లేదు. గత ఏడాది ప్రైవేటు ఇంజినీరింగ్ కళాశాలలు డిమాండ్ లేని బ్రాంచిల్లో సుమారు 30 వేల సీట్లను స్వచ్ఛందంగా వదులుకున్నాయి. అందుకే డిమాండ్ ఉన్న బ్రాంచిలకు ఒక్కో కాలేజీలో ఒక్కో రేటు పలుకుతోందట! కన్వీనర్ కోటా కింద ప్రవేశాలు పొందిన విద్యార్థుల నుంచి ప్రైవేటు కాలేజీలు డొనేషన్లు, ఫీజుల వసూళ్లకు పాల్పడితే సంబంధిత యూనివర్సిటీకి ఫిర్యాదు చేసే అవకాశం ఉంటుంది. కానీ, యాజమాన్య కోటాలో సీట్లను ఇష్టపూర్వకంగా కొనుగోలు చేసేవారు అలా ఫిర్యాదు చేసే అవకాశం లేదు.
మన సమాజంలో ఇంజినీరింగ్, మెడిసిన్ కోర్సులకు ఉన్న ‘క్రేజ్’ చెప్పనలవి కాదు. అబ్బాయైతే ఇంజినీర్ అని, అమ్మాయైతే డాక్టర్ కావాలని తల్లిదండ్రులు ఒకప్పుడు ఆరాటపడేవారు. అయితే, కేరీర్ పరంగా మంచి అవకాశాలు ఉండడంతో ఇప్పుడు అబ్బాయిలు, అమ్మాయిలు అనే తేడా లేకుండా అంతా ఇంజినీరింగ్‌పైనే దృష్టి పెడుతున్నారు. మంచి కాలేజీలో తమ పిల్లలను చేర్పించాలని తల్లిదండ్రులు తపన పడడం సహజమే. ఇందుకోసం వారు ఎంతటి ఖర్చుకైనా వెనుకాడక పోవడంతో ఇంజినీరింగ్ విద్య ‘వ్యాపారమయం’ అయింది. ముఖ్యంగా కంప్యూటర్ సైన్స్ చదివితే విదేశాల్లో భారీ ప్యాకేజీలపై జీతభత్యాలుంటాయన్న ‘డాలర్ కలలు’ అన్ని వర్గాల్లోనూ విస్తరించాయి. ‘సాఫ్ట్‌వేర్ బూమ్’, క్యాంపస్ సెలక్షన్లు, బహుళజాతి కంపెనీల్లో ఉద్యోగాలు వంటివి ఇంజినీరింగ్ విద్యకు డిమాండ్‌ను పెంచుతున్నాయి. దీంతో ఏడాదికేడాది కొన్ని కీలక బ్రాంచిలకు డిమాండ్ అనూహ్యంగా పెరుగుతోంది. డిమాండ్ ఉన్న బ్రాంచిని బట్టి ఒక్కో సీటును నాలుగు లక్షల నుంచి పది లక్షల రూపాయల వరకూ కార్పొరేట్ కాలేజీలు సొమ్ము చేసుకుంటున్నాయట! ‘ప్రథమ శ్రేణి’ కళాశాలల్లోనే సీట్ల పరిస్థితి ఇలా ఉంటే ఇక మిగతా కాలేజీల పరిస్థితి గురించి ప్రత్యేకంగా చెప్పుకోవలసిన అవసరం లేదు.
ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఏ ప్రైవేటు కళాశాలలోనైనా 70 శాతం సీట్లను ఎంసెట్ కన్వీనర్ కోటాలో, మిగతా 30 శాతం సీట్లను యాజమాన్య కోటాలో భర్తీ చేయాల్సి ఉంది. యాజమాన్య కోటా కింద ఉన్న 30 శాతం సీట్లలో ఎన్‌ఆర్‌ఐ కేటగిరీ కింద 15 శాతం, మిగతా 15 శాతం సీట్లను జేఈఈ, ఎంసెట్ ర్యాంకర్లకు కేటాయించాలి. ఎలాంటి పోటీ లేనపుడు ఇంటర్ మార్కుల ప్రాతిపదికపై సీట్లను భర్తీ చేయాలి. కొన్ని కాలేజీల్లో యాజమాన్య కోటాలో సీట్ల భర్తీ వ్యవహారం నిబంధనలకు విరుద్ధంగా జరుగుతోందనేది బహిరంగ రహస్యం! ‘ప్రథమ శ్రేణి’ కాలేజీల్లో యాజమాన్య కోటా కింద సీట్ల కోసం ఆరాటపడేవారిలో పదివేల ర్యాంకు పైనున్న వారే ఎక్కువ సంఖ్యలో ఉంటారు. పదివేల ర్యాంకులోపు వారికి కన్వీనర్ కోటాలోనే సీట్లు లభిస్తాయి. వారికి ప్రభుత్వం నుంచి ఫీజు రీయింబర్స్‌మెంట్ సైతం లభిస్తుంది. మెరిట్ ప్రకారం సీటు లభించని వారే అధిక సంఖ్యలో మేనేజ్‌మెంట్ కోటాపై దృష్టి సారించి భారీగా డొనేషన్లు చెల్లించేందుకు సిద్ధపడుతుంటారు. వాస్తవానికి కన్వీనర్ కోటా, యాజమాన్య కోటాలో ఫీజులు సమానంగా ఉండాలి. కానీ, ఏ ‘ప్రథమ శ్రేణి’ ప్రైవేటు కాలేజీ కూడా ‘కామన్ ఫీజు’కు విద్యార్థులను చేర్చుకోదు. తమ వద్ద ఉన్న ఫ్యాకల్టీ, ప్లేస్‌మెంట్స్, ఇతర సౌకర్యాలు ఇంకెక్కడా లేవని పలు కాలేజీలు చేస్తున్న ప్రచారానికి విద్యార్థులు ‘్ఫదా’ అయిపోతున్నారు.
ఇంజినీరింగ్ కళాశాలల్లో బీ కేటగిరీ సీట్లను కౌనె్సలింగ్ ద్వారా భర్తీ చేస్తే డొనేషన్ల బెడద తగ్గే అవకాశం ఉందని నిపుణులు సూచిస్తున్నారు. రెండేళ్ల క్రితం వరకూ మెడిసిన్ సీట్ల జాతర జోరుగా సాగినా, కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ‘జాతీయ స్థాయి ప్రవేశపరీక్ష’ (నీట్) ప్రారంభం కావడంతో పరిస్థితి కొంత అదుపులోకి వచ్చింది. ఇంజినీరింగ్ ప్రవేశాలకు కూడా ‘నీట్’ మాదిరి జాతీయ స్థాయి ఎంట్రన్స్ అనివార్యమన్న వాదన కొంతకాలంగా వినిపిస్తోంది. కౌనె్సలింగ్ ద్వారా ప్రవేశాలు నిర్వహిస్తే మేనేజ్‌మెంట్ కోటాలో సైతం మెరిట్ విద్యార్థులకు సీట్లు లభించే అవకాశం ఉంది. ఆన్‌లైన్‌లో దరఖాస్తులను ఆహ్వానించి బీ కేటగిరీ సీట్లను భర్తీ చేసేందుకు 2012లో ఉమ్మడి రాష్ట్రం హయాంలో జీవో విడుదలైనా, కొన్ని ప్రైవేటు కాలేజీలు కోర్టుకు వెళ్లడంతో ఆ ప్రయత్నాలకు గండిపడింది. మూడేళ్ల క్రితం తెలంగాణ ఉన్నత విద్యామండలి ఇటువంటి కసరత్తు చేసినా అది కార్యరూపం దాల్చలేదు. ఇంజినీరింగ్ ప్రవేశాలకు జాతీయ స్థాయి ఎంట్రన్స్ ప్రారంభించేందుకు కేంద్రం ‘నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ’ని ఏర్పాటు చేసినప్పటికీ, ఏ విద్యా సంవత్సరం నుంచి అది కార్యరూపం దాలుస్తుందో ఇంకా స్పష్టత లేదు. నిబంధనలకు లోబడి, పారదర్శకంగానే ప్రవేశాలు జరుగుతున్నాయని ప్రభుత్వం, కాలేజీ యాజమాన్యాలు చెబుతున్నా- ఇంజినీరింగ్ సీట్ల భర్తీకి సంబంధించి సంస్కరణలు అవసరమన్నది కాదనలేని వాస్తవం.