సంపాదకీయం

‘షాంఘయి’ చతురోక్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చైనాతో కొనసాగుతున్న మన సంబంధాలలో నిహితమై ఉన్న వైరుధ్యాలకు ‘షాంఘయి’ కూటమి మరో నిదర్శనం. చైనా ఆధిపత్య విస్తరణ కోసం 2001లో ఏర్పడిన ఈ ‘షాంఘయి సహకార సమాఖ్య’- ఎస్‌సిఓ- షాంఘయి కోఆపరేషన్ ఆర్గనైజేషన్-లో మనదేశం సభ్యత్వం పుచ్చుకోవడమే మన విదేశ వ్యవహారాల విధాన వైపరీత్యం. చైనాలోని ‘క్షింగ్‌డావో’ నగరంలో ఆదివారం జరిగిన ఈ ‘షాంఘయి సమాఖ్య’ శిఖర సమావేశం సందర్భంగా మనకూ చైనాకూ మధ్యగల వైరుధ్యాలు మరోసారి ప్రస్ఫుటించాయి. చైనా ప్రభుత్వం ఆర్భాటంగా రూపొందించి అమలు జరుపడానికి యత్నిస్తున్న ‘వాణిజ్య మండల, మహాపథ నిర్మాణ’- బెల్ట్ అండ్ రోడ్ ఇనీషియేటివ్’- ‘బిఆర్‌ఐ’- బృహత్ పథకాన్ని ‘క్షింగ్‌డావో’ మహాసభలో మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వ్యతిరేకించాడు. మన ప్రభుత్వం గత నాలుగేళ్లగా ఈ పథకాన్ని వ్యతిరేకిస్తోంది. ప్రాచీన కాలం నుంచి కొనసాగిన ‘పట్టుదారి’- సిల్క్‌రోడ్-ని పునరుద్ధరించడం పేరుతో చైనా తన రాజకీయ, వ్యూహాత్మక, వాణిజ్య, దౌత్య ప్రాబల్యాన్ని ఆసియాలోను, ఆఫ్రికాలోను విస్తరించడానికి ఈ ‘ఒకే మండలం’ ‘ఒకేదారి’ అన్న కార్యక్రమాన్ని రూపొందించింది. టిబెట్ నుంచి ‘ఝింజియాంగ్’- సింకియాంగ్-, మన జమ్మూ కశ్మీర్, ఆప్ఘానిస్థాన్‌ల మీదుగా మధ్య ఆసియాను పశ్చిమ ఆసియాను ‘బాట’ద్వారాను ‘ఇనుప బాట’- రైలుమార్గం ద్వారాను తమ దేశంతో అనుసంధానం చేయడం ఈ పథకం లక్ష్యం. దీనివల్ల మన ఉత్తరపు సరిహద్దుకు చైనా దురాక్రమణ ప్రమాదం మరింత పెరుగుతుంది. ఈ ‘పట్టుదారి’ని సముద్రమార్గంతో అనుసంధానం చేయడం ద్వారా మిగిలిన మూడువైపుల నుంచి మన దేశాన్ని ‘కనిపెట్టి ఉండడం’ చైనా లక్ష్యం. ఇలా ‘కనిపెట్టి ఉండడం’ వ్యూహాత్మక దిగ్బంధనం. ఈ ‘పట్టుబాట’ పాకిస్థాన్ దురాక్రమిత జమ్మూ కశ్మీర్- పాకిస్తాన్ ఆక్యుపైడ్ కశ్మీర్’- పిఓకె-లోని ఉత్తరభాగం గుండా కొనసాగుతోంది. ఈ రెండు కారణాల వల్ల మన ప్రభుత్వం ఈ ‘బిఆర్‌ఐ’ పథకాన్ని వ్యతిరేకిస్తోంది. కానీ ‘క్షింగ్‌డావో’లో జరిగిన ‘షాంఘయి’ సమావేశంలో, మన దేశం తప్ప మిగిలిన సమాఖ్య సభ్యదేశాలు ‘బిఆర్‌ఐ’ను సమర్ధించాయి. ఇలా మనదేశం ‘ఒంటరి’ అయిపోవడానికి ఈ ‘క్షింగ్‌డావో’ సమావేశం ‘షాంఘయి కూటమి’ దోహదం చేయడం వర్తమాన వైచిత్రి. ‘బిఆర్‌ఐ’ను వ్యతిరేకిస్తున్న మన దేశం ‘షాంఘయి కూటమి’లో చేరడం మన విధానంలోని వైరుధ్యం. ఎందుకంటె ‘షాంఘయి’ కూటమి లక్ష్యం, ‘పట్టుబాట పునరుద్ధరణ’ లక్ష్యం పరస్పరం ముడివడి ఉన్నాయి. ఈ లక్ష్యం చైనా వ్యూహాత్మక దురాక్రమణ విస్తరణ.
రష్యా తదితర ఏడు ‘షాంఘయి’ సభ్య దేశాలు ‘పట్టుబాట’ను సమర్ధించాయి. ‘షాంఘయి’ కూటమి ఏర్పాటుకు నేపథ్యం మధ్య ఆసియా దేశాలు మన దేశానికి సన్నిహితం కాకుండడానికి చైనా పన్నిన పన్నాగం. సోవియట్ రష్యా విచ్ఛిన్నమైన తరువాత ‘సోవియట్ సమాఖ్య’ పదిహేను దేశాలుగా విడిపోయింది, మధ్య ఆసియాలోని ఆరు దేశాలు చైనాకు, రష్యాకు మధ్య ఏర్పడినాయి. ఫలితంగా చైనాకు, రష్యాకు మధ్య ఈ ప్రాంతంలో సరిహద్దు లేకుండాపోయింది. సరిహద్దు సమస్య సహజంగా పరిష్కారమైంది. చైనా ఈశాన్యంలో మాత్రమే రష్యాతో ఆ దేశానికి సరిహద్దు మిగిలింది. ఒకప్పుడు స్వతంత్ర దేశంగా ఉండిన టిబెట్ మళ్లీ స్వతంత్ర దేశం అయినట్టయితే మనకూ చైనాకు మధ్య కూడ సరిహద్దు తగాదా సహజంగానే సమసిపోగలదు. మధ్య ఆసియాలోని దేశాలు ‘సోవియట్ సమాఖ్య’ నుంచి విడిపోవడం వల్ల మనదేశం నేర్చుకోదగిన పాఠం ఇది. ఇలా విడిపోయిన మధ్య ఆసియా దేశాలు మన దేశంతో సన్నిహితం కాకుండా నిరోధించడానికి వీలుగా 2001లో చైనా షాంఘయి కూటమిని ఏర్పాటుచేసింది. మధ్య ఆసియాలోని ఖజక్‌స్థాన్, కిర్గీస్థాన్, తజకిస్తాన్ ఈ కూటమిలో చేరాయి. అమెరికా పట్ల వ్యతిరేకతతో చైనాతో జట్టుకట్టిన రష్యా కూడా ఈ కూటమిలో చేరింది. ఇలా ఐదు దేశాలతో కలసి ‘షాంఘయి కూటమి’ ఏర్పడింది. ఆ తరువాత మరో మధ్య ఆసియా దేశం ఉజ్‌బెకిస్థాన్ కూడ ఈ కూటమిలో చేరింది... ‘షాంఘయి’ చైనాలోని అతి పెద్ద నగరం!
ఈ కూటమి ఏర్పడిన తరువాత మధ్య ఆసియా దేశాలతో మనకు కుదిరిన అనేక వాణిజ్య అంగీకారాలు అర్ధాంతరంగా రద్దుకావడం పదిహేను ఏళ్ల చరిత్ర. మధ్య ఆసియా దేశాలు ఆ తరువాత ఈ వాణిజ్య పథకాలను చైనాకు అప్పగించాయి. మధ్య ఆసియా నుంచి మనకు ఇంధన తైలం ఇంధనవాయువు లభించకుండా చైనా విఫలయత్నాలను, సఫలయత్నాలను కొనసాగిస్తోంది. ‘షాంఘయి కూటమి’ ఏర్పడేవరకు ‘నిద్రపోవడం’ 1991లో మధ్య ఆసియా ‘సోవియట్ యూనియన్’ నుంచి విడిపోయిన తరువాత పదేళ్ల మన విధాన వైపరీత్యం. షాంఘయి కూటమి కంటె ముందే మన ప్రభుత్వం మధ్య ఆసియా దేశాలను, శ్రీలంక నేపాల్ భూటన్ వంటి పొరుగుదేశాలను కలుపుకొని ‘ముంబయి సమాఖ్య’ను లేదా ‘కలకత్తా వాణిజ్య సమాఖ్య’ను ఏర్పాటుచేసి ఉండాలి. షాంఘయి కూటమి ఏర్పడిన తరువాతనైనా మన ప్రభుత్వం ‘ఇంధన సంపన్నమైన’, ‘్భగోళిక వ్యూహాత్మకమైన’ మధ్య ఆసియా దేశాలను కలుపుకొని మరో వాణిజ్య సమాఖ్యను ఏర్పాటుచేసి ఉండాలి. ఈ రెండూ జరగలేదు. ‘షాంఘయి కూటమిలో మమ్మల్ని చేర్చుకోండి’- అని 2004-2014 సంవత్సరాల మధ్య మన ప్రభుత్వం ‘దేబిరించడం’ చరిత్ర. చివరికి మనకు ‘పరిశీలక’ భాగస్వామ్యం లభించింది. ఎట్టకేలకు పూర్తిస్థాయి సభ్యత్వం లభించింది. పాకిస్తాన్‌కూ మనకూ కూడ ఈ పూర్తిస్థాయి సభ్యత్వాన్ని చైనా నియంతలు ఒకేసారి ప్రసాదించడం మన దేశానికి అవమానకరం. ఈ సభ్యత్వం మన రక్షణ వ్యూహాత్మక వాణిజ్య దౌత్య ప్రయోజనాలకు భంగకరం. చైనా ‘తోడేలు’కు ‘తోక’గా వెలసిన ఈ షాంఘయి సమాఖ్యలో మనకు పూర్తిస్థాయి సభ్యత్వం లభించిన తరువాత ఈ ‘క్షింగ్‌డావో’ శిఖర సభ జరిగింది. ‘బిఆర్‌ఐ’ను ఈ సమావేశంలో ప్రస్తావించడం ద్వారా, ‘పట్టుదారి’ గురించి మహాసభ తీర్మానపు ప్రకటనలో ఉటంకించడం ద్వారా చైనా మన దేశాన్ని ఒంటరిని చేసింది.
మన దేశానికీ చైనాకుమధ్య కొనసాగుతున్న ప్రధాన వివాదాలు మరుగున పడిపోవడానికి, మన ప్రయోజనాలు ప్రాధాన్యం కోల్పోవడానికి దోహదం చేస్తున్న విపరిణామక్రమంలో ఈ ‘షాంఘయి క్షింగ్‌డావో’ ప్రహసనం వర్తమాన ఘట్టం. మన ప్రధాన సమస్య మన భూభాగాలను చైనా కబళించి ఉండడం. వాటిని చైనా తిరిగి మనకు అప్పగించేవరకు చైనాతో మైత్రి ఏమిటి? కూటమి ఏమిటి? వాణిజ్యం ఏమిటి? ఆప్ఘానిస్థాన్‌లో భారత- చైనాలు ఉమ్మడిగా పథకాలను అమలుజరపడం ఏమిటి? మన జమ్మూ కశ్మీర్‌ను పాకిస్తాన్‌తో కలిసి ఉమ్మడిగా కాజేసిన చైనాతో, ఈ దురాక్రమిత కశ్మీర్‌లో పాకిస్తాన్‌తో కలసి వాణిజ్య పారిశ్రామిక కలాపాలను నిర్వహిస్తున్న చైనాతో మనం అప్ఘానిస్థాన్‌లో ఎలా పథకాలను అమలు చేయగలం? సిరియాతో కలసి ఇజ్రాయిల్ ఎలాంటి వాణిజ్య పథకాలను రూపొందించడం లేదు. జరీరీపాన్, చైనాలు ఇలాంటి ఉమ్మడి పథకాలను అమలుజరపడం లేదు. నిరంతరం మన ‘గోడ’దాటి దూకుతున్న తోడేలు వంటి చైనాతో మన సహకారానికి అర్థం ఏమిటి?? బీభత్సకాండకు విచ్ఛిన్నకాండకు తీవ్రవాదానికి విద్రోహకాండకు వ్యతిరేకంగా పోరాడాలని ఈ ‘క్షింగ్‌డావో’ సమావేశం పిలుపునిచ్చింది. మన దేశంపై చైనా, పాకిస్తాన్‌లు ‘విసిరిన’క్రూరమైన చతురోక్తి- క్రూయల్ జోక్- ఇది. మన దేశానికి వ్యతిరేకంగా పాకిస్తాన్ ప్రత్యక్ష బీభత్సకాండను జరుపుతోంది, పాకిస్తాన్‌ను సమర్ధిస్తున్న చైనా ప్రచ్ఛన్న బీభత్సకాండ జరుపుతోంది.