సంపాదకీయం

త్రిశంకు న్యాయం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యాయ ప్రక్రియలో కొనసాగుతున్న అలసత్వానికి ఇది మరో నిదర్శనం. తమిళనాడుకు చెందిన పద్దెనిమిది మంది శాసన సభ్యత్వాలు రద్దయ్యాయా? లేదా? అన్న విషయం గురువారం మదరాసు ఉన్నత న్యాయస్థానం చెప్పిన తీర్పు వల్ల స్పష్టం కాకపోవడం ఈ ‘అలసత్వం’! తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత 2016 డిసెంబర్ ఐదవ తేదీన దివంగత అయిన తరువాత కొనసాగుతున్న నాటకీయ పరిణామక్రమంలో ఈ శాసనసభ్యుల ‘బహిష్కరణ’ గొప్ప వైచిత్రి. గత ఏడాది శాసనసభ స్పీకర్ పి.్ధనపాల్ పద్దెనిమిది మంది సభ్యత్వాలను రద్దు చేశాడు. ఈ పద్దెనిమిది మంది ‘అఖిల భారత అన్నా ద్రవిడ మునే్నత్ర కజగం’లోని టీటీవీ దినకరన్ వర్గానికి చెందినవారు. అవినీతి నేరాలకు ప్రస్తుతం జైలుశిక్షను అనుభవిస్తున్న వి.కె.శశికళకు దినకరన్ అత్యంత సమీప బంధువు. తమిళనాడు ముఖ్యమంత్రి ‘కాబోయిన’ శశికళను సర్వోన్నత న్యాయస్థానం దోషిగా నిర్ధారించడంతో ఆమె గత ఏడాది ఫిబ్రవరిలో జైలుకు వెళ్లింది. జైలులో నుంచి దినకరన్ ద్వారా ‘అన్నా కజగం’ పార్టీని నియంత్రించడానికి శశికళ చేసిన ప్రయత్నం బెడిసికొట్టడం ఈ పద్దెనిమిది మంది శాసన సభ్యత్వాలను స్పీకర్ రద్దు చేయడానికి దారితీసిన పరిణామం. ముఖ్యమంత్రి పళనిస్వామిని గద్దె దించడానికి దినకరన్ చేసిన ప్రయత్నంలో భాగంగా ఇరవై రెండు మంది ‘అన్నా కజగం’ సభ్యులు కొత్త పార్టీగా ఏర్పడే ప్రయత్నం చేశారు. శాసనసభలో పళనిస్వామి ప్రభుత్వంపై విశ్వాస పరీక్ష జరగడానికి ముందే స్పీకర్ ఈ ఇరవై ఇద్దరిలో పద్దెనిమిది మందిని ‘ఫిరాయింపుల నిరోధక చట్టం’ కింద అనర్హులుగా ప్రకటించాడు. ఈ ‘అనర్హత’ ప్రకటనతో పళనిస్వామికి చెందిన ‘అన్నా కజగం’ ఎమ్మెల్యేల సంఖ్య నూట పదునాలుగుకు దిగజారింది. అయినప్పటికీ ఈ ‘అనర్హత’ న్యాయస్థానం ద్వారా స్థిరపడినట్టయితే పళనిస్వామి ప్రభుత్వానికి ‘సభ’లో సంఖ్యాబలం కొనసాగుతుంది. ఎందుకంటే ప్రతిపక్షాల ఉమ్మడి బలం నూట ఇద్దరు ఎమ్మెల్యేలు. వీరిలో మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి నాయకత్వంలోని ‘ద్రవిడ మునే్నత్ర కజగం’ కూటమి సభ్యులు తొంబయి ఎనిమిది మంది. అందువల్ల గురువారం నాడు మదరాసు హైకోర్టు స్పీకర్ నిర్ణయానికి అనుకూలంగా తీర్పు చెప్పినట్టయితే పళనిస్వామి ప్రభుత్వానికి ‘సభ’లో ‘మెజారిటీ’ యథావిధిగా కొనసాగి ఉండేది. 2021లో జరిగే శాసనసభ ఎన్నికల వరకూ పళనిస్వామి ప్రభుత్వం కొనసాగుతుంది. స్పీకర్ నిర్ణయాన్ని హైకోర్టు రద్దు చేసినట్టయితే దినకరన్ వర్గంలోని పద్దెనిమిది మంది శాసన సభ్యత్వాలు కొనసాగి ఉండేవి. పళనిస్వామి ప్రభుత్వాన్ని వ్యతిరేకించేవారి సంఖ్య శాసనసభలో నూట ఇరవైకి చేరి ఉండేది. పళనిస్వామి ప్రభుత్వం శాసనసభలో మెజారిటీని కోల్పోయి ఉండేది, కూలిపోయి ఉండేది.
కానీ మదరాసు హైకోర్టు వారు ఇలా నిర్ణయాత్మకమైన తీర్పును వెలువరించలేదు. స్పీకర్ నిర్ణయం సమంజసమైనదని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఇందిరా బెనర్జీ తీర్పు చెప్పింది. ఈ వివాదాన్ని విచారించిన ధర్మాసనంలోని మరో న్యాయమూర్తి సెల్వం సుందర్ స్పీకర్ నిర్ణయాన్ని రద్దు చేశాడు. ఈ పద్దెనిమిది మంది శాసన సభ్యత్వాలను పునరుద్ధరించాడు. ఇలా ధర్మాసనం అధిష్ఠించిన ఇరువురూ పరస్పర విరుద్ధమైన అభిప్రాయాలను, నిర్ణయాలను ఆవిష్కరించడంతో ‘త్రిశంకు స్థితి’ ఏర్పడింది. అందువల్ల మూడవ న్యాయమూర్తి ఈ వివాదాన్ని విచారించి తీర్పు చెప్పవలసి వస్తోంది. అంతవరకూ తమిళనాడు శాసనసభలో ‘యథాతథ స్థితి’ కొనసాగుతుంది. అంటే మూడవ న్యాయమూర్తి ఈ వివాదాన్ని విచారించి పరిష్కరించే వరకూ ఈ పద్దెనిమిది మంది సభ్యత్వాలు రద్దు కావు. శాసనసభలో ఎలాంటి విశ్వాస తీర్మానం కాని, అవిశ్వాస తీర్మానం కాని ప్రస్తావనకు రావు. వోటింగ్ జరగదు. అందువల్ల ‘మెజారిటీ’ ఉందా? లేదా? అన్న మీమాంసతో పనిలేకుండా పళనిస్వామి ప్రభుత్వం కొనసాగుతుంది- మూడవ జడ్జి తీర్పు చెప్పేవరకు.. ఈ పద్దెనిమిది స్థానాలకు ఉపఎన్నికలు జరగవు. ఇదీ గురువారం వెలువడిన ‘త్రిశంకు’ న్యాయ నిర్ణయం.
శాసనసభల కాలపరిమితి కేవలం ఐదేళ్లు. వంద ఏళ్లు జీవించగల మానవులు చేస్తున్న ఘోర నేరాలను విచారించి దోషులను శిక్షించడంలోను, నిర్దోషులను నిగ్గుతేల్చడంలోను జాప్యం జరుగుతోంది. దశాబ్దుల ఈ ‘న్యాయ విలంబనం’ పట్ల సర్వోన్నత న్యాయస్థానం వారు, ఉన్నత న్యాయస్థానాల వారు పదే పదే ఆందోళనను వ్యక్తం చేయడం, దర్యాప్తు సంస్థలను అభిశంసించడం, ప్రభుత్వాలను నిరసించడం నడుస్తున్న చరిత్ర.. ప్రభుత్వాల నిర్లక్ష్యం, అశ్రద్ధ, నేరస్థులను రక్షించడానికి అధికారంలో ఉన్న రాజకీయవాదులు అతి తెలివిగా అమలు జరుపుతున్న ‘వ్యూహాలు’ న్యాయ ప్రక్రియను నిలదీస్తుండడం నిజం.. రాజకీయ అవినీతి పరులకు వ్యతిరేకంగా దాఖలయ్యే అభియోగాలపై వేగవంతంగా విచారణ పూర్తయి తీర్పు వెలువడాలని సుప్రీం కోర్టు గత ఏడాది నవంబర్‌లో నిర్దేశించింది. రాజకీయ అవినీతి పరులకు వ్యతిరేకంగా దాఖలైన 1,581 అభియోగాలను ఏడాదిలోగా విచారించి తీర్పు చెప్పడానికి వీలుగా పనె్నండు ప్రత్యేక కోర్టులను ఏర్పాటు చేయాలన్న కేంద్రం ప్రతిపాదనను సుప్రీం కోర్టు గత డిసెంబర్ 17న ఆమోదించింది. ఇలా ‘విలంబన’ను తగ్గించాలని ఆదేశిస్తున్న న్యాయస్థానాలు స్వయంగా న్యాయ ప్రక్రియను మందగింప చేస్తుండడం విచిత్రమైన పరిణామం. వందేళ్ల మానవ జీవనంలోనే ‘ఏడాది కాలం’ న్యాయ ప్రక్రియ ఆలస్యం కావడం అనుచితం. అలాంటిది ఐదేళ్ల శాసనసభకు సంబంధించిన వ్యవహారంలో ‘ఏడాది పాటు’ న్యాయ ప్రక్రియ స్తంభించడం విస్మయకరం. కానీ తమిళనాడు శాసనసభ్యుల ఈ ‘అనర్హత’ వ్యవహారం ఏడాది గడిచినా కొలిక్కిరాలేదు. ఇందుకు కారణం ప్రభుత్వాలు మాత్రం కాదు. స్పీకర్ నిర్ణయం వెలువడే వరకు తమిళనాడు శాసనసభలో ‘బలపరీక్ష’ జరగరాదని గత ఏడాది సెప్టెంబర్ 20న హైకోర్టు ఆదేశించింది. ఈ పద్దెనిమిది స్థానాలకు ఉపఎన్నికలు కూడ జరుపరాదట!
ఇంత ప్రాధాన్యమైన వివాదాన్ని విచారించి నిర్ణయించడానికి ఇన్ని నెలల సమయం ఎందుకు పట్టినట్టు? ఇప్పుడు కూడ ‘నిర్ణయం కాని నిర్ణయం’- స్ప్లిట్ వర్డిక్ట్- వెలువడింది. ముందుగానే ముగ్గురు సభ్యుల ధర్మాసనాన్ని హైకోర్టు వారు ఎందుకు ఏర్పాటు చేసి ఉండరాదు? రాజ్యాంగంలోని పదవ అధికరణంలో నిర్దేశించిన ఫిరాయింపును నిరోధించే నిబంధనలను విశే్లషించి విచారించి వివరించి నిర్ణయం ప్రకటించడానికి వీలుగా హైకోర్టు వారు ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనాన్ని గత సెప్టెంబర్‌లోనే ఏర్పాటుచేసి ఉండవచ్చు. ఈ రెండు పద్ధతులను పాటించలేదు. ఫలితంగా గురువారం వెలువడిన ‘వైరుధ్య నిర్ణయం’ మరింత న్యాయ విలంబనకు దోహదం చేస్తోంది. ఇలా ఎందుకు జరిగింది?