సంపాదకీయం

‘సీషెల్స్’ ప్రాధాన్యం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆఫ్రికా ఖండానికి ‘సియాఛెల్లెస్’- సీషెల్స్- దేశంలో మన నౌకాదళానికి స్థావరం ఏర్పడలేదు. ఆఫ్రికాలోని జిబౌటీ దేశంలో చైనా పెద్ద నౌకాదళ స్థావరం ఏర్పడి ఉంది. నాలుగేళ్లుగా మన ప్రభుత్వం ప్రయత్నించింది, ‘సియాఛెల్లెస్’ ప్రభుత్వం అంగీకరించింది. కానీ సియాఛెల్లెస్ పార్లమెంటు గతవారం ఈ ప్రతిపాదనను తిరస్కరించిందట! చైనా మాత్రం గత ఏడాది మార్చిలో జిబౌటీలో తన నౌకాదళ స్థావరాన్ని ఏర్పాటు చేసినట్టు ప్రకటించింది. లక్ష మంది చైనీయ నావికులు ఈ స్థావరం నుంచి పనిచేస్తారట! అప్పటి నుంచి ఇప్పటివరకు యుద్ధనౌకలను, నౌకాదళంలో పనిచేసే విమానాలను జిబౌటీకి చైనా భారీ ఎత్తున తరలిస్తోంది. ఈ స్థావరం వల్ల అరేబియా సముద్ర ప్రాంతంలోను, హిందూ మహాసాగర జలాలలోను చైనా యుద్ధనౌకల రాకపోకలు ముమ్మరం కావడం మన దక్షిణ, పశ్చిమ సరిహద్దులకు పెరిగిన ప్రమాదం! ఆదివారం నుంచి ఆరురోజులపాటు మన దేశంలో పర్యటిస్తున్న ‘సియాఛెల్లెస్’ అధ్యక్షుడు డానీ యాంటియోనీ రోవెన్‌షార్ పర్యటనకు ఇదీ వ్యూహాత్మక నేపథ్యం. మన నౌకాస్థావరం ఏర్పాటుకు ‘సీషెల్స్’ పార్లమెంటు అంగీకరించక పోయినప్పటికీ రక్షణ రంగంలో వ్యూహాత్మక సహకారం పెంపొందించుకొనడానికి ఉభయ దేశాలు అంగీకరించడం చైనా ప్రభుత్వం శ్రద్ధగా గమనిస్తున్న పరిణామం. అతి చిన్న దేశమైనప్పటికీ ‘సీషెల్స్’లో ప్రజాస్వామ్యం వ్యవస్థీకృతమై ఉంది. ఉభయ దేశాల మధ్యగల ఈ ప్రజాస్వామ్య సమానత్వం ద్వైపాక్షిక మైత్రికి ప్రధాన ప్రాతిపదిక అన్నది ‘సీషెల్స్’ అధ్యక్షునితో మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పిన మాట. సీషెల్స్ పార్లమెంట్ ప్రస్తుతం మన నౌకాదళ స్థావరం ఏర్పాటును వ్యతిరేకించినప్పటికీ, ప్రజాస్వామ్య పద్ధతిలో ఆ దేశ ప్రభుత్వం పార్లమెంటులో విజయం సాధించే అవకాశం లేకపోలేదు. లేదా ఎన్నికల తరువాత ఏర్పడే కొత్త పార్లమెంటు మళ్లీ ఈ అంశాన్ని చర్చించవచ్చు. అందువల్ల జిబౌటీ స్థావరంగా చైనా హిందూ సాగర ప్రాంతంలో కొనసాగించనున్న వ్యూహాత్మక దురాక్రమణకు ‘్భరత- సీషెల్స్’ దేశాల మధ్య కొనసాగుతున్న రక్షణ సహకారం ప్రతిఘటన కాగలదు. మన దేశం ‘సీషెల్స్’కు బహూకరించిన యుద్ధవిమానం ఈ రక్షణ సహకారానికి ప్రతీక! సోమవారం మన ప్రధాని ఈ విమానం ‘నమూనా’ను ‘సీషెల్స్’ అధ్యక్షునికి బహూకరించాడు. మంగళవారం మన విదేశ వ్యవహారాల మంత్రి సుషమా స్వరాజ్ ఈ విమానాన్ని ‘సీషెల్స్’ అధికారులకు అప్పగించింది. ఇరవై తొమ్మిదవ తేదీన జరుగనున్న ‘సీషెల్స్’ స్వాతంత్య్ర దినోత్సవం నాటికి ఈ విమానం అక్కడికి చేరుకుంటుందట!
జిబౌటీలో ఏకపక్ష నియంతృత్వం నడుస్తోంది. దశాబ్దుల తరబడి రాజకీయ సంఘర్షణలకు, అలజడులకు ఆలవాలమైన జిబౌటీలో ప్రజాభిప్రాయంతో పనిలేని ప్రభుత్వ విధానాలు కొనసాగుతున్నాయి. అందువల్ల గుట్టుచప్పుడు కాకుండా చైనా ఆ దేశంలోకి చొరబడ గలిగింది. ప్రజాస్వామ్య వ్యవస్థ గల ‘చిన్న’ దేశమైన సీషెల్స్‌లోకి ప్రవేశించడం అంత సులభం కాదన్నది ఇప్పుడు స్పష్టమైంది. నియంతృత్వ వ్యవస్థ ఉన్న చైనా ప్రభుత్వం ఇతర దేశాలలో సైతం నియంతృత్వ వ్యవస్థలను సమర్ధిస్తోంది. మాల్‌దీవులలో దశాబ్దులపాటు ఏకపక్ష నియంతృత్వం కొనసాగింది. తొలిసారిగా ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికైన మహ్మద్ నషీద్‌ను 2012 ఫిబ్రవరిలో సైనికులు, మాల్‌దీవులలో పోలీసులు ఒక్కటై తొలగించారు. ఈ తొలగింపు పాకిస్తాన్, చైనా ప్రభుత్వాల ఉమ్మడి కుట్రలో భాగం. 2011లో చైనాకు దౌత్య కార్యాలయం ఏర్పాటుకు అనుమతినివ్వడం నషీద్ ప్రభుత్వం చేసిన తప్పిదం. అప్పటి నుంచి ఇప్పటివరకు మాల్‌దీవులలో పెత్తనం వహిస్తున్న అబ్దుల్లా యమీన్ చైనా చంక బిడ్డ. పాకిస్తాన్ ‘జిహాదీ’ మూకలు మాల్‌దీవులలో ప్రబలడానికి దోహదం చేస్తున్నాడు. ఆరేళ్లుగా మాల్‌దీవులతో మన సంబంధాలు క్షీణించిపోవడానికి కారణం చైనాకు, అబ్దుల్లా యమీన్ ప్రభుత్వానికి మధ్యగల నియంతృత్వ సమానత్వం. యమీన్ ప్రజాస్వామ్య వ్యవస్థలను ధ్వంసం చేశాడు. సిరియాలో సైతం కరడుకట్టిన నియంతృత్వ ప్రభుత్వాన్ని చైనా సమర్ధిస్తోంది. పక్కనే ఉన్న ప్రజాస్వామ్య ఇజ్రాయిల్ మన దేశం పట్ల మైత్రిని కొనసాగిస్తోంది. జిబౌటీ చైనావారి స్థావరంగా మారింది.. నియంతృత్వ సముద్ర జలాల మధ్య ‘సీషెల్స్’ ప్రజాస్వామ్య ద్వీపం. ఆఫ్రికాలోని అత్యధిక దేశాలు రకరకాల నియంతృత్వాలకు గురై ఉన్నాయి..
జిబౌటీ, సీషెల్స్ దేశాలు హిందూ సాగర ప్రాంతంలో వ్యూహాత్మక ప్రాధాన్యం సంతరించుకొనడం దశాబ్దుల చరిత్ర. ఆఫ్రికా ఖండం ప్రధాన భూభాగానికి తూర్పు దిశలోని సముద్ర జలాలలో మడగాస్కర్, మారిషస్, సీషెల్స్ వంటి ద్వీపాలు, ద్వీప సమూహాలు నెలకొని ఉన్నాయి. ఐరోపా జాతుల శతాబ్దుల ప్రపంచ దురాక్రమణ సమయంలో ఈ దేశాలు వారి వలసలుగా మారాయి. నిర్జన ద్వీపాల సమూహమైన ‘సీషెల్స్’ను మొదట ఫ్రాన్స్ ఆక్రమించుకొంది, ఆ తరువాత బ్రిటన్ ఆక్రమించింది. రెండు ప్రపంచ యుద్ధాల సమయంలోను ‘సీషెల్స్’, ‘మారిషస్’ దేశాలు బ్రిటన్ యుద్ధనౌకలకు ‘విశ్రాంతి కేంద్రాలు’. హిందూ మహాసాగరంలో ఉన్న ఈ ద్వీపాలు ఇలా సముద్ర భద్రతకు, సముద్ర ఆధిపత్యానికి కీలక ప్రదేశాలు కావడం చరిత్ర. అందువల్ల జిబౌటీని స్థావరంగా మలచుకున్న చైనా వ్యూహాత్మక దురాక్రమణను ప్రతిఘటించడానికి ‘సీషెల్స్’లో మన ‘ఉనికి’ అనివార్యమై పోయింది. పాకిస్తాన్‌లోని ‘గ్వాడార్’ ఓడరేవులో తిష్ఠ వేసిన చైనాను నిరోధించడానికై మన ప్రభుత్వం ఇరాన్‌లోని చౌబహార్ ఓడరేవును ‘దత్తత’కు తీసుకొంది. జిబౌటీలో చైనా తిష్ఠవేయడం వల్ల మన పడమటి సముద్ర తీరానికి దురాక్రమణ ప్రమాదం ఏర్పడి ఉంది. జిబౌటీ ఆఫ్రికా ఖండపు ఈశాన్య భాగంలో ఎఱ్ఱ సముద్రం హిందూ సాగరంలో సంగమించేచోట నెలకొని ఉంది. మధ్యధరా సముద్రాన్ని, ఎఱ్ఱ సముద్రాన్ని కలుపుతూ మానవ నిర్మితమైన ‘సూయెజ్’ కాలువ ఏర్పడి ఉంది. అందువల్ల ఎఱ్ఱ సముద్రం ప్రధాన అంతర్జాతీయ జల మార్గం. జిబౌటీలో చైనా తిష్ఠ దశాబ్దుల మన వ్యూహాత్మక వైఫల్యం.
సీషెల్స్‌లో మన నౌకాదళం స్థావరాన్ని ఏర్పరచుకోవడం మన భద్రతకు మాత్రమేకాక, హిందూ సాగర ప్రాంత ప్రశాంతతకు అనివార్యం. సీషెల్స్ జిబౌటీకి దాదాపు పదమూడు వందల కిలోమీటర్ల దూరంలో నెలకొని ఉన్న ద్వీప సమూహం. మడగాస్కర్‌కు ఈశాన్యంగా పదకొండు వందల కిలోమీటర్ల దూరంలో ‘సీషెల్స్’ ద్వీవులు, ఎనిమిది వందల కిలోమీటర్ల తూర్పుగా ‘మారిషస్’ దీవులు నెలకొని ఉన్నాయి. ఆఫ్రికా తీరానికి తూర్పుగా దాదాపు ఎనిమిది వందల కిలోమీటర్ల దూరంలోని మడగాస్కర్ కూడ ఒక పెద్ద ద్వీపం. ప్రపంచంలోని అరుదైన వృక్షజాలం, జీవజాలం ఈ ద్వీపాలలో మాత్రమే పరిఢవిల్లుతున్నాయి. అందువల్ల ‘సియాఛెల్లెస్’ వ్యూహాత్మకంగా మాత్రమేకాక జీవవైవిధ్య పరిరక్షణకు కూడ కీలక ప్రదేశమై ఉంది. లక్ష జనాభా, మూడువందల ఎనిమిది చదరపు కీలోమీటర్ల విస్తీర్ణం గల చిట్టి ప్రజాస్వామ్యం సీషెల్స్!