సంపాదకీయం

కొడిగట్టిన ‘వెలుగు’..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దేశ జనాభాలో తెలుగు మాట్లాడేవారి శాతం తగ్గిపోతోందన్నది ఆధికారిక నిర్ధారణ. ఇలా దేశభాషల మధ్య తెలుగుకు ప్రాధాన్యం తగ్గిపోతుండడం దశాబ్దుల విపరిణామం. ‘‘దేశభాషలందు తెలుగు లెస్స’’ అన్న ఘనమైన గత వైభవాన్ని తలచుకొని మురిసిపోయే తెలుగువారి సంఖ్య కూడ తగ్గిపోతోంది. తెలుగువారి హృదయ వైశాల్యం ఎక్కువ. ఈ వైశాల్యం విస్తరిస్తున్న కొద్దీ తెలుగుభాష ఆంగ్ల పదాలతో సంకరమైపోతోంది. ‘నాగరికులు’ అంటే- నగరాల్లో, పట్టణాల్లో నివసిస్తున్న తెలుగువారు మాట్లాడుతున్న భాషలో తెలుగు క్రియా పదాలు మాత్రమే మిగిలి ఉండడం నడుస్తున్న చరిత్ర. సర్వనామాలు, నామవాచకాలు, విశేషణాలు, క్రియా విశేషణాలు వంటివన్నీ ఆంగ్ల పదాలే. ‘మమీ కిచెన్‌లో బిజీగా ఉంది, వెజిటబుల్స్ కట్ చేస్తోంది..’ అన్నది నాగరిక తెలుగుభాష. తెలుగును గ్రంథాల నుండి విముక్తం చేసి వ్యవహారంలోకి పరుగులెత్తించిన గిడుగు రామమూర్తిపంతులు వంటివారు వందేళ్ల క్రితం ‘గవర్నమెంటు’వారు అన్న ఒకటి, రెండు ఆంగ్లభాషా పదాలతో మాత్రమే తెలుగును పరిపుష్టం చేశారు. ఇలాంటి మహనీయులు నాటిన ‘వ్యవహారపు తెలుగు మొక్కలు’ నేడు మహావృక్షాలుగా మారి ఆంగ్ల పదాల పువ్వులతో పాశ్చాత్య నాగరిక పరిమళాలను గుబాళిస్తున్నాయి. ‘ముఖ్యమంత్రి’, ‘శాసనసభ’ అని పలకడం తెలుగు విద్యాధికులకు నామోషీ. అందుకే ‘సీఎం’, ‘అసెంబ్లీ’ అన్నవి అచ్చ తెలుగు పదాలుగా మారి ఉన్నాయి. ‘క్రియ’లు మాత్రం ‘మాంధాత’ కాలం నాటి మన భాషలో ఎందుకుండాలి? అన్నది ఆధికారిక తర్కం. అందువల్లనే ‘కేజీ టూ పీజీ’ వరకూ ఆంగ్ల మాధ్యమ విద్యను బోధించాలని తెలుగు ప్రభుత్వాలు నడుములను గట్టిగా బిగించి ఉన్నాయి- ‘ప్రపంచీకరణ’ వల్ల దిగుమతి అవుతున్న ‘్ఫరిన్ బెల్టు’లతో..! దశాబ్దుల తరబడి ప్రభుత్వేతర పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమ బోధన జరిగినప్పటికీ ప్రభుత్వ పాఠశాలల్లో తెలుగు మాధ్యమం కొనసాగింది. కొన్ని జాతీయ నిష్ఠగల స్వచ్ఛంద సంస్థలు నడిపిన పాఠశాలల్లో సైతం తెలుగు మాధ్యమ బోధన జరిగింది. ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలల్లో సైతం తెలుగు మాధ్యమ బోధన నిర్మూలనకు గురవుతోంది. స్వచ్ఛంద సంస్థల వారు సైతం ‘నలుగురితో పాటు నారాయణ..’ అని అంటున్నారు. కొనే్నళ్ల తర్వాత ఇలాంటి తెలుగు సామెతలు కూడ మిగలవు. తెలుగురాని విద్యావంతులకు, విద్యాధికులకు తెలుగు సామెతల ధ్యాస కాని, తెలుగు సాహిత్య స్పృహ కాని ఎందుకుంటుంది? తెలుగు ప్రాంతం భౌగోళిక పరిధిలో ఆంగ్లం తమ మాతృభాష అని చెప్పుకొనేవారు అధిక సంఖ్యాకులు కావడం సంభవించనున్న పరిణామ క్రమం!
దశాబ్ది పాటు దేశజనాభాలో తెలుగువారి జనాభా శాతం తగ్గినట్టు ధ్రువపడి ఏడేళ్లు గడచిపోయాయి. 2001లో దేశజనాభాలో ‘తెలుగు మాతృభాష’ అని చెప్పుకున్న వారి సంఖ్య 07.19 శాతం. ఈ సంఖ్య 2011 నాటికి 06.93 శాతానికి తగ్గిపోయిందట! అంటే 2001లో దేశంలోని ప్రతి పదివేల మందిలో ఏడు వందల పంతొమ్మిది మంది తెలుగువారు. 2011 నాటికి తెలుగువారి సంఖ్య ప్రతి పదివేలమందిలో ఆరువందల తొంబయి ముగ్గురు మాత్రమే! అంటే 2001-2011 సంవత్సరాల మధ్య ఇతర భాషల వారితో సమానంగా తెలుగువారి సంఖ్య పెరగలేదు. పెరిగి ఉండినట్టయితే దేశంలో 2011 నాటికి దాదాపు మరో ముప్పయి మూడు లక్షల మంది తెలుగువారు అధికంగా ఉండేవారు. తెలుగువారు కుటుంబ సంక్షేమ కార్యక్రమంలో అగ్రగామిగా ఉండడం వల్ల సంఖ్య తగ్గి ఉండవచ్చునన్నది ఒక తర్కం. కానీ తెలుగుసీమలకు ఆవల ఉన్న ప్రవాసాంధ్రుల సంఖ్య కూడ ఈ పదేళ్లలో ఎందుకని తగ్గినట్టు? పాకిస్తాన్, బంగ్లాదేశ్‌లతో కలసిన అఖండ భారత్‌లో హిందీ భాషా జన సముదాయం అతి పెద్దది. తర్వాతి స్థానంలో బెంగాలీ ప్రజలుండేవారు. తెలుగువారిది మూడవ స్థానం. 1947లో దేశ విభజన జరిగిన తర్వాత బెంగాలీ ప్రజల్లో అరవై శాతం తూర్పు పాకిస్తాన్- బంగ్లాదేశ్-కు చెందినవారయ్యారు. అందువల్ల అవశేష భారత్‌లో అనేక దశాబ్దుల పాటు హిందీ భాషా జన సముదాయం వారిది మొదటి స్థానం కాగా తెలుగువారిది ద్వితీయ స్థానమైంది. కానీ 2011 నాటికి బెంగాలీ భాష మళ్లీ ద్వితీయ స్థానాన్ని ఆక్రమించింది. ఇందుకు కారణం బంగ్లాదేశ్ నుంచి శరణార్థులు, అక్రమ ప్రవేశకులు కూడ మన దేశంలోకి రావడం కావచ్చు. తెలుగుకు మూడవ స్థానం కూడ దక్కలేదు. మరాఠీ భాషకు మూడవ స్థానం దక్కింది. తెలుగు భాష నాలుగవ స్థానానికి దిగజారింది.
ఇలా స్వభావ సాంకర్యాన్ని పొందిన మన భాష స్వరూపం కూడ కుంచించుకొని పోతోంది. స్వభావం ఆంగ్లపదజాలంతో సాంకర్యం కావడానికి ఏకైక కారణం విద్యావంతుల్లో మాతృభాషా స్వచ్ఛతను పరిరక్షించాలన్న శ్రద్ధ లేకపోవడం. గ్రామీణులు, బ్రిటన్ విద్యా విధాన ప్రభావ గ్రస్తులు కానివారు నిన్న మొన్నటి వరకూ స్వచ్ఛమైన తెలుగును మాట్లాడేవారు. అయితే ఇంగ్లీషులో మాట్లాడడం, కనీసం తెలుగు మాట్లాడేటప్పుడు ఆంగ్ల పదాలను ప్రయోగించడం గొప్ప అన్న భ్రమ దశాబ్దుల తరబడి తెలుగువారిలో కొనసాగుతోంది. విద్య అంటే విజ్ఞానం, సంస్కారం, వినయం, సౌశీల్యం. ఇలాంటి విద్యను పొందడానికి ఆంగ్ల మాధ్యమం ద్వారా ఎంత అవకాశం ఉందో భారతీయ భాషల ద్వారా పొందడానికి అంతే అవకాశం ఉంది. నిజానికి ఇంకా ఎక్కువ ఉంది. ఎందుకంటే సంస్కృత భాష ద్వారా లక్షల ఏళ్లుగా వికసించిన భారతీయ విజ్ఞాన సర్వస్వం దేశ భాషల్లో నిహితమై ఉంది. అందువల్లనే సంస్కృత భాష ద్వారా, సంస్కృత భాషకు రూపాంతరాలైన హిందీ, మరాఠీ, తెలుగు, తమిళం వంటి భారతీయ భాషల ద్వారా విద్యలను గ్రహించి విజ్ఞానవంతులవుతున్నవారు భారతీయ స్వభావబద్ధులై జీవించగలరు. ఆంగ్లభాషా మాధ్యమ బోధనాగ్రస్తులు క్రమంగా భారతీయతకు దూరమైపోయి బ్రిటన్ నాగరికతా నిబద్ధులవుతున్నారు. ఆసేతు శీతనగం అన్ని భారతీయ భాషలూ సంస్కృత భాషకు రూపాంతరాలు, అందువల్ల దేశభాషల్లో ఏది పెరిగినా ఏమంత ప్రమాదం లేదు. కానీ అన్ని భారతీయ భాషలనూ ‘బ్రిటన్’ భాష దిగమింగతోంది. ఇదీ భయంకర ప్రమాదం...
తెలుగుతో పాటు అన్ని భారతీయ భాషలు బతికి బట్టకట్టాలంటే ప్రాథమిక మాధ్యమిక విద్యాబోధనను భారతీయ భాషల మాధ్యమంగా మాత్రమే జరపాలి. కేంద్ర ప్రభుత్వం పూనుకొని ఈ మేరకు రాజ్యాంగ సవరణ చేయాలి. బ్రిటన్ దీవులకు పొరుగున ఉన్న జర్మనీ, పోలెండ్, ఫ్రాన్స్, ఇటలీ వంటి ఐరోపా దేశాల్లో ఉన్నతోన్నత విద్యల బోధన ఆయా దేశాల మాతృభాషల్లోనే జరుగుతుంది. బ్రిటన్ వారి ఆంగ్లభాషను మిగిలిన ఐరోపా దేశాలవారు నెత్తికెత్తుకోవడం లేదు. మనం కూడ ఆంగ్లభాషను ప్రాథమిక స్థాయి నుంచి స్నాతకోత్తర స్థాయి వరకు అభ్యసించవచ్చు. కానీ అన్ని స్థాయిలలోను బోధనా మాధ్యమం మాత్రం భారతీయ భాషలే కావాలి. వందల ఏళ్ల చరిత్ర ఉన్న ఐరోపా భాషలు స్నాతకోత్తర పరిశోధక విద్యలకు మాధ్యమాలు కాగలినపుడు వేల ఏళ్లుగా వికసించిన తెలుగు భాష ఎందుకు బోధనా మాధ్యమం కారాదు?