సంపాదకీయం

రూపాయి ‘రుగ్మత’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘అభూత పూర్వ పతనం’- ఆల్‌టైమ్‌లో- అన్నది మన ‘రూపాయి’కి పట్టిన దుర్గతిని అభివర్ణించడానికి విశే్లషణ ధురీణులు కనిపెట్టిన పదజాలం. అమెరికా వారి ‘డాలర్’ ‘అంతర్జాతీయ’ వినిమయ ద్రవ్యానికి ప్రాతిపదికగా మారినప్పటి నుంచీ మన ‘రూపాయి’ సన్నబడిపోతూనే ఉంది. అందువల్ల మన రూపాయి విలువ- ఈ ‘డాలర్’తో పోల్చినప్పుడు- తగ్గిన ప్రతిసారీ ‘‘అభూత పూర్వ పతనం’’ అన్న మాటలు వినబడుతున్నాయి. అందువల్ల ‘పతనం’ అభూత పూర్వం అయినప్పటికీ ఈ పదజాలం మాత్రం ‘‘అభూత పూర్వం’’ కాజాలదు. ‘విషయం’ కంటే ‘విశే్లషణ’ ప్రాచుర్యం పొందుతుండడం ‘ప్రపంచీకరణ’ మహాయుగం సృష్టించిన మాయాజాలం. రూపాయి విలువ తగ్గిపోతున్నందుకు ప్రభుత్వాలు కాని, మేధావులు కాని పెద్దగా ఆందోళన చెందిన దాఖలాలు లేవు. రూపాయి విలువను పెంచడానికి ప్రభుత్వం కాని, భారతీయ రిజర్వ్ బ్యాంక్ వారు కాని పథకాలు రూపొందించిన సాక్ష్యాలు లేవు. దశాబ్దులుగా లేవు! పథకాలు రూపొంది ఉంటే మన ‘రూపాయి’ విలువ పెరిగి ఉండేది, కనీసం మరింత దిగజారకుండా ‘నిలకడ’ను సంతరించుకొని ఉండేది. అంతర్జాతీయ వాణిజ్య అనుసంధాన దుర్గంధ జలవాహినిలో పడి మన ఆర్థిక వ్యవస్థ కొట్టుకొనిపోతుండడం ‘ప్రపంచీకరణ’ ఫలితం. ప్రపంచీకరణ వ్యవస్థ ఆరంభమైన నాటికి ముప్పయి ఐదు రూపాయలకు ఒక అమెరికా ‘డాలర్’ను కొనగలిగే వాళ్లం. గురువారం నాడు అరవై తొమ్మిది రూపాయలు చెల్లిస్తేకాని ‘డాలర్’ లభించని స్థితి ఏర్పడిపోయింది. ఇలా ‘డాలర్’ విలువ ఇరవై ఆరేళ్లలో ముప్పయి ఐదునుంచి అరవై తొమ్మిది రూపాయలకు చేరడం మన ఆర్థిక వ్యవస్థ పతనానికి నిదర్శనం. రేపో మాపో ‘డాలర్’ విలువ డెబ్బయి రూపాయలకు చేరుతుందట! ఇదీ ‘రూపాయి’కి సంభవించిన అభూత పూర్వ పతనం!! రూపాయి విలువ ఎందుకు తగ్గిపోతోంది? అన్న ప్రశ్నకు సమాధానాలు చెపుతున్న విశే్లషకులు అంతర్జాతీయ కారణాలు మాత్రమే చెప్పుకొస్తున్నారు, అంతర్గత కారణాలు చెప్పరు. ఎందుకంటె అంతర్గత కారణాలు చెప్పడం ఈ విశే్లషకుల, మేధావుల, ఆర్థికవేత్తల ‘అంతర్జాతీయ స్థాయి’కి భంగకరం. మన దేశంలో ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో ‘అమరావతి’ రాజధానుల నిర్మాణం జరుగుతోంది, అంతర్జాతీయ ప్రమాణాలతో హైదరాబాద్‌లో కొత్త సచివాలయం నిర్మాణం కానున్నదట. అక్కడి నుంచి మొదలు... ప్రతిదానికీ ‘అంతర్జాతీయ ప్రమాణాల’ను సంతరింపచేయడం ప్రపంచీకరణ- గ్లోబలైజేషన్- యుగంలో భారతీయుల జీవన విలాసం.. భారతీయ ప్రమాణాలు పనికిరావు!!
అందువల్ల రూపాయి విలువ దిగజారిపోతుండడానికి దారితీస్తున్న అంతర్జాతీయ పరిణామాలను గురించి మన విశే్లషకులు వివరిస్తున్నారు. ఈ విశే్లషకులు ఒకరు చెప్పింది మరొకరికి అర్థం కాకపోవడం దశాబ్దుల ప్రహసనం. ‘ద్రవ్యోల్బణం’ రెండంకెల స్థాయిని చేరి పైపైకి దూసుకొని పోతున్న సమయంలో దాదాపు తొమ్మిదేళ్ల క్రితం ఒక ప్రముఖ ప్రభుత్వ ఆర్థికవేత్త- ‘ద్రవ్యోల్బణం పెరగడానికి అంతర్గత సమస్యలు కారణం కాదు, అంతర్జాతీయ ‘సంక్లిష్టాలు’ కారణం. అందువల్ల పరిష్కారాలు కూడ అంతర్జాతీయ స్థాయిలోనే అనే్వషించాలి.’అని తేల్చి వేశాడు. ఎవరు ఎప్పుడు ఎక్కడ ఎలా అనే్వషించాలని ఎవ్వరూ అడగలేదు, ఆయన చెప్పనూ లేదు. ఇలా మాన్యులకు, అసామాన్యులకు అర్థం కాని ఆర్థిక విషయాలు సామాన్యులకేమి అర్థం అవుతాయి? అందువల్ల రూపాయి విలువ తగ్గుతూనే ఉంది, డాలర్ విలువ పెరుగుతూనే ఉంది. 1960వ దశకంలో ఏడున్నర రూపాలకు ఒక ‘డాలర్’ లభించేదట. అందువల్ల స్వతంత్ర భారత ఆర్థిక వ్యవస్థ- డాలర్ ప్రాతిపదికగా- నిరంతరం పతనం వైపు పరుగులు తీస్తుండడం మాత్రమే సామాన్యులకు తెలిసిన ‘రహస్యం’..
రూపాయి విలువ గత కొన్నిరోజులుగా మళ్లీ పడిపోతుండడానికి మనవాళ్లు కనిపెట్టిన కారణం ‘అమెరికాకు, చైనాకు మధ్య నడుస్తున్న వాణిజ్య యుద్ధం..’-అట! ‘ఐరోపాలో ఎండకాస్తే భారతదేశంలోని వారికి చెమటలు పట్టడం’, ‘రష్యాలో వాన కురిస్తే ఇక్కడ మన వాళ్లు గొడుగులు పట్టుకోవడం..’వంటివి గతకాలం నాటి చతురోక్తులు! ‘ఇవి చతురోక్తులు కాదు వాస్తవాలు..’అని చెప్పడానికి మేధావులు ప్రయత్నిస్తుండడం వాణిజ్య ప్రపంచీకరణ విలాసం. మన ఉత్పత్తులు తగ్గడం వల్ల, మన ఎగుమతులు తగ్గడం వల్ల, మన విదేశీయ వాణిజ్యంలో నష్టం పెరిగి ‘లోటు’ఏర్పడడం వల్ల, వెరసి మన ‘స్థూల జాతీయ ఉత్పత్తుల’- గ్రాస్ డొమస్టిక్ ప్రాడక్ట్- పెరుగుదల వేగం తగ్గడం వల్ల మన ‘రూపాయి’ బక్కచిక్కిపోతోంది! - అన్నది సామాన్యులకు అర్థమయ్యే వ్యవహారం. కానీ ఆర్థికవేత్తలకు ఇదంతా ఇంకోవిధంగా అర్థం అవుతుండడం ‘అంతర్జాతీయ అనుసంధాన’ ప్రభావం, ‘ప్రపంచీకరణ’ మారీచుడు కల్పిస్తున్న బంగారపు మాయాజాలం! రూపాయి విలువ మరీ ఎక్కువ పెరగరాదట, పెరిగినట్టయితే మన వస్తువుల ఎగుమతులు తగ్గిపోతాయట! పదేళ్లక్రితం ‘డాలర్’ విలువల నలబయి ఐదు నుంచి నలబయి ఒక్క రూపాయిలకు దిగజారింది. ఆమేరకు మన రూపాయి విలువ పెరిగింది. కానీ ఆ సమయంలో ‘మన ఎగుమతులు తగ్గిపోయే ప్రమాదం ఉందహో!’అని ‘వాటాల విపణి’ - స్టాక్ మార్కెట్-లోని దళారీలు అరిచారు, ఆర్భాటించారు, హెచ్చరికలు- ఎవరికో? జారీచేశారు. ఆర్థిక నిపుణులు సైతం ‘ఔరా భళీ...’ అని వంత పాడారు. రూపాయి విలువ ‘ఎక్కువగా’ పెరగరాదన్నది అప్పుడు సామాన్యులు గ్రహించిన పాఠం. ఆ తరువాత రూపాయి విలువ పాతాళ పతనమైంది, ఇంకా అడుగునకు దూసుకొని వెడుతోంది.. మరి దిగుమతులు తగ్గిపోయి ఎగుమతులు పెరిగి ఉండాలి. అలాంటిదేమీ లేదు. 1947 నుంచి కూడ రూపాయి విలువ తగ్గుతూనే ఉంది, ఎగుమతులు కూడ తగ్గుతూనే ఉన్నాయి! ఇదీ మన ఆర్థిక వైచిత్రి!
అఖండ భారత్ ముక్కలు కావడం, టిబెట్‌ను చైనా కలుపుకోవడం సమాంతర విపరిణామాలు. మనవైన భూభాగాలు మనవి కాకుండాపోయాయి. తనవి కాని భూభాగాలను చైనా దురాక్రమించింది. ఫలితంగా ఇటు పాకిస్తాన్‌తోను అటు చైనాతోను మనం దశాబ్దుల తరబడి పోరాడవలసి వస్తోంది. మన రక్షణ వ్యయం ఇబ్బడి ముబ్బడిగా పెరగడం మన రూపాయి క్రమానుగత పతనానికి ఒక ప్రధాన కారణం! సువిశాలమైన టిబెట్‌ను కొల్లగొట్టిన చైనా దశాబ్దులపాటు తెగ బలిసింది. ఇలా తెగ బలిసిన చైనాతో అక్కరలేని వాణిజ్యాన్ని కొనసాగించడం వల్ల మనకు ఏటా రెండు లక్షల కోట్లు రూపాయల వాణిజ్యం లోటు ఏర్పడుతోంది. రూపాయి పతనానికి ఇది మరో కారణం! చైనాతో వాణిజ్యాన్ని పూర్తిగా రద్దుచేసుకొంటే మన వ్యవస్థకు సాలీనా రెండు లక్షల కోట్ల రూపాయలు ఆదాయం కలుగుతుంది. రూపాయి విలువ పెరుగుతుంది..