సంపాదకీయం

‘సైన్యం మనిషి’!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సైన్యం అండతో ఎన్నికల్లో విజేతగా నిలిచి, పాకిస్తాన్ ప్రధానిగా అధికార పగ్గాలు చేపట్టేందుకు సిద్ధమవుతున్న మాజీ క్రికెటర్, ‘పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్’ (పీటీఐ) పార్టీ అధినేత ఇమ్రాన్ ఖాన్ ‘్భరత వ్యతిరేకత’కు స్వస్తి చెబుతాడా? అన్నది సందేహాస్పదమే! పాకిస్తాన్ జాతీయ శాసనసభ ఎన్నికల ఫలితాలు వెలువడిన సందర్భంగా ఇమ్రాన్ ఖాన్ చేసిన వ్యాఖ్యలపై భారత విదేశీ, రక్షణ నిపుణులు అప్పుడే పెదవి విరుస్తున్నారు. పాక్‌లో ప్రభుత్వం మారుతోందే తప్ప, అక్కడి నాయకత్వ పంథా కాదని దౌత్యరంగ నిపుణులు విశే్లషిస్తున్నారు. పాకిస్తాన్‌లో అనాదిగా ఆర్మీదే ఆధిపత్యం గనుక అక్కడి ప్రభుత్వాధినేతలు ఎవరైనా సైన్యం చెప్పినట్టు వినాల్సిందే. ఇమ్రాన్ గద్దెనెక్కినంత మాత్రన భారత్ పట్ల పాక్ శత్రుత్వ వైఖరి మారదన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఎన్నికల ఫలితాలు తనకు అనుకూలంగా వెలువడిన వేళ విజయోత్సాహంతో ఇమ్రాన్ తన వీడియో ప్రసంగంలో- ‘నయా పాకిస్తాన్’ ఎలా ఉండబోతున్నదో చెబుతూ.. ‘జిన్నా కోరుకున్న’ పాకిస్తాన్‌ను ఆవిష్కరించడమే తన అంతిమ లక్ష్యమన్నాడు. చైనా నుంచి నేర్చుకోబోతున్నదేమిటో, భారత్ నుంచి ఆశిస్తున్నదేమిటో కుండబద్దలు కొట్టాడు. ‘్భరత్‌తో శాంతికి సిద్ధం.. కశ్మీర్ సమస్యే కీలకం’ అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. భారత్‌తో సత్సంబంధాలను నెలకొల్పేందుకు తన నేతృత్వంలో ఏర్పడబోయే ప్రభుత్వం సుముఖంగా ఉంటుందని చెబుతూనే- ‘కశ్మీర్ లోయలో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోంద’ని తన అంతరంగంలోని అసలు విషయాన్ని బయటపెట్టాడు. భారత్,పాక్‌లు ఒకరిపై ఒకరు నెపం నెట్టుకోవడానికి స్వస్తి పలికి, ఉపఖండంలో శాంతి, సుస్థిరతలకు ప్రయత్నాలు చేయాలని ఇమ్రాన్ తన దౌత్య పరిభాషను కూడా చాటుకున్నాడు.
ఇరు దేశాల మధ్య మంచి సంబంధాల కోసం భారత్ ఒక అడుగు ముందుకేస్తే తాము రెండడుగులేస్తామని, అయితే సయోధ్యకు ఎవరో ఒకరు ఆ దిశగా చొరవ తీసుకోవాలన్నాడు. రెండు దాయాది దేశాల మధ్య కశ్మీర్ ఒక్కటే కీలక సమస్య అని అంగీకరిస్తూనే- ‘లోయలో మానవ హక్కుల ఉల్లంఘన’ అంటూ అగ్నికి ఆజ్యం పోశాడు. భారత్‌పై విద్వేషం వెళ్లగక్కుతూనే, చర్చల ద్వారా కశ్మీర్ కల్లోలానికి పరిష్కారం కనుగొనేందుకు ఉభయ దేశాలు సిద్ధం కావాలంటూ శాంతి మంత్రం పఠించాడు. ‘30 ఏళ్లుగా భారత సైన్యం ద్వారా కశ్మీర్‌లో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోంది.. ఈ సమస్యకు ఇకనైనా ముగింపు పలికేలా ఇరు దేశాల ప్రభుత్వాలు చర్చలకు సిద్ధం కావాలి.. కశ్మీర్ వివాదంపై అటు తిరిగి, ఇటు తిరిగి మళ్లీ మొదటికే వస్తున్నాం’ అని ఇమ్రాన్ వ్యాఖ్యానించాడు. సత్సంబంధాలు, సరైన వాణిజ్య బంధాల ద్వారా ఇరు దేశాలకూ మేలు జరుగుతుందన్నాడు. బెలూచిస్తాన్‌లో పరిణామాలకు భారత్‌దే బాధ్యత అని, అయితే కశ్మీర్‌లో ఘటనలకు పాక్‌దే బాధ్యత అనడం సరికాదని భిన్నవాదన విన్పించాడు. పరస్పర ఆరోపణలతో అభివృద్ధి అసాధ్యమని, ఈ వైఖరి ఉపఖండానికే చేటు కలిగిస్తుందన్నాడు.
‘కశ్మీర్‌లో మానవ హక్కుల ఉల్లంఘన’ అంటూ కాస్త కటువుగానే మాట్లాడిన ఇమ్రాన్ తనను భారత మీడియా శత్రువుగా చిత్రీకరిస్తోందని తీవ్ర అసంతృప్తిని వెళ్లగక్కాడు. ‘కొంతకాలంగా భారత మీడియా నన్ను బాలీవుడ్ సినిమాల్లోని విలన్‌లా చూస్తోంది.. ఆ వార్తలతో నాకు బాధ కలుగుతోంది.. నేను అధికారంలోకి వస్తే భారత్‌కు చెడు జరుగుతుందని ప్రచారం చేస్తున్నారు.. ఇది సరికాదు. ఓ క్రికెటర్‌గా భారత్‌లో విస్తృతంగా తిరిగాను.. భారత ప్రజల గురించి నాకు బాగా తెలుసు..’ అని చెప్పిన ఇమ్రాన్ - పాక్ ప్రేరిత ఉగ్రవాదం గురించి కానీ, భారత వ్యతిరేక కార్యకలాపాలను తాను అనుమతించేది లేదని కానీ మాటవరసకైనా అనలేదు. అధికారం చేపట్టబోయే ఉత్సాహంలో ఇన్ని మాటలు చెప్పిన ఆయన పాకిస్తాన్‌లో సైన్యాన్ని కాదని సొంత నిర్ణయాలు తీసుకోలేడన్నది కాదనలేని కఠోర వాస్తవం. నిజానికి ఇమ్రాన్ చెప్పిన గొప్ప మాటలకు, సైన్యం ఆలోచనలకు చుక్కెదురు. భారత్ పట్ల ఎలా వ్యవహరించాలన్నది సైన్యం నిర్ణయిస్తుందే తప్ప, ఎలాంటి కీలక నిర్ణయాలు తీసుకొనే అవకాశం పాక్ ప్రభుత్వాధినేతలకు ఉండదన్నది చరిత్ర చెప్పిన విషయం. కశ్మీర్ సమస్యపై చర్చలే శరణ్యమంటున్న ఇమ్రాన్ తాజా ఎన్నికల ప్రచారంలో ‘్భరత వ్యతిరేకత’ను విస్తృతంగా వాడుకున్న విషయం జగమెరిగిన సత్యం. నవాజ్ షరీఫ్‌తో చేతులు కలిపి పాక్ సైన్యాన్ని బలహీనపరచేందుకు భారత్ కుట్ర పన్నిందని ఎన్నికల ప్రచారంలో దుమ్మెత్తి పోశాడు. ఉగ్రవాదం వల్ల ఆఫ్గనిస్తాన్ ఎంతో నష్టపోయిందని సానుభూతి వాక్యాలు పలికిన ఆయన భారత్‌లో పాక్ ప్రేరిత జిహాదీ బీభత్సం గురించి ఎప్పుడూ నోరు విప్పలేదు. పాకిస్తాన్‌ను అన్ని రంగాల్లో తీర్చిదిద్దుతానని, పొరుగు దేశాలతో స్నేహగీతం ఆలపిస్తానని ఇమ్రాన్ ఘనంగా చెబుతున్నా, సైన్యం అభీష్టానికి విరుద్ధంగా ఆయన ఏ నిర్ణయం తీసుకోలేడు. ఒకప్పుడు సైన్యానికి వ్యతిరేకంగా మాట్లాడిన ఆయన ఇపుడు అదే సైన్యం చెప్పుచేతల్లో పనిచేయాల్సి ఉంటుంది. ‘పాక్‌లో ఆర్మీ రోజులు పోయాయి.. త్వరలోనే అక్కడ నిజమైన ప్రజాస్వామ్య ప్రభుత్వం ఏర్పడడం మీరు చూస్తారు..’ అని 2012లో స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో మీడియాతో మాట్లాడుతూ ఇదే ఇమ్రాన్ అన్నాడు. అయితే, ఆరేళ్లలో ఆర్మీ పట్ల ఆయన అభిప్రాయాల్లో, వ్యవహార శైలిలో మార్పు వచ్చింది. ‘పాక్‌లోని ఆర్మీ శత్రుదేశపు సైన్యం కాదు.. నేను ఆర్మీని కలుపుకొనిపోతా..’ అని ఇమ్రాన్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన అంతరంగాన్ని బయటపెట్టాడు. ఈ నేపథ్యంలోనే సైన్యానికి ఇమ్రాన్ ఎంతో ప్రీతిపాత్రుడయ్యాడు. భారత్‌తో సంబంధాల కోసం నవాజ్ షరీఫ్ చొరవ చూపడం, ఆర్మీని నియంత్రించేందుకు ప్రయత్నించడం ‘సైనిక పెద్దల’కు నచ్చలేదు. షరీఫ్‌ను అన్ని రకాలుగా ఇబ్బందుల పాలుచేసి, ఇమ్రాన్‌కు అధికారం దక్కేలా చేయడంలో సైన్యం గెలిచింది. తనకు అధికార పగ్గాలు దక్కడంలో అండగా నిలిచిన సైన్యానికి విధేయుడిగా ఇమ్రాన్ వ్యవహరించక తప్పదు. సైన్యం మనసెరిగినందునే ఇమ్రాన్ తన ఎన్నికల మేనిఫెస్టోలో- కశ్మీర్ అంశాన్ని ఐరాస భద్రతామండలి తీర్మానంతో ముడిపెట్టడం, ఇప్పుడు కశ్మీర్‌లో మానవ హక్కుల ఉల్లంఘన అని కొత్త పల్లవి అందుకోవడం వింతేమీ కాదు. ఇవన్నీ చూస్తుంటే- ఇమ్రాన్ భిన్నంగా వ్యహరిస్తాడని, భారత్‌తో మైత్రి కోరుకుంటాడని ఆశించడం కష్టం.
పదవిలో ఉన్నన్నాళ్లూ ఇమ్రాన్ సైన్యం మనిషే. పాక్ ఆర్మీ చెప్పింది చేయడమే ఆయన విధి. ఆయన నాయకత్వంలో భారత్ పట్ల పాక్ ఆలోచనా ధోరణిలో మార్పు వస్తుందని భావించడం అత్యాశే. భారత్- పాక్ ఉద్రిక్త పరిస్థితుల్లో పెద్దగా మార్పు ఉంటుందని కూడా ఆశించలేం. నిజంగా భారత్‌తో మైత్రిని ఇమ్రాన్ కోరుకుంటే- ముందుగా ఆయన సైన్యాన్ని ఒప్పించాలి. పాక్‌లో ఎప్పటిలానే సైన్యం చేతిలో ‘కీలుబొమ్మ సర్కారు’ ఉంటే సమస్యలు షరామామూలే, భారత్‌కు ఉగ్రవాద సెగలే. పరిపూర్ణమైన పౌర ప్రభుత్వం కానందున ఇమ్రాన్ నేతృత్వంలో అద్భుతాలు జరుగుతాయని ఆశించలేం.