సంపాదకీయం

‘ఎత్తర గంప..’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌లోని అనేక జిల్లాలలో వర్షాభావ స్థితి నెలకొని ఉందన్నది వర్ష ఋతువు నడికొంటున్న సమయంలో జరుగుతున్న ప్రచారం. కార్తిక మాసంలో కోతకు వచ్చే- కార్తికం కారు- ఖరీఫ్- పంటలు పూర్తిగా సాగుకాలేదు. దేశంలో అన్ని ప్రాంతాల్లోను నైరృతి ఋతు పవనం - సౌత్ వెస్ట్ మాన్‌సూన్- నిర్ణీత సమయం కంటె చాలా ముందుగానే ప్రారంభం కావడం కర్షకులకు హర్షం కలిగించిన పరిణామం. కొన్ని ప్రాంతాల్లో పదహైదు రోజులు ముందుగాను, మరికొన్నిచోట్ల పదిహేడు రోజులు ముందుగాను నైరృతి ఋతుపవన వర్షాలు కురిశాయి. ఆర్ద్రకార్తె అన్న పేరు సార్థకమైంది. భూమి వర్షధారల వల్ల తడిసిపోతుంది కాబట్టి ఈ కార్తెకు ‘ఆర్ద్ర’అన్న పేరు వచ్చింది. ఆర్ద్ర కార్తెలో ఈసారి నిజంగానే భారత భూమి మొత్తం తడిసిపోయింది- ఆర్ద్రమైపోయింది. జూన్ 22 నుంచి జూలై 4 వరకు ‘ఆర్ద్ర’కార్తె నడిచింది. కానీ వరుణ దేవుడు చూపిన ఈ కరుణ సమదృష్టి సమృద్ధవృష్టి ఆ తరువాతి కార్తెలలో సన్నపడిపోయినట్టు ఇప్పుడు స్పష్టమైపోయింది. ఆంధ్రప్రదేశ్‌లోని అనేక జిల్లాలలో మృగశిర- జూన్ 10 నుంచి- ప్రారంభం నుంచి పుష్యమి కార్తె- ఆగస్టు 2వరకు - పూర్తయ్యేవరకు మామూలుగా కురవదగిన వర్షం కంటె పదమూడు శాతం తక్కువ కురిసిందట. ఫలితంగా కొన్ని జిల్లాల్లో ఇరవై ఐదుశాతం పంట భూమిలో విత్తనాలు వేయలేదు, నాట్లు పడలేదు. మృగశిర, ఆర్ద్ర, పునర్వసు, పుష్యమి కార్తెలు తెలుగు ప్రాంతాల్లో ‘ఏరు’వాక సాగే సమయం. ‘పునర్వసు’- జూలై ఆరవ, ఇరవయ్యవ తేదీల మధ్య- కార్తె పూర్తయ్యేసరికి విత్తనాలు వేయడం పూర్తికావడం ‘దేవమాతృకలు’- వర్షాధార భూములు- ఎక్కువగా ఉన్న ప్రాంతాలలో అనాది సంప్రదాయం.. ఆర్ద్ర- ‘ఆరుద్ర’ లేదా ‘ఆరద్దల’- కార్తెలోను పునర్వసు- పెదపూసి- కార్తెలోను సమృద్ధిగా వాన కురవక పోయినట్టయితే విత్తనాలు వేయడం ఆలస్యం అయిపోతుంది. గ్రామీణులు పడమటికి వెళ్లి ‘వానదేవుడిని పూజించడం పరిపాటి’- ఇప్పటికే ఆలస్యమైపోయింది. ఇకనైనా వాన కురిపించవయ్యా! వరుణదేవా!-అని ప్రార్థించడం పల్లెకు పడమటికి వెళ్లి జరుపుకునే గ్రామీణ ఉత్సవం. అత్యంత ఆలస్యంగా వాన కురిసినప్పటికీ ‘పుష్యమి’ కార్తె- చిన్న పూసి- జూలై 20 నుంచి ఆగస్టు 2 వరకూ- లోనైనా పంట భూములలో విత్తనాలు పడాలి. కానీ ‘పుష్యమి’ పూర్తయి ‘ఆశే్లష’ కార్తె నడుస్తున్నప్పటికీ ఇరవై ఐదు శాతం ‘ఖరీఫ్’ పంట భూమి ఆంధ్రప్రదేశ్‌లో బీడుగానే ఉందన్నది వర్తమాన వర్ష వైపరీత్యం- ఈ ‘ఆసల’- ఆశే్లష- కార్తెలో కూడ చినుకులు తగినన్ని రాలక పోయినట్టయితే ‘ఉత్తర చూసి ఎత్తర గంప’ అన్న నానుడి మరోసారి ధ్రువపడక మానదు.. ఇంకా ఉత్తర కార్తె రాలేదు! ఆశే్లష తరువాత ‘మఘ’, పూర్వ ఫల్గుని- పుబ్బ-, పూర్తయిన తరువాత ‘ఉత్తర ఫల్గుని’-ఉత్తర- కార్తె సెప్టెంబరు 14వ తేదీన ప్రారంభం కానుంది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆర్ద్రకార్తెలో, జేష్ఠ మాసం పౌర్ణమినాడు- జూన్ 28వ తేదీ- ‘ఏరువాక’ ఉత్సవాన్ని ఆధికారికంగా నిర్వహించడం తరతరాల వ్యవసాయ సంప్రదాయానికి అనుగుణం. అయినప్పటికీ వరుణుడు ఈసారి ఆంధ్రప్రదేశ్ ప్రజలను కరుణించినట్టు లేదు. రాయలసీమ జిల్లాలలో ప్రతి ఏట ఎక్కడో అక్కడ ‘వర్షాభావం’ నెలకొనడం ఆశ్చర్యం కాదు. కానీ వర్ష సమృద్ధికి నిలయమైన గోదావరి ప్రాంతంలో కూడ ఈ ఏడాది ‘అనావృష్టి’ పరిస్థితులు ఏర్పడి ఉన్నాయట. దేశమంతటా కూడ అనేక ప్రాంతాలలో వరదలు ముంచెత్తుతుండడం మరికొన్ని ప్రాంతాలలో అనావృష్టి ఏర్పడి ఉండడం సమాంతర పరిణామాలు. అస్సాంలో యథావిధిగా వర్షబీభత్సం కొనసాగుతోంది. జమ్మూ కశ్మీర్, ఉత్తరఖండ్, హిమాచల్, బిహార్ రాష్ట్రాలను సైతం వరదలు ముంచెత్తాయి. కానీ మరోవైపు మధ్య భారతంలో పశ్చిమ భారతంలో వర్షపాతం నిరుటికంటె తక్కువైపోయింది. తెలుగు ప్రాంతాలలో సైతం ఈ దుస్థితి నెలకొని ఉంది. కొన్నిచోట్ల వర్షబీభత్సం కొనసాగుతోంది. కర్నాటక తదితర ఎగువ ప్రాంతాలలో కురిసిన వర్షాల వల్ల తెలుగు ప్రాంతాలలో నదులు పొంగులెత్తుతున్నాయి, జలాశయాలు కళకళ లాడుతున్నాయి. కానీ మరోవైపు ‘అనావృష్టి’కూడ- ‘నేనున్నాను..’అని అస్తిత్వాన్ని చాటుకుంటోంది..
ఈ ఏడాది తెలుగు రాష్ట్రాలలో వర్షసమృద్ధి వెల్లివిరుస్తుందన్న శాస్తవ్రేత్తల అంచనాలు ఇలా పాక్షికంగా మాత్రమే పరిపూర్తికావడం ‘‘మానవ మేధపై ప్రకృతి నిరంతరం సాధిస్తున్న విజయానికి’’ మరో నిదర్శనం మాత్రమే! నదీ మాతృకలు- చెఱువులు, కాలువల ద్వారా సాగయి రెండుమూడు పంటలు ‘సాలీనా’ పండే భూమి- ఎక్కువగా ఉన్న తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలలోను ఇతర కోస్తా ప్రాంతాలలోను కూడ ఈసారి వర్షపాతం తగ్గిందట. ఫలితంగా నాటడానికి నోచుకోను ‘నారు’ నారుమడుల- నర్సరీలు-లోనే వాడిపోయి ఎండిపోతోందట! తెలుగు రాష్ట్రాలు సహా అనేక రాష్ట్రాలలో ప్రభుత్వాలు రైతుల ఋణాలు ‘మాఫీ’చేసినందువల్ల రైతులకు గొప్ప వెసులుబాటు ఏర్పడింది. తెలంగాణ ప్రభుత్వం పెట్టుబడి క్రింద ప్రతి పంటకు ఎకరానికి నాలుగువేల రూపాయలు చొప్పున ఇస్తోంది. ఇలాంటి పథకాల వల్ల దేశమంతటా వ్యవసాయదారులలో ‘సమృద్ధ’ ‘్భద్రతా’్భవాలు పెంపొందినాయి. కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ ఉత్పత్తులపై లభించనున్న కనీసపు మద్దతు ధరలను సైతం భారీగా పెంచింది. ఈ భద్రతా భావం వల్ల, సకాలంలో వర్షాలు సమృద్ధిగా కురిసాయన్న, తమ ఉత్పత్తులకు మంచి ధరలు లభిస్తాయన్న భద్రతాభావం కారణంగా తమ పంటలను బీమా చేస్తున్న రైతుల సంఖ్య ఈ ఏడాది తగ్గిందట! 2016లో కేంద్ర ప్రభుత్వం ఆరంభించిన ఈ ‘పంటల బీమా’ పథకంలో నమోదయిన వ్యవసాయ భూమి పరిణామం గత ఏడాది కంటె ఈ ఏడాది పదిహేను శాతం తగ్గిపోవడం రైతులలో పెరిగిన భద్రతాభావానికి ప్రతీక! కర్నాటకలో నలబయి శాతం మేర, రాజస్థాన్‌లో ముప్పయి మూడు శాతం మేర ‘పంటల బీమా’ తగ్గిపోవడం వ్యవసాయదారులలో పెరిగిన విశ్వాసానికి చిహ్నం. కానీ ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం అనేక జిల్లాలలో తమ పంటలను బీమాచేసే రైతుల సంఖ్య పెరగక మానదు, ఆవహించి ఉన్న అనావృష్టి ఇందుకు కారణం! అనావృష్టి పీడిత మండలాలలోని రైతులకు ‘ఉత్తర చూసి ఎత్తర గంప’ అన్న సామెత మరోసారి గుర్తుకు రాక మానదు!!
ఉత్తర కార్తెవరకు వర్షాలు సరిగా కురవకపోతే పంటలు పండవని రైతులకు, వ్యవసాయ శ్రామికులకు తెలిసిపోతుందట! ‘శ్రామికులు’ గంపలెత్తుకొని, తట్టాబుట్టా తపేలాలతో ఇతర ప్రాంతాలకు వలసపోవడం తప్పదన్నది ఈ సామెత! గ్రామీణ ఉపాధి పథకం కింద నూట యాబయి రోజులవరకూ ఉన్నచోటునే వ్యవసాయ కార్మికులకు కేంద్ర ప్రభుత్వం ఉపాధి కలిపిస్తోంది. అందువల్ల గ్రామీణ ప్రాంతాలలో వలసలు వెళ్లేవారి సంఖ్య తగ్గిపోయి ఉండాలి! తగ్గడం లేదు. ‘ప్రపంచీకరణ’ ఆర్థిక వైపరీత్యాలు గ్రామీణ జీవన వ్యవస్థను ఛిన్నాభిన్నం చేయడం ఇందుకు కారణం. పల్లెల నుంచి వలసలు పట్టణాల వైపు నగరాల వైపు కొనసాగుతూనే ఉన్నాయి. ‘‘ఉత్తర చూసి ఎత్తర గంప’’ అన్నది తాత్కాలిక అనావృష్టి సృష్టించిన తాత్కాలికమైన వలసలు. కానీ ‘ప్రపంచీకరణ’ మాయాజాలం సృష్టిస్తున్న వలసలు శాశ్వతమైనవి. గ్రామాలలో ముసలివారు, పనిచేయలేనివారు మాత్రమే మిగిలిపోతున్నారని, యువజనులు నగరాలకు చేరిపోతున్నారని ప్రచారమైంది. ఈ యువజనులకు అనావృష్టి బాధలేదు, ‘కార్తెలు’ ‘ఋతువులు’ తెలియవు. వర్ష దారిద్య్రం కంటె ‘ప్రపంచీకరణ’ సృష్టించిన భావ దారిద్య్రం మరింత ప్రమాదకరమన్నది ప్రచారం కాని వాస్తవం!