సంపాదకీయం

హరివంశ విజయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఐక్య జనతాదళ్‌కు చెందిన హరివంశ నారాయణ్ సింగ్ రాజ్యసభ ఉపాధ్యక్షుడుగా ఎన్నిక కావడం గురువారం నాడు భారతీయ జనతాపార్టీకి లభించిన వ్యూహాత్మక విజయం. ఉపాధ్యక్ష పదవికి తమ పక్షానికి చెందినవారిని కాక, మిత్రపక్షానికి చెందిన హరివంశ్‌ను అభ్యర్థిగా ఎంపిక చేయడం భాజపా అధిష్ఠానం అమలు జరిపిన ‘వ్యూహం’! ఐక్య జనతాదళ్ భాజపాకు రెండు దశాబ్దులుగా మిత్రపక్షం. భాజపా నాయకత్వంలోని జాతీయ ప్రజాస్వామ్య సంఘటనం- నేషనల్ డెమొక్రాటిక్ అలియన్స్- ఎన్‌డీఏ-లో భాగస్వామ్య పక్షం. 2013వ సంవత్సరంలో భాజపా ప్రధానమంత్రి అభ్యర్థిగా నరేంద్ర మోదీ అవతరించడం పట్ల నిరసనగా ఐక్య జనతాదళ్ ఎన్‌డీఏ నుంచి నిష్క్రమించింది. గత ఏడాది మళ్లీ ఎన్‌డీఏలో ప్రవేశించింది. ఈ పునః ప్రవేశానికి ఫలితం హరివంశ నారాయణ్ సింగ్ రాజ్యసభ ఉపాధ్యక్షుడుగా ఎన్నిక కావడం. రాజ్యసభ ఉపాధ్యక్ష పదవికి భాజపాకు చెందిన అభ్యర్థి కాక ఎన్‌డీఏలోని మిత్రపక్షాలకు చెందిన అభ్యర్థిని పోటీ పెట్టాలన్నది బిజూ జనతాదళ్ వారు విధించిన నిబంధన. అలా జరిగినప్పుడు మాత్రమే తమ పార్టీ సభ్యులు ఎన్‌డీఏ అభ్యర్థికి వోటు వేయగలరని బిజూ జనతాదళ్ అధినేత, ఒరిస్సా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ స్పష్టం చేశాడట! అందువల్లనే భాజపా ఈ వ్యూహాత్మక త్యాగానికి సిద్ధపడింది. ప్రతిపక్షాల కూటమికి వ్యితిరేకంగా విజయం సాధించ గలిగింది. హరివంశ నారాయణ్ సింగ్ బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ నాయకత్వంలోని ఐక్య జనతాదళ్‌కు ఇంతవరకూ జాతీయ కార్యదర్శిగా ఉన్నాడు. పార్టీ ఒరిస్సా ప్రాంత వ్యవహారాలను పర్యవేక్షించాడట! ఒరిస్సాలో కూడ ఐక్య జనతాదళ్ విస్తరించి ఉందన్నది ఇప్పుడు బయటపడింది. హరివంశ్ సింగ్ రాజ్యసభ ఉపాధ్యక్షుడుగా ఎన్నిక కావడం ఇందుకు కారణం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రశంసించినట్టుగా హరివంశ నారాయణ్ సింగ్ వరిష్ట పత్రికా రచయిత, ప్రముఖ సంపాదకుడు, సామాజిక ఉద్యమకారుడు, మాజీ ప్రధాని చంద్రశేఖర్‌కు సన్నిహితుడు, ప్రచార మాధ్యమ సలహాదారుడు. చంద్రశేఖర్ ప్రాతినిధ్యం వహించిన బలియా లోక్‌సభ స్థానంలోనే హరివంశ్ జన్మస్థలం ఉందట! బలియా బ్రిటన్ వ్యతిరేక స్వాతంత్య్ర సమర సమయంలో ప్రసిద్ధికెక్కింది. ‘లోక్‌నాయక్’ జయప్రకాశ్ నారాయణ్ జన్మించిన గ్రామంలోనే హరివంశ్ కూడ జన్మించాడన్నది రాజ్యసభలో ప్రధానమంత్రి చెప్పిన మాట. యుద్ధ హతుడైన ఒక సమరవీరుని కుటుంబానికి హరివంశ్ సహాయం చేయడం, భారీ నిధిని సేకరించి సమర్పించడం ఆయన సేవానిరతికి నిదర్శనమని మోదీ చెప్పడం హరివంశ్ వ్యక్తిత్వ ఉన్నతికి నిదర్శనం. హిందీ భాషాప్రచారానికై ఆయన చేసిన కృషి నిరుపమానమన్నది రాజ్యసభలో కాంగ్రెస్ నాయకుడు గులాం నబీ ఆజాద్ చెప్పిన మాట. వౌలికంగా హరివంశ్ ఇలా సమాజ హితవేత్త.. రాజకీయవేత్త కావడం తరువాతి అంశం. అందువల్ల రాజకీయ విభేదాలకు అతీతమైన పదవికి ఆయన ఎన్నిక కావడం రాజ్యాంగ సామంజస్యానికి చిహ్నం.
సభలో డెబ్బయి మూడు స్థానాలున్న భాజపా ఇలా మిత్రపక్షానికి పదవిని కట్టబెట్టింది. యాబయి స్థానాలున్న కాంగ్రెస్ ఇలా సాహసోపేతమైన పదవీ త్యాగానికి సిద్ధపడలేదు. కాంగ్రెస్ కూటమి- ఐక్య ప్రగతి కూటమి- యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలియన్స్- యూపీఏ-కి దక్కిన వ్యూహాత్మక పరాజయానికి ఇదీ ప్రాతిపదిక. అభ్యర్థిత్వాన్ని మిత్రపక్షాలకు కేటాయించడానికి కాంగ్రెస్ అధిష్ఠానానికి మనసొప్పలేదు. తమ పార్టీకి చెందిన బీకే హరిప్రసాద్‌ను రంగంలోకి దించింది. దీంతో కొన్ని మిత్రపక్షాలను నిస్పృహ ఆవహించింది. తటస్థ పక్షాలు భాజపా కూటమి వైపు మొగ్గు చూపాయి. తొమ్మిది మంది సభ్యులున్న బిజూ జనతాదళ్ ఎన్‌డీఏలో కాని, యూపీఏలో కాని భాగస్వామ్య పక్షం కాదు. తమ పార్టీ కాంగ్రెస్‌కు, భాజపాకు మధ్య సమాన దూరం పాటిస్తుందని బీజేడీ అధినేత నవీన్ పట్నాయక్ పలుమార్లు స్పష్టం చేసి ఉన్నాడు. ఇప్పుడు ఆ పార్టీ భాజపా కూటమి వైపు జరగడానికి కారణం కాంగ్రెస్ వ్యూహం. విపక్ష అభ్యర్థిగా కాంగ్రెస్‌కు చెందిన వారిని కాక మరో మిత్రపక్షం అభ్యర్థిని నిలబెట్టి ఉండినట్టయితే బహుశా బీజేడీ కాంగ్రెస్ వైపు జరిగి ఉండేది! అది జరగకపోవడానికి కారణం కాంగ్రెస్ ‘మోహం’.
ఎన్‌డీఏ అభ్యర్థి హరివంశ్‌కు నూట ఇరవై ఐదు మంది రాజ్యసభ సభ్యులు వోట్లు వేశారు. యూపీఏ అభ్యర్థి హరిప్రసాద్‌కు నూట ఐదు వోట్లు పడ్డాయి. బీజేడీకి చెందిన తొమ్మిదిమంది హరివంశ్‌కు వోటు వేయకపోయి ఉంటే ఆ యన బలం నూట పదహారుకు దిగజారి ఉండేది. అప్పటికీ ఆయన విజయం సాధించి ఉండేవాడు. ఒకవేళ ఆ తొమ్మిది మంది హరిప్రసాద్‌కు మద్దతు పలికి ఉంటే ఆయన బలం నూట పదునాలుగుకు చేరి ఉండేది. అప్పుడు కూడ ఎన్‌డీఏ అభ్యర్థి రెండు వోట్ల మెజారిటీతో గెలిచి ఉండేవాడు. కానీ అలాంటి స్థితిని కాంగ్రెస్ సృష్టించి ఉండినట్టయితే ప్రతిపక్షాల ఏకత్వ స్ఫూర్తికి గొప్ప ఊపు సిద్ధించి ఉండేది. కర్నాటక శాసనసభ ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే కాంగ్రెస్ పార్టీ వారు ముఖ్యమంత్రి పదవి తమకు వద్దన్నారు. తమ పార్టీకి లభించిన సీట్ల సంఖ్యలో సగం మాత్రమే లభించిన లౌకిక జనతాదళ్ నాయకుడు హెచ్‌డీ కుమారస్వామికి మద్దతు పలికింది. ఆయనను ముఖ్యమంత్రిని చేసింది. భాజపాకు కర్నాటకలో అధికారం దక్కకుండా నిరోధించింది. ప్రతిపక్షాల ఐక్య సంఘటన విజయం కోసం, భాజపాను గద్దె దించడం కోసం, ప్రధానమంత్రి పదవిని సైతం త్యాగం చేయడానికి కాంగ్రెస్ సిద్ధపడిపోవడం వర్తమాన వైచిత్రి! ఇలా ప్రతిపక్ష సమైక్య అధికార అభ్యుదయ ప్రాప్తి కోసం ముఖ్యమంత్రి పదవిని త్యాగం చేసిన, ప్రధాని పదవిని త్యాగం చేయడానికి సిద్ధపడుతున్న కాంగ్రెస్ రాజ్యసభ ఉపాధ్యక్ష- డిప్యూటీ చైర్మన్- పదవిని మాత్రం త్యాగం చేయడానికి సంసిద్ధతను ప్రకటించలేదు. బిజూ జనతాదళ్‌కే అభ్యర్థిత్వాన్ని కట్టబెట్టనున్నట్టుగా కాంగ్రెస్ ప్రకటించి ఉండవచ్చు లేదా సమాజ్‌వాదీ పార్టీకి అభ్యర్థిత్వాన్ని కేటాయించి ఉండవచ్చు. సమాజ్‌వాదీ పార్టీ, రాష్ట్రీయ జనతాదళ్, లౌకిక జనతాదళ్, బిజూ జనతాదళ్, ఐక్య జనతాదళ్- ఇవన్నీ ఒకే బద్దెలోని దారాలు. ఇవన్నీ కలసి ఒకే ‘జనతాదళ్’గా ఉండిన సమయంలో ఆ పార్టీ నాయకుడు వీపీ సింగ్ ప్రధానమంత్రి అయ్యాడు. ఆ ‘జనతాదళ్’ కుక్కలు చింపిన విస్తరి వలె మారిన తరువాత ఈ ‘జనతా’ దళాలు పుట్టాయి..
కానీ కాంగ్రెస్ ఈ పనికి పూనుకోలేదు. కర్నాటకలో సీఎం పదవి దక్కదని తెలిశాక ‘త్యాగం’ చేసింది. ‘రాజకీయ విదూషక శిఖామణి’ రాహుల్ గాంధీ నాయకుడిగా ఉన్నంత వరకు కాంగ్రెస్‌కు లోక్‌సభ ఎన్నికల్లో విజయం లభించబోదు. అందువల్ల అందని ద్రాక్ష వంటి ప్రధాని పదవిని సైతం వదలుకోవడానికి కాంగ్రెస్ సిద్ధపడింది. కానీ రాజ్యసభ ఉపాధ్యక్ష పదవిని గెలవగలమన్న ఆ శ ఏ మూలలోనో కాంగ్రెస్ వారికి అంకురించింది! అందువల్లనే అభ్యర్థిత్వాన్ని త్యాగం చేయలేదు. విపక్ష ‘ఏకత్వం’ పట్ల కాంగ్రెస్ నకిలీ నిష్ఠ ఇదీ..