సంపాదకీయం

విధాన వైపరీత్యం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాకిస్తాన్ పౌర ప్రభుత్వం అధినేత ఇమ్రాన్‌ఖాన్‌కు ఉత్తరం వ్రాయడం వల్ల అంతర్జాతీయ సమాజంలో పాకిస్తాన్‌కు గౌరవం పెరిగింది. పాకిస్తాన్‌లో వాస్తవానికి రెండు ప్రభుత్వాలు పని చేస్తున్నాయి. మొదటిది ‘సైనిక దళాల ఆధిపత్యం’. ఇది రాజ్యాంగంతో కాని చట్టాలతో కాని నిమిత్తం లేని మతోన్మాద జిహాదీ నియంతృత్వం. ఈ నియంతృత్వ ‘స్వభావం’ భారత వ్యతిరేకత. ఈ సైనిక ఆధిపత్యానికి ‘లక్ష్యం’ భారత్‌ను బద్దలు కొట్టడం. ఈ లక్ష్యం ఎప్పటికీ నెరవేరదు.. కానీ ఈ ‘స్వభావం’ కూడ ఏడు దశాబ్దులుగా మారడం లేదు, భవిష్యత్తులో మారుతుందన్న విశ్వాసం లేదు. ఎందుకంటె సైనిక దళాల స్వభావం విస్తృత పాకిస్తాన్ సమాజ స్వభావానికి అద్దం. ఈ స్వభావం మారేంతవరకు మన ప్రభుత్వం ఎన్నిసార్లు అవకాశం ఇచ్చినప్పటికీ, ఎంత ప్రయత్నించినప్పటికీ పాకిస్తాన్ సైనిక ఆధిపత్య నియంతలకు మన దేశం పట్ల మైత్రి అంకురించదు. ప్రపంచంలోని అన్ని ఇతర మతాలను ధ్వంసం చేసి ‘ఇస్లాం’ను ఏకైక మతంగా నిలబెట్టడం ‘జిహాద్’ స్వభావం, లక్ష్యం. ఈ లక్ష్యసాధన కోసం బీభత్సకాండను సాగించడం జిహాదీల మాధ్యమం. అందుకు పాకిస్తాన్ ఏర్పడిన నాటి నుంచి కూడ ఇస్లామేతర మతస్థులు అత్యధిక సంఖ్యలో ఉన్న భారత్‌కు వ్యతిరేకంగా బీభత్సకాండ జరపడం పాకిస్తానీ ‘జిహాదీ’ల కార్యక్రమంగా మారి ఉంది. ఇది బహిరంగ రహస్యం, దశాబ్దుల వైపరీత్యం. వివిధ వికృత నామాలున్న పాకిస్తానీ ప్రభుత్వేతర జిహాదీ ముఠాలవారు భారత వ్యతిరేక ప్రత్యక్ష బీభత్సకారులు.. పాకిస్తాన్ సైనికులు ప్రచ్ఛన్న- మారువేషంలోని- జిహాదీ బీభత్సకారులు. ఇదీ పాకిస్తాన్‌లో శాశ్వతంగా వ్యవస్థీకృతమైన సైనిక ప్రభుత్వం. ఇది మొదటి ప్రభుత్వం. ఈ ‘పరమోన్నత’ సైనిక ప్రభుత్వం వారి ప్రత్యక్ష, పరోక్ష ఆజ్ఞలకు అనుగుణంగా ‘పరిపాలన’ను అభినయిస్తున్న ‘పౌర ప్రభుత్వం’ పాకిస్తాన్‌లోని రెండవ ప్రభుత్వం. అందువల్ల ఇమ్రాన్ ఖాన్ కాని మరొక ప్రధానమంత్రి కాని స్వయంగా నిర్ణయాలు తీసుకోవడం అసంభవం! నిర్ణయాలను తీసుకుంటున్నట్టు, పాలన సాగిస్తున్నట్టు, ఇతర దేశాలతో దౌత్యం నెరపుతున్నట్టు పౌర ప్రభుత్వాలు ప్రచారం చేసుకోవడం అభినయం మాత్రమే. నాటక సూత్రధారి పాకిస్తాన్ సైన్యం! అందువల్ల మన ప్రధానమంత్రి పాకిస్తాన్ ‘పౌర ప్రభుత్వ’ నూతన అధిపతి ఇమ్రాన్‌ఖాన్‌కు ఉత్తరం వ్రాయడం ‘బూడిదలో పోసిన పన్నీరు’ వంటి విపరిణామం! మన దేశం నుండి వెళ్లి ఇమ్రాన్‌ఖాన్ పాకిస్తాన్ ప్రధానమంత్రిగా ప్రమాణం చేయడాన్ని వికృత వదనంతో చూసిన నవజ్యోత్‌సింగ్ సిద్ధు అనే పంజాబ్ మంత్రికి ఈ సైనిక ప్రాధాన్యం బాగా తెలిసినట్టుంది. అందువల్లనే అతగాడు- సిద్ధూ- పాకిస్తాన్ సైనిక దళాల ప్రధాన అధికారి ఖమర్ బడ్‌వాను రెండుసార్లు ఆలింగనం చేసుకొని మాతృ దేశాన్ని వెక్కిరించాడు, జాతీయ భావ నిష్ఠను ధిక్కరించాడు...
ఇరుగు పొరుగు దేశాలలో శాంతి భద్రతలను పెంపొందించడంలోను, ఇరుగు పొరుగు దేశాలను బీభత్సకాండ నుండి, హింసాకాండ నుండి విముక్తం చేయడంలోను, ప్రగతి సాధనకు పాటుపడడంలోను తమ ఇద్దరికీ- తమ దేశాలకు- సమాన దృష్టి ఏర్పడి ఉందని ఇమ్రాన్‌ఖాన్‌కు వ్రాసిన ఉత్తరంలో నరేంద్ర మోదీ పేర్కొన్నట్టు ప్రచారవౌతోంది. ఇదే నిజమైతే, ఇది బీభత్స రాజ్యాంగ వ్యవస్థగల పాకిస్తాన్‌కు ప్రశంసాపత్రం వంటిది. ఈ ‘ప్రశంసా పత్రం’ తోడేళ్లమందకు గోగణ సమూహం సమర్పించే స్నేహపత్రం వంటిది, ‘హంతకుణ్ని’ ‘హతుడి’ ప్రతినిధులను ఒకే ‘గాట’కట్టడం వంటిది. ఎందుకంటె మన దేశంలోకి చొరబడి బీభత్సకాండను జరుపుతున్న ‘జిహాదీ’లు ప్రభుత్వేతర మూకలు - నాన్ స్టేట్ యాక్టర్స్- కారు, వారు పాకిస్తాన్ ప్రభుత్వం దశాబ్దుల తరబడి పెంచి పోషించి మన దేశంలోకి ఉసిగొల్పుతున్న బీభత్స మృగాలు, తోడేళ్లు.. అందువల్ల నిజమైన బీభత్సకారులు పాకిస్తాన్ ప్రభుత్వ నిర్వాహకులు..
పాకిస్తాన్ ప్రభుత్వం ఈ బీభత్సకాండను విడనాడినప్పుడు మనం ఆ దేశంతో స్నేహం చేయవచ్చు, చర్చలు జరుపవచ్చు. ‘మీరు మా దేశంలోకి జిహాదీలను ఉసికొల్పడం ఇకనైనా మానుకోండి. లేనట్టయితే మేము బీభత్స రాజ్యాంగ వ్యవస్థ- టెర్రరిస్ట్ రిజీమ్-గా ప్రకటిస్తాము. అంతర్జాతీయ సమాజం, ఐక్యరాజ్యసమితి మీ ప్రభుత్వాన్ని ‘బీభత్స వ్యవస్థ’గా గుర్తించడానికి వీలైన ప్రయత్నాలను ప్రారంభిస్తాము..’ అని ఇమ్రాన్ ఖాన్‌కు మోదీ చెప్పి ఉండాలి. అలా జరగలేదు. హంతకులను ఉసిగొల్పుతున్న పాకిస్తాన్ ప్రభుత్వాన్ని ఐక్యరాజ్యసమితి శిక్షించాలి. కానీ హంతకులను శిక్షించాలని పాకిస్తాన్ ప్రభుత్వాన్ని కోరడం వల్ల- పాకిస్తాన్ ప్రభుత్వానికి అనర్హమైన గౌరవం లభిస్తోంది, పాకిస్తాన్ ప్రభుత్వం వారు తాము బీభత్సకారులను ఉసిగొల్పడం లేదని బుకాయించడానికి వీలుకలుగుతోంది. బీభత్సకాండ నుండి ఇరుగు పొరుగు దేశాలను విముక్తం చేయడంలో ‘మనకూ పాకిస్తాన్‌కు మధ్య సమాన దృష్టి, సమాన భాగస్వామ్యం ఉందనడం’ అతార్కికం, వాస్తవాలకు విరుద్ధం.. పాకిస్తాన్‌లో ‘పౌర ప్రభుత్వాన్ని’ ఏర్పాటు చేయడానికి జరుగుతున్న ఎన్నికలను, ఫలితాలను సైనిక దళాల వారు నియంత్రిస్తున్నారు. 2008లో అధ్యక్షుడు అసఫ్ అలీ జర్దారీ స్వయంగా తమ తప్పును అంగీకరించాడు, పాకిస్తాన్ ప్రభుత్వం దశాబ్దుల తరబడి బీభత్సకారులను రూపొందించిందని అంగీకరించాడు. అందువల్ల సైనిక దళాలకు అతగాడు గిట్టలేదు, అధ్యక్షుని అధికారాలను కుదించి వేశారు. యూసఫ్ రజా జిలానీ ప్రధానమంత్రిగా భారత వ్యతిరేకతను వెళ్లగక్కాడు. కానీ జిలానీ కంటె నవాజ్ షరీఫ్ మరింత మతోన్మాదిగా, భారత వ్యతిరేకిగా చెలామణి అయ్యాడు. అందువల్ల 2013లో షరీఫ్‌ను సైనిక దళాలవారు బలపరిచారు. షరీఫ్ కంటె ఇమ్రాన్ ఖాన్ మరింతగా ‘జిహాదీ’ ఉన్మాదాన్ని, భారత వ్యతిరేకతను ప్రదర్శించడం గత ఏడాదిగా నడిచిన చరిత్ర. అందువల్లనే ఇమ్రాన్ ఖాన్ ఇప్పుడు ప్రధాని....
నవజ్యోత్‌సింగ్ సిద్ధూ వంటి ప్రచ్ఛన్న దేశ వ్యతిరేకులను శిక్షించడానికి వీలైన చట్టాలు లేకపోవడం మన ప్రజాస్వామ్య రాజ్యాంగ వ్యవస్థలో నిహితమై ఉన్న వైపరీత్యం! ఒక కవి అన్నట్టు-
‘అదిగో.. అక్కడ నిలుచున్నవారు
ఆత్మలను హత్యచేసి
ఆవురావురమని ఆరగిస్తున్నారు,
ఇది నాదని, నా దేశమని
భావించని వారు.. వారు!
మాతృభూమి పట్ల మమకార జ్వాల
రగలని గుండెలవారు.. వారు!
పిశాచాలను కౌగలించుకొని
నిశాతటిలో క్రీడిస్తున్నారు..’!!
సిద్ధూ లాంటి వారు ఈ పైశాచిక ప్రవృతులు. పంజాబ్‌లో మంత్రి పదవిని వెలగబెడుతున్న సిద్ధూ ‘కౌగిలింత’ను పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ స్వయంగా అభిశంసించాడు. మరి మంత్రివర్గం నుంచి ఎందుకు తొలగించలేదు? ‘హురియత్’ ముఠాకు చెందిన ప్రత్యక్ష ద్రోహులను కేంద్ర ప్రభుత్వం పాకిస్తాన్‌కు వెళ్లి ‘చర్చలు’ జరపడానికి అనుమతించడం లేదు.. అభినందనీయం.. మరి సిద్ధూను ఎందుకు వెళ్లనిచ్చినట్టు?