సంపాదకీయం

‘పెద్దన్న’ కోరిక..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మన వాణిజ్య వ్యవహారాల చట్టాలను సవరించాలన్నది అమెరికా వ్యక్తం చేసిన సరికొత్త కోరిక. తమ దేశం నుంచి మన దేశానికి తరలివస్తున్న వస్తువులపై మన ప్రభుత్వం విధిస్తున్న పన్నులను- సుంకాలను- గణనీయంగా తగ్గించి వేయాలట, పూర్తిగా ఎత్తి వేసినట్టయితే మరీ మంచిదట! తాము మాత్రం మన దేశం నుండి దిగుమతి చేసుకుంటున్న సామగ్రిపై భారీగా సుంకాలను విధించవచ్చునట, మన ప్రభుత్వం అభ్యంతరం చెప్పరాదు, ‘ప్రతిక్రియ’కు పూనుకోరాదు, కొత్త సుంకాలను విధించరాదు. ఇదీ అమెరికా ప్రభుత్వం మన దేశంలో కోరుతున్న ఆర్థిక వాణిజ్య సంస్కరణల తాజా స్వరూపం. ఈ స్వరూపాన్ని మన దేశంలోని అమెరికా రాయబారి కెనె్నత్ జెస్టర్ కొత్త ఢిల్లీలో ఆగస్టు పద్దెనిమిదవ తేదీన మరోసారి ఆవిష్కరించారు. ‘మరోసారి’ అన్నది ఎందుకంటే మన దేశంలో ఇలాంటి సంస్కరణలు జరగాలని అమెరికా ప్రభుత్వం ఏళ్ల తరబడి కోరుతూనే ఉంది. అమెరికా ఒత్తిడికి మనం లొంగడం లేదన్నది మన ప్రభుత్వాలు పదేపదే చెబుతున్న మాట. కానీ అమెరికా వారి ‘పెద్దన్న సలహాల’ను మన ప్రభుత్వం ఎప్పటికప్పుడు స్వీకరించడం, శిరసావహించి అమలు జరుపుతుండడం దశాబ్దుల చరిత్ర. ఇదే మనకూ అమెరికాకు మధ్య నెలకొని ఉన్న ‘వ్యూహాత్మక బంధం’. ‘ఈ వ్యూహాత్మక బంధానికి వాణిజ్యం ప్రాతిపదిక’ అన్న అమెరికా రాయబారి సరికొత్త భాష్యం కూడ పునరావృత్తి. ఇలా మన ప్రభుత్వం సుంకాలను తగ్గించకపోతే, తమ ప్రభుత్వం సుంకాలను పెంచడానికి వీలు కల్పించకపోతే మన దేశంలో పెట్టుబడులను పెట్టడానికి ‘విదేశీయ సంస్థలు’ ముందుకు రావన్నది కెనె్నత్ జెస్టర్ చేసిన హెచ్చరిక! మన ఆర్థిక వ్యవస్థ ద్వారాలు మరింతగా తెరుచుకోవాలట! ఇలా తెరుచుకొనడంలో భాగం- మన దేశం సుంకాలను తగ్గించడం. అమెరికా, చైనా, ఐరోపా సమాఖ్య, దక్షిణ కొరియా వంటి దేశాలు పెంచిన సుంకాలను మనం బుద్ధిగా చెల్లించడం.. ఇదీ ‘ప్రపంచీకరణ’ ఊబిలో మనం కూరుకొనిపోతున్న తీరు. విదేశాల నుండి పెట్టుబడులు వస్తాయన్న ‘వాణిజ్య మోహం’ ఆవహించి ఉన్న మన ప్రభుత్వం ఏళ్ల తరబడి అమెరికా ఒత్తిడికి, చైనా ఒత్తిడికి లొంగిపోతుండడం సామాన్యులకు అర్థం కాని, పెద్దగా ప్రచారం కాని ‘అంతర్జాతీయ అనుసంధాన రహస్యం’. ఈ అనుసంధాన కబంధంలో మన దేశాన్ని ఇరికించేసిన అంతర్జాతీయ స్థాయి ఆర్థికవేత్త, భూతపూర్వ ఆర్థికమంత్రి, భూతపూర్వ ప్రధానమంత్రి మన్‌మోహన్ సింగ్..
సంకుచిత జాతీయ ప్రయోజనాలను త్యాగం చేసి విస్తృత అంతర్జాతీయ ప్రయోజనాల సాధనకు ప్రపంచ దేశాలు పాటుపడాలన్నది వాణిజ్య ప్రపంచీకరణ లక్ష్యం. ‘ప్రపంచ వాణిజ్య సంస్థ’- వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్- డబ్ల్యుటీవో- ఇందుకోసం నియమావళిని నిర్దేశించింది. ‘ప్రపంచ హితం’ అంటే ‘బ్రిటన్ సామ్రాజ్య హితం’ అన్నది మొదటి ప్రపంచ యుద్ధానికి పూర్వం నాటి నీతి. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఈ ‘ప్రపంచ హితం’ ముదిరి ఉన్న వర్తమానంలో ‘అంతర్జాతీయ హితమం’టే అమెరికా, ఐరోపా, చైనాల హితం. మరింత కచ్చితంగా చెప్పాలంటే ఐరోపా సమాఖ్య దేశాలకు, అమెరికాకు, చైనాకు తదితర సంపన్న దేశాలకు చెందిన ‘బహుళ జాతీయ వాణిజ్య సంస్థ’- మల్టీ నేషనల్ కంపెనీ-ల ప్రయోజనం. భారత- అమెరికాల వ్యూహాత్మక సంబంధానికి వాణిజ్యం ప్రాతిపదిక అంటున్న అమెరికా ‘పెద్దన్న’ అంతరంగం ఇది. చైనా వాణిజ్య దురాక్రమణను ఎదుర్కొనలేక చతికిలపడి ఉన్న అమెరికా ‘అత్తమీది కోపాన్ని దుత్తల మీద’ తీర్చుకొంటోంది. ప్రవర్ధమాన దేశాలకు వ్యతిరేకంగా సుంకాలను పెంచుతోంది. మన దేశాన్ని కూడ ‘పెంచిన సుంకాల’తో అమెరికా భయపెడుతోంది. తమ దేశం వస్తువులను ఇతర దేశాల్లో అమ్ముకోవాలి. ఇతర దేశాల ప్రభుత్వాలు తమ వస్తువులపై సుంకాలను పెంచరాదు. పెంచినట్టయితే తమ దేశం వస్తువుల ధరలు ఇతర దేశాల్లో పెరుగుతాయి. అందువల్ల వాటికి గిరాకీ తగ్గుతుంది. అలా గిరాకీ తగ్గరాదు. తగ్గితే తమ సంస్థలకు లభించే లాభాలు తగ్గుతాయి. ఇదీ అమెరికా వ్యూహం, చైనా వ్యూహం! ఇతర దేశాల వస్తువులు తమ దేశంలో అమ్ముడుపోరాదు. అమ్ముడుపోరాదంటే వాటి ధరలు పెరగాలి. అందువల్ల ఇతర దేశాల నుంచి తమ దేశానికి దిగుమతయ్యే వస్తువులపై అమెరికా సుంకాలను పెంచుతోంది. పోటీగా చైనా కూడా పెంచుతోంది. ఇతర సంపన్న దేశాలు కూడ దిగుమతి సుంకాలను భారీగా పెంచుతున్నాయి.
జాతీయ సంకుచిత ఆర్థిక- ప్రొటక్షనిస్ట్- విధానాలను పాటించరాదన్న ప్రపంచ వాణిజ్య సంస్థ నియమావళిని, మార్గదర్శక సూత్రాలను ప్రవర్ధమాన దేశాల్లో కొన్ని మాత్రమే బుద్ధిగా అమలు జరుపుతున్నాయి. మన దేశం మరింత బుద్ధిగా అమలు జరుపుతోంది. అందువల్లనే చైనా సంస్థలు తమ వస్తువులను ‘కారుచౌక’గా మన దేశంలో అమ్మి లక్షల కోట్ల రూపాయలను ప్రతి ఏటా దోచుకొని పోగలుతున్నాయి. కానీ మన దేశం మాత్రం చైనీయ వస్తువులను- నాసిరకం వస్తువులను, అక్కర్లేని వస్తువులను నిరోధించడానికి వీలుగా సుంకాలను పెంచడం లేదు. కానీ చైనా, అమెరికా ప్రభుత్వాలు ‘ప్రపంచ వాణిజ్య సంస్థ’ మార్గదర్శకాలను బాహాటంగా ఉల్లంఘిస్తున్నాయి. చైనా వస్తువులపై అమెరికా, అమెరికా వస్తువులపై చైనా ఇటీవలి కాలంలో భారీగా సుంకాలను విధించాయి. అమెరికాకు వ్యతిరేకంగా చైనా, చైనాకు వ్యతిరేకంగా అమెరికా ‘ప్రపంచ వాణిజ్య సంస్థ’కు ఫిర్యాదులు చేశాయి. అమెరికా, చైనాల మధ్య నడుస్తున్న వాణిజ్య యుద్ధం ‘సంకుచిత జాతీయ ఆర్థిక విధానాల’ ఫలితం. ‘అంతర్జాతీయ అనుసంధానం’, ‘పుడమి పల్లె’, ‘స్వేచ్ఛా వాణిజ్యం’ వంటి సిద్ధాంతాలను మన దేశం నెత్తికెక్కించిన అమెరికా, చైనా, ఐరోపా సమాఖ్య దేశాలు తాము మాత్రం ఈ సిద్ధాంతాలను భూస్థాపితం చేసి తమ జాతీయ ప్రయోజనాలను మాత్రమే రక్షించుకొంటున్నాయి, పెంపొందించుకొంటున్నాయి. ఇది ‘గ్రహించని’ మన ప్రభుత్వం మాత్రం విదేశీయ వాణిజ్యంలో లోటును పెంచుకొంటోంది. ఈ ఏడాది ఆరంభం నుంచి అమెరికా మన దిగుమతులపై దాదాపు రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయల మేర కొత్త సుంకాలను విధించింది. ప్రతిచర్యగా మన ప్రభుత్వం అమెరికా నుంచి వస్తున్న దిగుమతులపై దాదాపు పదహారు వందల కోట్ల రూపాయల మేర సుంకాలను విధించింది. గత మార్చిలో అమెరికా ప్రభుత్వం వారు మన దేశానికి వ్యతిరేకంగా, మన విధానాలకు వ్యతిరేకంగా ఫిర్యాదు దాఖలు చేశారు. జూన్ నుంచి ఉభయ దేశాల మధ్య సయోధ్య చర్చలు మొదలయ్యాయి. ఈ చర్చల ప్రహసనంలో భాగంగా అమెరికా వస్తువులపై విధించిన కొత్త సుంకాలను సెప్టెంబర్ వరకూ వసూలు చేయరాదని మన ప్రభుత్వం నిర్ణయించిందట. కానీ అమెరికా మాత్రం మన వస్తువులపై తాను విధించిన కొత్త సుంకాలను వసూలు చేస్తూనే ఉంది. తాత్కాలికంగానైనా నిలిపి వేయలేదు. ఇదీ సమాన ‘ద్వైపాక్షిక న్యాయం’.
విదేశాల నుంచి సంపన్న దేశాల నుంచి పెట్టుబడులు రావన్న భయంతో మన ప్రభుత్వం రెండున్నర దశాబ్దులుగా ‘సంపన్న’ ప్రభుత్వాల షరతులను ఆమోదిస్తూనే ఉంది. ఇలా ‘వ్రతం చెడినప్పటికీ’ మనకు ఫలితం మాత్రం దక్కలేదు. విదేశీయుల పెట్టుబడుల వల్ల మన వౌలిక పారిశ్రామిక ఉత్పత్తులు పెరిగిన దాఖలా లేదు. విదేశీయులు తక్కువ పెట్టుబడులతో సేవల రంగంలోకి, పంపిణీ రంగంలోకి చొరబడి ఇబ్బడి ముబ్బడిగా లాభాలను మూటకట్టుకొని పోతున్నారు. విదేశీయుల పెట్టుబడులు ప్రతి ఏటా తగ్గిపోతుండడం నడుస్తున్న చరిత్ర. 2017లో దేశంలోకి విదేశాల నుంచి దాదాపు రెండు లక్షల ఎనబయి వేల కోట్ల రూపాయల ‘ప్రత్యక్ష నిధులు’- డైరెక్ట్ ఇనె్వస్ట్‌మెంట్స్- తరలి వచ్చాయట! చైనాతో మనం చేస్తున్న వ్యాపారంలో దాదాపు ఇంతే మొత్తం మనకు లోటు ఏర్పడింది. అంటే ‘లోటు’ రూపంలో ఏటా దాదాపు రెండున్నర లక్షల కోట్ల రూపాయలు మన దేశం నుంచి శత్రు దేశమైన చైనాకు తరలిపోతున్నాయి. చైనాతో వ్యాపారాన్ని రద్దు చేసుకుంటే చాలు.. ఈ మొత్తం మన దేశంలోనే పెట్టుబడిగా ఉపయోగపడుతుంది.