సంపాదకీయం

ఈవీఎంలపై గుబులెందుకు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గెలిచినవారు తమకు ఎన్నికల సంఘంపై అచంచల విశ్వాసం ఉందని ప్రకటించడం, ఓడినవారు ‘ఎలక్ట్రానిక్ వోటింగ్ యంత్రాల’ (ఈవీఎంల)ను శంకించడం మన ఘనమైన ప్రజాస్వామ్య దేశంలో చాలా ఏళ్లుగా నడుస్తున్న ప్రహసనం. ‘ఈవీఎంలు వద్దు.. మళ్లీ బ్యాలెట్ పేపర్లతోనే పోలింగ్ జరపించండి’- అంటూ ఈమధ్య కేంద్ర ఎన్నికల సంఘం నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో పదిహేడు విపక్ష పార్టీలు ముక్తకంఠంతో విజ్ఞప్తి చేశాయి. లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో ఈవీఎంల వివాదాన్ని విపక్షాలు మళ్లీ తెరపైకి తేవడం రాజకీయంగా వేడి పుట్టిస్తోంది. 2014 లోక్‌సభ ఎన్నికల్లోను, ఆ తర్వాత వివిధ రాష్ట్రాల శాసనసభ ఎన్నికల్లో భారతీయ జనతాపార్టీ గెలుపొందడానికి ‘ఈవీఎం అక్రమాలే’ కారణమని కాంగ్రెస్ సహా ఇతర విపక్షాలు పదే పదే అనుమానిస్తున్నాయి. ఇదే నిజమైతే ఇటీవల కొన్ని ఉప ఎన్నికల్లో భాజపా ఎందుకు ఓడిపోయిందన్న ప్రశ్నను విపక్ష నేతలు వేసుకోవాల్సి ఉంటుంది. ఎన్నికల్లో గెలుపు కోసం ఎన్‌డీఎ సర్కారు అక్రమాలకు పాల్పడుతోందని అనుకుంటే మొన్నటి కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా ఎందుకు ఓడిపోయిందని విపక్షాలు ఆలోచించాల్సి ఉంటుంది. 2014 సంవత్సరానికి ముందు అధికార పీఠాలను దక్కించుకున్న కాంగ్రెస్, ‘ఆప్’, బీఎస్పీ వంటి పార్టీలు అప్పట్లో ఈవీఎంలతోనే పోలింగ్ జరిగిన విషయాన్ని విస్మరించడం విడ్డూరం. గతంలో పదేళ్లపాటు అధికారానికి దూరమైనపుడు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా ఈవీఎంలపై అనుమానాలు వ్యక్తం చేశారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో విజయలక్ష్మి వరించాక ఆయన తిరిగి ఆ ప్రసక్తే ఎత్తకపోవడం గమనార్హం. ఉత్తరప్రదేశ్‌లో ఓటమి ఎదురైనపుడు మాయావతి, పంజాబ్‌లో పరాభవం జరిగినందుకు కేజ్రీవాల్ ఈవీఎంలను నిందించారు. ఆ మధ్య పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల ముందు ఇదే పాట పాడిన కాంగ్రెస్ పార్టీ అధికారం దక్కడంతో ఎలాంటి ఆరోపణలు చేయలేదు. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా ఆధిక్యానికి ఈవీఎం అక్రమాలే కారణమంటున్న విపక్షాలు తమ వాదనకు ఎలాంటి సాక్ష్యాధారాలను చూపడం లేదు. కాగా, ఇందుకు భాజపా కూడా మినహాయింపు కాదు. ఒకప్పుడు ఎన్నికల ప్రధానాధికారిపైనే ఆరోపణలు గుప్పించిన భాజపా ఇప్పుడు ఈవీఎంల పనితీరు భేష్ అని కితాబివ్వడం ప్రజలకు తెలియని విషయం కాదు. ఇలా ఎన్నికల్లో పరాజితులైనపుడు ఈవీఎంలను అనుమానించడం, అధికారం దక్కినపుడు వాటిని కీర్తించడం షరామామూలైంది.
ఈవీఎంల ‘విశ్వసనీయత’ గతంలో పలుసార్లు చర్చనీయాంశమైంది. ‘సార్వత్రిక’ సమరం సమీపిస్తున్న తరుణంలో ఈ అంశం మరోసారి తెరపైకి వచ్చింది. ఈవీఎంలపై పలు రాజకీయ పక్షాల్లో నెలకొన్న ‘ఆందోళన’కు ‘సంతృప్తికరమైన పరిష్కారాన్ని’ చూపిస్తామని చీఫ్ ఎలక్షన్ కమిషనర్ (సీఈసీ) ఓపీ రావత్ ఇటీవల అఖిలపక్ష సమావేశంలో భరోసా ఇచ్చారు. ఎన్నికల సంస్కరణలపై రాజకీయ అభిప్రాయం సాధించేందుకు సీఈసీ నిర్వహించిన సమావేశంలో పలు రాజకీయ పక్షాల ప్రతినిధులు పాల్గొన్నారు. ఏడు జాతీయ పార్టీలు, గుర్తింపు పొందిన 51 ప్రాంతీయ పార్టీలను ఎన్నికల సంఘం అఖిలపక్ష సమావేశానికి ఆహ్వానించగా 41 పార్టీలకు చెందిన ప్రతినిధులు హాజరయ్యారు. ఈవీఎంలలో భాజపాకు అనుకూలంగా వోట్లు పడుతున్నాయని కాంగ్రెస్ సహా 17 విపక్ష పార్టీలు ఆరోపించాయి. ఈవీఎంలు పనిచేయని ప్రతిసారీ కేవలం ‘ఒకే పార్టీకి వోట్లు ఎందుకు పడుతున్నాయ’ని ఆ పార్టీల నేతలు అనుమానం వ్యక్తం చేశారు. వోటింగ్ యంత్రాలను మరమ్మతు చేసే సంస్థలకు సంబంధించి సమస్త సమాచారాన్ని బహిర్గతం చేయాలని కూడా వారు తమ గళం వినిపించారు. ఈవీఎంల విశ్వసనీయతపై సందేహాలు నెలకొనడంతో బ్యాలెట్ పత్రాలతో ఎన్నికలు జరిపించాలని 77 శాతం రాజకీయ పార్టీలు కోరుతున్నట్టు కాంగ్రెస్ చెబుతోంది. ఈవీఎంలలో ప్రజల తీర్పు ప్రతిఫలించడం లేదని ఆ పార్టీ వాదిస్తోంది. ఈవీఎంల ట్యాంపరింగ్, ఓటు రసీదు యంత్రాల (వీవీపాట్)లో లోపాలపై కాంగ్రెస్, సమాజ్‌వాదీ, బహుజన సమాజ్, తృణమూల్ కాంగ్రెస్ వంటి విపక్ష పార్టీలు తమ అభ్యంతరాలను వినిపించాయి. ఈ లోపాలను సరిదిద్దేందుకు మళ్లీ ‘బ్యాలెట్’ పద్ధతి అనివార్యమని ఆ పార్టీలు పట్టుబట్టాయి. బ్యాలెట్‌కు వెళ్లని పక్షంలో కనీసం ముప్పయి శాతం పోలింగ్ కేంద్రాల్లో ఈవీఎంలకు ఓటు రసీదు యంత్రాలను అనుసంధానం చేయాలని కూడా కాంగ్రెస్ డిమాండ్ చేసింది.
ఎన్నికల్లో ఓడినపుడు ఒకలాగ, గెలిచినపుడు మరొకలాగ గళం మార్చే రాజకీయ నేతల సంగతలా ఉంచితే, ‘బ్యాలెట్’కే మళ్లీ పట్టం కట్టాలనడం సహేతుకం కాదు. సాంకేతిక పరిజ్ఞానం సకల రంగాల్లో విస్తరిస్తున్న నేటి ఆధునిక యుగంలో ‘పాత దారిలో’నే పయనిస్తామనడం విడ్డూరం. వోటింగ్ యంత్రాలపై వివిధ పార్టీల్లో నెలకొన్న అనుమానాలను తొలగించి, ఆ విధానంపై ఇప్పటికీ పూర్తి ఆమోదాన్ని సాధించలేక పోవడం ఓ విధంగా వైఫల్యమే. ఎన్నికల్లో ఒకరి ఓటమికి లేదా మరొకరి విజయానికి ఈవీఎం అక్రమాలే కారణమన్న ఆరోపణల్లో నిజానిజాలను నిగ్గుతేల్చాలిందే. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థ కలిగిన మన దేశంలో ఎన్నికల నిర్వహణ మహా క్రతువు లాంటిది. ఈవీఎంలపై అనుమానాలను నివృత్తి చేయాల్సిన బాధ్యత- ఎవరి అదుపాజ్ఞలలో లేని, స్వయం ప్రతిపత్తి కలిగిన ఎన్నికల సంఘానిదే. ‘ఈవీఎంల విశ్వసనీయత’పై వివిధ రాజకీయ పక్షాలు అభ్యంతరాలు వ్యక్తం చేసిన ప్రతిసారీ- ‘అక్రమాలకు ఆస్కారం’ లేదనడం తప్ప అనుమానాలను తొలగించేందుకు ఎన్నికల సంఘం నిర్దిష్ట కార్యాచరణను అమలు చేసిన దాఖలాలు లేవు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఈవీఎంలకు బదులు బ్యాలెట్ పత్రాలు వాడాలని పదహారు రాజకీయ పార్టీలు దేశ రాజధానిలో ఆమధ్య ర్యాలీ జరిపి, ఎన్నికల సంఘానికి వినతిపత్రం సమర్పించాయి. దీంతో ఎన్నికల సంఘం అఖిలపక్ష సమావేశం నిర్వహించి, రాజకీయ పక్షాల నుంచి అభ్యంతరాలను, సూచనలను స్వీకరించింది. ఈవీఎంలపై అనుమానాలు తొలగిపోయే వరకూ బ్యాలెట్‌ను ఆశ్రయించడం ఉత్తమమని, అభివృద్ధి చెందిన దేశాల్లో సైతం ఇప్పటికీ బ్యాలెట్ పత్రాలతోనే ఎన్నికలు జరుపుతున్నారని కొన్ని రాజకీయ పక్షాలు గుర్తు చేస్తున్నాయి. ఈ ఏడాది మార్చిలో జరిగిన కాంగ్రెస్ పార్టీ 84వ ప్లీనరీలోనూ ఇదే విషయాన్ని ప్రస్తావించి, రాబోయే అన్ని ఎన్నికల్లో ఈవీఎంల స్థానంలో బ్యాలెట్ పద్ధతిని ప్రవేశపెట్టాలని ఎన్నికల సంఘాన్ని కోరుతూ తీర్మానం ఆమోదించారు. ఎన్నికల ప్రక్రియ పట్ల అన్ని వర్గాల్లో నమ్మకం కలిగించేందుకు బ్యాలెట్ పత్రాలే శరణ్యమని ‘శతాధిక కాంగ్రెస్’ పాత మాటే చెబుతోంది.
వోటింగ్ యంత్రాలపై శంకలు తీర్చేందుకు పోలింగ్ కేంద్రాల్లో విధిగా ‘వోటు రసీదును వెలువరించే మిషన్ల’ (వీవీపాట్)ను ఏర్పాటు చేస్తామని గత ఏడాది జూలైలో జరిగిన అఖిలపక్ష సమావేశంలో ఎన్నికల సంఘం ప్రకటించింది. ఏడాది తర్వాత మళ్లీ ఇదే అంశంపై ఎన్నికల సంఘం కొత్తగా హామీ ఇస్తోంది. బ్యాలెట్ పద్ధతిని మళ్లీ తీసుకొస్తే- పోలింగ్ బూత్‌ల ఆక్రమణలకు అవకాశం కలుగుతుందని సీఈసీ రావత్ అంటున్నారు. ఈవీఎంలు, వీవీపాట్‌ల విశ్వసనీయతపై సందేహాలను ఎన్నికల సంఘం నివృత్తి చేస్తుందని ఆయన చెబుతున్నా అందుకు కార్యాచరణను ప్రకటించలేదు. ఎన్నికల ప్రక్రియ మరింతగా మెరుగుపడాలన్న ఎన్నికల సంఘం లక్ష్యం నెరవేరేందుకు అన్ని పక్షాలూ రాజకీయాలకు అతీతంగా సహకరించాలి. బ్యాలెట్ పత్రాల ముద్రణ, పోలింగ్ కేంద్రాలకు తరలింపు వంటి పనులకు ఎన్నో వ్యయప్రయాసలు తప్పవు గనుక ఈవీఎంల వ్యవస్థలో లోపాలను సరిదిద్దేలా యత్నించాలి. సాంకేతికతను స్వాగతించేందుకు నిరాకరిస్తే- సమస్యలు సమసిపోవని గ్రహించాలి.