సంపాదకీయం

నత్తనడక న్యాయం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యాయ ప్రక్రియలో నిహితమై ఉన్న ‘విలంబన’కు ఇది మరో నిదర్శనం మాత్రమే! ‘అభియోగం’ దాఖలయిన తరువాత ఎనిమిదేళ్లకు కాని న్యాయ ప్రక్రియలో ‘కదలిక’ ప్రస్ఫుటించలేదు. ఎనిమిదేళ్లు జరిగిపోయిన తరువాత హఠాత్తుగా ఇప్పుడు మహారాష్టల్రోని ధర్మాబాద్ న్యాయస్థానం వారు ‘ప్రక్రియ’ను వేగవంతం చేస్తున్నారు. ‘ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుకి వ్యతిరేకంగా ‘నాన్ బెయిలబుల్ వారెంట్’- ఎన్‌బీడబ్ల్యూ-ను జారీచేశారు. నిందితుడిని నిర్బంధించిన సమయంలో పోలీసులు ఆ నిందితుడిని ‘తాత్కాలికంగా విడుదల’ చేయవచ్చు. అలా విడుదల చేయడానికి వీలుగా న్యాయస్థానం వారు ‘అనివార్య చర్య’- వారెంట్-ను ఆదేశించినట్టయితే అది ‘బెయిలబుల్ వారెంట్’-! నిందితుడిని నిర్బంధించే సమయంలో పోలీసులు ఆ నిందితుడిని తాత్కాలికంగా విడుదల చేయడానికి వీలులేని ‘అనివార్య చర్య’- వారెంట్-కు న్యాయస్థానం ఆదేశించినట్టయితే అది ‘నాన్ బెయిలబుల్ వారెంట్’! అందువల్ల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిని ఈ ‘న్యాయస్థానం’ వారి ఆదేశం మేరకు పోలీసులు అరెస్టు చేసినట్టయితే ఆ పోలీసులు ఆయనను తాత్కాలికంగా విడుదల చేయడానికి వీలులేదు, ఆయనను న్యాయస్థానం ఎదుట హాజరుపరచాలి. న్యాయస్థానం మాత్రమే ఆయనకు ‘తాత్కాలికంగా విడుదల’ను ప్రసాదించగలదు. ఈ ‘ప్రక్రియ’ ఎలా ముగుస్తుంది? అన్నది వక్తవ్యాంశము కాదు! చంద్రబాబు నాయుడు పాల్పడినట్టు ఆరోపితవౌతున్న నేరం ఏమిటి? అన్న మీమాంస కూడ ప్రధానం కాదు! ఆయన నేరం చేశాడా? లేదా? అన్నది నిర్ధారణ జరుగవలసింది న్యాయస్థానంలో మాత్రమే! అందువల్ల న్యాయస్థానం తుది తీర్పు వెలువడేవరకు వేచి ఉండక తప్పదు. కానీ ఈ న్యాయ ప్రక్రియ ఇలా ఎనిమిదేళ్లపాటు స్తంభించి ఉండడమే విస్మయకరం! ఇలా ‘నిర్బంధించడం’ న్యాయప్రక్రియలో భాగమైనప్పుడు ఎనిమిదేళ్ల క్రితం లేదా కనీసం ఆరేళ్లక్రితం న్యాయస్థానం వారు ఈ ఆదేశాన్ని ఎందుకు జారీచేయలేదు..? సామాన్య ప్రజలకు అర్థం కాని వ్యవహారం ఇది! మన దేశంలో సామాన్య ప్రజలకు- జనాభాలో అత్యధిక శాతంగా ఉన్న సాధారణ పౌరులకు- అర్థం కాని ఆర్థిక, న్యాయ, విద్యా విషయ, పాలనా వ్యవహార పరిణామాలు బోలెడన్ని జరిగిపోతున్నాయి. ఎనిమిదేళ్ల తరువాత ఇలా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి వ్యితిరేకంగా న్యాయస్థానం వారు ‘నిర్బంధ అనివార్యాన్ని’ కల్పించడం సామాన్య జనానికి అర్థం కాని మహా విషయాలలో ఒకటి మాత్రమే! కొంత కొంత అర్థమవుతున్న వారికి న్యాయ ప్రక్రియలో నిహితమై ఉన్న ‘ఆలస్యం’ లేదా ‘విలంబనం’ గోచరిస్తోంది..
ఈ ‘న్యాయ విలంబన’ దేశమంతటా నిలువుగాను, అడ్డంగాను దశాబ్దుల తరబడి వ్యవస్థీకృతమై ఉంది. ఇందుకు కారణాలు కోకొల్లలు.. విరుద్ధమైన అభిప్రాయాలు సైతం వ్యక్తం అవుతున్నాయి. సర్వోన్నత న్యాయస్థానంలోను, ఉన్నత న్యాయస్థానాలలోను, కిందిస్థాయి న్యాయస్థానాలలోను తగినంత మంది న్యాయమూర్తులు లేకపోవడం ‘విలంబన’కు ఒక ప్రధాన కారణమన్నది ప్రముఖంగా ప్రచారం అవుతున్న వాస్తవం. దేశంలోని ఉన్నత న్యాయస్థానాలలో నలబయి శాతం ‘న్యాయమూర్తి పదవులు’ ఖాళీగా ఉన్నాయట! వెయ్యి డెబ్బయి తొమ్మిది న్యాయమూర్తులు ఇరవై నాలుగు హైకోర్టులలో న్యాయపాలన బాధ్యతలను నిర్వహించవలసిన అవసరం ఉందట. కానీ ప్రస్తుతం ఆరువందల యాబయి రెండు మంది ఉన్నత న్యాయమూర్తులు మాత్రమే పనిచేస్తున్నారట! జిల్లాస్థాయి, కింది స్థాయి న్యాయస్థానాలలో సైతం వేల న్యాయమూర్తి పదవులు ఏళ్లతరబడి భర్తీకావడం లేదు. ఎవరు కారణం? ప్రభుత్వ రాజకీయ నిర్వాహకులు..!! రాజకీయాలలో ఉన్న అవినీతిపరులు, నేరస్థులు మాత్రమే కాదు ఇతర రంగాలకు చెందిన నేరస్థులు సైతం ‘వాయిదాల’మీద వాయిదాలను పొందుతుండడం వల్ల ఏళ్లతరబడి ‘అభియోగాల’ విచారణ నత్తల నడకతో పోటీపడుతోంది. పౌర వ్యాజ్యాలు- సివిల్ లిటిగేషన్స్- న్యాయ ప్రక్రియ మరింతగా ‘సాగి’పోతోంది. ఇవన్నీ ప్రచారవౌతున్న ‘విలంబన సూత్రాలు!’
ప్రచారం కాని, ప్రముఖులకు, మేధావులకు, ప్రభుత్వాలకు, న్యాయకోవిదులకు ‘్ధ్యస’లేని మరో ‘వౌలిక విలంబన సూత్రం’ బ్రిటన్ దురాక్రమణ నాటి న్యాయ వారసత్వం కొనసాగుతూ ఉండడం! వేల ఏళ్లుగా మన దేశంలో కొనసాగిన సహజ న్యాయవ్యవస్థను బ్రిటన్‌వారు ధ్వంసం చేశారు.. బ్రిటన్ విముక్త భారత్‌లో బ్రిటన్ బౌద్ధిక బీభత్సకారులు మన నెత్తికెత్తిన విద్యావిధానం, న్యాయసూత్రాలు కొనసాగుతూనే ఉన్నాయి. ప్రపంచంలోని అనేక దేశాలు విదేశీయ దాస్యం నుండి విముక్తమైన తర్వాత దురాక్రమణదారుల పద్ధతులను వదిలించుకున్నాయి. స్వదేశీయ విద్యా, న్యాయ, పాలనా, సాంస్కృతిక సంప్రదాయాలను పునరుద్ధరించుకొంటున్నాయి. కానీ మన దేశంలో మాత్రం ప్రాచీన న్యాయవ్యవస్థ, బ్రిటన్ తస్కర ముష్కరులు మన దేశానికి రాకపూర్వం అనాదిగా కొనసాగిన న్యాయవ్యవస్థ పునరుద్ధరణకు నోచుకోవడం లేదు. క్రీస్తుశకం పంతొమ్మిదవ శతాబ్దిలో మన దేశ ప్రజలను అణగదొక్కడానికి బ్రిటన్ మేధావులు రూపొందించిన న్యాయవ్యవస్థ స్వరూప స్వభావాలలో ఇప్పటికీ పెద్దగా మార్పు రాలేదు. ఈ బ్రిటన్ దొరలు మనకంటగట్టిన న్యాయ వ్యవస్థ స్వరూప స్వభావాలను స్వాతంత్య్ర సమర కాలంలో సమరయోధులు తీవ్రంగా నిరసించడం చరిత్ర! స్వాతంత్య్ర ఉద్యమ కవి గరిమెళ్ల సత్యనారాయణ ఈ విదేశీయ న్యాయవ్యవస్థను ఇలా అభిశంసించి ఉన్నాడు!
‘‘కోర్టులంటూ పెట్టి పార్టీలు సృష్టించి... స్నేహభావము చంపినాడు,
ద్రవ్య దాహము కల్పించినాడు... చెడ్డ ఊహలు కడు పెంచినాడు,
మా ఆహారముల త్రుంచి.. ఆహా అనిపించాడు..
మాకొద్దీ తెల్లదొరతనము.. దేవ! మాకొద్దీ తెల్లదొరతనము....’’
మన న్యాయ చరిత్ర, రాజ్యాంగ చరిత్ర బ్రిటన్ పార్లమెంటు ఆమోదించిన ‘‘రౌలట్ చట్టాల’’తో ఆరంభం అవుతుండడం మన స్వాతంత్య్రాన్ని అపహాస్యం పాలుచేస్తున్న వైపరీత్యం! ఉన్నత, సర్వోన్నత న్యాయస్థానాలలో హిందీని కాని మరే భారతీయ భాషను కాని న్యాయపాలన మాధ్యమంగా ఉపయోగించడానికి అవకాశం లేదు. ఆంగ్లభాష ఉన్నత సర్వోన్నత న్యాయ మాధ్యమంగా కొనసాగుతోంది!! ఇవి కొన్ని ఉదాహరణలు మాత్రమే! విముక్తి ఎప్పుడు?
ప్రజాప్రతినిధులకు, రాజకీయవేత్తలకు వ్యతిరేకంగా దాఖలయ్యే అభియోగాలను అమిత వేగంగా విచారించడానికి వీలుగా, ప్రత్యేక న్యాయస్థానాలను ఏర్పాటు చేయాలని సర్వోన్నత న్యాయస్థానం గత ఏడాది నవంబర్‌లో కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఇందుకోసం పనె్నండు ప్రత్యేక న్యాయస్థానాలను ఏర్పాటు చేయాలన్న కేంద్ర ప్రభుత్వ ప్రతివాదనను సర్వోన్నత న్యాయస్థానం గత డిసెంబర్‌లో ఆమోదించింది. కానీ ఈ ‘‘క్షిప్ర ప్రక్రియ’’- ఫాస్ట్ ట్రాక్- న్యాయస్థానాలలో జరిగిన ప్రగతి గురించి వివరాలు వెల్లడి కావడం లేదు. అయోధ్య రామజన్మ భూమి స్థల వివాదం అనేక ఏళ్లుగా అపరిష్కృతంగా ఉండడం న్యాయ విలంబనకు సర్వోన్నత నిదర్శనం!