సంపాదకీయం

బాల్యానికి బాధ..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దారిద్య్రం, ఆకలి కేకలను నివారించడమే అంతిమ లక్ష్యంగా అవతరించిన మన ‘పంచవర్ష ప్రణాళిక’లు గతి తప్పాయి. ఫలితంగా పోషకాహార లోపంతో కుంగుతున్న బాలల సంఖ్య నానాటికీ అధికమవుతోంది. పాలకులపై అక్కసుతో ఏ విపక్షం నేతలో చేస్తున్న విమర్శలు కావివి. ప్రపంచ వ్యాప్తంగా ‘పోషకాహారం- ఆహార భద్రత’పై ఐక్యరాజ్య సమితి తాజాగా వెలువరించిన నివేదిక ఈ కఠోర వాస్తవాన్ని వెల్లడించింది. 2030 నాటికి ఆకలి కేకలు విన్పించని ప్రపంచాన్ని ఆవిష్కరించాలని ఐక్యరాజ్య సమితి నిర్దేశించినప్పటికీ, ఆ దిశగా మన దేశంలో జరుగుతున్న ప్రయత్నాలు అంతంత మాత్రంగానే ఉంటున్నాయి. భారత్‌లో ఆహార భద్రత, పోషకాహార స్థితిగతులు కడు దయనీయ పరిస్థితిలో ఉన్నాయని అనేకానేక అంతర్జాతీయ నివేదికలు చాలాకాలంగా ఘోషిస్తున్నాయి. పేదరికం, పోషకాహార లోపం ముఖ్యంగా బాలలకు పెను శాపాలుగా పరిణమించిన దృశ్యాలు మన దేశంలోని చాలా ప్రాంతాల్లో కనిపిస్తున్నాయి. పరిశుభ్రమైన తాగునీరు, పారిశుద్ధ్యం, పోషకాహారం, కనీస ఆరోగ్య సౌకర్యాలు లోపిస్తున్నందున మన దేశంలో సగటున ప్రతి రెండు నిమిషాలకూ ముగ్గురు శిశువులు మృత్యువు ఒడికి చేరుతున్నట్లు ‘యునైటెడ్ నేషన్స్ ఇంటర్ ఏజెన్సీ గ్రూప్ ఫర్ చైల్డ్ మోర్టాలిటీ ఎస్టిమేషన్’ (యునిగ్మె) కొద్ది రోజుల క్రితం వెలువరించిన నివేదికలో వెల్లడైంది. ప్రపంచ వ్యాప్తంగా శిశు మరణాలు అత్యధిక సంఖ్యలో సంభవిస్తున్నది భారత్‌లోనేనని ఆ నివేదిక బహిర్గతం చేయడం ఆందోళన కలిగించే అంశం. కాగా, గత అయిదేళ్ల గణాంకాలను విశే్లషిస్తే మన దేశంలో శిశు మరణాల రేటు 2017లో కాస్త తగ్గుముఖం పట్టినట్టు అధికార యంత్రాంగం చెబుతున్నా వాస్తవ పరిస్థితి మాత్రం మరో విధంగా ఉంది. గత ఏడాది దేశ వ్యాప్తంగా ఎనిమిది లక్షల రెండువేల శిశు మరణాలు నమోదయ్యాయి. శిశు మరణాలకు కారణమవుతున్న వ్యాధులపై, పోషకాహార లోపంపై పోరాటం చేస్తున్నట్టు పాలకులు చెబుతుండడం పరిపాటిగా మారింది. భారత్‌లో ఏటా దాదాపు రెండున్నర కోట్ల మంది శిశువులు పుడుతున్నారు. వైద్యుల ప్రత్యక్ష పర్యవేక్షణలో ప్రసవాలు జరిగేలా చూడడం, రోగ నిరోధక శక్తి పెంచడం, పోషకాహారం పంపిణీ చేయడం, పిల్లల కోసం ప్రత్యేక వైద్యశాలలను ఏర్పాటు చేయడం వంటి చర్యలను అరకొరగా చేపట్టడంతో ఆశించిన ఫలితాలు కానరావడం లేదు. ఆకలిని రూపుమాపడం, బాలలందరికీ పోషకాహారం అందజేయడం కార్యరూపం దాలిస్తేనే చిన్నారుల మరణాలకు అడ్డుకట్ట పడుతుందని నిపుణులు చేస్తున్న హెచ్చరికలు ప్రభుత్వాల చెవిన పడడం లేదు.
సహజంగా రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్న బాలలే పోషకాహార లోపంతో అనేక దుష్ప్రరిణామాలను ఎదుర్కొనక తప్పడం లేదు. పౌష్టికాహార లేమి వల్ల వయసుకు తగిన ఎదుగుదల, ఎత్తుకు తగ్గ బరువు లేకపోవడం, రక్తహీనత వంటివి పిల్లల్లో అధికమవుతున్నాయి. అమెరికా, చైనా వంటి అగ్రరాజ్యాలను ఊబకాయం ఇప్పుడు ప్రధాన సమస్యగా వేధిస్తుండగా, మన దేశంలో మాత్రం పోషకాహార లోపంతో పిల్లలు కుంగిపోతున్నారు. భారత్‌లోని ప్రతి ముగ్గురు బాలల్లో కనీసం ఒకరిలో ఎదుగుదల లేకపోవడం, ప్రతి ఇద్దరు పిల్లల్లో ఒకరు రక్తహీనతతో నీరసించి పోవడం కనిపిస్తోందని వైద్య నిపుణులు తీవ్రస్థాయిలో ఆందోళన చెందుతున్నారు. పేద కుటుంబాల్లో పిల్లలను ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వాలు ప్రవేశపెడుతున్న ఆకర్షణీయ పథకాలు దశాబ్దాలు గడిచినా ఫలవంతం కావడం లేదన్నది ముమ్మాటికీ నిజం. క్షుద్బాధను నివారించాలన్న ధ్యేయంతో అంత్యోదయ, అంగన్‌వాడీ కేంద్రాలు, సమీకృత శిశు అభివృద్ధి పథకం, బడుల్లో మధ్యాహ్న భోజనం, చౌకధరలకు నిత్యావసర సరకుల సరఫరా వంటి పథకాలకు వేల కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నట్లు పాలకులు ఘనంగా ప్రకటిస్తున్నప్పటికీ బాలలు పోషకాహార లేమితో బాధపడుతూనే ఉన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న విభిన్న పథకాల్లో ‘గణాంకాల గోల’ తప్ప పిల్లలకు ఆహార భద్రత గగన కుసుమమే. పోషకాహార లోపం, వాయు కాలుష్యం భారత్‌ను అతలాకుతలం చేస్తున్నట్టు అంతర్జాతీయ సైన్స్ పత్రికలు చేసిన విశే్లషణలు వాస్తవాలకు ప్రతిరూపాలే.
ప్రపంచ వ్యాప్తంగా పుడుతున్న పిల్లల్లో 18 శాతం మంది భారత్‌లోనే జన్మిస్తున్నారని, శిశు మరణాల సంఖ్య కూడా మన దేశంలోనే అత్యధికంగా ఉంటోందని ‘యునిగ్మె’ నివేదిక తేటతెల్లం చేసింది. శిశు మరణాలలో భారత్ ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉండగా, ఆ తర్వాతి స్థానాల్లో నైజీరియా, పాకిస్తాన్, కాంగో, ఇథియోపియో దేశాలు నిలిచాయి. 2017లో మన దేశంలో 6.05 లక్షల మంది నవజాత శిశువులు మరణించగా, అయిదు నుంచి పధ్నాలుగేళ్ల వయసు పిల్లల్లో 1.52 లక్షల మంది మృత్యువాత పడ్డారు. 2016లో మన దేశంలో 8.67 లక్షల మంది చిన్నారులు మరణించగా, 2017లో ఆ సంఖ్య స్వల్పంగా 8.02 లక్షలకు తగ్గింది. 2016లో పుట్టిన ప్రతి వెయ్యిమంది శిశువుల్లో 44 మంది మరణించగా, గత ఏడాది ఆ సంఖ్య 40కి తగ్గింది. అయిదేళ్ల వయసు లోపు పిల్లలు గత ఏడాది 9.89 లక్షల మంది మరణించారు. ప్రపంచ వ్యాప్తంగా చూస్తే గత ఏడాది పదిహేనేళ్ల లోపు వయసు పిల్లల్లో 63 లక్షల మంది మరణించారు. వీరిలో అయిదేళ్ల లోపు వయసు గల చిన్నారుల సంఖ్య 54 లక్షలు. ప్రపంచ వ్యాప్తంగా చూస్తే ప్రతి అయిదు సెకన్లకు ఒకరు చనిపోతుండగా, భారత్‌లో ప్రతి రెండు నిమిషాలకు ముగ్గురు శిశువులు విగతజీవులవుతున్నారు. అనేక దేశాలతో పాటు భారత్‌లోనూ పోషకాహార లేమితో బాధపడుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. పోషకాహారం అందక శుష్కించిపోతున్న వారి సంఖ్య పెరుగుతూ, దాదాపు దశాబ్దం క్రితం నాటి పరిస్థితులు పునరావృతం అవుతున్నాయని, ప్రతి తొమ్మిది మందిలో కనీసం ఒకరు పౌష్టికాహార లేమితో సతమతమవుతున్నారని ‘ప్రపంచ ఆహార భద్రత- పౌష్టికాహార స్థితి- 2018’ నివేదిక చెబుతోంది. అయిదేళ్ల లోపు చిన్నారుల్లో వయసుకు తగ్గ ఎత్తు, ఎత్తుకు తగ్గ బరువు లేకపోవడానికి పోషకాహార లోపమే ప్రధాన కారణమవుతోంది. భారత్‌లో అయిదు నెలల లోపు శిశువుల్లో కేవలం 54.9 శాతం మందికి మాత్రమే తల్లిపాలు అందుతుండడం మరో ఆందోళనకర పరిణామం.
గత ఏడాది నాటి గణాంకాలను పరిశీలిస్తే- ప్రపంచ వ్యాప్తంగా 82 కోట్ల మందికి సరైన పోషకాహారం అందడం లేదు. 2016లో ఈ సంఖ్య 80 కోట్లుగా ఉండేది. అధిక వర్షాలు, అత్యధిక ఉష్ణోగ్రతలు, తుపానులు, వరదలు,కరవు వంటి ప్రకృతి వైపరీత్యాల వల్ల విశ్వవ్యాప్తంగా ఆకలి బాధితుల సంఖ్య పెరుగుతోంది. అయిదేళ్ల లోపు వయసు పిల్లల్లో 22.2 శాతం మంది పోషకాహారం లభించక అలమటిస్తున్నారు. భారత్ సహా అనేక వర్ధమాన, పేద దేశాలను ఈ విపత్కర పరిస్థితి వెంటాడుతోందని ఐక్యరాజ్య సమితి ప్రకటించింది. వరుసగా గత మూడేళ్ల నుంచి ఆకలి బాధలు పెరగడంతో పోషకాహార లోపాన్ని నివారించేందుకు ప్రపంచ దేశాలన్నీ కార్యోన్ముఖం కావాలని ఐరాస పిలుపునిచ్చింది. 2030 నాటికి భూమిమీద ఎక్కడా ఆకలి కేకలు లేకుండా చేయాలన్నా, శిశు మరణాలను తగ్గించాలన్నా ఆహార భద్రతకు భరోసా కల్పించాలని, ఇందుకు ప్రణాళికాబద్ధమైన కార్యాచరణ అవసరమని ఐరాస నొక్కి చెబుతోంది. భారత్ వంటి దేశాల్లో పేద కుటుంబాలు తమ ఇళ్లలోని ఆడపిల్లల కంటే మగపిల్లలకే మెరుగైన ఆహారం ఇవ్వడానికి ప్రాధాన్యత ఇవ్వడాన్ని ఐరాస ఆక్షేపించింది. వ్యూహాత్మక ప్రణాళికలతో బాలలను రోగాల బారి నుంచి గట్టెక్కించడం తమ తక్షణ కర్తవ్యమని మన పాలకులు ఇకనైనా గుర్తించాలి.