సంపాదకీయం

‘స్వచ్ఛత’కు గీటురాయి..?!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

స్వచ్ఛతా ఉద్యమం విశ్వాసానికి, పరివర్తనకు ప్రతీక అన్నది ప్రధాని నరేంద్ర మోదీ చెప్పిన మాట! కొత్త ఢిల్లీలో నాలుగు రోజులపాటు జరిగిన మహాత్మా గాంధీ ‘అంతర్జాతీయ స్వచ్ఛతా సదస్సు’ సమారోహ్ ఉత్సవంలో ప్రసంగించిన మోదీ భౌతిక పరివర్తనతోపాటు మానసిక పరివర్తన స్వచ్ఛత పునరుద్ధరణకు అనివార్యమన్న వాస్తవాన్ని గుర్తుచేశాడు. ‘స్వచ్ఛత’ అతి పెద్దసంఖ్యలో జనం భాగస్వాములుగా మారిన అంతర్జాతీయ ఉద్యమంగా రూపుదిద్దుకొనడం గురించి మోదీ ప్రస్తావించాడు. ‘స్వచ్ఛత’కు ప్రతిబింబమైన గాంధీజీ నూట యాబయ్యవ జయన్తి సందర్భంగా జరిగిన ఈ స్వచ్ఛతా సదస్సులో ఐక్యరాజ్యసమితి, ప్రపంచ బ్యాంకు తదితర అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులతోపాటు వివిధ దేశాల ప్రభుత్వాల నిర్వాహకులు భాగస్వాములు కావడం భారతీయ సంస్కారాల విస్తృతికి సరికొత్త నిదర్శనం. ప్రాచీన భారతంలో పరిఢవిల్లిన స్వచ్ఛతా సూత్రాల ప్రాతిపదికగా మళ్లీ స్వచ్ఛత వికసించాలన్నది మోదీ వ్యక్తం చేసిన ఆకాంక్ష! భౌతిక స్వచ్ఛత ఆర్థిక సమృద్ధికీ ప్రగతికీ దోహదం చేస్తోంది, మానసిక స్వచ్ఛత నైతిక నిబద్ధత పరిఢవిల్లడానికి సాంస్కృతిక సుగతికీ దోహదం చేస్తోంది. మహాత్మా గాంధీ ఈ స్వరూప స్వచ్ఛత కోసం, స్వభావ స్వచ్ఛత కోసం ఆజీవన కృషి చేయడం చరిత్ర! గాంధీ పుట్టిన రోజున స్వచ్ఛత ప్రధాన చర్చనీయాంశం కావడం మహాత్ముని పట్ల అంతర్జాతీయ సమాజానికున్న భక్తిశ్రద్ధలకు నిదర్శనం. గాంధీకి అత్యంత ప్రియమైన ‘వైష్ణవజన్’ అన్న భజన గీతాన్ని ప్రపంచవ్యాప్తంగా నూట ఇరవై నాలుగు దేశాలలోని గాయనీ గాయకులు విడివిడిగా ఆలపించడం ఈ భక్తిశ్రద్ధల ఆవిష్కరణకు వినూతన పునరావృత్తి! క్రీస్తుశకం పదహైదవ శతాబ్ది నాటి నరసింహ మెహతా రూపకల్పన చేసిన ఈ గుజరాతీ భాషా గీతం గాంధీజీ ఉద్యమ సమయంలో మరింత ప్రసిద్ధమైంది. ఈ నూట ఇరవై ఆలాపనల ‘్ధ్వని ముద్రణ’- కాంపాక్ట్ డిస్క్- సీడీ-ను ప్రధాని మంగళవారం ఆవిష్కరించడం మానసిక స్వచ్ఛతకు దోహదం చేయగల పరిణామం! సదస్సులో ప్రసంగించిన విదేశ వ్యవహారాలమంత్రి సుషమా స్వరాజ్ అభిభాషించినట్టు ‘స్వచ్ఛత’ గాంధీ మహాత్ముని కార్యక్రమం కాలేదు, ‘స్వచ్ఛత’ ఆ మహాత్ముని సహజ స్వభావం! తనువు స్వచ్ఛంగా ఉండడం భౌతిక స్వచ్ఛత, మనస్సు స్వచ్ఛంగా ఉండడం ప్రవర్తనలో స్వచ్ఛత. మహాత్ముడు ఇలా బాహ్య స్వచ్ఛతకు ప్రతీక, అంతరంగ స్వచ్ఛతకు పతాక! ప్రతి ఒక్కరు కూడ బాహిరమైన స్వచ్ఛతను, అంతరంగ స్వచ్ఛతను నిలబెట్టుకొనడం పెంపొందించుకొనడం మహాత్ముని ఆకాంక్ష. స్వచ్ఛ భారతం, స్వచ్ఛ ప్రపంచం మళ్లీ ఏర్పడడం కోసం జరుగుతున్న కృషికి ఇది సమీక్షా సమయం! స్వచ్ఛమైన బుద్ధి స్వచ్ఛమైన విశ్వంతో నిరంతరం అనుసంధానమై ఉండడం సృష్టిగత వాస్తవం.
లక్షల కోట్ల రూపాయల విలువైన కృత్రిమ రసాయన విషాలు వ్యవసాయ భూములను పండించడానికి ఎఱువులుగాను, క్రిమినాశక ఔషధాలుగాను ఉపయోగపడుతుండడం నడచిపోతున్న వైపరీత్యం. మొత్తం భూమిలో సగానికి పైగా వ్యవసాయ క్షేత్రం.. దాదాపు నాలుగవ వంతు అటవీ ప్రాంతం! ఈ అటవీ ప్రాంతాన్ని మొత్తం భూమిలో యాబయి శాతానికి పెంచడానికి కృషిచేయనున్నట్టు ఆంధ్రప్రదేశ్ వంటిచోట్ల ప్రాంతీయ ప్రభుత్వాలు ప్రతిజ్ఞలు కూడ చేసి ఉన్నాయి. అందువల్ల భారతదేశపు స్వరూప స్వచ్ఛతకు ఈ వ్యవసాయ, అటవీ ప్రాంతాల స్వచ్ఛత ప్రాతిపదిక. నగరాలలోను, పట్టణాలలోను, గ్రామీణ, వనవాసీ జనావాసాలలోను బహిరంగ మలమూత్ర విసర్జనను సంపూర్ణంగా నిర్మూలించడం వల్ల సర్వసమగ్ర ‘స్వచ్ఛ భారతం’ మళ్లీ అవతరిస్తుందనుకోవడం ‘భ్రమ’. ‘బహిరంగ విసర్జన’ను నిర్మూలించడం స్వచ్ఛతాసాధనలో ఒక అంశం మాత్రమే. విష రసాయనాల కాలుష్యం కోరల నుంచి వ్యవసాయ క్షేత్రాలను విముక్తం చేయడం ప్రధాన అంశం! విష రసాయనపు ఎఱువుల వల్ల భూమి నిర్జీవం కావడం మాత్రమే కాదు, భూగర్భ జలాలు కలుషితం అవుతున్నాయి. పారిశ్రామిక రసాయన వ్యర్థాల వల్ల నగర పట్టణ ప్రాంతాల భూగర్భ జలాలు, రసాయన విషపు ఎఱువుల వల్ల గ్రామీణ భూగర్భ జలాలు కలుషితం అయిపోయాయి..
ప్లాస్టిక్ వ్యర్థాల వల్ల భూమి ఉపరితలం, సముద్రం, పర్వతశ్రేణులు, అంతరిక్షం కూడ మలినమై పోతున్నాయన్నది అంతర్జాతీయ వాస్తవం. జీవ జన్యువులను మార్చడం- జెనటిక్ మోడిఫికేషన్ -జిఎమ్- ద్వారా తయారవుతున్న ‘మహా సంకరపు’ విత్తనాల వల్ల మొక్కల వల్ల భూమి, ప్రకృతి, మానవ శరీరాలు, మానవుల మనస్సులు కూడ చిత్రవిచిత్ర రోగాలకు గురవుతున్నాయి. ‘స్వస్థత’ ఏర్పడకుండా ‘స్వచ్ఛత’ ఏర్పడడం కల్ల! అడవుల పెంపకం పేరుతో ఫల పుష్ప రహితమైన, సహజ పరిమళ రహితమైన ‘చేదు’మొక్కలను కోట్లకొలది నాటుతున్నారు. ఈ మొక్కలతో స్వచ్ఛత ఏర్పడడం లేదు, ఈ చెట్లవల్ల పక్షులకు, జంతువులకు, మానవులకు లభిస్తున్న ప్రయోజనం సున్న. ఈ మొక్కలలోని కొన్ని విదేశీయ జాతుల మొక్కలు విస్తరించినచోట అనాదిగా పెరిగిన సంప్రదాయ వృక్షజాలం అంతరించిపోతోంది! మొక్కలు పెంచడం స్వచ్ఛతకు దోహదం చేయడం లేదు. ఎలాంటి మొక్కలను పెంచుతున్నారన్నది ప్రధానం! కోతులకు, పక్షులకు ఆహారాన్ని సమకూర్చగల పండ్ల చెట్లను విరివిగా నాటాలని తెలంగాణ ప్రభుత్వం ఇటీవల నిర్ణయించిందట! ఫలాలను, పరిమళ పుష్పాలను ప్రసాదించగల అడవుల పునరుద్ధరణ జరగాలి. స్వచ్ఛ్భారత సర్వసమగ్రత్వం ఇలాంటి అడవుల వల్ల మాత్రమే సాధ్యం. వ్యవసాయ క్షేత్రాలలోను, అడవులలోను ‘తేనెటీగలు’ నిరంతరం సంచరించడం ‘తేనెపట్టులు’ పెరగడం ప్రకృతి స్వచ్ఛతకు అనాదిగా ప్రమాణం. గాలి మధుమయం అవుతుండడం- మధు వాతాఋతాయతే- ప్రాచీన భారత ‘స్వచ్ఛత’కు నిదర్శనం. విదేశీయ దురాక్రమణదారులు ధ్వంసం చేసిన ఈ స్వచ్ఛత మళ్లీ చిగురించగలదా? వ్యవసాయ భూమిని విష రసాయనాల నుంచి విముక్తం చేయాలంటే సంప్రదాయ, సేంద్రియ వ్యవసాయం పునరుద్ధరణ జరగాలి. ‘సిక్కిం’ప్రాంతం మొత్తం సేంద్రియ వ్యవసాయ క్షేత్రంగా మారిందట! ఆంధ్రప్రదేశ్ కూడ సర్వసమగ్ర సేంద్రియ వ్యవసాయ క్షేత్రం కానున్నదట! ఈ సేంద్రియ వ్యవసాయం దేశవాలీ ఆవుల పై ఆధారపడి ఉంది. గవ్యాలు-పేడ, మూత్రం వంటివి- సేంద్రియ వ్యవసాయానికి అనివార్యం. స్వచ్ఛ భారత పునర్ నిర్మాణం గోసంతతి సంరక్షణపై ఆధారపడి ఉంది!
ఈ స్వరూప స్వచ్ఛత దేశ ప్రజల స్వభావ స్వచ్ఛతపై ఆధారపడి ఉంది! మానసిక స్వచ్ఛత, బౌద్ధిక స్వచ్ఛత జీవన వ్యవహార స్వచ్ఛతకు ప్రాతిపదికలు! పాఠశాలల్లో బోధిస్తున్న విజ్ఞానం, ప్రభుత్వాలు చేస్తున్న చట్టాలు, న్యాయస్థానాలు చెబుతున్న తీర్పులు, చేస్తున్న నిర్ధారణలు, మాధ్యమాలలో జరిగిపోతున్న మహాప్రచారాలు భారతీయుల మానసిక బౌద్ధిక, సామాజిక, సాంస్కృతిక, జీవన స్వచ్ఛతను పెంపొందిస్తున్నాయా? లేక వికృతులకు గురిచేస్తున్నాయా? మహాత్ముని సార్థ శత జయన్తి- నూట యాబయ్యవ జయన్తి- సంవత్సర ఉత్సవాల సందర్భంగా ఈ ‘స్వచ్ఛత’ గురించి జాతీయ మథనం జరగాలి. మద్యపానం నిషేధించని ప్రభుత్వాలకు మహాత్ముని పేరు చెప్పగల నైతిక స్వచ్ఛత ఉందా?