సంపాదకీయం

మతిమాలిన వేగం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాయలసీమ ద్వారమైన- గేట్‌వే ఆఫ్ రాయలసీమ- కర్నూలు నుంచి బయలుదేరి తెలంగాణ రాజధాని భాగ్యనగరానికి ఒకటిన్నర గంటల వ్యవధిలో చేరుకోవడం మధ్యతరగతి జనాన్ని మత్తెక్కించే మహా అనుభూతి.. భాగ్యనగరం-హైదరాబాద్-నుంచి ‘ఎల్లబూరి’ విజయవాడను రెండున్నర గంటలలో స్పృశించడం ఉత్కంఠ పూరితమైన మరో విచిత్రం! సొంత వాహనాలలో దూసుకొనిపోతున్న వారు ఈ ‘వేగాన్ని’ సాధించడం ‘ఎక్స్‌ప్రెస్ హైవే’లు ఏర్పడినందువల్ల ప్రతిరోజు సంభవిస్తున్న అద్భుతం.. ‘మహిమ’తోపాటు ‘మాయ’ కూడ పెరగడం సమాంతర పరిణామం! ‘మహిమ’ వేగాన్ని పెంచింది, ‘మాయ’ ప్రమాదాలను పెంచుతోంది! ఇరుకు రహదారుల వల్ల గతుకుల రహదారుల వల్ల ఈ రహదారుల మధ్యలో వెలసిన చిన్న పట్టణాలలోను పెద్ద గ్రామాలలోను జనం అడ్డుతగలడం వల్ల మహానగరాల మధ్య సంచరించే ప్రయాణ మాధ్యమాల, వాణిజ్య వాహనశ్రేణుల వేగం తగ్గిపోవడం దశాబ్దుల చరిత్ర. కర్నూలు నుంచి హైదరాబాద్‌కు చేరడానికి ప్రభుత్వం వారి ‘రోడ్డు రవాణా’ బస్సులలో రాత్రిపూట ఐదు గంటలు పట్టేది, హైదరాబాద్ నుంచి ఆదిలాబాద్ చేరడానికి ఆరున్నర గంటలు ప్రయాణించవలసి వచ్చేది. పగటిపూట ఈ ప్రయాణ సమయం మరింతగా పెరగడం చరిత్ర. కార్ల వంటి సొంత వాహనాలలోను బస్సుల వంటి ప్రభుత్వేతర వాహనాలలోను పయనించిన వారు కొంత ఎక్కువ వేగాన్ని సాధించారు. కానీ రోడ్ల ఇరుకుతనం, రోడ్లపై ఎప్పటికప్పుడు ఏర్పడిన గుంటలు- పాట్‌హోల్స్- చీలికలు వంటి అవరోధాలు ‘ప్రభుత్వేతర’ వాహన వేగాన్ని సైతం బాగా నియంత్రించాయి. అందువల్ల వేగాన్ని పెంచడానికి ప్రభుత్వాలు పూనుకున్నాయి. రహదారిపై ఎదురు ఎదురుగా వాహనాలు వస్తుండడంతో అవి తరచు ఢీకొట్టుకొని ప్రమాదాలు సంభవించాయి. ప్రధానమైన రహదారులలో కనీసం ‘జాతీయ మహాపథాల’- నేషనల్ హైవేస్-లో వాహనాలు పరస్పరం ఎదురు కాకుండా నిరోధించాలన్నది ప్రమాదాలను తగ్గించడానికై తపన పడిన ప్రభుత్వాలకు కలిగిన జ్ఞానోదయం! ఈ జ్ఞానోదయం ‘వేగప్రయాణ మహాపథాల’- ఎక్స్‌ప్రెస్ హైవేస్- నిర్మాణానికి దోహదం చేసింది. ‘జాతీయ పథాలు’ ‘మహావేగ పథాలు’గా రూపొందడం మొదలైంది. ఈ మహావేగ పథాలు ‘ఏకదిశాగమన’- ఒన్‌వే- పథాలు. ఒకవైపున నడిచే వాహనాలు, వ్యతిరేక దిశలో వస్తున్న వాహనాలు ఎదురుపడి ఢీకొట్టుకొనే ప్రమాదం తప్పింది. రెండు విభాగాలుగా మహావేగ పథాలు నిర్మాణం కావడం ఇందుకు కారణం. రెండు విభాగాలను వేరుచేసే ‘నడవ’- ఐలాండ్- ఏర్పడింది. ఫలితంగా వేగం పెరిగింది. రహదారుల మధ్యలో గోతులు, గుంటలు లేవు. ఈ ‘ఎక్స్‌ప్రెస్ హైవే’లు చిన్న పట్టణాలను, పెద్ద గ్రామాలను స్పృశించకుండా చుట్టుకొని- బైపాసింగ్- వెడుతుండడం వల్ల వేగం మరింత పెరిగిపోయింది! వేగవంతంగా దూసుకెళ్లే ప్రభుత్వేతర సంస్థల బస్సులలోను, సొంత వాహనాలలోను ప్రయాణించడం మధ్యతరగతికి గొప్ప అనుభూతి! ఈ అనుభూతి వ్యామోహంగా మారి ఉండడం నడుస్తున్న జీవన రీతి- లైఫ్ స్టెయిల్, జీవన విలాసం- ఫ్యాషన్-! మద్యపానం మత్తుకంటె ఈ వేగప్రయాణ మోహపు మత్తు మరింత విస్తృతంగా వ్యాపించిపోయింది. ఈ రెండు ‘మత్తుల’ ఫలితం పెరుగుతున్న రహదారి ప్రమాదాలు!
ప్రభుత్వాలకు వేగ ప్రయాణ పథాలను నిర్మించాలన్న జ్ఞానోదయం కలుగడం, వాణిజ్య ప్రపంచీకరణ- గ్లోబలైజేషన్- వ్యవస్థీకృతం కావడం సమాంతర పరిణామాలు. మొదటిది శుభ పరిణామం, రెండవది విపరిణామం! మొదటి దాన్ని రెండవది దిగమింగింది, ఈ ‘దిగమింగడం’ పేరు ‘ప్రభుత్వ ప్రభుత్వేతర భాగస్వామ్యం’ అంటే ఇంగ్లీషులో ‘పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్‌షిప్’- పిపిపి! ఇది స్వరూపం! ప్రజల- పబ్లిక్-ను ప్రభుత్వేతర- ప్రైవేట్- సంస్థలు దోచుకొనడం ఈ భాగస్వామ్య స్వభావం! ఈ దోపిడీకి ‘ఎక్స్‌ప్రెస్ హైవేస్’ సులభమైన మాధ్యమాలు. ‘నిర్మించి నిర్వహించి బదిలీ’ చేయడం ఈ ‘పిపిపి’ సూత్రం! అంటే ప్రభుత్వేతర సంస్థలు రహదారులను నిర్మించి నిర్వహిస్తాయి. ఆ తరువాత తమ పెట్టుబడిని దానిపై పదింతల లాభాన్ని రాబట్టుకొన్న తరువాత ప్రభుత్వానికి ఈ రహదారులను అప్పగిస్తాయి-ట-! కొన్ని సందర్భాలలో లాభాల విలువ పెట్టుబడికంటె పదిహేను రెట్లని కూడ ప్రచారం జరిగింది! అందువల్ల నిర్మించిన సంస్థలు ఆ రహదారులను ఏళ్లతరబడి నిర్వహిస్తూనే ఉంటాయి. నిర్వహించడమంటే రహదారిపై పయనించే వాహనాలను ‘శుల్కద్వారాల’- టోల్‌ప్లాజాల- వద్ద నిరోధించి డబ్బు దండుకోవడం! ఇలాంటి ‘శుల్క సేకరణ ప్రాంగణాలు’- టోల్ ప్లాజాలు- ఎక్స్‌ప్రెస్ హైవేలపై ప్రతి యాబయి కిలోమీటర్లకొకచోట వెలసి ఉన్నాయి! తిరుపతి నుంచి హైదరాబాద్‌కు వచ్చే వాహనాల యజమానులు దాదాపు ఎనిమిది తొమ్మిది చోట్ల ఇలా రోడ్డు పన్ను కట్టాలి! ఇదీ నిర్వహణ! బెంగళూరు నుంచి హైదరాబాదుకు వచ్చినా హైదరాబాద్ నుంచి విజయవాడకు వెళ్లినా ఇదే తంతు... పెట్రోలు ఖర్చుకంటె ఈ ‘పన్నుల’ విలువ ఎక్కువైపోయింది!!
ఇదంతా ‘ప్రగతి’ పేరుతో జరిగిపోతున్న ‘ప్రపంచీకరణ’ మారీచ మృగ మాయల విన్యాసం. ‘ప్రమాదాలను నిరోధించడానికి ఏర్పడిన ‘వేగ పథాలు’, ‘వలయ పథాలు’- ఔటర్ రింగ్‌రోడ్స్- ప్రమాద నిలయాలుగా మారి ఉండడం వర్తమాన దృశ్యం. ఇందుకు మొదటి కారణం మతిమాలిన వేగం. ఎదురుగా వాహనాలు రావన్న ధీమాతో అమిత వేగంగా నడుపుతున్న వారు తమ ‘శకటాల’ను రహదారిని రెండుగా విభజిస్తున్న నడవ గోడలకు ఢీకొడుతున్నారు, వంతెనల స్తంభాలను ఢీకొంటున్నారు. రోడ్డు బయటికి దూసుకొనిపోయి బోల్తాకొట్టిస్తున్నారు. ఇదంతా ‘ఎక్స్‌ప్రెస్ హైవే’లు ఏర్పడినందునకు పెరిగిన ధీమా! ప్రమాదానికి గురైన ప్రతి వాహనం కూడ ప్రమాద సమయంలో గంటకు నూట అరవై నుంచి రెండు వందల కిలోమీటర్ల వేగంతో వెడుతుండినట్టు దేశవ్యాప్తంగా వెలువడుతున్న సమాచారం. ప్రధానంగా ద్విచక్ర వాహనాల చోదకులు, ప్రభుత్వేతర సంస్థల బస్సులను నడుపుతున్న వారు ఇలా గుద్దుతున్నారు, తాము దుర్మరణం పాలుకావడమేకాక బాటసారులను పాదచారులను బలిగొంటున్నారు. దేశంలో సగటున ప్రతిరోజు నూట ముప్పయి నలుగురు ద్విచక్ర వాహన చోదకులు, ప్రమాదాలకు గురై మరణించడం గత ఏడాది చరిత్ర. ఈ ప్రమాదాలకు- ప్రమాదానికి కారకులు కాని- యాబయి ఆరుగురు పాదచారులు, సైకిల్‌పై వెళ్లేవారు ప్రతిరోజు బలికావడం గత ఏడాది చరిత్ర. గత ఏడాది రహదారి ప్రమాదాలకు దాదాపు నలబయి ఎనిమిది వేల మంది ద్విచక్ర వాహన చోదకులు, ఇరవై వేల మంది పాదచారులు బలయ్యారట! ఈ ద్విచక్ర వాహనాలు మోటార్ సైకిళ్లు, స్కూటర్లు. ఇదికాక మూడున్నర వేల మంది ‘సైకిల్’ సారథులు కూడ ప్రమాదాలకు బలైపోయారట! బస్సులు, కార్లు, ఆటోరిక్షాలు, ట్రక్కుల ప్రమాదాలు నిరంతరం జరిగిపోతూనే ఉండడం నడుస్తున్న చరిత్ర! ‘వోల్వో’ వంటి విదేశాల బస్సులు దిగుమతి అయిపోతుండడం ప్రమాదాలు పెరగడానికి మరో ప్రబల కారణం. విదేశీయ వాహనాల మోజు మన దేశాన్ని ఆవహించి ఉంది. బస్సులు మాత్రమే కాదు, సైకిళ్లను సైతం మనం విదేశాల నుండి దిగుమతి చేసుకుంటున్నాము. ఇందుకు ఏకైక కారణం దేశాన్ని దివాలా తీయించడానికి ‘బహుళజాతీయ వాణిజ్య సంస్థలు చేస్తున్న కుట్ర. ఈ మాయాజాలంలో ఇరుక్కుని ఉన్న మధ్యతరగతి వారు ‘వోల్వో’ వంటి విదేశాల బస్సులను ఎగబడి ఎక్కి ప్రయాణం చేస్తున్నారు, జాతీయ ఆర్థిక వ్యవస్థను కుదేలుమనిపిస్తున్నారు. అత్యధికంగా ప్రమాదాలకు గురవుతున్నది విదేశాల నుంచి వచ్చిపడిన ‘వోల్వో’ బస్సులే!
ముంబయికి చెందిన దాదారావు బిల్ హోరే అనే నలబయి ఏళ్ల సామాజిక కార్యకర్త ప్రతిరోజు రోడ్లపై ఉన్న ‘గుంత’లను, గోతులను పూడ్చి మరమ్మతు చేస్తున్నాడట! ఉత్తరప్రదేశ్‌లోని లలిత్‌పూర్‌లో డెబ్బయి తొమ్మిదేళ్ల రూప్‌నారాయణ్ నిరంజన్ కూడ ప్రతిరోజు రోడ్లను మరమ్మతు చేసి ప్రమాదాలను నిరోధించడానికి కృషిచేస్తున్నాడట. కానీ దేశవ్యాప్తంగా రోడ్లపై ఏర్పడి ఉన్న గోతులను పూడ్చడం ఎప్పుడో? ఎవరు పూనుకుంటున్నారు??