సంపాదకీయం

‘పెట్రోలు’ పాఠం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెట్రోలియం ఉత్పత్తుల ధరలు నిరంతరం పెరుగుతుండడానికి కారణం ‘ప్రపంచీకరణ’. ఈ వాణిజ్య వాస్తవాన్ని అంగీకరించడానికి ప్రభుత్వ నిర్వాహక రాజకీయ పక్షాలవారు, ప్రతిపక్షాలవారు, బహుళ జాతీయ వాణిజ్య సంస్థల- మల్టీ నేషనల్ కంపెనీల- ఎమ్‌ఎన్‌సిల-కు ‘అనధికార’ ప్రతినిధులుగా పనిచేస్తున్న ఆర్థిక నిపుణులు అంగీకరించరు. పెట్రోలియం ఉత్పత్తుల ధరలు పెరగడం ప్రతీక మాత్రమే! అన్ని వస్తువుల ధరలు నిరంతరం పెరుగుతుండడానికి కారణం ఈ ‘బహుళ జాతీయ వాణిజ్య సంస్థలు’- మల్టీనేషనల్ కంపెనీస్- అంతర్జాతీయంగాను, అంతర్గతంగాను మన ఆర్థిక వ్యవస్థను నియంత్రిస్తుండడం. ప్రపంచీకరణ- గ్లోబలైజేషన్-ను సమర్ధించడం ప్రగతి ప్రేరక స్వభావమని, ‘ప్రపంచీకరణ’ను వ్యతిరేకించడం ప్రగతి నిరోధక స్వభావమని భావిస్తున్న ఆర్థిక నిపుణులు ఈ బహుళ జాతీయ వాణిజ్య సంస్థలకు అనధికార ప్రతినిధులు. ‘బహుళ జాతీయ వాణిజ్య సంస్థలు’ పుష్కలంగా ప్రదానం చేస్తున్న విరాళాలను రాజకీయవేత్తలు స్వీకరిస్తున్నారు. పరిశోధన పేరుతో, అధ్యయనం పేరుతో, గణాంకాల సేకరణ పేరుతో వెలసిన అనేక స్వచ్ఛంద సంస్థలు ఈ ‘బహుళ జాతీయ వాణిజ్య సంస్థల’ ఆర్థిక సహకారంతో, సహాయంతో మనుగడ సాగిస్తున్నాయి. పరిశోధనలు, అధ్యయనాలు చేస్తున్నవారికి ఈ ‘స్వచ్ఛంద’ మాధ్యమంగా ‘బహుళ జాతీయ సంస్థల’ నుంచి అధ్యయన భృతి లభిస్తోంది. ప్రచార మాధ్యమాలలోని కొందరు కీలక ప్రతినిధులు సైతం ఈ ‘బహుళ జాతీయ వాణిజ్య సంస్థల’ ఆతిథ్యాలను పుచ్చుకొని అలరారుతున్నారు. అందువల్ల ‘వాణిజ్య ప్రపంచీకరణ’, స్వేచ్ఛా విపణి వ్యవస్థ- మార్కెట్ ఎకానమీ- ‘బహుళ జాతీయ వాణిజ్య సంస్థలు’, విదేశాల ప్రత్యక్ష వాణిజ్య నిధులు- ఫారిన్ డైరక్ట్ ఇనె్వస్టిమెంట్- అన్న పదజాలానికి గొప్ప సమ్మాన పూర్వకమైన ప్రచారం జరుగుతోంది. వాస్తవం ‘అబద్ధం’గాను, వంచన ‘వాస్తవం’గాను ప్రచారం అవుతుండడం ‘ప్రపంచీకరణ’ మారీచుడు కల్పిస్తున్న బంగారు వనె్నల ప్రగతి భ్రాంతి. ఒక్కొక్క ‘బహుళ జాతీయ వాణిజ్య సంస్థ’ ఒక బంగారపు జింక.. జనానికి తెలియకుండా దోచుకోవడం ‘మార్కెట్ ఎకానమీ’ స్వభావం! పెట్రోలియం ధరలు అందువల్లనే పెరుగుతున్నాయి. మన్‌మోహన్‌సింగ్ ప్రధానమంత్రిగా ఉండిన సమయంలో కాంగ్రెస్ నాయకత్వంలోని ‘ఐక్య ప్రగతి కూటమి’ ప్రభుత్వం వారు ‘పెట్రోలియం’ ఉత్పత్తుల పంపిణీ వ్యవస్థను ప్రభుత్వ నియంత్రణ నుంచి తప్పించారు, అంతర్జాతీయ వాణిజ్య వ్యవస్థతో అనుసంధానం చేశారు. అప్పటి నుంచి ‘పెట్రోలియం’ ఉత్పత్తుల ధరలు పెరగడం మొదలైంది. మొదట నెలకోసారి పెరిగిన పెట్రోలు, డీజెల్ నూనెల ధరలు వారానికోసారి పెరగడం ‘అంతర్జాతీయ అనుసంధానం’ ఫలితం. ప్రస్తుతం ప్రతి రోజూ పెట్రోలు ధరలు పెరగడం ఈ ‘అంతర్జాతీయ అనుసంధానాని’కి పరాకాష్ఠ. దేశ రాజధాని ఢిల్లీలో సోమవారం నాడు పెట్రోలు దుకాణాల యజమానులు నిరసన తెలపడం ఈ ప్రహసనంలో భాగం..
పెట్రోలియం ఉత్పత్తుల ధరలు ఇలా పెరగడానికి మొదటి కారణం, వౌలిక కారణం ప్రపంచీకరణ! రెండవ కారణం ‘పంపిణీని’ ప్రభుత్వ నియంత్రణ నుంచి తప్పించడం. ‘ప్రపంచీకరణ’ మన నెత్తికెక్కి తొక్కుతుండడానికి, ‘విదేశీయ వాణిజ్య సంస్థలు’ చిల్లర వ్యాపారంలోకి తద్వారా మన వంట ఇళ్లలోకి చొరబడి మన జీవన విధానాన్ని విధ్వంసం చేయడానికి ప్రణాళికను రూపొందించి అమలు జరిపినవాడు మన్‌మోహన్‌సింగ్. ఆయన అంతర్జాతీయ స్థాయిలో అత్యంత ప్రసిద్ధుడైన ఆర్థికవేత్త. ఆయనకు ‘సంకుచిత జాతీయ ప్రయోజనం’ కంటె విస్తృత అంతర్జాతీయ వాణిజ్య హితం ప్రధానం. అందువల్లనే అమెరికా అధ్యక్షులు, ఐరోపా ప్రభుత్వాల అధినేతలు అంతర్జాతీయ వేదికలపై ఆయనను ఘనంగా ప్రస్తుతించారు. ఈ ‘ప్రశంస’ను నిరంతరం నిలబెట్టుకొనడానికి మన్‌మోహన్‌సింగ్ యత్నించాడు. ప్రపంచ హితమంటే అమెరికా ప్రయోజనమన్నది అమెరికా ప్రభుత్వ విశ్వాసం, గతంలో తమ హితమే ప్రపంచ హితమని ఐరోపా దేశాలు కూడ భావించాయి. ఐరోపా దేశాలవారు తమ ఆధిపత్యం కోసం పరస్పరం కలహించుకున్నారు. ‘ఐరోపా యుద్ధాలు’ ప్రపంచ యుద్ధాలుగా ప్రసిద్ధికెక్కడానికి ఇదీ కారణం. నాలుగైదు ఐరోపా దేశాలు వివిధ ప్రపంచ దేశాలపై పెత్తనం కోసం పరస్పరం కలహించుకొనడం క్రీస్తుశకం పదిహేడవ శతాబ్ది నుంచి నడచిన చరిత్ర. ప్రస్తుతం అమెరికాకు చైనాకు మధ్య వాణిజ్య ఆధిపత్య యుద్ధం నడుస్తోంది. కానీ మన్‌మోహన్‌సింగ్ ప్రధానిగా ఉండిన సమయంలో భారత వాణిజ్య ప్రయోజనాల కంటె అమెరికా ప్రయోజనాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చాడన్నది చరిత్ర.. ‘అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాకు అమెరికా ప్రయోజనాలేమిటో బాగా తెలుసు. భారత ప్రధాని మన్‌మోహన్‌సింగ్‌కు కూడ అమెరికా ప్రయోజనాలేమిటో బాగా తెలుసు’ అని కొంతమంది అంతర్జాతీయ విశే్లషకులు వ్యాఖ్యానించడం చరిత్ర! పెట్రోలియం ఉత్పత్తుల పంపిణీని ‘ఐక్యప్రగతి కూటమి’ ప్రభుత్వం అంతర్జాతీయ వ్యవస్థతో అనుసంధానం చేయడానికి ఇదీ నేపథ్యం. మన్‌మోహన్‌సింగ్ నిజానికి నిమిత్తమాత్రుడు, అసలు సూత్రధారి కాంగ్రెస్ అధిష్ఠానం. ఇలా పెట్రోలియం ధరలు నిరంతరం పెరగడానికి ప్రాతిపదికను సిద్ధం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం 2014కు తరువాత పెట్రోలు ధరలు పెరుగుతుండడం పట్ల రుసరుసలాడుతుండడం విచిత్రమైన వ్యవహారం..
గత మే నెలలో పెట్రోలు ధరలను లీటరుకు ఒక ‘పైస’ చొప్పున కేంద్ర ప్రభుత్వం తగ్గించింది. ఇలా తగ్గించడం కూడ ‘మార్కెట్ ఎకానమీ’- స్వేచ్ఛా విపణి వ్యవస్థ- వౌలిక సూత్రానికి విరుద్ధం. ధరలను అదుపుచేయడానికి సార్వభౌమ దేశాల ప్రభుత్వాలు చర్యలు తీసుకోరాదన్నది ఈ వౌలిక సూత్రం. ‘లభ్యత’- సప్లయి- ‘గిరాకీ’- డిమాండ్- ప్రాతిపదికగా ప్రతి వస్తువు, సేవల ధరలు వాటంతట అవే నిర్ధారితం కావడం ‘మార్కెట్ ఎకానమీ’.. ధరల నియంత్రణకు ప్రభుత్వం పూనుకున్నట్టయితే మన దేశానికి ‘మార్కెట్ ఎకానమీ’ హోదాను ‘ప్రపంచ వాణిజ్య సంస్థ’వారు తొలగిస్తారు. ‘మార్కెట్ ఎకానమీ’ హోదాను కోల్పోయినట్టయితే విదేశాలకు చెందిన వాణిజ్యపు ముఠాల వారు, దోపిడీ చేసే తండాల వారు మన దేశంలో ‘పెట్టుబడుల’ను పెట్టరట! అదీ ప్రభుత్వాల భయం. అందువల్ల ధరలు పెరగడం సమస్య కాదు, ‘మార్కెట్ ఎకానమీ’ హోదాను నిలబెట్టుకొనడం ప్రధానం. మన్‌మోహన్‌సింగ్ రచించిన ‘స్వేచ్ఛా విపణి’ విధానాన్ని నరేంద్ర మోదీ ప్రభుత్వం మరింత చిత్తశుద్ధితో అమలుచేస్తుండడానికి వెనుకగల అంతర్జాతీయ రహస్యం ఇదీ. ‘బహుళ జాతీయ సంస్థల’ను దేశం నుండి వెళ్లగొట్టడం లేదు. ‘విదేశాల పెట్టుబడులతో కాక స్వదేశీయ నిధులతో ప్రగతిని సాధిస్తాము’- అని 2014 నాటి లోక్‌సభ ఎన్నికల సందర్భంగా ప్రతిజ్ఞ చేసిన ‘్భరతీయ జనతాపార్టీ’ మాటమార్చడంలో రహస్యం ఇదీ! అందువల్ల కాంగ్రెస్ ప్రభుత్వ కాలంలో వలనే ‘్భజపా’ ప్రభుత్వ సమయంలో కూడ పెట్రోలు ధరలు పెరుగుతూనే ఉంటాయి. నిరసనలు, ‘బంద్’లు జరుగుతూనే ఉంటాయి. సెప్టెంబర్ పదవ తేదీన జరిగిన ‘్భరత్ బంద్’ ఈ సమాంతర ప్రక్రియలో భాగం! ఢిల్లీలో పెట్రోలు దుకాణాలను సోమవారం మూసివేయడం కూడ ఈ వాణిజ్య నాటకంలో ప్రస్తుత ఘట్టం! ఢిల్లీలో దుకాణాలను ఒక రోజు మూసివేయడం ప్రజాప్రయోజనాలను కాపాడడం కోసం కాదు, వాణిజ్య ప్రయోజనాలను నిలబెట్టుకోవడం కోసం మాత్రమే!!
అక్టోబర్ ఐదవ తేదీన కేంద్ర ప్రభుత్వం లీటరు పెట్రోలుపై రెండున్నర రూపాయల మేర ‘సుంకం’ తగ్గించింది. తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు, ఇతర రాష్ట్రాల ప్రభుత్వాలు కూడ రెండు, మూడు, నాలుగు రూపాయల మేర సుంకాలను తగ్గించాయి. కానీ ఢిల్లీ-కేంద్ర పాలిత ప్రాంత- జాతీయ రాజధాని ప్రాంత- ప్రభుత్వం మాత్రం ‘సుంకం’ తగ్గించలేదు. అందువల్ల ఇరుగు పొరుగు రాష్ట్రాలలో కంటె ఢిల్లీలో పెట్రోలు ధరలు ఎక్కువగా ఉన్నాయట! వినియోగదారులు ఢిల్లీ ‘శివార్లు’లో ఉన్న ఇతర రాష్ట్రాల దుకాణాలలో పెట్రోలు కొంటున్నారట. దీనివల్ల ఢిల్లీలోని దుకాణాల వారి వ్యాపారం దెబ్బతింటోందట. అందువల్ల ఢిల్లీ ప్రభుత్వం వారు కూడ ‘సుంకం’ తగ్గించాలన్నది దుకాణాల వారి కోరిక! ఈ కోరికను నెరవేర్చాలని కోరుతూ సోమవారం నాడు ‘బంద్’ జరిపారు. పెట్రోలియం పంపిణీని ‘వస్తు, సేవల పన్నుల’ వ్యవస్థ పరిధిలోకి తెచ్చినట్టయితే ధరలు దాదాపు నలబయి శాతం తగ్గిపోతాయి. ఇందుకు కేంద్ర ప్రభుత్వం కాని, రాష్ట్రాలు కాని ఎందుకు పూనుకోవడం లేదు?