సంపాదకీయం

హరిత దీపావళి..?!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన ‘హరిత దీవాలీ’- ఆకుపచ్చని దీపావళి- ఉద్యమానికి సర్వోన్నత న్యాయస్థానం మంగళవారం చెప్పిన తీర్పు విచిత్రమైన నేపథ్యం..! ‘బాణసంచా’- ఫైర్ క్రాకర్స్-ను ‘ఇష్టం వచ్చినట్టు’ వ్యాపారులు అమ్మరాదని, ప్రజలు సమయ సీమలను అతిక్రమించి ‘పటాకులు’ కాల్చరాదని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించడం పర్యావరణ పరిశుభ్రతకు దోహదం చేయవచ్చు. కానీ అనుమతించిన ‘హరిత విస్ఫోటన సామగ్రి’- ‘ఆకుపచ్చని టపాకాయలు, చిచ్చుబుడ్లు, తారాజువ్వలు, మతాబాలు, వెలుగు రవ్వలు వంటి బాణసంచాని దీపావళి సందర్భంగా కేవలం రెండు గంటలు మాత్రమే పేల్చుకోవాలన్న న్యాయ నిర్దేశం మాత్రం ప్రజల అభీష్టానికి విరుద్ధం, యుగయుగాల నాటి ఉత్సవ సంప్రదాయానికి వ్యతిరేకం. బాలబాలికల సహజమైన హక్కులకు భంగకరం, పర్యావరణ సమతుల్యస్థితి పరిరక్షణకు సైతం విఘాతకరం! ద్వాపర యుగంలో సత్యభామా సమేతుడైన యదుకుల కృష్ణుడు ‘నరక చతుర్దశి’నాడు దుర్మార్గుడైన నరకాసురునిపై యుద్ధం చేసి విజయం సాధించాడు. అసుర శక్తులపై సజ్జన విజయ ప్రతీక నరక చతుర్దశి. ఆరోజున తెల్లవారుజామున అభ్యంగన మంగళస్నానం- తలంటు పోసుకోవడం- చేసి విజయచిహ్నంగా బాణసంచా పేల్చడం దాదాపు ఐదువేల రెండువందల ఏళ్లుగా కొనసాగుతున్న ధార్మిక సంప్రదాయం. ఈ ‘శే్వత వరాహకల్పం’లో ఇంతవరకు నూట తొంబయి ఐదుకోట్ల యాబయి ఎనిమిది లక్షల ఎనబయి ఐదువేల నూట పంతొమ్మిది ఏళ్లు గతించాయి. మన్వంతరాలుగా, మహాయుగాలుగా, యుగాలుగా ఏర్పడి ఉన్న చరిత్ర ఇది. ఇది భారతదేశపు చరిత్ర మాత్రమే కాదు, ప్రపంచ చరిత్ర, విశ్వవ్యవస్థ చరిత్ర. ఈ శే్వత వరాహ కల్పంలో ఇది ఏడవ ‘మన్వంతరం’. ఈ వైవస్వత మన్వంతరంలో ఇది ఇరవై ఎనిమిదవ మహాయుగం. ఈ ‘మహాయుగం’లో కృత, త్రేత, ద్వాపర యుగాలు ముగిశాయి. కలియుగం ఆరంభమైన తరువాత ఐదువేల నూట పంతొమ్మిది ఏళ్లు గతించాయి, ఈ ‘విలంబ’ నామ సంవత్సరం ఐదువేల నూట ఇరవయ్యవ సంవత్సరం. మహాభారత యుద్ధం జరిగి ఇప్పటికి ఐదువేల నూట యాబయి ఆరు సంవత్సరాలైంది. అంతకుముందే సత్యభామా కృష్ణులు నరకాసురునిపై సాంస్కృతిక విజయం సాధించారు. భారతీయతను ధ్వంసం చేయడానికి యత్నించినవాడు నరకుడు, భారతీయతను పరిరక్షించినవాడు యదుకృష్ణుడు! అందువల్ల ఆశ్వయుజ బహుళ చతుర్దశి- నరక చతుర్దశి-నాడు తెల్లవారుజామున విజయ సూచకంగా ‘బాణసంచా’ పేల్చడం జాతీయ సంప్రదాయమైంది. కానీ, కోర్టు తీర్పు ప్రకారం ఇకపై ఇలా తెల్లవారుజామున ‘బాణసంచా’ పేల్చి ఉదయానికి స్వాగతం చెప్పడానికి వీలులేదు. ఎందుకంటె రాత్రి ఎనిమిది గంటల నుంచి రాత్రి పది గంటల వరకు మాత్రమే ఆకుపచ్చని ‘బాణసంచా’ పేల్చడానికి కోర్టు అనుమతినిచ్చింది. మిగిలిన ఇరవై రెండు గంటలలో టపాకాయలు పేల్చరాదు.. నరక చతుర్దశి మరుసటి రోజు దీపావళి పండుగ!
వేల ఏళ్లుగా ప్రాకృతిక ఉత్పత్తులు ముడి వస్తువులుగా ఉపయోగించి మన దేశంలో టపాకాయలను, ఇతర ‘బాణాసంచా’ను తయారుచేశారు. ఇలాంటి ‘హరిత బాణసంచా’ పేల్చడం ప్రకృతికి జరుగుతున్న చికిత్స. ఆవుపేడతో చేసిన పిడకలను, పచ్చి ఆకులను కాల్చడం వల్ల ఆ పొగ వాతావరణాన్ని పరిశుభ్రం చేస్తుంది. ‘గవ్యా’ల- ఆవుపేడ, మూత్రం, పాలు, పెరుగు, నెయ్యి-ను ఉపయోగించి చేసే హోమాల వల్ల యజ్ఞాల వల్ల కూడ పర్యావరణ ప్రక్షాళనవౌతోంది. ఆవుపేడ, పంచితము అడవి ఆకులు ఎఱువులుగా వాడడం వల్ల భూమి పరిపుష్టమై ధాన్యాన్ని అన్నాన్ని ప్రసాదించింది. అందువల్లనే దీపావళి సమయంలో పేల్చుతున్న ‘పటాకులు’ వంటి విస్ఫోటన సామగ్రి వల్ల ప్రకృతి ప్రక్షాళితమైంది. కానీ పాశ్చాత్య వాణిజ్య పద్ధతులు, కేంద్రీకృత ఉత్పత్తి విధానాలు మననెత్తినెక్కిన తరువాత, ఈ ప్రాకృతిక ‘చికిత్స’ మూలపడింది. విష రసాయనాలు కలసిన ‘ఎఱువులు’ భూమిని, వ్యవసాయాన్ని, ధాన్యాన్ని, అన్నాన్ని, ప్రకృతిని విష పూరితం చేస్తున్నాయి. ‘కల్తీ’అయిన ‘గవ్యాల’తో హోమం, యజ్ఞం చేయడం వల్ల ప్రకృతి మరింతగా గాయపడుతోంది, పరిశుభ్రం కావడం లేదు. పసుపు, చందనం వంటి ప్రాకృతిక ‘సుగంధాల’తో కలసిన ‘వసంత జలాన్ని’ చల్లుకొనడం ‘హోలీ’ ఉత్సవ సంప్రదాయం. దీనివల్ల ప్రజల శరీరాలు, మనసులు మాత్రమే కాదు, మొత్తం ప్రకృతి సుగంధ భరితమై పరిమళిస్తోంది. కానీ ప్రస్తుతం ‘హోలీ’ సందర్భంగా పెట్రోలియం, ఇతర విష రసాయనాలు కలసిన రంగులు చల్లుతున్నారు, విషపు వాసనలను వెదజల్లుతున్నారు. ఇదే పద్ధతిలో ‘దీపావళి’ బాణసంచాను కూడ ప్రాకృతిక ఉత్పత్తులతోకాక భయంకర విష రసాయనాలతో తయారుచేస్తున్నారు. ఇలాంటి రసాయన విషాలతో తయారైన ‘బాణసంచా’ను అమ్మరాదని, పేల్చరాదని న్యాయస్థానం నిర్దేశించింది. ప్రాకృతిక పదార్థాలు నిండిన ‘బాణసంచా’- హరిత విస్ఫోటనాలు-ను మాత్రమే పేల్చాలని నిర్దేశించింది. ఈ నిర్దేశం హర్షణీయం. కానీ ఏవి ఆకుపచ్చని పటాకులు? ఏవి విష రసాయనాలు? -అన్న వివరాలు జనానికి తెలియచెప్పేదెవ్వరు?
దీపావళి సందర్భంగా రాత్రి ఎనిమిది నుంచి పది గంటల వరకు మాత్రమే టపాకాయలను ఇతర వెలుగుల విస్ఫోటనాలను పేల్చుకోవడానికి సుప్రీం అనుమతినివ్వడం ఉత్సవ ఉత్సాహాన్ని నిరోధించడం.. దీపావళి వెలుగుల సమాహారం, దివ్వెల తోరణం. దేశమంతటా దీపావళి సమయంలో సాయంత్రం ఐదున్నరకు చీకటి కమ్ముకుంటుంది. ఈశాన్యంలోను తూర్పుప్రాంతాలలోను ఐదు గంటల కంటె ముందే సూర్యాస్తమయం జరుగుతుంది. కానీ రెండున్నర గంటలపాటు వేచి ఉండి, రాత్రి ఎనిమిది గంటల తరువాత వెలుగుల విస్ఫోటనాలను జరుపుకోండని ఆదేశించడం జీవన వాస్తవానికి విరుద్ధమైన అంశం! ‘హరిత’ సామగ్రిని సాయంత్రం ఐదున్నర గంటల నుంచి పేల్చుకోవడంవల్ల వచ్చే ప్రమాదం ఏమిటి?? ఎనిమిది గంటలలోపు మాత్రమే చిన్నపిల్లలు ‘తారాజువ్వల’ను పేల్చి ఆనందిస్తారు, వెలుగుల మయం చేస్తారు. ఎనిమిది తరువాత వారు నిద్రపోతారు. అలా పిల్లలు నిద్రించే సమయంలో వృద్ధులు బాణసంచా పేల్చుకోవడం ఔచిత్య రహితం. న్యాయస్థానం ఈ జీవన వాస్తవానికి అనుగుణంగా తమ తీర్పును సమీక్షించాలి. సూర్యాస్తమయం అయిన వెంటనే బాణసంచా కాల్చుకోవడానికి అనుతమి ఇవ్వాలి! అలాగే దీపావళికి ముందురోజున, దీపావళి రోజున, మరుసటి రోజున కూడ తెల్లవారుజామున బాణసంచా పేల్చుకొనడాన్ని అనుమతించాలి! సంప్రదాయాలను నిరోధించినట్టయితే జన జీవనం నిర్బంధగ్రస్తమైపోతుంది, దేశం సువిశాల నిర్బంధ గృహమైపోతుంది.
దీపావళి తరువాత కార్తిక పౌర్ణమి వరకు గృహప్రాంగణాలను సాయం సంధ్యవేళ దీపాలతో అలంకరిస్తున్నారు. ఈ సమయంలో కూడ కొంతసేపు ‘బాణసంచా’కాల్చడం కొందరి సంప్రదాయం. హరిత సామగ్రిని, హానికరం కాని విస్ఫోటన పదార్థాలను కాల్చుకొనడానికి మాత్రమే అనుమతి ఉన్నప్పుడు సమయ పరిమితులు విధించడంలో ఔచిత్యం లేదు. ఎవరి ఆనుకూల్యాన్ని బట్టివారు ఉత్సవాలను ఆయా సమయాలలో జరుపుకోనివ్వాలి! అందువల్ల ఈ సమయ నియమాలను ఎత్తివేయడం మేలు. ఇరవై నాలుగుగంటలూ ఎవ్వరు కూడ ‘టపాకులు’కాల్చరు. సర్వోన్నత న్యాయస్థానంవారు తమ తీర్పును సమీక్షించడం మేలు... అర్ధరాత్రి పూట తాగి ఊగి తూగి తందనాలు ఆడేవారు జరుపుతున్న ఉత్సవాలపై నియంత్రణ విధించడం మేలు. మద్యపానం వల్ల కాలుష్యం పెరుగుతోంది. సర్వోన్నత న్యాయస్థానం వారు ‘తమంతతాము’గా దేశమంతటా మద్యపాన నిషేధాన్ని ఎందుకు విధించరాదు? స్వచ్ఛ భారత్, హరిత భారత్ పునరవతరణకు అది మాధ్యమం కాగలదు...