సంపాదకీయం

‘అమిత’ వ్యూహం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అక్రమ ప్రవేశకులను దేశం నుండి వెళ్లగొట్టనున్నట్టు భారతీయ జనతాపార్టీ అధ్యక్షుడు అమిత్ షా భాగ్యనగరంలో ప్రకటించడం కొత్త విషయం కాదు. ఇది కేంద్ర ప్రభుత్వ విధానానికి పునరుద్ఘాటన మాత్రమే. 2019వ సంవత్సరంలో జరిగే లోక్‌సభ ఎన్నికలలో తమ పార్టీ విజయం సాధించిన తరువాత ఈ ‘చొరబాటుదారులైన విదేశీయులను వెళ్లగొట్టే’ కార్యక్రమం మొదలౌతుందని అమిత్ షా చెప్పినట్టు జరుగుతున్న ప్రచారం మాత్రమే కొత్త విషయం. పార్టీ యువజన విభాగం ‘భారతీయ జనతా యువమోర్చా’ వారు హైదరాబాద్‌లో నిర్వహించిన ‘జాతీయ సదస్సు’లో ఆదివారం ప్రసంగించిన సందర్భంగా అమిత్‌షా ఈ ‘వెళ్లగొట్టే’ కార్యక్రమం గురించి ప్రస్తావించాడు! అమిత్ షా చెప్పిన మరో ప్రధాన విషయం- తమ పార్టీ తెలంగాణలో అధికారంలోకి వచ్చినట్టయితే తెలంగాణ విమోచన ఉద్యమాన్ని తమ ప్రభుత్వం ‘అధికార ఉత్సవం’గా నిర్వహిస్తుంది- అన్నది! ఇది కూడ కొత్త విషయం కాదు. ‘భాజపా’ వారు ఏళ్ల తరబడి ఈ విషయం చెబుతూనే ఉన్నారు. కానీ, ‘తెలంగాణకు స్వాతంత్య్రం లభించిన 1948 నాటి చారిత్రక ఘట్టాన్ని’ దేశవ్యాప్తంగా ఆధికారిక ఉత్సవంగా నిర్వహించాలన్న ధ్యాస జాతీయతా నిష్ఠ ఉన్న ‘భాజపా’కు ఎందుకు ఇంతవరకు కలగలేదన్నది ‘‘మానసిక మథనానికి ప్రాతిపదిక కాగల మహావిషయం!’’ 1947 ఆగస్టు 15న అఖండ భారతదేశం మరోసారి ముక్కలైపోయింది. పాకిస్తాన్ ఏర్పడింది, అవశేష భారత్‌కు విదేశీయ పాలన నుంచి విముక్తి ఒక్కసారిగా జరగలేదన్నది చారిత్రక వాస్తవం! ‘‘మరోసారి ముక్కలైంది’’ అని చెప్పడం ఎందుకంటె రెండున్నర సహస్రాబ్దులపాటు అఖండ భారతదేశం దశలవారీగా ముక్కలైంది.. అందువల్ల! స్వజాతీయుల నిర్లక్ష్యం వల్ల- అఖండ భారతదేశపు సరిహద్దుల ధ్యాసను కోల్పోవడం వల్ల - అఖండ భారత్ ముక్కలైంది, విదేశీయ బీభత్సకారుల దురాక్రమణ ఇలా ముక్కలు చెక్కలు కావడానికి మరింత దోహదం చేసింది. ఫలితంగా వివిధ సమయాలలో ‘అఖండ భారత్’ నుంచి- అద్వితీయ సాంస్కృతిక స్వరూపం నుంచి, సమీకృత రాజ్యాంగ వ్యవస్థ నుంచి- టిబెట్, బర్మా, సింహళము, మాలాద్వీపాలు, గాంధార మొదలైన వాయువ్య ప్రాంతాలు, పాకిస్తాన్, నేపాల్, భూటాన్ విడిపోయాయి. ఇలా విడిపోయిన విషాదపు చారిత్రక ధ్యాస కూడ ‘అవశేష భారత్’లోని అనేకానేక రాజకీయ పక్షాలకు లేదు. ‘భారతీయ జనతాపార్టీ’ వారికి ఈ ధ్యాస ఉంది. ‘‘ధ్యాస ఉన్న’’ భాజపా నాలుగేళ్లకు పైగా కేంద్ర ప్రభుత్వాన్ని నిర్వహిస్తోంది. అందువల్ల విదేశీయ జిహాదీ బీభత్సవారసత్వానికి ప్రతీక అయిన ‘నిజాం’ అధీనం నుంచి తెలంగాణకు, హైదరాబాద్ సంస్థానానికి విముక్తి కలిగిన ఘట్టాన్ని జాతీయ దినోత్సవంగా ఆధికారికంగా నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం ఈ నాలుగేళ్లలో ఆదేశించి ఉండవచ్చు.. హైదరాబాద్ సంస్థాన విముక్తి కేవలం ఈ ప్రాంతానికి పరిమితమైనది, యావత్ భారత జాతికి సంబంధించిన చారిత్రక శుభ పరిణామం! అమిత్ షా తక్షణం కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించవచ్చు! ‘తెలంగాణ విమోచన’ను జాతీయ ఉత్సవంగా ప్రకటింపచేయవచ్చు...
అవశేష భారత్‌కు ఒక్కసారిగా స్వాతంత్య్రం రాలేదన్నది చారిత్రక వాస్తవం! ఈ ‘్ధ్యస’ కూడ అధికాధిక రాజకీయ పక్షాల వారికి లేదు. అందువల్ల ‘అవశేష భారత్’ మొత్తం 1947 ఆగస్టు 15వ తేదీన విదేశీయుల పాలన నుండి విముక్తమైందన్న ‘భ్రమ’ కొనసాగుతోంది. వాస్తవానికి 1947 ఆగస్టు 15కు ముందు, ఆ తరువాత కూడ దేశం దశలవారీగా విదేశీయ దురాక్రమణ నుండి విముక్తమైంది! 1943లో నేతాజీ సుభాష్ చంద్ర వసు నాయకత్వంలోని ‘ఆజాద్ హింద్ ఫౌజ్’ అండమాన్ దీవులను, ఈశాన్యంలోని కొన్ని ప్రాంతాలను బ్రిటన్ నుంచి విముక్తం చేసింది. వసు-బోస్- నాయకత్వంలో స్వతంత్ర భారత ప్రవాస ప్రభుత్వం కూడ ఏర్పడింది. 1947 ఆగస్టు 15 తరువాత అనేక ఏళ్లపాటు పుదుచ్చేరి ఫ్రాన్స్ దురాక్రమణలో కొనసాగింది, 1950వ దశకంలో మాత్రమే పుదుచ్చేరికి విముక్తి లభించింది. 1961లో ‘గోవా, డయ్యూ, దమన్’ ప్రాంతాలు, ‘దాద్రానగర్ హవేలీ’ ప్రాంతం విదేశీయ దురాక్రమణ నుంచి విముక్తిని పొందాయి. మన దేశంలోకి క్రీస్తుశకం పదహైదవ శతాబ్ది చివరిలో చొరబడిన ‘పోర్చుగల్’ వారు 1961లో మాత్రమే నిష్క్రమించారు. ఇలా పోర్చుగల్ దుండగులు మొదట చొరబడిన ఐరోపా బీభత్సకారులు. చివరికి నిష్క్రమించింది కూడ ఈ దుండగులే!
ఇవన్నీ జాతీయ చారిత్రక ఘటనలు. అందువల్ల బ్రిటన్ నిష్క్రమణను జాతీయ ఉత్సవంగా అధికార పూర్వకంగా నిర్వహిస్తున్నట్టే పోర్చుగల్, ఫ్రాన్స్‌ల నిష్క్రమణను కూడ జాతీయ ఆధికారిక ఉత్సవాలుగా జరుపుకోవాలి. ‘ఉత్సవం’ జరుపుకోవడమంటే తప్పనిసరిగా ‘సెలవులు’ ప్రకటించాలని కాదు. ఆ చారిత్రక పరిణామాల స్ఫూర్తిని నెమరువేసుకోవడం. అందువల్ల 1948లో జరిగిన ‘తెలంగాణ’- హైదరాబాద్ సంస్థాన- విముక్తి ఘట్టం కూడ దేశం స్వాతంత్య్రం పొందిన క్రమంలో భాగం. ఈ ‘విముక్తి’ కేవలం ప్రాంతీయ జన సముదాయానికి సంబంధించినది కాదు, భారతీయులందరిదీ. అందువల్ల కేంద్ర ప్రభుత్వం తక్షణం తెలంగాణ విమోచన ఘట్టాన్ని జాతీయ అధికార ఉత్సవంగా ప్రకటించాలి. కేంద్ర ప్రభుత్వం ఉత్తరువు ద్వారా- అవసరమైతే చట్టం ద్వారా- ఈ జాతీయ కర్తవ్యాన్ని నిర్వహించాలి! బ్రిటన్, ఫ్రాన్స్, పోర్చుగల్ వంటివి విదేశాలు, అందువల్ల ఆయా దేశాల దురాక్రమణ నుంచి దేశానికి ‘విముక్తి’జరిగింది. కానీ ‘నిజాం’లు, వారికి పూర్వం ‘‘పాలించిన’’వారు ఇక్కడే పుట్టిపెరిగారు కనుక తెలంగాణను వారు దేశంలో ‘విలీనం’ చేసినట్టు భావించాలన్న విచిత్రవాదాన్ని కొంతమంది కొనసాగిస్తున్నారు. కానీ పుట్టి పెరగడం చరిత్రలో ప్రధానం కాదు, దొంగల వారసులు, అక్రమ ప్రవేశకుల వారసులు ‘ఇక్కడే పుట్టి పెరిగినంత మాత్రాన’ వారు స్వజాతీయులు కాజాలరు. బ్రిటన్ దురాక్రమణ సమయంలో బ్రిటన్ ఉద్యోగులకు మన దేశంలో సంతానం కలిగి ఉండవచ్చు. వారు భారతీయులు కాలేదు. వారిలో ఈ దేశాన్ని మాతృభూమిగా భావించి ఈ దేశపు పౌరసత్వం స్వీకరించిన వారు స్వజాతీయులుగా మారి ఉండవచ్చు. అలాగే శతాబ్దుల తరబడి చొరబడిన విదేశీయ జిహాదీల సంతానం, వారి వారసులు కూడ ఈ దేశాన్ని మాతృభూమిగా భావించి ఈ దేశం కొరకు జీవించినట్టయితే వారు కూడ స్వజాతీయులే, భరతమాత బిడ్డలే! కాని 1947-48నాటి ‘నిజాం’లు ఈ దేశాన్ని మాతృభూమిగా భావించలేదు. ఈ దేశం నుండి విడిపోయి ‘హైదరాబాద్ సంస్థానాన్ని’ ప్రత్యేక స్వతంత్ర దేశంగా మార్చాలన్న విష పన్నాగాన్ని అమలు జరిపిన భారత విద్రోహులు ‘నిజాం’లు! అందువల్ల అప్పటి ఉప ప్రధాని సర్దార్ పటేల్ పూనుకొని ‘నిజాం’ల ‘రజాకార్ల’ బీభత్స బంధం నుంచి ‘హైదరాబాద్’- తెలంగాణ-ను విముక్తం చేయవలసి వచ్చింది! విదేశీయ జిహాదీ వారసత్వాన్ని పెంపొందించిన అప్పటి ‘నిజాం’లు స్వభావ రీత్యా విదేశీయులు, భారత్‌కు శత్రువులు.. ఇదీ వాస్తవం!
విదేశీయ అక్రమ ప్రవేశకులను వెళ్లగొట్టే కార్యక్రమం అమలు జరుగుతోంది. ‘రోహింగియాల’ను బర్మాకు పంపే కార్యక్రమం ఇప్పటికే మొదలైంది. అందువల్ల అమిత్ షా ఈ కార్యక్రమాన్ని 2019లో జరిగే లోక్‌సభ ఎన్నికల తరువాత మళ్లీ కొత్తగా మొదలుపెట్టనక్కరలేదు. మొదలై ఉన్న కార్యక్రమాన్ని కొనసాగింపచేస్తే చాలు. 2019 మేలోగానే లక్షలాది బంగ్లాదేశీయ అక్రమ ప్రవేశకులను వెళ్లగొట్టవచ్చు!!