సంపాదకీయం

మళ్లీ ‘ఉగ్ర సర్పం’ బుసలు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతి గుండెలపై చెరగని నెత్తుటి చారికలు మిగిల్చిన ‘ఖలిస్థాన్’ ఉగ్రవాదం పంజాబ్‌లో మళ్లీ కోరలు చాస్తోందా..? అంటే తాజా ఘటనలు ‘ఔన’నే నిరూపిస్తున్నాయి. పాకిస్తాన్ సరిహద్దుల్లో ఉన్న పంజాబ్ రాష్ట్రంలో తాజా ఉగ్రదాడిని ఏదో ‘తేలికపాటి సంఘటన’ అని విస్మరించడానికి వీలు లేదు. అమృతసర్ శివారులోని నిరంకారీ భవన్‌పై ఆదివారం ఉగ్రవాదులు జరిపిన గ్రెనేడ్ దాడిలో ముగ్గురు మరణించగా 23 మంది గాయపడ్డారు. ఇది ముమ్మాటికీ ఉగ్రమూకల ఘాతుకమేనని పోలీసులు యథాప్రకారం ప్రకటించారు. ఖలిస్థాన్, కశ్మీరీ ఉగ్రవాదుల పాత్ర ఈ ఘటనలో ఉన్నట్లు పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ కొద్ది క్షణాల్లోనే కనుగొని ‘కొత్త విషయం’ ఆవిష్కరించారు. నిఘా వర్గాలు ఉగ్రవాదుల కదలికలపై ముందస్తు సమాచారం ఇచ్చినప్పటికీ గ్రెనేడ్ దాడిని నిలువరించలేక పోవడం ఎవరి తరమూ కాలేదు. భద్రతా సంస్థలు భయపడినట్టే ఉగ్రవాదులు దుశ్చర్యకు పాల్పడ్డారంటే ప్రభుత్వ ‘అప్రమత్తత’ ఏపాటిదో ఎవరికైనా ఇట్టే అర్థమవుతుంది. పంజాబ్‌లో మళ్లీ ఉగ్రవాదం తలెత్తే ప్రమాదం ఉందని సాక్షాత్తూ ఆర్మీ అధిపతి జనరల్ బిపిన్ రావత్ హెచ్చరించిన కొద్ది రోజులకే అమృతసర్ శివారులో, అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరువలో గ్రెనేడ్ దాడి జరగడం నిఘా వ్యవస్థలోని డొల్లతనాన్ని బయటపెట్టింది. ఈ దాడికి ముందు పఠాన్‌కోట్‌లో జిల్లాలో నలుగురు దుండగులు తుపాకులు గురిపెట్టి ఓ కారును అపహరించుకొనిపోయారన్న ఫిర్యాదు అందడంతో పంజాబ్ ప్రభుత్వం అన్ని జాల్లాల్లోనూ ‘రెడ్ అలర్ట్’ ప్రకటించింది. అయినప్పటికీ నిరంకారీ భవన్‌లోకి ఉగ్రవాదులు యథేచ్ఛగా ప్రవేశించి గ్రెనేడ్ దాడికి పాల్పడి పోలీసులకు సవాల్ విసిరారు. నిరంకారీ భవన్‌లో ‘సత్సంగం’ (సదస్సు) సమయంలో మహిళలు సహా సుమారు 200 మంది భక్తులు ఆధ్యాత్మిక కార్యక్రమంలో మునిగి ఉండగా ఉగ్రవాదులు వ్యూహాత్మకంగా తెగబడ్డారు. బైక్‌పై వచ్చిన ఇద్దరు దుండగులు ప్రార్థనా మందిరంలోకి చొరబడి గ్రెనేడ్ విసిరి పరారయ్యారంటే వారు ఎంత పకడ్బందీగా వచ్చారో తేటతెల్లమవుతోంది.
సరిహద్దులు దాటి పాకిస్తాన్ నుంచి ‘జైషే మహమ్మద్’ సంస్థకు చెందిన ఆరేడుగురు ఉగ్రవాదులు పంజాబ్‌లోకి ప్రవేశించారని, వారు ఢిల్లీలోకి చొరబడేందుకు యత్నిస్తున్నారని నిఘా వర్గాలు కొద్ది రోజుల క్రితమే హెచ్చరించాయి. ‘జైషే మహమ్మద్’తో సంబంధాలున్న ‘గజ్వాతుల్ హింద్’ అనే ఉగ్రవాద ముఠాకు చెందిన నేత జకీర్ మూసా పంజాబ్‌లో సంచరిస్తున్నట్లు సైతం వార్తలొచ్చాయి. అమృతసర్ ప్రాంతంలో ఇన్నాళ్లూ నిద్రాణంగా ఉన్న ఖలిస్థాన్ ఉగ్రవాద కార్యకర్తలను మూసా కలిసి ఉంటాడని స్థానిక పోలీసులు అనుమానించారు. మరోవైపు ‘ఖలిస్థాన్’ ఉగ్రవాదాన్ని పునరుద్ధరించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని సైనిక దళాల అధిపతి రావత్ ఈమధ్యనే భద్రతా సిబ్బందిని గట్టిగా హెచ్చరించారు. ఈ క్రమంలో ప్రార్థనా మందిరంలో గ్రెనేడ్ దాడి జరగడం గమనార్హం. బైక్‌లపై వచ్చే దుండగులు మతపెద్దలను కాల్చి చంపడం పంజాబ్‌లో కొత్తేమీ కాదు. గత రెండేళ్ల వ్యవధిలో ఇలా ఏడుగురు మతపెద్దలు హత్యకు గురయ్యారు.
పంజాబ్‌లో సిక్కులకూ, నిరంకారీలకు మధ్య విభేదాల సెగలు ఇప్పటివి కావు. సుమారు తొమ్మిది దశాబ్దాల క్రితం నుంచీ ‘నిరంకారీ మిషన్’కు, సిక్కుల్లోని మెజారిటీ వర్గానికి మధ్య ఘర్షణ వాతావరణం కొనసాగుతోంది. ఈ రెండు వర్గాల మధ్య వైషమ్యాలు, వైరుధ్యాలు ఘర్షణలకు, హత్యలకు దారితీయడం దశాబ్దాలుగా కొనసాగుతున్న చరిత్ర. 1978లో ఉభయ వర్గాల మధ్య చెలరేగిన ఘర్షణలో 13 మంది సిక్కులు ప్రాణాలు కోల్పోయారు. 1980లో అప్పటి నిరంకారీ పీఠం అధిపతి గురుబచన్ సింగ్‌ను దుండగులు హతమార్చారు. ఆ సమయంలో సిక్కుల ప్రతినిధిగా తెరపైకి వచ్చిన భింద్రన్‌వాలే సొంతంగా సాయుధ దళాన్ని ఏర్పాటు చేసుకొని ‘ప్రత్యేక ఖలిస్థాన్’ పేరిట వేర్పాటు వాదాన్ని ముందుకు తెచ్చాడు. భింద్రన్‌వాలే ప్రభావం మొదట్లో అంతగా లేకున్నా అతనికి లేనిపోని ప్రాధాన్యత ఇచ్చి కాంగ్రెస్ పార్టీ రాజకీయం నడిపింది. ఇలా కాంగ్రెస్ పార్టీ పాలు పోసి పెంచిన ‘విషనాగు’ భింద్రన్‌వాలే ఆ తర్వాత కొరకరాని కొయ్యిగా మారాడు. ఆర్థిక, రాజకీయ, సామాజిక రంగాల్లో తాము వివక్షకు గురవుతున్నామని భావించే సిక్కుల్లో కొన్నివర్గాల వారిని పావులుగా వాడుకొన్న భింద్రన్‌వాలే ‘సిక్కుల స్వయం ప్రతిపత్తి’ కోసం ఖలిస్థాన్ పేరిట ప్రత్యేక దేశం ఏర్పడాల్సిందేనని నూరిపోశాడు. భింద్రన్‌వాలే నేతృత్వంలో ఉగ్రవాదులు ప్రార్థనా మందిరాలను స్థావరాలుగా చేసుకొని ఖలిస్థాన్ కోసం విధ్వంసక చర్యలను విస్తృతం చేశారు. భింద్రన్‌వాలే ఘాతుకాలతో అట్టుడికిన పంజాబ్‌ను దారిలోకి తెచ్చేందుకు పోలీసులు రంగంలోకి దిగడంతో వేలాదిమంది ప్రాణాలు కొల్పోయారు. అమృత్‌సర్‌లోని ‘స్వర్ణ దేవాలయం’ నుంచి ఉగ్రవాదులను ఖాళీ చేయించేందుకు అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ హయాంలో జరిగిన ‘ఆపరేషన్ బ్లూస్టార్’ సిక్కుల్లో ఆగ్రహజ్వాలలను రగిలించింది. ‘ఆపరేషన్ బ్లూస్టార్’కు నిరసనగా ఉగ్రవాదులు జరిపిన మారణకాండలో 165 మంది హిందువులు, నిరంకారీలు, భింద్రన్‌వాలేను వ్యతరేకించిన 39 మంది సిక్కులు కూడా ప్రాణాలు కోల్పోయారు. భింద్రన్‌వాలే అనుచరుల ప్రతీకారం ఇంతటితో చల్లారలేదు. ప్రధాని ఇందిరా గాంధీని- సిక్కు మతస్థులైన ఆమె సెక్యూరిటీ గార్డులే హత్య చేయడంతో ఢిల్లీ సహా పలు ఉత్తరాది రాష్ట్రాల్లో సిక్కులపై మూకుమ్మడి దాడులు జరిగాయి. కొంతమంది కాంగ్రెస్ నేతలు స్థానికులను రెచ్చగొట్టడం వల్లే ఢిల్లీలో తమ వారు ఊచకోతకు గురయ్యారన్న ఆగ్రహం సిక్కుల్లో ఇప్పటికీ ఉంది. 1984 నాటి ‘ఊచకోత’పై నమోదైన కేసులు ఇప్పటికీ కొలిక్కిరాక పోవడం, దోషులకు శిక్షలు పడకపోవడంపై కూడా సిక్కుల్లో ఆందోళన గూడుకట్టుకుంది. కాగా, ఢిల్లీలో ‘సిక్కుల ఊచకోత’పై విచారణ జరిపేందుకు 2015లో ‘ప్రత్యేక దర్యాప్తు బృందం’ (సిట్) ఏర్పాటుకాగా, ఓ కేసులో యశ్‌పాల్ సింగ్ అనే నిందితుడికి మరణశిక్షను, నరేశ్ షెరావత్ అనే మరో నిందితుడికి యావజ్జీవ జైలుశిక్షను విధిస్తూ మంగళవారం నాడు ఢిల్లీలోని న్యాయస్థానం తీర్పు ఇచ్చింది. ‘ఊచకోత’కు సంబంధించి 293 కేసులు నమోదు కాగా, సాక్ష్యాధారాలు లేవని చాలా కేసులను మూసివేశారు. 60 కేసుల్లో ‘సిట్’ పునర్విచారణ ప్రారంభించగా ఇప్పటికి ఒక్క కేసులో మాత్రమే శిక్షలను ఖరారు చేశారు. దాదాపు మూడున్నర దశాబ్దాలుగా ఈ కేసులకు మోక్షం లేకపోవడంతో సిక్కుల్లో ఆగ్రహం రావణకాష్టంలా రగులుతోంది. దీన్ని ఆసరాగా చేసుకొని ఉగ్రవాద ముఠాలు సిక్కు యువకులకు వల విసురుతున్నాయి.
1980 నుంచి దశాబ్ద కాలం పాటు ఉగ్రవాద కోరల్లో పంజాబ్ విలవిలలాడింది. ఆ తర్వాత భద్రతాదళాలు శాంతిభద్రతలను దారిలోకి తెచ్చాయి. అయితే, ఇటీవలి కాలంలో పఠాన్‌కోట్ సహా పలు ప్రాంతాల్లో ముష్కర దాడులు యథేచ్ఛగా చోటుచేసుకున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ అలసత్వ ధోరణి, స్థానిక పోలీసులు అప్రమత్తంగా లేకపోవడం వల్ల ఉగ్రవాదం మళ్లీ ఊపిరి పోసుకుంటోంది. పంజాబ్‌ను అస్థిర పరచేందుకు పాకిస్తాన్ కుటిల పన్నాగాలు కొనసాగుతున్నాయన్న అంచనాలకు ఇటీవలి ఘటనలు బలం చేకూరుస్తున్నాయి. గత 18 నెలల్లో 15 ఉగ్రవాద కుట్రలను పోలీసులు భగ్నం చేశారని ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ చెబుతూనే, పంజాబ్‌లో ఐఎస్‌ఐ ప్రాబల్యం పెరుగుతోందని అంగీకరించడం గమనార్హం. ‘ఖలిస్థాన్’ ఉద్యమాన్ని పునరుద్ధరించేందుకు ఐఎస్‌ఐ సరికొత్త వ్యూహాలను అమలు చేస్తోందని సీనియర్ కాంగ్రెస్ నేత, లూధియానా మాజీ ఎంపీ మనీష్ తివారీ సైతం ఆందోళన వ్యక్తం చేశారు. శాంతిభద్రతల పరిరక్షణకు కేంద్రం, రాష్ట్రం తక్షణ చర్యలు తీసుకోవాలంటున్న ఆయన పంజాబ్‌లో మళ్లీ విపత్కర పరిస్థితులు ఏర్పడుతున్నట్లు ఆందోళన వ్యక్తం చేశారు. గురుదాస్‌పూర్, పఠాన్‌కోట్, అమృతసర్ ఘటనలు ఐఎస్‌ఐ వ్యూహాత్మక హింసాకాండకు నిదర్శనాలే. శాంతిభద్రతల పరిరక్షణకు తమ ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటోందని ముఖ్యమంత్రి చెబుతున్న గణాంకాలు ఎవరికీ ఉపశమనం కలిగించవు. సామాజిక మాధ్యమాల జోరు పెరగడంతో వదంతులు, వ్యాఖ్యానాలు వేగంగా విస్తరిస్తున్నందున ప్రభుత్వం అనునిత్యం అప్రమత్తంగా ఉండాలి. ఫంజాబ్‌లో సుమారు 550 కిలోమీటర్ల పొడవున ఉన్న సరిహద్దు ప్రాం తంలో రెప్పవాల్చని నిఘా అవసరం. భద్రతా దళాలు, స్థానిక పోలీసులు అలసత్వం వీడకుంటే- ఉగ్రవాద మూకలకు ఊతం ఇచ్చినట్టే.