సంపాదకీయం

‘విక్టోరియా’కు నివాళి..!!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్‌లోని ఒక ‘మెట్రో’ రైలుస్టేషన్‌కు ‘విక్టోరియా మెమోరియల్’ అని పేరుపెట్టడం మరో ఉదాహరణ మాత్రమే! విజాతీయ దురాక్రమణ వారసత్వాన్ని మన దేశంలో కొనసాగించడానికి కొనసాగుతున్న వ్యూహం ఇది ఒక అంశం మాత్రమే! ఉదాహరణలు వేనవేలు.. ఈ వ్యూహాత్మక శక్తులు ఏడు దశాబ్దులకు పైగా పొంచి ఉన్నాయి, నిక్కినిక్కి చూస్తున్నాయి. ‘సందు’ దొరికినప్పుడల్లా బౌద్ధిక విద్రోహపు అస్త్రాలను, శస్త్రాలను సంధిస్తూనే ఉన్నాయి. ఏడు దశాబ్దుల క్రితం బ్రిటన్ వారి భౌతిక దురాక్రమణ మన దేశం నుండి నిష్క్రమించింది. కానీ ఐరోపీయ బౌద్ధిక దురాక్రమణ మాత్రం కొనసాగుతూనే ఉంది. భారతీయ స్వరూపాలుకల వారిలో అత్యధికులు ఐరోపా స్వభావంతో అలరారుచుండడానికి చాపకింద విషం లాగ విస్తరించిపోతున్న ఈ బౌద్ధిక దురాక్రమణ కారణం! ‘విక్టోరియా మెమోరియల్’ ఇందుకు సరికొత్త నిదర్శనం. వేల మంది భారతీయులు, చదువుకున్నవారు, దుర్బుద్ధి పూర్వకంగా ఈ ‘ఐరోపా వారి బౌద్ధిక దురాక్రమణ’ కొనసాగడానికి వ్యూహాత్మకంగా పనిచేస్తున్నారు. ఇది పెద్ద ప్రమాదం కాదు.. కోట్ల మంది భారతీయులు అమాయకంగా ఈ బౌద్ధిక దురాక్రమణకు దోహదం చేస్తున్నారు. ఇదీ పెద్ద ప్రమాదం! హైదరాబాద్‌లోని ‘ఎల్‌బీ నగర్- కొత్తపేట’ ప్రాంతంలో ‘మెట్రో రైలుస్టేషన్’కు ‘విక్టోరియా మెమోరియల్’ అని పేరుపెట్టిన నిర్వాహకులు దుర్బుద్ధితో, బ్రిటన్ పట్ల విధేయతా నిష్ఠతో ఈ పనికి పూనుకున్నారా? లేక అమాయకంగా అనభిజ్ఞత- ఇగ్నోరెన్స్-తో ఈ పనికి పూనుకున్నారా? అన్నది స్పష్టం కాని ‘మహా విషయం’! ‘అదేమిటయ్యా! ఇది భారతదేశంలోని భాగ్యనగరం, బ్రిటన్‌లోని ‘బర్మింగ్‌హామ్’కాదు, ఇక్కడ ‘రైలుస్టేషన్’కు ‘విక్టోరియా మెమోరియల్’ అన్న పేరు ఏమిటి?’ అని ‘హైదరాబాద్ మహా నగర పాలక సంస్థ’- గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్- జిహెచ్‌ఎమ్‌సి- వారు ప్రశ్నించలేదు, తెలంగాణ ప్రభుత్వ నిర్వాహకులకు ఈ స్పృహ లేదు. ‘విక్టోరియా’ అన్న పేరు ‘‘మన దేశంపై బ్రిటన్ తస్కర మూకల దురాక్రమణకు ప్రతీక’’ అన్న చారిత్రక ధ్యాస లేదు! చదువుకున్నవారు, చదువుకుంటున్నవారు అమాయకంగా ‘విక్టోరియా మెమోరియల్’ స్టేషన్‌లో రైలు ఎక్కుతున్నారు, దిగుతున్నారు..
ఈ ‘విక్టోరియా మెమోరియల్’ రైలు ఠాణా ‘ఎల్‌బీ నగర్- దిల్‌సుఖ్‌నగర్’- మధ్య ప్రాంతంలోని ‘కొత్తపేట’లో వెలసి ఉంది. అందువల్ల ఆ ‘ణాణా’-స్టేషన్-కు ‘కొత్తపేట’ అని పేరుపెట్టాలి! సమీపంలోనే ‘రైతుబజార్’ ఉంది గనుక ‘రైతుబజార్’ అన్న పేరు పెట్టవచ్చు. అక్కడే ఉన్న ‘అష్టలక్ష్మీ దేవాలయం’ అత్యంత ప్రసిద్ధమైనది. సమీప ప్రాంతంలో ‘సరూర్‌నగర్ క్రీడాప్రాంగణం’ ఉంది. ఇంకా ‘స్థానికత’కు, ‘భారతీయత’కు ప్రతీకలైన అనేక ప్రాంతాలు, ప్రముఖ కట్టడాలు ఈ ‘విక్టోరియా మెమోరియల్’ సమీపంలో ఉన్నాయి. వీటిలో ఏ పేరుకూడ ‘మెట్రో సంస్థ’ వారి మేధావుల తలకెక్కలేదు. మన దేశాన్ని శతాబ్దుల పాటు దోచుకున్న బ్రిటన్‌ను ఈ ‘విక్టోరియా’ అన్న మహారాణి అరవై ఏళ్లకు పైగా పాలించింది. అందువల్ల ఈమెను స్మరించుకోవడం ఇప్పుడు భారతదేశంలో అవసరమన్నది ‘మెట్రో’ నిర్వాహకుల నిర్ధారణ! ‘‘ఎందుకిలా ఈ పేరుపెట్టి ఉంటారని?’’ ప్రయాణీకులను అడిగినట్టయితే ‘‘కొత్తగా ఉండాలని, ఆకర్షణీయంగా ఉండాలని పెట్టి ఉంటారు...’’ అన్నది ఎక్కువమంది చెబుతున్న సమాధానం. ఈ ‘విక్టోరియా’ బ్రిటన్ ముష్కర మూకల ముఠా నాయకురాలని, ఈ ముఠా మన దేశాన్ని కొల్లగొట్టిందని ఈ అమాయక జనావళికి తెలియదు! అందువల్ల నిరసించడం లేదు. జాతీయతా నిష్ఠకల స్వచ్ఛంద సంస్థల వారు, తెలుగువారి ఆత్మగౌరవ పరిరక్షకులైన భాషాభిమానులు సైతం ఈ ‘మెట్రో’ వైపరీత్యాన్ని నిరసించడం లేదు. ఎక్కుతున్నారు దిగుతున్నారు.. సూచనలను మొదట ‘తెలుగు’లో ప్రకటించాలి, ప్రదర్శించాలి! కానీ ఈ ‘మెట్రో’ రైలులో మొదట ‘ఇంగ్లీషు’లో సూచనలను జారీచేస్తున్నారు. ఆ తరువాతనే తెలుగులో పలుకుతున్నారు. ప్రపంచీకరణ ప్రభావ విస్తృతికి ఇదంతా నిదర్శనం! ‘మెమోరియల్’ అని అంటే ‘స్మారకం’ అని తెలియడానికి ప్రయాణీకులకు ‘ఇంగ్లీషు’ వచ్చి ఉండాలన్నది ప్రపంచీకరణ ప్రభావం... ‘‘రాకపోతే నీవు మెట్రోరైలు ఎక్కడానికి అనర్హుడివి, ‘క్యాబ్’లో ప్రయాణించడానికి వీలులేదు..’’ అన్నది ప్రపంచీకరణ పాఠం. ‘ప్రపంచీకరణ’ విదేశీయ వికృత ప్రభావానికి విస్తృతి!!
ఈ ‘విక్టోరియా’ క్రీస్తుశకం 1837 నుంచి 1901 వరకు బ్రిటన్ రాణి. ఇంత దీర్ఘకాలం బ్రిటన్‌ను పాలించినవారు చరిత్రలో మరొకరు లేరట. ఈ ‘విక్టోరియా’ యుగం బ్రిటన్‌లో ‘స్వర్ణయుగం’. ఎందుకంటె ఈ కాలఖండంలోనే ప్రపంచంలోని అనేక దేశాలలో బ్రిటన్ ప్రభుత్వ దురాక్రమణ వ్యవస్థీకృతమైంది. మన దేశంలో కూడ 1858లో బ్రిటన్ ప్రభుత్వ బీభత్సపాలన వ్యవస్థీకృతమైంది. అంతకు పూర్వం బ్రిటన్ వారి ‘వాణిజ్య సంస్థ’ మన దేశంపై పెత్తనం చెలాయించింది. ఇలాంటి వాణిజ్య సంస్థలు క్రీస్తుశకం పదహారవ, పదిహేడవ శతాబ్దులలో ఓడదొంగల ముఠాలు. ఇలాంటి సముద్రపు దొంగల ముఠాలను బ్రిటన్ ప్రభుత్వం ప్రోత్సహించడం బ్రిటన్, ఐరోపా జాతుల స్వభావానికి ఒక ఉదాహరణ మాత్రమే! ఈ బ్రిటన్ దొంగల ముఠాలు సముద్రంలోకి వెళ్లి వివిధ దేశాల ఓడలను కొల్లగొట్టేవి, ఈ ‘దోపిడీ ధనం’లో బ్రిటన్ ప్రభుత్వానికి ‘వాటా’ పంచి ఇచ్చేవి. ఈ ‘ముఠాలు’ ఆ తరువాత పేర్లు మార్చుకొని ‘వాణిజ్య’ సంస్థలుగా వెలశాయి. ఈ వాణిజ్య సంస్థలు వివిధ దేశాలకు వెళ్లి మొదట ‘నక్క వినయం’ అభినయించాయి, ఆ తరువాత ‘తోడేళ్ల’ వలే దూకి వివిధ దేశాలలో రాజకీయ సామ్రాజ్యాలను స్థాపించాయి. 1757లో జరిగిన ‘ప్లాసీ’ యుద్ధంలో బ్రిటన్ ‘వాణిజ్య సంస్థ’- ఈస్ట్ ఇండియా కంపెనీ-కు నాయకత్వం వహించి ‘రాబర్ట్ క్లయివు’ అనేవాడు మొదట ఓడదొంగల ముఠాలో పనిచేసినవాడు. 1857లో జరిగిన బ్రిటన్ వ్యతిరేక ప్రథమ ‘భారత స్వాతంత్య్ర సమరం’ తరువాత ఈ ‘వాణిజ్య సంస్థ’ దురాక్రమణ మన దేశంలో ముగిసింది. బ్రిటన్ ప్రభుత్వ దురాక్రమణ, బీభత్సపాలన ఆరంభమయ్యాయి. ఈ ఆరంభ సమయంలో బ్రిటన్ రాణి ‘విక్టోరియా’.. అందువల్ల ఈ విక్టోరియా రాణి మన దేశాన్ని కొల్లగొట్టిన బ్రిటన్ మూకల ముఠా రాణి.. ఇదీ చరిత్ర! ‘విక్టోరియా’ పేరుతో ప్రపంచంలోని అనేక దేశాలలో పట్టణాలు, నగరాలు, ప్రాంతాలు, విద్యాలయాలు వెలయడం ఈ బ్రిటన్, ఐరోపాల దురాక్రమణ ఫలితం!
బ్రిటన్ విముక్త భారతదేశంలో ఈ దాస్యపు చిహ్నాలను తొలగించడానికి ఒకవైపున స్వజాతీయతా నిష్ఠాపరులు సంస్థలు, ప్రభుత్వాల వారు యత్నిస్తున్నారు. మరోవైపున ‘హైదరాబాద్ మెట్రోసంస్థల’ వంటి దోపిడీ ముఠాలవారు బ్రిటన్ భావదాస్యాన్ని పెంపొందిస్తున్నారు. ఈ ‘మెట్రో దోపిడీ’ వివరాలు వేరే ఉన్నాయి. కానీ ముంబయిలోని ‘విక్టోరియా టెర్మినల్’- వీటీ- పేరు భారత రైల్వేసంస్థ వారు మార్చారు, ‘ఛత్రపతి శివాజీ’ పేరును పెట్టారు. ‘విక్టోరియా’ విదేశీయ దురాక్రమణకు ప్రతీక, ఛత్రపతి శివాజీ స్వజాతీయ సాంస్కృతిక పతాక! ఈ సంగతి తెలిసిన హైదరాబాద్ ‘మెట్రో’ వారు ‘కొత్తపేట’ అని కాక ‘విక్టోరియా స్మారకం’- విక్టోరియా మెమోరియల్- అని రైలుస్టేషన్‌కు ఎందుకు పేరు పెట్టారు! ‘అనభిజ్ఞత’తో జరిగినా దుర్బుద్ధి పూర్వకంగా జరిగినా కూడ ఇది దేశ వ్యతిరేక చర్య, జాతి విద్రోహ చర్య... మెట్రోరైల్వే వారు ఇప్పుడైనా తప్పు తెలుసుకొని ఈ ‘పేరు’ను మార్చాలి.. విజ్ఞత కల ప్రజలు మార్పించాలి!!