సంపాదకీయం

మతం.. జాతీయ తత్త్వం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తరతరాల వాస్తవాలు జన జీవన సమష్టి విశ్వాసాలుగా పరిణతి చెంద డం చరిత్ర. వివిధ దేశాల చరిత్ర ఆయా జాతుల సమష్టి విశ్వాసం. అందువల్ల ఇతిహాస ప్రమాణానికి ప్రాతిపదిక విశ్వాసం. విశ్వాసం, వాస్తవం ఒకదానికొకటి పర్యాయపదాలు కావడం చారిత్రక పరిణామ క్రమం. ఈ చరిత్రను విశ్వసించని వారి ఆర్భాటం అయోధ్య ‘రామజన్మభూమి’ మందిర పునర్ నిర్మాణ కార్యక్రమానికి అవరోధం! మన జాతీయ చరిత్రను, మన పూర్వులు యుగాల తరబడి వ్రాసిన దినచర్యను మనమే విశ్వసించలేకపోవడం మన వైఫల్యం, హిమాలయ మహాపరాధం! ఈ వైఫల్యం దశాబ్దుల ప్రభుత్వాలది, ప్రభుత్వాలను నడిపిస్తున్న రాజకీయ పక్షాలది, ప్రతిపక్షాలది, స్వచ్ఛంద సంస్థలది, మేధావులది. ప్రముఖులది, చరిత్రకారులుగా చెలామణి అవుతున్న చరిత్ర వ్యతిరేకులది... దశాబ్దుల తరబడి రాజకీయ పక్షాలు అయోధ్య చరిత్రను గురించి ఆలోచించడం లేదు, వాస్తవాలను నిగ్గుతేల్చడానికి యత్నించడం లేదు. ‘‘అయోధ్యలో రామ జన్మభూమి మందిర నిర్మాణం చేసినందువల్ల మన పార్టీకి ఎన్నికలలో విజయం లభిస్తుందా?’’ లేక ‘‘అయోధ్య రామజన్మభూమి మందిర నిర్మాణాన్ని అడ్డుకోవడం వల్ల మన పార్టీకి ఎన్నికలలో విజయం లభిస్తుందా?’’ అన్న ప్రశ్నల పరిధికి మాత్రమే అధికాధిక రాజకీయ పక్షాలు పరిమితమై ఉండడం దశాబ్దులుగా నడచిపోతున్న వైపరీత్యం! విశ్వహిందూ పరిషత్ తదితర సాంస్కృతిక, జాతీయతా నిష్ఠకల స్వచ్ఛంద సంస్థలు ఆదివారం అయోధ్య రామజన్మభూమి ప్రాంగణంలో నిర్వహించిన ‘్ధర్మసభ’కు ఈ రాజకీయ వైపరీత్యం విషాద నేపథ్యం. రాజకీయ తాత్కాలిక విజయ లక్ష్యాలకు అతీతంగా శాశ్వత జాతీయ అస్తిత్వ పరిరక్షణ దృష్టితో రాజకీయ పక్షాలు ఆలోచించగలిగి ఉన్నట్టయితే అయోధ్యలో రామజన్మభూమి ఆలయ నిర్మాణం ఎప్పుడో జరిగి ఉండాలి! విక్రమ సమ్రాట్ క్రీస్తునకు పూర్వం ఒకటవ శతాబ్దిలో అయోధ్యలో శ్రీ రామజన్మభూమి ఆలయాన్ని నిర్మించడం చరిత్ర! ఈ నిర్మాణానికి పూర్వం కూడ అనేకసార్లు అదే స్థలంలో ఆలయాలను నిర్మించారని కూడ చరిత్ర చెబుతోంది. 2003లో జరిగిన తవ్వకాలలో కూడ ఈ చరిత్ర ధ్రువపడింది. 1992 డిసెంబర్ ఆరవ తేదీన కరసేవకులు కూల్చివేసిన ‘బాబరీ కట్టడం’ కింద భూగర్భంలో వివిధ సహస్రాబ్దులకు చెందిన దేవాలయ అవశేషాలు నిక్షిప్తమై ఉన్నట్టు ధ్రువపడింది. అందువల్ల ‘బాబరీ కట్టడం’ అన్నది ఈ భూగర్భ నిక్షిప్త దేవాలయం శిథిలాల మీద మాత్రమే ఏర్పడినట్టు చరిత్ర సాక్ష్యం చెప్పింది. తథాకథిత బాబరీ కట్టడం ఎత్తయిన దిబ్బమీద ఏర్పడి ఉండడం ఈ చరిత్రకు ప్రత్యక్ష సాక్ష్యం! కూల్చిన దేవాలయ శిథిలాల రాశి మీద లేదా కూలిన దేవాలయ అవశేషాల మీద మాత్రమే విదేశీయ జిహాదీలు తథాకథిత- సోకాల్డ్- బాబరీ కట్టడాన్ని నిర్మించడం అందువల్ల చారిత్రక వాస్తవం!
జాతీయత ‘మతతత్త్వం’గా మారిపోవడం ‘రామజన్మభూమి మందిరం’ వివాదగ్రస్తం కావడానికి కారణం. మన దేశం అనాదిగా ఒక ‘జాతి’గా వికసించింది, వికసిస్తోంది. ఈ జాతీయతకు ఏ ఒక్క మతం కాని ఏ ఒక్క భాష కాని, ప్రాంతం కాని, సంప్రదాయం కాని ప్రాతిపదిక కాలేదు. ‘‘మాతాభూమిః పుత్రోహం పృథివ్యాః’’ - భూమి తల్లి.. నేను ఆమె బిడ్డను’’- అన్న సృష్టిస్థితమైన శాశ్వత- సనాతన- వాస్తవం ఈ దేశంలోని జాతీయతకు ప్రాతిపదిక! అందువల్ల మాతృభూమి పట్ల సహజమైన మమకారం ఈ దేశంలోని వివిధ భాషా జన సముదాయాలను, మత సముదాయాలను, అనేకానేక వైవిధ్య సమూహాలను ఒకే జాతిగా తీర్చిదిద్దింది. అందువల్ల ఈ స్వజాతీయత వైవిధ్యాల సంపుటమైంది. ఈ వైవిధ్య పరిరక్షక సమష్టి స్వభావం సంస్కృతి అయింది! వివిధ మతాల మధ్య సమానత్వం, భాషల మధ్య సమన్వయం, వివిధ వైవిధ్య స్వరూపాల మధ్య నిహితమై ఉన్న అద్వితీయ స్వభావం ఈ జాతీయతకు ప్రాతిపదిక. అనేక మతాలు, భాషలు, వైవిధ్యాలు అనాదిగా ఏర్పడి ఉన్నాయి. కానీ ‘జాతి’ మాత్రం ఒక్కటే, సంస్కృతి మాత్రం ఒక్కటే! ఈ అద్వితీయ జాతీయత, అద్వితీయ సంస్కృతి భారతీయత లేదా హిందుత్వం!
ఈ చారిత్రక వాస్తవాన్ని అంగీకరించకపోవడం రామజన్మభూమి మందిర వివాద కారణం! అంగీకరించినట్టయితే ఈ ‘భారతీయత’లో, ‘హిందుత్వం’లో అన్ని మతాలు భాగం. అనాదిగా ఈ దేశంలో పుట్టిన పెరిగిన స్వజాతీయ మతాలన్నీ ఈ భారత జాతీయతలో, హైందవ జాతీయతలో భాగమయ్యాయి. విదేశాల నుంచి వ్యాపించిన పారశీక, యూదు మతాలవారు కూడ ఈ హైందవ జాతీయతలో భాగస్వాములు కావడం చరిత్ర! ఇది సహజం. జాతీయతలో మతాలు భాగం. అమెరికా జాతికి కేవలం నాలుగువందల ఏళ్ల వయస్సు. అమెరికాలో ఈ కొత్త జాతి ఏర్పడిన నాటికి ఆ జాతీయులందరూ క్రైస్తవ మతస్థులు. ఆ తరువాత అమెరికా వెళ్లి స్థిరపడిన వివిధ దేశాలకు చెందిన అనేక మతాలవారు తాము తమను అమెరికా జాతీయులుగా భావించారు. మతాలు వేరైనా తామంతా అమెరికా జాతీయులు. తాము అమెరికాకు వచ్చి స్థిరపడి వంద ఏళ్లు, యాబయి ఏళ్లు, పది ఏళ్లు, ఐదు ఏళ్లు అయినప్పటికీ వారందరూ ఈ నాలుగువందల ఏళ్ల అమెరికా చరిత్రను తమ చరిత్రగాను, జాతీయతను తమ జాతీయతగాను భావిస్తున్నారు. అమెరికా జాతీయ పురుషులైన విలియమ్‌పెన్, జార్జి వాషింగ్టన్ వంటి వారిని తమ జాతీయ పురుషులుగా గౌరవిస్తున్నారు. ఇలా కేవలం నాలుగువందల ఏళ్ల వయస్సు కలిగిన అమెరికా ‘జాతీయత’ తమదని విదేశాల నుంచి వెళ్లి స్థిరపడినవారు భావిస్తున్నారు. తాము ఏ మతం వారైనా తమది అమెరికా ‘జాతీయత’ అన్న వాస్తవాన్ని ‘‘విదేశాల నుంచి వెళ్లినవారు’’ కూడ అంగీకరిస్తున్నారు. అలాంటప్పుడు లక్షల ఏళ్లుగా యుగయుగాలుగా ఈ దేశంలో వికసిస్తున్న ‘హైందవ జాతీయత’లో తాము కూడ భాగమని విదేశాల నుంచి వ్యాపించిన ఇస్లాం, క్రైస్తవ మతాల వారు కూడ భావించాలి. ఈ దేశంలో పుట్టిన శైవ, వైష్ణవ, శాక్త, సౌర, గాణాపత్య, స్కాంద, బౌద్ధ, జైన, శిక్కు, ఆర్య సమాజం వంటి మతాలతోపాటు విదేశాల నుంచి వ్యాపించిన యూదు, పారశీక, ఇస్లాం, క్రైస్తవ మతాల వారు ఈ అనాది ‘హైందవ’ జాతీయతలో భాగం. ‘భారతీయత’, ‘హిందుత్వం’ పరస్పరం పర్యాయ పదాలు!
ఈ చారిత్రక వాస్తవాన్ని అంగీకరించినప్పుడు అయోధ్య రామజన్మభూమి వివాదమే లేదు. నాలుగు వందల ఏళ్ల చరిత్ర ఉన్న అమెరికాలోనే అన్ని మతాల వారికి వారి జాతీయ మహాపురుషులు ఆరాధ్యులు అయినప్పుడు అనాదిగా వికసిస్తున్న ‘హైందవ జాతి’కి చెందిన మహాపురుషులు ఈ దేశంలోని అన్ని మతాల వారికి పూజనీయులు, వందనీయులు కావాలి! ఇది న్యాయం, ఇది తార్కికం! కొత్త మతాలు విదేశాల నుంచి వచ్చినందువల్ల ఈ దేశపు అనాది ‘జాతీయత’ పేరు మారిపోదు, జాతీయ చరిత్ర అన్ని మతాల చరిత్ర. జాతీయ మహాపురుషులు అన్ని మతాల వారికీ సమానంగా పూర్వులు, పూజనీయులు. రఘురాముడు, యదుకుల కృష్ణుడు వంటివారు ఇలాంటి జాతీయ మహాపురుషులు. మహాత్మాగాంధీ వలె, నేతాజీ వలె, లోకమాన్యుని వలె, వివేకానందుని వలె, ఛత్రపతి శివాజీ వలె, అబ్దుల్ కలాం వలె, రఘురాముడు, యదుకుల కృష్ణుడు ఈ దేశంలో పుట్టిపెరిగిన మహా పురుషులు, పురుషులలో శ్రేష్ఠులు. వశిష్టుడు, వాల్మీకి వంటి వేలాది జాతీయ మహాపురుషులు అన్ని మతాల వారి ‘సమష్టి’ ఆరాధ్యులు. ఇదీ చరిత్ర. దీన్ని అంగీకరించినట్టయితే అన్ని మతాల వారు అయోధ్యలో శ్రీరామజన్మభూమి మందిర నిర్మాణానికి నడుం బిగించగలరు..